
కంచె గచ్చిబౌలిలో చెట్ల నరికివేతపై కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆఘమేఘాల మీద స్పందించింది. భారతీయ జనతాపార్టీ, దాని అనుబంధ విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి పరిషత్ కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టాయి. సుప్రీం కోర్టు కూడా స్పందించి తాత్కాలికంగా ఆదేశాలను జారీ చేసింది. అడవులు కాపాడటం ప్రాధాన్యతే అనటంలో సందేహం లేదు. మరి ఈ కర్తవ్యానికి అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే, సమాన ప్రాధాన్యతను ఇస్తుందా అన్నది ప్రశ్న.
కంచే గచ్చిబౌలి ప్రాంతంలో చెట్ల నరికివేతకు కారణమయిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు ఏప్రిల్ 3న కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి రాజ్య సభకు తెలిపారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి ఎంపీ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు మంత్రి భూపేంద్ర యాదవ్ పై విధంగా సమాధానం చెప్పారు
కంచె గచ్చిబౌలి ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం మార్చి 30 నుంచి చెట్లు నరికి అడివిని శుభ్రం చేయటం మొదలు పెట్టింది. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న హైదారాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన యాభై మంది విద్యార్థులను కూడా అరెస్టు చేసింది.
అయితే, యాదవ్ రాజ్యసభలో “తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెట్లంటే ఎందుకు అంత శత్రుత్వమో అర్థం కావడం లేదు. రాత్రికి రాత్రి బుల్డోజర్లు పెట్టి చెట్లను కూకటివేళ్లతో సహా పెకిలిస్తున్నారు. దాదాపు ఆరు వందల చెట్లను నరికారు. ఈ ప్రాంతంలో వన్య ప్రాణుల మనుగడను ఈ చర్య ప్రశ్నార్థకం చేస్తోంది” అన్నారు. సాధారణంగా వివిధ సమస్యలపై కేంద్రం స్పందించే వేగంతో పోలిస్తే కంచె గచ్చిబౌలి విషయంలో కేంద్రం సూపర్ స్పీడ్‌తో స్పందించిందని చెప్పవచ్చు. అదే రోజు ఇదే విషయంలో సుప్రీం కోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అదేశాలిచ్చింది.
కంచె గచ్చిబౌలి విషయం ప్రస్తుతం దేశంలో పతాక శీర్షికలకు ఎక్కింది. కానీ ఎక్కడా కనీసం వార్తలకు కూడా ఎక్కకుండానే దేశంలో పలు చోట్ల అమలవుతున్న అభివృద్ది ప్రాజెక్టుల కోసం లక్షల సంఖ్యలో చెట్లు, వేల సంఖ్యలో అడవులు ఆవిరవుతున్నాయి. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి మాటల్లో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్రాల్లో ఉన్న బిజెపి ప్రభుత్వాలు అడవుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నాయి. చెట్ల పట్ల శత్రుత్వంతో వ్యవహరిస్తున్నాయి. కానీ మంత్రిగారి మాటల్లో వాటి గురించిన ప్రస్తావన కూడా లేదు. సుప్రీం కోర్టు కూడా కంచె గచ్చిబౌలి విషయంలో ఆందోళన పడినంతగా మిగతా రాష్ట్రాల విషయంలో ఆందోళన చెందటం లేదు. కంచె గచ్చిబౌలి కంటే భారీ స్థాయిలో ఏయే రాష్ట్రాల్లో అభివృద్ది ప్రాజెక్టుల పేర అడవులు బలవుతున్నాయో పరిశీలిద్దాం.
