
న్యూఢిల్లీ: అస్సాంలో కాంగ్రెస్ అధికారానికి వస్తే హిమంత బిశ్వ శర్మ కటకటాలు లెక్కించాల్సిందే అంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. గౌహతిలో జూలై 16వ తేదీ జరిగిన కార్యకర్తల సమావేశంలో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. పదేళ్ల కాలంలో అస్సాంలో శర్మ కుటుంబం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. అంతేకాకుండా, బంధుప్రీతితో భూదందా వంటి కుంభకోణాలు ఎన్నో జరిగాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వీటన్నింటిపై దర్యాప్తు జరుగుతుందని రాహుల్ గాంధీ తెలియజేశారు.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
రాష్ట్ర రాజధానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చాయగావ్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. అందులో పాల్గొన్న రాహుల్ గాంధీ “మీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాజును అనుకుంటున్నారు” అంటూ ధ్వజమెత్తారు.
“మీ సంపాదనను, రాష్ట్రంలోని భూములను అదానికి- అంబానీకి కట్టబెట్టడానికి శర్మ అహర్నిశలు పనిచేస్తున్నారు. ఆయన మాటలను జాగ్రత్తగా వింటే, ఆ మాటల్లో భయం కనిపిస్తుంద”ని తన ఉపన్యాసంలో రాహుల్ అన్నారు.
ఈ సమావేశంలో వేదికపై ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, నూతన పీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన గౌరవ్ గొగోయ్‌లు కూడా ఉన్నారు. వారి సమక్షంలోనే రాహుల్ “ఏదో ఒకరోజు కాంగ్రెస్ సింహాల చేతికి దక్కక తప్పదని, అప్పుడు జైలు జీవితం ఖాయమనే విషయం ఆయనకు తెలుసు. ఏదో ఒక రోజు ఆయన, ఆయన కుటుంబం పాల్పడిన అక్రమాలకు సంబంధించిన లెక్క చెప్పాల్సిన సమయం వస్తుందని కూడా ఆయనకు తెలుసు. కొంతకాలం తర్వాత మీ ముఖ్యమంత్రి జైలుకెళ్లక తప్పదు. ప్రజలే ఈ నిర్ణయం తీసుకుంటారు. మోడీ గాని అమిత్‌షా గాని ఆయనను కాపాడలేర”ని పేర్కొన్నారు.
అప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి తన సోషల్ మీడియా వేదికల మీద గాని బహిరంగ సమావేశాల్లో గాని రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించలేదు. పైగా రాహుల్ గాంధీ లేవనెత్తిన ఆరోపణలపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతగా ఆత్మ సమర్థనకు పాల్పడితే, అంతగా 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ అనుసరించబోయే వ్యూహాలకు సంబంధించిన సంకేతాలు బయటపడతాయి.
హిమంత బిశ్వ శర్మ చుట్టూ పెద్ద కోటరి ఉంది. ఈ కోటరి కూడా శర్మలాగానే గతంలో కాంగ్రెస్ వాదులే. రాహుల్ గాంధీ విమర్శలపై ముఖ్యమంత్రి ఎదుర్కొంటున్న అసౌకర్యాన్ని అందరూ గమనిస్తున్నారు. శర్మ మాట్లాడుతున్న మాటల్లో భయం కనబడుతుందన్న విమర్శలతో రాహుల్ గాంధీ శర్మకు ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా దెబ్బ కొట్టారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
భయం..
ఏ ఎన్నికల్లోనైనా నాయకులకు భయం ఉంటుంది. అది సహజం.
హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తొలి ఐదేళ్లలో ఆయన కుటుంబ సభ్యులపై దురాక్రమలకు సంబంధించిన పెద్ద ఆరోపణలు వచ్చాయి. ఆశ్రితులకు, సన్నిహితులకు అనుకూలంగా వ్యవహరించిన చట్టవిరుద్ధ చర్యలపై కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ విభాగాలు నుంచి సమాచార హక్కు చట్టం కింద అందిన సమాచారం కూడా ఆధారంగా ఉంది.
