
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్కు చైనా నిరంతరం సహకరించిందని, యుద్ధంలో టర్కీ ప్రత్యక్షంగా పాల్గొన్నదని కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా ధ్రువీకరించింది.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్(ఫిక్కి) నవతరం సాయుధ సాంకేతిక పరిజ్ఞానాలు అన్న అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్లో పాల్గొని భారత సాయుధ దళాల ఉప ప్రధానాధికారి లెఫ్ట్నెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ శుక్రవారం నాడు మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ కేవలం భారత్ పాకిస్తాన్లో మధ్య మాత్రమే జరిగిన యుద్ధం కాదని పలు దేశాల భాగస్వామ్యం, శక్తివంతమైన ఆధునిక నిఘా వ్యవస్థల మధ్య సమన్వయం యుద్ధరంగంలో ప్రత్యక్ష భాగస్వామ్యం సైనిక సహాయాలతో జరిగిన యుద్ధమని స్పష్టం చేశారు.
లెఫ్ట్నెంట్ జనరల్ ప్రసంగం నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన అంశాలు
ఒక సరిహద్దులో ముగ్గురు ప్రత్యర్థులు..
ఆపరేషన్ సిందూర్ సమయంలో, సరిహద్దుల్లో భారతదేశ కేవలం పాకిస్తాన్తో మాత్రమే తలపడలేదని, మూడు దేశాలతో తలపడిందని రాహుల్ సింగ్ ప్రకటించారు.
“పాకిస్తాన్ కదనరంగంలో ముందు వరుసలో ఉన్నది. చైనా అన్ని రకాల సహాయ సహకారాలను పాకిస్తాన్కు అందించింది. టర్కీ కూడా పాకిస్తాన్ కోసం కీలకమైన సహాయ సహకారాలు అందించింది” రాహుల్ సింగ్ అన్నారు .
భారతదేశం ఎదుర్కొంటున్న సరిహద్దు సమస్యల స్వభావాన్ని, ప్రమాదపు తీవ్రతను ఈ పరిణామం వ్యక్తం చేస్తుంది. అనేక దేశాలు పరస్పరం అత్యంత సన్నిహితంగా సహకరించుకుంటూ సమన్వయం చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో భారతదేశం అనుసరించాల్సిన భవిష్యత్తు రక్షణ వ్యూహం, ఎత్తుగడలను సమూలంగా మారుస్తున్నాయి. ఏకకాలంలో బహుముఖ రంగాలలో శత్రువులను ఎదుర్కోవాల్సి రావటం కేవలం యుద్ధ తంత్రానికి సంబంధించిన సైద్ధాంతిక చర్చకు మాత్రమే పరిమితం కాలేదని, వాస్తవ రూపం దాలుస్తుందని రాహుల్ సింగ్ ఉపన్యాసం స్పష్టం చేస్తుంది.
పాకిస్తాన్ వద్ద భారతదేశానికి సంబంధించిన రియల్ టైం ఇంటెలిజెన్స్ సమాచారం..
రాహుల్ సింగ్ ఉపన్యాసంలో భారతదేశపు సైనిక మొహరింపుకు సంబంధించిన సమగ్రమైన సంపూర్ణ సమాచారం పాకిస్తాన్కు అందుబాటులో ఉందన్న విషయం అత్యంత ఆందోళనకరమైన అంశం. ఈ విషయాన్ని రెండు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ స్థాయి చర్చలలో వెల్లడైందని ఆయన తెలిపారు.
ఈ చర్చలలో పాల్గొన్న పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్లో భాగంగా భారతదేశం మోహరించే ఫలానాఫలానా యుద్ధ క్షేత్రాలలోని సైనిక బలగాలు రంగంలో దిగటానికి సిద్ధంగా ఉన్నాయన్న విషయం తమకు స్పష్టంగానే తెలుసని, ఆ సైనిక బలగాలను రంగంలోకి దిగకుండా నిలువరించాలని కోరుతున్నామనే విషయాన్ని వెల్లడించినట్లు రాహుల్ సింగ్ ఉపన్యాసంలో తెలిపారు. అటువంటి రియల్ టైం సమాచారం చైనా అందించిన ఇంటలిజెన్స్ షేరింగ్ ద్వారా పాకిస్తాన్ అందుబాటులో ఉన్నదని రాహుల్ సింగ్ చెప్పారు.
ఈ పరిస్థితి భారతదేశ రక్షణ స్థావరాలు వ్యూహాలకు సంబంధించిన దుర్భలత్వాన్ని వెల్లడిస్తోంది. భారతదేశానికి వ్యతిరేకంగా వ్యూహాత్మక రక్షణ రంగ సమాచారాన్ని చైనా సేకరించడం సరిహద్దు వివాద స్వరూప స్వభావాలను మార్చేస్తుంది.
దేశీయంగా రూపొందించిన యుద్ధసామాగ్రి పనితనం సమస్యలు..
దేశీయంగా ఉత్పత్తి చేసిన రక్షణ పరికరాలలో కొన్ని సమర్థవంతంగా పనిచేసినా, మరికొన్నిటికి సంబంధించిన కీలకమైన లోపాలు ఆపరేషన్ సిందూర్ సందర్భంగా వెళ్లడయ్యాయని రాహుల్ సింగ్ ప్రస్తావించారు. కీలకమైన ఆయుధ సామాగ్రి సరఫరాకు సంబంధించిన సమస్యలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలిపారు. గత సంవత్సరం అక్టోబర్ నవంబర్లోను, ఈ సంవత్సరం జనవరిలోనూ చేరాల్సిన ఆయుధ సామాగ్రి ఆపరేషన్ సిందూర్ సమయానికి కూడా చేతికందలేదని వివరించారు.
