తెలివి ఒకడబ్బ సొమ్ము కాదు, పశ్చిమ దేశాల, తెల్లతోళ్ల గుత్త అసలే కాదు. రక్షణాత్మక చర్యలతో తన ప్రత్యర్ధులను అణచివేయాలని ఎవరైనా ఎంతగా ప్రయత్నిస్తే అంతగా ప్రతిఘటనే కాదు, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కూడా సవాలు విసురుతాయని గతంలో అణుబాంబులు, ఖండాంతర క్షిపణుల వరకు నిరూపించాయి. తాజాగా చైనా డీప్‌సీక్ కృత్రిమ మేథ యాప్ అమెరికాతో సహా ప్రపంచ మంతటా సంచలనానికి కారణమైంది. అనేక దేశాలో ప్రభుత్వశాఖలు, భారీ సంఖ్యలో కంపెనీలు ఆ యాప్‌ను తమ ఫోన్లు, కంప్యూటర్లలో పెట్టుకోవద్దని, దాని సేవలను వినియోగించవద్దని ఆంక్షలు విధిస్తున్నట్లు వార్తలు. చైనా సాంకేతికంగా ముందుకు పోకుండా అడ్డుకొనేక్రమంలో జో బైడెన్ 2022లో తెచ్చిన చిప్స్ చట్టం ప్రకారం డ్రాగన్ దేశానికి ఎలాంటి పరిజ్ఞానం, చిప్స్‌ను అందనివ్వకూడదు,ఒక వేళ ఇతర దేశాలు ముందుకు పోతే వాటి మీద కూడా ఆంక్షలు విధిస్తామని బెదిరించిన సంగతి తెలిసిందే.ఇప్పుడవి దానికే ఎదురుతంతున్నాయి. రక్షణాత్మక చర్యలకు ఎవరు పాల్పడినా అదే జరుగుతుంది. తగిన ప్రోత్సాహం, అవకాశాలను కల్పించాలేగానీ ఎవరైనా అద్భుతాలు సృష్టించగలరని ప్రత్యేకించి చైనా ఇప్పటికే నిరూపించింది. గంగలో మునిగితే కరోనా పారిపోతుందని చెప్పిన వారు ఇప్పుడు కోట్లాది మందిని మహాకుంభమేళా పేరుతో గంగా స్నానం చేయిస్తున్నారు. వారి నుంచి డీప్‌సీక్ వంటి నవకల్పనలు వెలువడతాయని ఆశించలేము. అన్నీ వేదాల్లోనే ఉన్నాయష అన్నవారు ఇంకా ఆ పాటనే పాడుతున్నారు. నిజంగా ఉంటే ఘనాపాటీలు ‘‘ దేశం కోసం ధర్మం కోసం ’’ ఎలాంటి ఖర్చు లేకుండా ఈ పాటికి ఇంథనం, విమానాశ్రయాలతో పని లేకుండా ఎలా అనుకుంటే అటు తిరుగుతూ ఎందరు ఎక్కినా మరొకరికి సీట్లు ఉండే పుష్పక విమానాలను, కృత్రిమ మేథ(ఏఐ) భారతీయ యాప్‌ను ఎందుకు రూపొందించలేదన్నది ప్రశ్న !