ఒక అంచనా ప్రకారం అండమాన్ నికోబార్‌లోని దట్టమైన అడవుల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆధునీకరణ ప్రాజెక్ట్ కారణంగా కనీసం 10 లక్షల వృక్షాలు నేలమట్టం కానున్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 70 వేల కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టుల కోసం నికోబార్ హరితవనాలను పొట్టన పెట్టుకుంటున్నారు. ఈ అడవుల స్థానంలో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఓ నగర నిర్మాణం, అంతర్జాతీయ రవాణా నౌకాయాన కేంద్రం, విద్యుత్ ప్రాజెక్టు సిద్ధమవుతున్నాయి. పర్వావరణవాదులు, సామాజిక శాస్త్రవేత్తలు ఈ చర్యలవల్ల అండమాన్ నికోబార్ స్వరూప స్వభావాలు తీవ్రంగా దెబ్బతినబోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రాంతంలో నివసిస్తున్న నికోబారీలు, సొంపెన్ అనే అంతరించి పోయే ఆదివాసీ తెగల మనుగడకు, వన్య వైవిధ్యానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల ముప్పు వాటిల్లన్నుందని భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. నిపుణులు హెచ్చరిస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం అటువంటి ప్రమాదం ఏమీ జరగదని నమ్మబలుకుతోంది. కేంద్ర హరిత ట్రిబ్యునల్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేదు. అండమాన్ నికోబార్ ప్రాంతంలో అమలవుతున్న ప్రాజెక్టుల కోసం కేంద్ర అటవీ శాఖ ఇచ్చిన అనుమతుల విషయంలో జోక్యం చేసుకోబోమని బాహాటంగానే ప్రకటించింది.
చిత్రదుర్గ అరణ్యాలలో మైనింగ్ సమస్య..
ఇప్పటికే భారతదేశంలో మిగిలి ఉన్న పెద్ద అడవిగా చెప్పుకోవాలంటే 1500 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన చిత్ర దుర్గ అడవి గురించి చెప్తారు. ఈ అడవుల్లో 2912 నుండి పలు కంపెనీలు మైనింగ్ పనులు సాగిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అదానీ కంపెనీ ఈ అడవుల్లోని బొగ్గు గనులను దశాబ్దకాలంగా తవ్వుతోంది. ఈ గనుల నుండి బొగ్గు సరఫరా కోసం రాజస్థాన్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ అదానీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నది.
ఒక అంచనా ప్రకారం అదానీ కంపెనీ ఈ ప్రాజెక్టు చేపట్టిన తరవాత ఈ ప్రాంతంలో లక్షకు పైగా చెట్లు మాయం అయ్యాయి. 2023 డిసెంబర్ నుండి 15,000 చెట్లు నరికివేతకు గురయ్యాయి. చెట్ల నరికివేతకు పోలీసులే రక్షణ కల్పిస్తున్నారని ఆర్టికల్ 14 డిజిటల్ వార్తా సంస్థ వెల్లడించింది. నరికివేతకు గురైన చెట్ల సంఖ్య విషయంలో బయటకి చెప్తున్న లెక్కలు వాస్తవంలో జరుగుతున్న నష్టం కంటే చాలా తక్కువ. ఈ ప్రాంతంలో ప్రజల భక్తి విశ్వాసాలకు, ఆకలిదప్పులు తీర్చుకోవడానికి ఆ అడవులే ఆధారం.
అడవులు అంతరించి పోవడంతో ఈ ప్రాంతంలో ఏనుగులు జనావాసాలలోకి ప్రవేశించడం పెరిగిందని, ఫలితంగా ఎన్నో విపత్తులు తలెత్తుతున్నాయని ద వైర్ గతంలో కథనాలను కూడా ప్రచురించింది. హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కథనాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తులో ఈ ప్రాజెక్టు అనుమతుల కోసం కంపెనీ అందించిన అనేక పట్టాలు తప్పుడు పత్రాలని తేలింది. ఇలాంటి ప్రాజెక్టుల కోసం గ్రామసభల అనుమతి తప్పనిసరి. కానీ అదానీ కంపెనీ ఈ కీలకమైన పత్రాన్ని కూడా ఫోర్జరీ చేసిందని దర్యాప్తు నివేదిక తెలిపింది. ఈ ఆరోపణల్లో ఏ ఒక్క ఆరోపణలకు కూడా బిజెపి ప్రభుత్వం స్పందించడం లేదు.
