
భారత ప్రజాస్వామిక చరిత్రలో రాజ్యాంగ హోదాతో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, సుప్రీం కోర్టు, సిబిఐ వంటి ఉన్నత స్థాయి సంస్థలను అలంకరించిన వ్యక్తులు పక్షపాతంతో వ్యవహరించిన దాఖలాలు లేవని కొట్టిపారేయలేము. కానీ, భారత ఉపరాష్ట్రపతి కుర్చీలో కూర్చున్న జగదీష్ ధన్కడ్ వ్యవహరించినంత సంపూర్ణ పక్షపాతంతో వ్యవహరించిన దాఖలాలు మాత్రం లేవు.
తాజాగా సుప్రీం కోర్టు పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు అలవాటుగా మారిన పొరపాటే తప్ప అలవాట్లో పొరపాటు కాదు. రాజ్యాంగ హోదాల్లో ఉన్న వాళ్లు ఈ రకంగా రాజకీయ పక్షపాతంతో వ్యవహరించటం స్థూలంగా ప్రజాస్వామ్యానికి నష్టదాయకమే. భారత ప్రజాస్వామ్యానికి ప్రమాద ఘంటికలు మోగిన తరుణంగా చరిత్ర ధన్కడ్ ఎపిసోడ్‌ను నమోదు చేస్తుంది. గట్టే చేనును మేస్తే చేను బతుకుతుందా? రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువను మనసా వాచా కర్మణా అమలు చేస్తామని ప్రమాణ స్వీకారం చేసిన వాళ్లే రాజ్యాంగానికి విచ్చలవిడిగా తూట్లు పొడుస్తుంటే రాజ్యాంగ పునాదులు కుంగిపోక ఏంచేస్తాయి?
ఓ విషయాన్ని మనం స్పష్టం చేసుకోవాలి. సుప్రీం కోర్టు రాజ్యాంగంలోని 142 అధికరణం గురించి చేసిన వ్యాఖ్యలు భారత ప్రజాస్వామ్యంపై క్షిపణి దాడి అని ధన్కడ్ వ్యాఖ్యానించటం తప్పు మాత్రమే కాదు. రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం కూడా.
కార్యనిర్వాహకవర్గం విచ్చలవిడితనానికి, చట్టసభల్లో ఏర్పడే ప్రతిష్టంభనల కారణంగా ప్రభుత్వాలు చట్టాలు రూపొందించే క్రమం నిలిచిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడానికి గాను రాజ్యాంగ నిర్మాతలు కల్పించిన రక్షణ కవచమే ఆర్టికల్ 142. సుప్రీం కోర్టు ఈ అధికరణం కింద తీర్పులివ్వడం శాసనాలు రూపొందించే క్రమంలో వేలుపెట్టడం కానే కాదు. సంపూర్ణ న్యాయ సాధన దిశగా రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలను పాటించటమే. రాజ్యాంగబద్ధంగా వ్యవహరరించటమే రాజ్యాంగ విరుద్ధమని దాడి చేయటం అంటే అటువంటి విమర్శల ఫలితాలు, పర్యవసానాలు ఎక్కడికి దారితీస్తాయో అన్న ఆందోళన కలుగుతుంది. అంతకు మించి ఈ విమర్శలు చేసేవారి దృష్టిలో రాజ్యాంగం అంటే ఏమిటి, వారు దేన్ని రాజ్యాంగంగా భావిస్తున్నారు అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది.
రాజ్యాంగబద్దమైన హోదాల్లో ఉన్న వాళ్లు తమ తమ రాజకీయ లక్ష్యాలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఆ హోదాల స్పూర్తికి భిన్నంగా వ్యవహరించిన దాఖలాలు గతంలో కూడా ఉన్నాయి. 1975 నాటి అత్యవసర పరిస్థితని గుర్తు చేసుకుందాం. ఏకంగా రాజ్యాంగం పౌరుకులకు కల్పించిన ప్రాథమిక హక్కులను రద్దు చేస్తూ అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ ఆహ్మద్ ఆదేశాలు జారీ చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి రాజ్యాంగ ప్రమాణాలను కాపాడటానికి అంకితమయ్యేందుకు బదులు నిరంకుశత్వ ప్రభుత్వాధినేతల చేతుల్లో రబ్బర్ స్టాంప్‌గా మారిపోయారు. అదేవిధంగా తాజాగా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు చట్టంగా మారనీయకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీం కోర్టు రాజ్యాంగంలోని 142వ అధికరణాన్ని ఆశ్రయించి గవర్నర్ నెలకొల్పిన ప్రతిష్టంభనకు రాజ్యాంగబద్ధమైన పరిష్కారం చూపింది.
ఈ రెండు సందర్భాల్లోనూ రాజ్యాంగపరమైన బాధ్యతల్లో ఉన్న వ్యక్తులు వ్యవహరించిన తీరు అటు పౌర మేధావుల నుంచీ ఇటు న్యాయ వ్యవస్థ నుంచీ తీవ్రమైన విమర్శలకు గురైంది. ప్రత్యేకించి ధన్కడ్ పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా ఉన్న కాలంలో వ్యవహరించిన రీతిని మించిపోయి ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు.