ఈ రంగంలో చైనా కంపెనీ విడుదల చేసిన డీప్‌సీక్‌ఆర్‌ఐ యాప్ పెను సంచలనం సృష్టించటమే కాదు, అమెరికా కంపెనీల వాటాల ధరలు పతనమై దాని చరిత్రలో లేని విధంగా దాదాపు లక్ష కోట్ల డాలర్లు( 96,900) నష్టపోయేందుకు దోహదం చేసింది.పది సంవత్సరాల క్రితం అమెరికా ఓపెన్ ఎఐ కంపెనీ (చాట్ జిపిటి సృష్టికర్త) నాలుగున్నరవేల మంది సిబ్బంది, 660 కోట్ల డాలర్ల పెట్టుబడితో ప్రారంభమైంది. అదే చైనా డీప్‌సీక్ 200 మంది సిబ్బందితో ప్రారంభమై రెండు సంవత్సరాలు కూడా నిండలేదు.కోటి డాలర్లలోపు ఖర్చుతోనే యాప్‌ను అభివృద్ధి చేసినట్లు ది కొబెఇసీ న్యూస్‌లెటర్ స్థాపకుడు ఆడమ్ కొబెఇసీ ఎక్స్‌లో పేర్కొన్నాడు. ఈ రెండు కంపెనీలు ఇప్పుడు ఎలా పోటీబడుతున్నాయో చూడండని పేర్కొన్నాడు. ఒక్క ఎన్విడియా కంపెనీ వాటాల ధరలే 60వేల కోట్ల మేర నష్టపోయాయి. ఆ కంపెనీ సిఇఓ 2,100, ఒరాకిల్ అధిపతి సంపద 2,760 కోట్ల డాలర్లు నష్టపోయారు. అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇంత నష్టం ఇదే ప్రధమం. తరువాత ఆ కంపెనీలు పుంజుకోవచ్చు, మార్కెట్లో నిలదొక్కుకోవచ్చు, అది వేరే అంశం. ఒక్కటి మాత్రం స్పష్టం వందల కోట్ల డాలర్లు ఖర్చుచేసిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేవారు, వాటాలను కొనుగోలు చేసేవారు ఒకటికి వందసార్లు ఆలోచించే విధంగా ఊరూపేరులేని డీప్‌సీక్ అంకుర సంస్థ మేల్కొలిపింది. దాని మీద ఇప్పుడు కనీవినీ ఎరుగని రీతిలో సైబర్‌దాడులు జరుగుతున్నాయి. అమెరికా కంపెనీలు ఒక యాప్‌ను తయారు చేసేందుకు పది కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే చైనా కంపెనీ కేవలం 60లక్షల డాలర్లతో వాటికి ధీటైనదాన్ని రూపొందించింది.
ఆధునిక చిప్‌లను, వాటిని తయారు చేసే యంత్రాలను చైనా కంపెనీలకు విక్రయించరాదని అమెరికా ఆంక్షలు విధించిన తరువాత డీప్‌సీక్ తన సత్తాచాటింది. చిత్రం ఏమిటంటే అమెరికాకు చెందిన ఎన్వీడియా కంపెనీ తన వద్ద పాత తరం హెచ్800 రకం చిప్స్‌ను రెండువేలు కొనుగోలు చేసి వాటిని వినియోగించామని డీప్‌సీక్ ఇంజనీర్లు వెల్లడిరచారు. అందువలన చైనాకు ఆధునిక పరిజ్ఞానం అందకుండా మడిగట్టుకొని మంత్రాలు వేసిన వారు ఇప్పుడేం చేస్తారన్నది ప్రపంచానికి ఆసక్తి కలిగించే అంశం.చివరికి రద్దును అమ్మాలన్నా చైనా గనుక కొనుగోలుకు ముందుకు వస్తే ధనిక దేశాల కంపెనీలు భయపడే స్థితి వచ్చింది. ఇంత తక్కువ ఖర్చుతో చైనా యాప్‌లు తయారు చేస్తున్నపుడు వందల కోట్ల డాలర్లు ఖర్చు చేయటం అవసరమా అని అమెరికన్లలో సందేహాలు తలెత్తాయి. తాజా యాప్‌ను విడుదల చేయక ముందే అంటే జనవరి ప్రారంభం నుంచి డీప్‌సీక్ కంపెనీ మీద సైబర్ దాడులు ప్రారంభమయ్యాయని చైనా భద్రతా సంస్థ ఎక్స్‌లాబ్ వెల్లడిరచింది. అమెరికా, సింగపూర్, నెదర్లాండ్స్, జర్మనీ చివరికి చైనాలో చిరునామాలు కలిగిన సంస్థలు వేల సంఖ్యలో దాడులు జరుపుతున్నాయని, రానున్న రోజుల్లో ఇంకా పెరగవచ్చని కూడా హెచ్చరించింది. ఈ దాడులు జరుగుతుండగానే జనవరి 28వ తేదీన డీప్‌సీక్‌ఆర్‌ఐ మోడల్ యాప్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది అమెరికన్ ఏఐకి హెచ్చరిక అని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వర్ణించినట్లు సమాచారశాఖ మంత్రి కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు.