ప్రత్యేకంగా డ్రోన్ల విషయాన్నీ ప్రస్తావిస్తూ భారతదేశంలో డ్రోన్లు తయారు చేసే కంపెనీలను నిర్దేశిత సమయానికి ఎన్ని డ్రోన్లు అందించగలరని అడిగినట్లు లెఫ్ట్నెంట్ జనరల్ తెలిపారు. కానీ ఈ ప్రశ్న వేసినప్పుడు చాలామంది సరఫరా చేస్తామని ముందుకొచ్చినప్పటికీ వారం రోజుల తర్వాత సరఫరా గురించి ఆరాతీస్తే ఎవరి నుండీ స్పందన రాలేదని రాహుల్ సింగ్ అన్నారు. ఎందుకంటే మనకు కావాల్సిన సామాగ్రి తయారు చేయడానికి రావలసిన ముడి సరుకుల కోసం ఇతరులపై ఆధారపడాల్సి రావడమే కారణమని ఆయన గుర్తించారు. సైన్యానికి కావలసిన ఆయుధ సామాగ్రి సహాయక పరికరాలు అందుబాటులో ఉంటే ఆపరేషన్ సిందూర్ కథ వేరేగా ఉండేదని చెప్పారు.
ఈ సమస్య భారత సైన్యపు సన్నద్ధతను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అర్థమవుతోంది. శక్తివంతమైన దేశీయ రక్షణ ఉత్పత్తుల వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని ఆపరేషన్ సిందూర్ ముందుకు తెచ్చింది.
చైనా ఆయుధ సామాగ్రిని పరీక్షించే ప్రయోగశాలగా పాకిస్తాన్..
గత ఐదేళ్లలో పాకిస్తాన్ సమకూర్చుకున్న ఆయుధ సామాగ్రిలో 81 శాతం కేవలం చైనా నుంచి దిగుమతి చేసుకున్నదని లెఫ్ట్నెంట్ జనరల్ వెల్లడించారు. చైనా తయారు చేసిన ఆయుధ సామాగ్రిని పరీక్షించేందుకు పాకిస్తాన్ ప్రయోగశాలగా మారిందని లెఫ్ట్నెంట్ జనరల్ వ్యాఖ్యానించారు.
“ప్రపంచంలో వివిధ ఆయుధ తయారీ శక్తులతో పోటీపడి తాను తయారు చేసిన ఆయుధాలను పాకిస్తాన్ ద్వారా ప్రయోగించి పరీక్షించుకునే అవకాశం ఉందన్న విషయాన్ని చైనా గ్రహించింది. చైనాకు పాకిస్తాన్ సజీవ ప్రయోగశాలుగా మారింది” అన్నారు.
అంటే పాకిస్తాన్తో జరిగే ఏ సాయుధ ఘర్షణ అయినా లేదా పాకిస్తాన్ భాగస్వామిగా ఉన్న ఏ సాయుధ ఘర్షణ అయినా చైనా అభివృద్ధి చేసిన ఆధునిక ఆయుధ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించే సందర్భమే అవుతుంది. తద్వారా చైనా తన ఆయుధ తయారీ సామర్థ్యాన్ని మరింత లోపరహితంగా అభివృద్ధి చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఈ విధంగా ఆధునీకరించుకున్న ఆయుధాలు పాకిస్తాన్కు అందుబాటులో ఉంటాయి. అంటే పాకిస్తాన్ భవిష్యత్తు ఘర్షణలకు సిద్ధపడినంత సమర్థవంతంగా భారతదేశం సిద్ధపడలేదు.
డ్రోన్లతో ప్రత్యక్షంగా పాకిస్తాన్కు సహకరించిన టర్కీ..
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్కు టర్కీ అందించిన గణనీయమైన సహకారాన్ని గురించి కూడా లెఫ్ట్నెంట్ జనరల్ రాహుల్ సింగ్ వివరించారు. బయరక్తర్ డ్రోన్లు, శిక్షణ పొందిన సైనికులను కూడా పంపిందని రాహుల్ సింగ్ తొలిసారి వెల్లడించారు.
“పాకిస్తాన్కు కీలకమైన సహకారాన్ని అందించడంలో టర్కీ కీలక పాత్ర పోషించింది. అంతకు ముందు(ఆపరేషన్ సిందూర్ కంటే ముందు) నుంచే బయరక్తర్ డ్రోన్లు సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. యుద్ధ కాలంలో ఇంకా అనేక డ్రోన్లు కూడా దిగుమతి అయ్యాయి. డ్రోన్లతో పాటు సుశిక్షితులైన సైనికులను కూడా ఈ యుద్ధంలో పాకిస్తాన్ తరఫున టర్కీ బరిలోకి దించింది” అని వెల్లడించారు.
ఈ విషయంతో మరో వాస్తవం కూడా వెలుగులోకి వస్తోంది. భారతదేశానికి వ్యతిరేకంగా విశాలమైన రాజకీయ భౌగోళిక సమీకరణలకు దారి తీస్తుందన్న వాస్తవాన్ని భారత్- పాక్ సాయుధ ఘర్షణల నడుమ టర్కీ ప్రత్యక్ష, చైనా పరోక్ష పాత్రలు ముందుకు తెస్తున్నాయి.
ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా నిరంతరం పాకిస్తాన్కు సహకరించిందని, టర్కీ ప్రత్యక్షంగా పాల్గొన్నదని కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా ధ్రువీకరించడం ఇదే ప్రథమం.
భావి భారత రక్షణ వ్యూహాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఈ పరిణామాలు ముందుకు తెస్తున్నాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.