ఈ మధ్యకాలంలో అస్సాంలో అవినీతి ఆరోపణలు పెరిగాయి తప్ప తగ్గలేదు. తాజాగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జాబితాలో హిమంత బిశ్వ శర్మ చలవతో బీజేపీ పంచన చేరిన రాష్ట్ర మంత్రులు కూడా చేరారు.
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో, ప్రజాధనం దుర్వినియోగం గురించి వచ్చే ఆరోపణలు మచ్చలేని మహా నాయకుడిగా ఇంతకాలం తనకు తాను నిర్మించుకుంటూ వచ్చిన గౌరవ ప్రతిష్టలు, అదే స్థాయిలో బీజేపీలో తన స్థానం వివాదాస్పదమవ్వటమే కాక, రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా తన కొనసాగింపుపై కూడా నీలిమేఘాలు కమ్ముకునే పరిస్థితులను తెచ్చిపెడుతున్నాయన్న విషయాన్ని హిమంత బిశ్వ శర్మ తేలిగ్గానే అర్ధం చేసుకోగలరు.
ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు సన్నిహితులుగా చెప్పుకుంటున్న కొందరు మంత్రుల విలాసవంతమైన జీవితాలు, అలంకారాలుగా మారిన అహంకారాల గురించి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మెజారిటీ అసెంబ్లీ సీట్లు కేంద్రమైన ఎగువ అస్సాం ప్రాంతంలో ఈ చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో కీలకమైన స్థానాల్లో ఉన్న వారి విలాసంతమైన జీవితాలు, రాష్ట్ర ప్రభుత్వంపై తాజాగా పెరుగుతోన్న అవినీతి ఆరోపణల మధ్య ప్రజలు సంబంధాన్ని చూడగలిగితే రాహుల్ గాంధీ ఆరోపణల నేపథ్యంలో 2026 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని తిరిగి గద్దెనెక్కించటం అంత తేలిక కాదు.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసి వచ్చే మరో అంశం కూడా ఉంది. అదేంటంటే, గౌరవ్ గొగోయ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకం కావడం.
గొగోయ్ సౌమ్యశీలతకు హిమంత బిశ్వ శర్మ దుందుడుగుతనానికి మధ్య రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తేడాను గమనిస్తున్నారు. ఈ తేడా ఎన్నికల్లో బీజేపీకి నష్టం చేస్తుందని స్థానిక రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గొగోయ్ గతంలో ప్రాథినిధ్యం వహించిన పార్లమెంటరీ నియోజకవర్గం మోడీ చేపట్టిన డీలిమిటేషన్లో మాయమైనప్పటికీ కాంగ్రెస్ కొత్త నియోజకవర్గంలో కూడా విజయం సాధించటం దీనికి ఉదాహరణగా చూస్తున్నారు. జోర్హర్ నియోజకవర్గంలో బీజేపీని ఓడించటం హిమంత బిశ్వ శర్మకు ఆయన అనుయాయులకు ఈ మధ్యకాలంలో తగిలిన పెద్ద ఎదురు దెబ్బ.
హిమంత బిశ్వ శర్మ పాకిస్తాన్ పేరుతో ఆడుతున్న రాజకీయాలు..
లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేత, లోక్‌సభ ఎంపీ గౌరవ్ గొగోయ్‌పై హిమంత బిశ్వ శర్మ దాడి చేయడాన్ని పెంచారు. ఎక్కువైన ఈ విమర్శల పర్వాన్ని గమనిస్తే, లోక్‌సభ ఎన్నికలు బీజేపీ నాయకత్వాన్ని ఎంతగా ఆందోళనకు గురి చేశాయో అర్థమవుతోంది. గత కొంతకాలంగా తను చెప్పుకుంటూ వచ్చిన మాటలు, చేసుకున్న ప్రచారం, తనను తాను బాహుబలి గాను లేదా రాబిన్‌హుడ్ గాను చూపించుకుంటూ అస్సాం ప్రజలందరికీ ప్రియతమ నేతగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న శర్మకు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో గతంలో గట్టు ఎక్కినంత తేలికకాదనే వాస్తవం అర్థమవుతున్నట్టుగా కనిపిస్తుంది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో అస్సాంలో బీజేపీని తిరిగి అధికారానికి తీసుకురావడం హిమంత శర్మ రాజకీయ భవిష్యత్తుకు కీలకమైన లక్ష్యంగా ఉండనున్నది. లేదంటే బీజేపీ ఆయనకు ఉద్వాసన చెప్పటానికి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదన్న విషయం కూడా శర్మకు తెలుసు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో శర్మకు అవకాశం కల్పించడానికి, అప్పటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న శర్బానంద సోనవాల్కు ఇలాగే మోడీ షా ద్వయం ఉద్వాసన పలికారు. ఈసారి ముఖ్యమంత్రి పదవికి సోనావాల్‌తో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియా కూడా బరిలో ఉన్నారు.