చైనా యాప్ విడుదలకు వారం రోజుల ముందు డోనాల్డ్ ట్రంప్ స్టార్గేట్ పేరుతో సాంకేతిక రంగంలో తనకు అనుకూలమైన కొందరిని సమావేశపరచి కృత్రిమ మేథ, సంబంధిత రంగాలకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 500బిలియన్ డాలర్ల మేర ప్రాధమిక సదుపాయాలను కల్పించనున్నట్లు, అది సాంకేతికరంగ భవిష్యత్‌కు తోడ్పడుతుందని ప్రకటించాడు. చైనాకు అడ్డుకట్ట వేసేందుకు కన్న కలలను అదే చైనా వారం రోజుల్లోనే ఆటతీరునే మార్చి వేస్తుందని ట్రంప్ ఊహించలేకపోయాడు. నిజానికి ఇతర చైనా కంపెనీలు ప్రపంచానికి సుపరిచతం తప్ప డీప్‌సీక్ గురించి పెద్దగా తెలియదు. అలాంటి కంపెనీ అమెరికా సాంకేతిక రంగాన్ని, ఖరీదైన ట్రంప్ పథకాలను ఒకేసారి దెబ్బతీసింది. తొలిసారి అధికారానికి వచ్చినపుడు ట్రంప్, తరువాత జోబైడెన్ కూడా సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక యంత్రాలు చైనాకు అందకుండా చూసేందుకు చేయని ప్రయత్నం లేదు. ఈ నేపధ్యంలో అనేక రంగాల్లో చైనా ముందున్నప్పటికీ మైక్రో చిప్స్, ఏఐ రంగంలో వెనుకబడి ఉందని వెంటనే అమెరికాను అధిగమించటం జరిగేది కాదని అనేక మంది భావిస్తున్న తరుణంలో అది వాస్తవం కాదని స్పష్టం చేసింది, ఇప్పటికే చిప్స్ తయారీకి శ్రీకారం చుట్టిన చైనా ఆ రంగంలో కూడా త్వరలో తన సత్తా నిరూపించటం ఖాయం. ఏఐలో సంచలనాలు సృష్టించిన చాట్ జిపిటిని రూపొందించిన ఓపెన్ ఏఐ సంస్థ మరికొన్నింటిని పెంపొందించటానికి ట్రంప్ స్టార్గేట్ పేరుతో ఈ మొత్తాన్ని ఖర్చు చేసేందుకు పూనుకున్నాడు. ఈ రంగంలో అతిపెద్ద సంస్థలైన గూగుల్, మేటా, ఇతర పెద్ద సంస్థలను దీన్నుంచి మినహాయించాడు. చాట్ జిపిటిపై ప్రతి ఖాతాదారు మీద నెలకు రెండువందల డాలర్లు ఖర్చు అవుతున్నదని, నష్టాల్లో ఉన్నట్లు ఓపెన్ ఏఐ చెప్పింది.నిజానికి ఇప్పటి వరకు ఈ సేవద్వారా లాభాలు ఎలా వచ్చేదీ స్పష్టం కాలేదని చెబుతున్నారు. ఇప్పుడు ఉచితంగా అందుబాటులోకి వచ్చిన డీప్‌సీక్ ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు.బైట్ డాన్స్ రూపొందించిన టిక్‌టాక్, అలీబాబా,మూన్‌షాట్,రిaపు వంటి చైనా కంపెనీలు ఇప్పటికే ఏదో ఒక రూపంలో అమెరికా సంస్థలను సవాలు చేస్తున్నాయి. మరోసారి అమెరికాను గొప్పదిగా చేయాలన్న ట్రంప్ మీద భ్రమలు పెట్టుకున్నవారు నేడు గాకపోతే రేపైనా కళ్లు తెరవక తప్పదు.
