
పులులు, సింహాలు, జింకలు, నెమళ్ళు వేరు..!
నక్కలు వేరు?
ఈ ప్రస్తుత స్వయంసాధనా పర్వంలో
జంతువుల పేర్లలోనూ
వివక్షతో బుస కొడుతున్నావు?
నన్ను గుంట నక్క అంటివి గదా!
మీ కాంక్రీటు అరణ్యంలో
మీరందరు కలిసి మెలిసి జీవిస్తూ ఉండలేరు
కులమంటరు మతమంటరు
ప్రాంతమంటరు
ఉత్తరం, దక్షిణం సరే సరి..
అన్ని రకాల పూలు
అన్ని రకాల జంతువులు
అన్ని రకాల పక్షులు
ఒకే అడవి తల్లి ఒడిలో
సేద తీరకూడదా?
ఏం..?
మమ్మల్ని కలిసి మెలిసి ఉండనివ్వరా?
మీకు నీడనిచ్చే చెట్లను
గూడుకు కలపనిచ్చే తరువులను
మీ జనారణ్యానికి ఆక్సీజనిచ్చే
ఊపిరి తిత్తులుగా నిలిచిన
వన రాజ్యాలను కాపాడే జీవ సైనికులం మేం
ఏ పేర్లు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టినా సరే
మా బాధ్యతా గొడుగును
మీ తిట్లు, శాపనార్థాల
వాన జడిలో ఏమాత్రం
అలజడికి గురి కానివ్వం
పిడికిలి మరింత బిగిసి పట్టి
కాలం వంతెనను ఒడుపుగా దాటి
ప్రజా సమూహాల తోడ్పాటుతో
మా ప్రియ విద్యార్థి మిత్రుల
వారి ఉపాధ్యాయుల గొంతుకతో
కొద్దిమంది నిస్వార్థ రాజకీయుల సహకారంతో
మనసున్న మరి కొందరితో
ఈ తాత్కాలిక యుద్ధాన్ని నేర్పుగా ఎదుర్కుంటాం
నల్లమల మా తల్లి
దామగుండం మా అక్క
జనారణ్యంలోని చేమలు
చెట్లు మా కుటుంబ సభ్యులే..
మా దోస్తు ప్రకృతి కన్నీటి
పర్యంతమైందనుకోకు
తాత్కాలిక విజయంతో చిలికిన
ఆనంద భాష్ప జల్లుల హేల ఇది
మా పోరు ఇక అసలే ఆగదు..
గిరిధర్
9849801947
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.