ఎగువ అస్సాం ప్రాంతంలో హిమంత శర్మ కుటుంబంపై వెళ్లువెత్తుతోన్న భూఆక్రమణల గురించి గౌరవ్ గొగోయ్ దృష్టి సారించారు. ప్రత్యేకించి హిమంత శర్మ భార్య రింకీ భుయాన్ శర్మపై వస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఈ ఆరోపణలను ప్రజల దృష్టి నుంచి మళ్ళించడానికి బీజేపీ ప్రభుత్వం గత కొంతకాలంగా రాజకీయ ప్రచారంలో పాకిస్తాన్ సమస్యను ముందుకు తెస్తుంది. నిన్న మొన్నటి వరకు బంగ్లాదేశ్ బూచిని చూపించి రాజకీయ పదవులు అధిరోహించిన రాష్ట్రంలో నేడు పాకిస్తాన్ పేరుతో ప్రజా జీవితాన్ని భయాందోళనలమయం చేయ బూనుకోవడంలో కొత్తకోణం కనిపిస్తోంది.
గౌరవ్ గొగోయ్ రహస్యంగా పాక్ పర్యటన చేసి వచ్చారని, ఆయన భార్య బ్రిటిష్ పౌరురాలు పాకిస్తాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి పనిచేస్తుందంటూ హిమంత శర్మ ధ్వజమెత్తడం మొదలెట్టారు. అయితే దీనికి సంబంధించి ఆయన ఎటువంటి సాక్షాలు చూపించడం లేదు. గౌరవ్ గొగోయ్ భార్య, ఆయన కూతురు ఇద్దరు విదేశీయులేనని హిమంత శర్మ ఆరోపిస్తున్నారు. గౌరవ్ గొగోయ్ కుటుంబానికి పాకిస్తాన్‌తో ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దర్యాప్తు బృందంతో కూడిన పోలీసు అధికారులను నియమించారు. సెప్టెంబర్ నెలలో గొగోయ్ కుటుంబానికి పాకిస్తాన్‌తో ఉన్న సంబంధాల గురించి ముఖ్యమైన విషయాలు వెల్లడిస్తానని హిమంత శర్మ సవాలు విసిరారు.
బీజేపీ ఎజెండాపై, హిమంత బిశ్వ శర్మతో ముఖాముఖిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గౌరవ్ గొగోయ్ తలపడటం లేదు. దీనికి బదులుగా శర్మ నాయకత్వంలో బీజేపీ పాలనలో జరుగుతున్న అవినీతి- అక్రమాలపై, భూఆక్రమణలపై దృష్టిని కేంద్రీకరించారు. దీంతో పాకిస్తాన్ పేరుతో చేసే రాజకీయాల వల్ల కలిగే ప్రయోజనాలు అస్సాంలో చాలా తక్కువని శర్మ గ్రహించారు.