ధన్కడ్ వ్యాఖ్యల్లో మరింత కుటిలత్వం ఏమిటంటే దేశానికి ఉపరాష్ట్రపతి బాధ్యతల్లో ఉండి, ఓ రాజకీయ పార్టీ ప్రయోజనాలు కాపాడేందుకు ఆ పార్టీ అభిప్రాయాలనే వల్లెవేయటం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ వంటి పదవుల్లో ఉన్న వాళ్లు నిస్పాక్షికంగా వ్యవహరించాలి. అధికార పార్టీకి మరీ దూరంగా వ్యవహరించగల సామర్ధ్యం, నిబద్ధత ఉండాలి. దీనికి భిన్నంగా ఏ రాజ్యాంగ పదవుల్లో ఉన్నారో ఆ రాజ్యాంగాన్నే అవమానించేలా వ్యవహరించటం, మాట్లాడటం ఉన్నత రాజ్యాంగ సాంప్రదాయాలను నీరుగార్చే వ్యవహారమే అవుతుంది.
ఇది కేవలం రాజ్యాంగపరమైన నైతికతను ఉల్లంఘించటం మాత్రమే కాదు. ఏ రాజ్యాంగాన్నైతే ‘కాపాడటానికి, సంరక్షించటానికి, కవచంగా వ్యవహరించటానికి’ కట్టుబడి ఉంటామని ప్రమాణం చేశారో అదే రాజ్యాంగాన్ని పాతాళంలోకి తోసేసే ఉల్లంఘన. ఉపరాష్ట్రపతి సంకుచిత పార్టీ పరిధులను అధిగమించి ఉన్నతంగా నిలవగలగాలి. పాలకపక్షానికి కాపలా కుక్కలా వ్యవహరించటం కాదు.
పశ్చిమబెంగాల్లో గవర్నర్‌గా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టినందుకు గాను ఢన్కడ్ను ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి మోడీ ప్రభుత్వం సత్కరించింది. దీనికి గాను మోడీ ప్రభుత్వానికి విశ్వాసపాత్రుడుగా ఉన్నానని చెప్పేందుకు ఊ అనమంటే ఉస్కో అనేదాకా దిగజారారు. ఈ ప్రయత్నంలో దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవిని మైలపరుస్తున్నారు.
ధన్కడ్ ప్రవర్తన పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి
ధన్కడ్ తన ప్రజా జీవితంలో అనుసరించిన కప్పదాట్లు, మారిన పార్టీలు గమనిస్తే ఆయనకు నిర్దష్ట రాజకీయ తాత్విక అభిప్రాయాలు ఉన్నాయా అన్న సందేహం కలుగుతుంది. న్యాయవాద వృత్తిలో సైతం ఆయన పెద్దగా రాణించింది ఏమీ లేదు.
1980లో జనతా దళ్ సభ్యుడిగా రాజకీయ ఆరంగ్రేటం చేసిన ధన్కడ్, 1991లో తొలిసారి రాజస్తాన్ నుంచి కాంగ్రెస్ టిక్కెట్టు మీద ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 2003లో భారతీయ జనతా పార్టీలో చేరారు.
ఈ కప్పదాట్లు అన్నీ పరిశీలిస్తే తనకంటూ పరమపద సోపానమే తప్ప రాజకీయ నిబద్ధత కానీ, విధానపరమైన నిబద్ధత కానీ లేవని అర్థమవుతుంది. దాంతో ఎప్పుడు ఏ జెండా నీడన ఉంటాడో తెలియని ధన్కడ్ రాజకీయ విశ్వాసాల పట్ల ఎవ్వరికీ సదభిప్రాయం లేదు. అటువంటి వ్యక్తి ఇప్పుడు నీతిసూత్రాలు వల్లిస్తుంటే ఎవరైకైనే సందేహమే కదా.
ధన్కడ్ తరహా రాజకీయాలు దేశం ముందు ముందు ఎదుర్కొనబోయే ప్రమాదం గురించి హెచ్చరిస్తున్నాయి. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకున్న విశ్వాసం ప్రజాస్వామ్య పరిరక్షణలో ఆఖరి కవచం. ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్లే అటువంటి న్యాయవ్యవస్థను చీడపురుగు చూసినట్లు చూసి మాట్లాడటం మొదలు పెడితే, న్యాయ వ్యవస్థ పునాదులపై దాడి మొదలు పెడితే చట్టాన్ని ఉల్లంఘించే నీచులందరూ రొమ్ము విరుచుకుని నడుస్తారు. తలెగరేసుకుని తిరుగుతారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డందుకు తమిళనాడు గవర్నర్‌ను పదవి నుంచి తొలగించటం ఎంత సబబో, ఉపరాష్ట్రపతిని కూడా పదవి నుంచి తొలగించటం అంతే సబబు.
ఆరోగ్యవంతమైన ప్రజాస్వామిక లక్షణాలున్న వ్యక్తులు సిగ్గుతో రాజీనామా చేస్తారు. ఆ కాస్త సిగ్గు బిళ్ల కూడా లేకుండా ఊరేగ వాళ్లని గద్దె దించటం తప్ప మరో మార్గం లేదు. కానీ ఉపరాష్ట్రపతిని పదవి నుంచి తొలగించాలంటే సుదీర్ఘమైన ప్రహసనం ప్రయత్నం ఉంది. ఉపరాష్ట్రపతి పదివికి, భారత ప్రజాస్వామ్యానికి ధన్కడ్ ఇప్పటికే ఎనలేని కీడు చేశారు. రాజ్యాంగపరమైన బాధ్యతలకు, రాజకీయ పార్టీలో పదవులకూ మధ్య తేడా తెలియని ధన్కడ్ లాంటి వాళ్ల పరమపద సోపాన క్రమంలో రాజ్యాంగాన్ని బలి కానీయకూడదు. చరిత్ర మనల్ని గమనిస్తోంది. ఆశ్రిత రాజకీయాల కోసం రాజ్యాంగాన్ని తృణప్రాణయంగా చూసే ధన్కడ్ లాంటి వాళ్లను క్షమించదు.
ద వైర్ విశ్లేషణ
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.