
Reading Time: 2 minutes
న్యూఢిల్లీ: అక్రమంగా ఢిల్లీలో స్థిరపడిన బంగ్లాదేశీయులను గుర్తించాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఢిల్లీలో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. సకాలంలో సరైన ధృవీకరణ పత్రాలు అందజేయకపోవడంతో భారతదేశవాసులైన వారిని కూడా విదేశీయులుగా ముద్రవేస్తున్నారు. ఈ నేపథ్యంలో బతుకుదెరువు కోసం వలస వచ్చిన బెంగాలీలను ఢిల్లీలో వేధింపులకు గురిచేస్తున్నట్టుగా వార్తలు రావడంతో సీపీఎం(భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు)) స్పందించి, ఈ చర్యలను ఖండించింది. వేధింపులను ఆపాలని పార్టీ సీనియర్ నేతలు బృందాకరత్, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి అనురాగ్ సక్సేనాలు కేంద్రహోం మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు.
అమిత్‌షాకు సీపీఎం రాసిన లేఖలో “బెంగాలీ భాష మాట్లాడుతున్న కారణంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయ బెంగాలీలను ప్రభుత్వ యంత్రాంగం వేధింపులకు గురి చేస్తున్న విషయంపై అనేక ఫిర్యాదులు అందాయి. జూలై 10వ తేదీన సీపీఎం ఢిల్లీ రాష్ట్ర ప్రతినిధి బృందంతో పాటు బవాన జేజే కాలనీలో పర్యటించాము. అనేకమంది ఫిర్యాదుదారులను కలిశాము. బెంగాలీ మాట్లాడేవారి విషయంలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్టు, వారిని వేధింపులకు గురిచేస్తున్నట్టు, మరికొన్ని సందర్భాలలో మితిమీరిన అవినీతి, అరాచకాలకు పాల్పడుతున్నట్టుగా అందిన ఫిర్యాదులు మమ్మల్ని కలవరానికి గురిచేశాయి” అని పేర్కొన్నారు.
ఐదుగురి విషయంలో ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును లేఖలో ప్రత్యేకించి ప్రస్తావించారు. భారతీయ పౌరులైన వారి విషయంలోనే ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరించడంపై ఆందోళన వ్యక్తంచేశారు. కొద్దిమందికి చేతులకు బేడీలు వేయటం, కొట్టడం, దూకుడుగా వ్యవహరించడం వంటి సందర్భాలను లేఖలో పేర్కొన్నారు.
“ఒక కుటుంబం జార్ఖండ్ నుంచి కొన్ని దశాబ్దాల క్రితమే ఢిల్లీ వచ్చి స్థిరపడింది. ఆ కుటుంబం ఇంటికి పదేపదే పోలీసులు వెళ్లారు. పత్రాలు చూపించమని వేధించారు. ఆ కుటుంబానికి సంబంధించిన సభ్యులందరి ఫోటోలు పోలీసు శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేయబడి ఉన్నాయ”న్నారు.
మరో కేసులో కొద్దిమంది వ్యక్తులను తాము బంగ్లాదేశ్ వాసులమే అని ఒప్పుకునేంతవరకు ఒత్తిడి చేశారని, తరువాత లాటిలతో కొట్టి హింసించారని, బూట్లతో చెవులపై తన్నారని చెప్పారు.
మరో ముగ్గురు వృద్ధ మహిళల విషయాన్ని లేఖలో ప్రస్తావిస్తూ, “60 నుంచి 70 సంవత్సరాల వయసున్న మూగ్గురు మహిళలు బంగ్లాదేశ్ నుంచి చిన్నప్పుడే తల్లితండ్రులతో పాటు భారతదేశానికి వచ్చారు. తమను దేశం నుంచి బలవంతంగా పంపిస్తారనే ఆందోళనతో వీరిప్పుడు కాలాన్ని గడుపుతున్నార”ని పేర్కొన్నారు.
జూన్ 26వ తేదీన సరైన ఆధారాలు ఉన్నప్పటికీ వలస వచ్చిన బెంగాలీ కార్మికులను బలవంతంగా బంగ్లాదేశ్ తరలించిన విషయాన్ని ఈ లేఖలో గుర్తు చేశారు. ఇలాంటి చర్యలు అన్ని రకాల మానవ హక్కులను ఉల్లంఘించేవిగా ఉన్నాయని సీపీఎం నేతలు ఆగ్రహాన్నివ్యక్తం చేశారు. “బెంగాల్లో 26 శాతం ముస్లింల జనాభా ఉంది. వాళ్లందరు బెంగాలీ మాట్లాడేవారు. సరిహద్దులు దాటించి తరలించేటపుడు పాటించాల్సిన విధివిధానాలు, చట్టాలు, అంతర్జాతీయ న్యాయసూత్రాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం జూన్ 26న వ్యవహరించిన తీరు వీటన్నింటినీ ఉల్లంఘించేదిగా ఉంది”అని తీవ్ర స్థాయిలో ప్రభుత్వ అధికారుల వ్యవహారశైలిని నిరసించారు.
భారతదేశంలో పౌరులు బెంగాలీ భాష మాట్లాడటం నేరమాని సీపీఎం నేతలు లేఖలో ప్రశ్నించారు. ముందు ముందు భారదేశంలోను బెంగాలీ మాట్లాడే ముస్లింలందరినీ నేరస్తులుగా కేంద్ర ప్రభుత్వం పరిగణిస్తుందాని నిలదీశారు.
కనీస మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న ప్రభుత్వ అధికారులు, విభాగాలపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నేతలు లేఖలో కేంద్ర హోంమంత్రిని డిమాండ్ చేశారు. ప్రభుత్వ చర్యల వల్ల నష్టపోయిన వారికి తగిన నష్ట పరిహారం చెల్లించే ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీలో తగిన నివాసపత్రాలు లేని 700 మందిని కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ వాసులుగా పరిగణించి, బంగ్లాదేశ్‌కు తరలించిన విషయాలపై ది వైర్ పలుకథనాలను ప్రచురించింది. పహాల్గాం దాడుల తర్వాత ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.