ఎక్కువగా అస్సాం సరిహద్దు బంగ్లాదేశ్‌తో ఉంటుంది. దాంతో రాష్ట్రంలో రాజకీయ భావోద్వేగాలు రెచ్చగొట్టడంలో బంగ్లాదేశ్ పేరు ఇచ్చేంత ప్రోత్సాహం పాకిస్తాన్ పేరుతో రాదు. తిరిగి శర్మ బంగ్లాదేశ్ కార్డును బయటకు తీస్తున్నారు. 2016- 2021 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఎంచుకున్న నినాదం జాతి మాటి భేటీ- అంటే జాతీయత, భూమి, మహిళలు- నినాదం బీజేపీకి బాగా కలిసి వచ్చింది. దీంతోపాటు బెంగాల్ నుంచి వలస వచ్చిన ముస్లింలు నివసించే ప్రాంతాలలో తొలగింపు చర్యలకు బీజేపీ పాల్పడింది. గిరిజన, గిరిజనేతర అస్సామీ ప్రజల మనోభావాలు రెచ్చగొట్టడానికి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రచారంలో ముందు భాగాన ఉన్నారని స్థానిక మీడియా కథనాలు పరిశీలిస్తే అర్థమవుతోంది. అస్సాంలో నివసిస్తున్న బెంగాలీ మాట్లాడే హిందువుల ఓటు బ్యాంకును సంఘటితం చేసుకునేందుకు బెంగాలీ భాష మాట్లాడే ముస్లింలపై దాడులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతోంది. స్థానికంగా ఈ ముస్లింలను మియాలు అని పిలుస్తారు.
తాత్కాలికంగా ఈ చర్యలు బీజేపీకి రాజకీయంగా ఫలితాలను తెచ్చి పెట్టవచ్చు. ముస్లింలకు సంబంధించిన పౌరుసత్వంపై వివాదాలు రెచ్చగొడితే చివరకు వారికి ఓటు హక్కు కూడా తిరస్కరించవచ్చు. దీంతో ముస్లింల ఓటు గురించి బీజేపీ వ్యతిరేక ఓటును తగ్గించుకోవచ్చు. 2024 లోక్‌సభ ఎన్నికలలో బెంగాలీ భాష మాట్లాడే దేశి ముస్లింలు ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్‌కు ఓటు వేశారన్న విషయాన్ని పాలక బీజేపీ నాయకత్వం మరిచిపోలేదు. ముస్లిం సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న డుబ్రి నియోజకవర్గంలో, కాంగ్రెస్ అభ్యర్థి దేశంలో ఎన్నికైన లోక్‌సభ సభ్యులందరికీ కంటే అత్యధిక మెజారిటీతో గెలుపొందటం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.
ఆపరేషన్ సిందూర్ తరువాత బంగ్లాదేశ్ కార్డును మరింత శక్తివంతంగా ఉపయోగించడానికి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పౌరసత్వ తనిఖీలో భాగంగా సరైన నివాస దృవీకరణ పత్రాలు గుర్తింపు పత్రాలు లేని కొంతమంది ముస్లింలను రాష్ట్ర పోలీసు యంత్రాంగం బలవంతంగా బంగ్లాదేశ్- భారత్ సరిహద్దు ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి వచ్చింది. ఇటువంటి వారంతా భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారేన్న వాదనను ప్రభుత్వం ఎంచుకుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అక్రమ వలసదారులను ఏరివేస్తోందంటూ చెప్పుకోవడం ద్వారా, రాష్ట్రంలోని హిందూ ఆధిపత్య ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి హిమంత శర్మ శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు.
అస్సాం ప్రభుత్వం ఈ విధంగా సరిహద్దులు దాటించిన కొందరిని, బంగ్లాదేశ్ ప్రభుత్వం వారు బంగ్లాదేశీయులు కాదంటూ తిరస్కరించింది. దీంతో తిరిగి రాష్ట్రంలో అనుమతించక తప్పక పోయిన ఈ దూకుడు విధానాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయని, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా తన ఎక్స్ వేదికలో చేస్తున్న ప్రకటనలు వెల్లడిస్తున్నాయి.
వ్యూహం..
వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను చూడబోతున్న సమయంలో బీజేపీ బంగ్లాదేశ్ కార్డును ఉపయోగించుకొని ద్వంద్వ రాజకీయ ప్రమాణాలకు తెరతీస్తూ ఉంటే, మరో వైపు రాహుల్ గాంధీ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై అవినీతి, బంధుప్రీతి, భూ ఆక్రమణలకు సంబంధించిన ఆరోపణలను రాజకీయ ఎజెండాగా మార్చారు.