వృక్ష సంపదను నాశనం చేసిన యుపీ సర్కార్..
ఉత్తర ప్రదేశ్‌లో సాంప్రదాయకంగా జరిగే కన్వర్ యాత్రలో పాల్గొనేవారికి సౌలభ్యం కోసం ఘజియాబాద్, మీరట్, ముజాఫర్‌నగర్ జిల్లాలో 111 కిలోమీటర్ల పొడవునా రహదారి వెంట ఉన్న 17,607 వృక్షాలను యూ పి సర్కార్ నరికేసింది. ఈ వివరాలన్నీ ఉత్తర ప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ప్రభుత్వ స్వాధీనంలో పని చేసే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌కి నివేదిక అందజేసింది. అందులో తమ తుది ఉత్తర్వులు లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఈ చెట్లను నరికివేయించిందని వెల్లడించింది. ద హిందు పత్రిక కథనం ప్రకారం ఇప్పటికే 66 కిలోమీటర్ల నిడివిలో ఉన్న చెట్లను నరికేసిన తర్వాత ఈ కార్యక్రమం ప్రస్తుతానికి ఆగింది. తిరిగి ఎపుడైనా మొదలు పెట్టవచ్చు.
మీర్జాపూర్లో అడవులు నరికివేత..
ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో ఉత్తరప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ అదానీ కంపెనీ కలిసి ఓ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయం జరిగింది. అందులో భాగంగా ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన 8 హెక్టార్లలో నిర్మాణం పనులు మొదలు పెడితే పర్యావరణానికి అరుదైన వన్యప్రాణులను ముప్పు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రాజెక్టు సైట్‌ను వేరే చోటికి మార్చుకోవాలనే ప్రతిపాదనలపై చర్చలు జరుగుతున్నాయి. కానీ ఈ చర్చలు ఓ కొలిక్కి రాకముందే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు లేకుండానే అదానీ కంపెనీ చెట్ల నరికివేతతో భూమిని చదునుచేయటం మొదలు పెట్టింది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న 350 హెక్టార్ల అడవిని నిర్మూలించడం మొదలైంది.
ఆవిరవుతున్న ఆరావళి అడవులు..
కళ్ళు తెరిచి చూస్తే కనిపించేంత దగ్గర్లో ఢిల్లీ సరిహద్దులో అడవులు, కొండలు నుజ్జు చేయటం కేంద్ర ప్రభుత్వ స్పందనకు నోచుకోని మరో ముఖ్యపరిణామం. గుజరాత్, రాజస్థాన్ హర్యానాలో విస్తరించిన ఆరావళి పర్వతాలు ఢిల్లీని కూడా చుట్టూ ముట్టి ఉంటాయి. ఈ ప్రాంతంలో గత దశాబ్ది కాలం నుండి కొండలు, గుట్టలను తవ్వేస్తూ అడవులలోని చెట్లను నరుక్కుంటూ మైనింగ్ జరుగుతోంది. రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటి అధ్యయనం ప్రకారం గత నాలుగున్నర దశాబ్దాల్లో ఆరావళి పర్వతాల విస్తరణ 8 శాతం తగ్గింది. కేవలం హర్యానాలోని నూహ్ జిల్లాలోనే ఈ కాలంలో అక్రమంగా 858 మిలియన్ మెట్రిక్ టన్నుల రాయిని తవ్వి తీశారని ఓ అంచనా. దీన్ని రూపాయల్లో లెక్కేస్తే దాదాపు రెండు వేల కోట్ల రూపాయాలు.