సంచలనాత్మక డీప్‌సీక్ గురించి అనేక కథనాలు వెలువడుతున్నాయి. వాటన్నింటినీ నమ్మటానికి లేదు.దాని దగ్గర ఉన్న సమాచారంలో పదిలక్షల రికార్డులను ఎవరైనా చూడవచ్చని విజ్ అనే ఒక సంస్థప్రకటించింది. అయితే ఒక అరగంట వ్యవధిలోనే వాటికి తాళం వేశారని అనుమతి లేకుండా ఎవరూ చూడటానికి లేదని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ సమాచారం ఏమిటి ? ఎవరైనా తీసుకున్నారా ? దానికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిది అన్నది కూడా తెలియలేదు. టిక్‌టాక్ ఇతర యాప్‌ల ద్వారా చైనా సమాచారాన్ని సేకరిస్తున్నదనే ఆరోపణల మాదిరే ఇప్పడు దీని మీద కూడా అనేక దేశాల్లో హెచ్చరికలు చేస్తున్నారు. ఏ స్థాయిలో ఉన్న వారు కూడా దీని సేవలను పొందవద్దని అమెరికా నౌకా దళం తన సిబ్బందిని ఆదేశించింది.ఈ యాప్ మరో స్పూత్నిక్ క్షణాలను గుర్తుకు తెచ్చిందని కొందరు వ్యాఖ్యానించారు. నిజానికి ప్రపంచ తొలి సోవియట్ యూనియన్ కృత్రిమ ఉపగ్రహం స్పూత్నిక్1 ప్రయోగం అమెరికా ఒక్కదాన్నే కలవరపెట్టింది. ఇప్పుడు డీప్‌సీక్ చైనాను అడ్డుకోవాలని చూసే ప్రతి వారూ కాళ్లు విరగదొక్కుకొనేట్లు చేసింది.స్పూత్నిక్ ప్రయోగం పెను సంచలనం సృష్టించింది.అప్పటి నుంచి పెద్ద సంచలనాలను స్పూత్నిక్ క్షణాలు అంటున్నారు.
ప్రచ్చన్న యుద్ధం కారణంగానే అమెరికన్లు నాసాను రంగంలోకి తెచ్చారు.1950 దశకం ప్రారంభంలో అమెరికాకు చెందిన యుా2 అనే గూఢచార విమానం ద్వారా తమ రహస్యాలను సేకరించిందని గ్రహించిన సోవియట్ ప్రతి చర్యలను చేపట్టింది. దాని గురించి అమెరికా రాబట్టిన సమాచారం ప్రకారం 1955 నుంచి 61 సంవత్సరాలలో తమ దేశంలో ఉన్న శాస్త్రవేత్తలకంటే రెండు మూడు రెట్లు ఎక్కువ మందితో పరిశోధనలను జరిపించిందని అమెరికన్లు గ్రహించారు. దాని ఫలితమే 1957 అక్టోబరు నాలుగున ప్రపంచ తొలి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్1 ప్రయోగం. అది ఎంత సంచలనం అంటే న్యూయార్క్ టైమ్స్ సేకరించిన సమాచారం ప్రకారం అక్టోబరు 6`31వ తేదీల మధ్య 279 వ్యాసాలు, రోజుకు పదకొండు చొప్పున అమెరికా పత్రికల్లో వచ్చాయి. అమెరికా ద్వితీయ శ్రేణి శక్తిగా మారిందని మీడియా వ్యాఖ్యాతలు రెచ్చగొట్టారు. సోవియట్ సాంకేతికంగా ఎంతో ముందున్నదని, అది అమెరికా భద్రతకు ముప్పు అని భాష్యం చెప్పారు.