అయితే, పరాజయాన్ని శర్మ అంత తేలిగ్గా ఒప్పుకునే మనిషి కాదు. ఈ బాహాబాహీలో హిమంత శర్మ గెలుస్తే సరిపోదు, గెలుస్తున్నానన్న విషయాన్ని చూపిస్తూ ప్రజలకు నమ్మకాన్ని కూడా కలిగించాలి. అందుకే సామాజిక మాధ్యమాలలోనూ స్థానిక మీడియాలోనూ పదేపదే ప్రకటనలు చేస్తూ బిజీగా ఉన్నారు.
సాటి అస్సాం వ్యక్తిని అవమానించేలా రాహుల్ గాంధీ మాట్లాడటం స్వయంగా సొంత పార్టీలోనే అసమ్మతికి కారణం అవుతుందంటూ హిమంత శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ బెయిల్‌పై బతుకుతున్నాడంటూ విమర్శించారు. ఈ పోరాటంలో రాహుల్ గాంధీ ఓడిపోయారంటూ సంకేతాలు ఇచ్చారు.
ఈ విమర్శల వెనుక రాహుల్ గాంధీ లేవనెత్తిన అవినీతి ఆరోపణలపై శర్మ ఆందోళన పడుతున్న విషయం తేటతెల్లమవుతోంది. ఆ భయంతోనే మళ్ళీ మళ్ళీ బంగ్లాదేశ్ కార్డు బయటకు తీస్తున్నారు.
రాహుల్ గాంధీ పర్యటన తర్వాత రాష్ట్రంలో బంగ్లాదేశీయుడనే అపోహలతో ఓ 19 ఏళ్ల యువకుడిని రాష్ట్ర పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనపై సంతాపం ప్రకటించటానికి బదులుగా దాన్ని కూడా రాజకీయం చేయటానికి సిద్ధమయ్యారు.
శర్మ ఎక్స్‌లో జారీ చేసిన ప్రకటనలో, “రాహుల్ గాంధీ పర్యటన తర్వాత రెచ్చిపోయిన గుంపులు పైకాన్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పోలీసులపై దాడులు చేసి, ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ దాడుల్లో 21 మంది ఫారెస్ట్ అధికారులు, పోలీసు సిబ్బంది గాయాలపాలయ్యారు” అని తెలిపారు. ఈ పరిస్థితిలో పోలీసులు కాల్పులు జరపక తప్పలేదని అన్నారు.
“రాహుల్ గాంధీ ఒకరోజు రాష్ట్రంలో పర్యటిస్తేనే పరిస్థితి ఈ విధంగా తయారయింది. బాధ్యతారహితంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రశాంతంగా ఉన్న రాష్ట్ర జనజీవనంలో ఆందోళనకు దారితీశాయి. ఈ చర్యలను రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు” అన్నారు.
తర్వాత గౌహతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, “నిన్న అస్సాంలో పర్యటించిన రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేలు భూజిహాదీలను రెచ్చగొట్టారు. దీని ఫలితంగా ఏడుగురు పోలీసులపై దాడి జరిగింద”ని విమర్శించారు. ఇది ఇలా ఉండగా లూటీకి పాల్పడ్డారంటూ ఇప్పటివరకు పదిమందిని రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాహుల్ గాంధీ తనపై చేసిన ఆరోపణలు, పైకాన్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో జరిగిన ఘర్షణకు ఏమైనా సంబంధాలున్నాయాన్న విషయాన్ని ముఖ్యమంత్రి అనుమానించారు. విచారణ తర్వాత వాటి ఆధారంగా రాహుల్ గాంధీపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలో రాహుల్ గాంధీ జైలుకు వెళ్లాల్సి వస్తోందని హెచ్చరించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో అస్సాం రాజకీయాలు రానున్న కాలంలో మరింత ఉధృతంగా మారనున్నాయి. అదే జరిగితే, తనపై వచ్చిన ఆరోపణల నుంచి రాష్ట్ర ప్రజానీకం దృష్టి మళ్లించడానికి, ఏకంగా ప్రతిపక్ష నాయకుడిని పరీక్ష చేస్తామని పాలక పార్టీ బెదిరించిన విషయం రాష్ట్ర చరిత్రలో గుర్తుండే అంశంగా మిగులుతుంది.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.