ఈ ప్రాంతంలో భారీ ఎత్తున అడవులు నరికివేత కారణంగా ఢిల్లీ అడపాదడపా ఇసుక తుఫానుల్లో చిక్కుకు పోయిందని స్వయంగా జాతీయ మానవహక్కుల సంఘం కేంద్రానికి, హర్యానా- రాజస్థాన్‌లకు 2018లోనే నోటీసులు కూడా జారీ చేసింది. అడవులు నరికివేత కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఫలితంగా తాగునీటి కొరత ఏర్పడుతోంది. పట్టణీకరణ కూడా అరావళి పర్వతాలను ఆక్రమిస్తుంది. తాజాగా పదివేల ఎకరాల్లో కొత్తగా జంతు ప్రదర్శనశాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇక్కడ విచిత్రం ఏమిటంటే గ్రేటర్ నికోబార్ ప్రాంతంలో పట్టణీకరణ ఫలితంగా నరికివేతకు గురవుతున్న చెట్లకు బదులుగా గుర్గాన్ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు తలపెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ నష్ట పరిహారం ఏమాత్రం పనికిరాదని ఈ ప్రాజెక్టు వల్ల ఆరావళి పర్వత శ్రేణి మరింత ముప్పు ఎదుర్కొంటోందని నిపుణులు ఆరోపిస్తున్నారు. పదవి విరమణ చేసిన అటవీ అధికారులు కొందరు ఈ ప్రాజెక్టు ప్రతిపాదన విరమించుకోవాలని ప్రధానికి లేఖ రాశారు
చమురు ఉత్పతికేంద్రంగా అరుదైన కోతి ఆవాస కేంద్రం..
బిజెపి పాలిత అస్సాంలోని హోలోంగపారకి ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకు అక్కడి వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం అరుదైన కోతి జాతికి చెందిన ఏప్లకు అభయారణ్యంగా ఉంది. 11 హెక్టార్ల విస్తీర్ణంలోని ఈ అభయారణ్యం హల్లోక్ జాతికి చెందిన కోతులకు నివాస కేంద్రం. విస్తీర్ణంలో పోలిస్తే కంచె గచ్చిబౌలి కంటే తక్కువే. కానీ చమురు డ్రిల్లింగ్ వల్ల ఈ జిల్లా మొత్తం పర్యావరణం ప్రభావితం కానుంది.
వృక్ష సంపదను మింగనున్న పూణే రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు..
మహారాష్ట్రలోని పూణేలో 2022లో ప్రధాని 4700 కోట్ల విలువైన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. పూణే గుండా ప్రయాణించే మూల, ముఖ్య నదులను సుందరీకరించడం ఆ ప్రాజెక్టు లక్ష్యం. దీనికిగాను గాను నదుల ఒడ్డున 44 కిలోమీటర్ల పొడవున ఉన్న 11,000 వృక్షాలను నరికేయనున్నారు. ఇండియన్ ఎక్సప్రెస్ కథనం ప్రకారం ఈ ప్రాజెక్టులో భాగంగా సుదీర్ఘ చరిత్ర కలిగిన 11000 వృక్షాలను నరికేసి వాటి స్థానంలో 11500 మొక్కలు నాటుతారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పూణే వాసులు ఉద్యమిస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రాజెక్టు పనులు కొనసాగిస్తూనే ఉంది.
పైన చెప్పిన ప్రాజెక్టులన్నీ బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే ఉన్నాయి. కనుమరుగవుతున్నది కేవలం వృక్ష సంపద మాత్రమే కాదు. కొండలు- కోనలు, అడవులు, నీటిపాయలు, సకల ప్రకృతి సంపద రియల్ ఎస్టేట్ లాభాలకోసం బలి అవుతోంది. కేంద్ర అటవీ శాఖ మంత్రికి ఇవన్నీ కనిపించకుండా కేవలం కంచె గచ్చిబౌలిలో కన్నీళ్లు పెట్టుకుంటున్న చెట్లే కనిపించడం కేవలం కాకతాళీయమా? లేక కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయమా..!
అతిర పెరించేరి
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.