అమెరికన్లలో తలెత్తిన కలవరపాటును తగ్గించేందుకు అసలు మనం 1956లోనే ఎక్స్‌ప్లోరర్1 అనే ఉపగ్రహాన్ని సిద్దం చేశామని ప్రచారం చేశారు. అయితే అది ఏమైందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. సోవియట్ ఉపగ్రహ ప్రయోగానికి ఖండాంతర క్షిపణి పరిజ్ఞానాన్ని వినియోగించారు. ఉపగ్రహంతో పాటు దాన్ని నింగిలోకి మోసుకుపోయిన ఆర్‌ా7 రాకెట్ పదిలక్షల పౌండ్ల శక్తిని విడుదల చేసిందని గ్రహించిన అమెరికన్లు దాన్ని చూసి కూడా కలవరపడ్డారు. ఆ రాకెట్ ద్వారా అణ్వాయుధాన్ని కొన్ని నిమిషాల్లోనే ఆరువేల కిలోమీటర్ల దూరం మోసుకుపోగల శక్తి కలిగిందన్నది మరింత ఆందోళన కలిగించి అంతరిక్ష రంగంలో తాము ఎంతో వెనుకబడి ఉన్నామని తరువాత కాలంలో వేగాన్ని పెంచారు. స్పుత్నిక్ వలన ఎలాంటి ముప్పు లేదని గ్రహించి ఐదు రోజుల తరువాత నాటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్ దేశ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ అదొక శాస్త్రప్రయోగ విజయం తప్ప భద్రకు ముప్పులేదని చెప్పారు. (తరువాత అమెరికా రెండు ఉపగ్రహాలను ప్రయోగించినా అవి విఫలమయ్యాయి) అదే పెద్ద మనిషి 1958లో మాట్లాడుతూ అంతరిక్ష శాస్త్ర, సాంకేతిక రంగంలో అమెరికా, ఇతర స్వేచ్చా ప్రపంచ దేశాలను సోవియట్ అధిగమించిందని, అమెరికా ప్రతిష్ట, నాయకత్వాన్ని ఖాతరు చేయకుండా ఉండేందుకు ఒక సాధనంగా వినియోగించుకోవచ్చని, గగన తలంలో ఉన్నతమైన మిలిటరీ సామర్ధ్యాన్ని ప్రదర్శించిన తొలిదేశంగా సోవియట్ అవతరించిందని అంగీకరించక తప్పలేదు.
డీప్‌సీక్ కంపెనీ 2023 చివరిలో ప్రారంభమైంది. అంతకు ముందు దాని అధినేత లియాంగ్ వెన్ఫెంగ్ ఒక వెంచర్ కాపిటల్ సంస్థను నడుపుతున్నాడు. దాని వాణిజ్య వ్యూహాలను రూపొందించేందుకు కృత్రిమ మేథను వినియోగించాడు. తరువాత కంప్యూటర్ ప్రాతిపదికగా పని చేసే రెండు కంపెనీలను పదేండ్ల క్రితం ఏర్పాటు చేశాడు. ఆ క్రమంలో తలెత్తిన ఆసక్తి నుంచి డీప్‌సీక్ యాప్ వెలువడిరది. ఇటీవలి కాలంలో చైనా తనదైన శైలిలో అమెరికన్లకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నది. ప్రపంచంలో అతి పెద్ద నౌకాదళ శక్తిగా రూపొందింది. ఆరవ తరం యుద్ధ విమానాన్ని ప్రయోగించింది. ఇప్పుడు కృత్రిమ మేథ రంగంలో షాకిచ్చింది. అమెరికా కంపెనీలు వందల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే కేవలం 60లక్షల డాలర్లు, అంతగా ఆధునికం కాని, పరిమిత కంప్యూటర్ చిప్స్‌తో యాప్‌ను తయారు చేశారు. ఒక ఊరూపేరులేని సంస్థే ఆ ఘనతను సాధించటంతో సిలికాన్ వాలీలోని అగ్రశ్రేణి కంపెనీలు భయాలను వ్యక్తం చేశాయి.
ఎం కోటేశ్వరరావు
వేదిక. కాం సౌజన్యం తో