
వీఎస్ అచ్యుతానందన్‌ను తరచూ కేరళ కాస్ట్రో అని పిలుస్తూ ఉంటారు. కమ్యూనిస్టు ఆదర్శాల పట్ల ఆయన నిబద్ధత, శతాబ్ది కాలపు విప్లవ పథం, ప్రజలు మెచ్చిన నేతగా ఆయనకున్న గుర్తింపులే ఆయనను కేరళ కాస్ట్రో అని పిలవడానికి కారణమయ్యాయి.
వీఎస్ అచ్యుతానందన్ సోమవారం(జూలై 21) మధ్యాహ్నం మరణించారు. నిబద్ధత, నిజాయితీలతో కూడిన రాజకీయాలలో ఆయన మరణంతో ఒక అంకం ముగిసింది. వ్యక్తిగత ప్రయోజనాలు, తాత్కాలిక రాజకీయ అవసరాలే లక్ష్యంగా సాగుతోన్న రాజకీయాలలో వీఎస్ తనదైన ముద్రతో అద్వితీయ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఏ ఆదర్శాలు, విలువల కోసం రాజకీయాలలో ప్రవేశించారో ఆ ఆదర్శాలు, విలువల కోసమే తుదిశ్వాస వరకు కట్టుబడి ఉన్నారు. నిజాయితీ, అనుకువతనం, నిస్వార్ధమైన నిబద్ధత, సేవాతత్పరత ఆయనను రాజకీయాలలోకి నడిపించిన విలువలు. సాధారణ కార్యకర్తగా మొదలైన వీఎస్ రాజకీయ జీవితం రాష్ట్రంలో అత్యున్నత స్థానమైన ముఖ్యమంత్రి పదవిని చేపట్టే వరకు ఎదిగింది. ఈ ప్రయాణంలో ఏనాడు ఆయన న్యాయం, సమానత్వం సూత్రాలను విడనాడలేదు.
భారతదేశంలో ఎన్నికల ద్వారా అధికారానికి వచ్చిన మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వాలలో అగ్రగన్యుడైన నేతగా వీఎస్ ఉన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితం నుంచి గెంటివేయబడిన వారి పక్షాన ఆయన నిలిచారు. ఎనిమిది దశాబ్దాల జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు. ఆయన మరణంతో అధికారం, ఆకాంక్షల కంటే విలువలకు, ఆదర్శాలకు పెద్దపీటవేసే ఒక తరం ముగింపుకు వచ్చింది.
అలప్పుజ జిల్లాలో పున్నప్ర గ్రామంలో 1923లో వీఎస్ జన్మించారు. పిన్నవయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. విద్యాభ్యాసం ఏడో తరగతి గడప దాటలేదు. బ్రతుకుతెరువు కోసం కొబ్బరి పీచుల ఉత్పత్తుల పరిశ్రమలలోను, కుట్టు మిషన్ మీద ఆధారపడ్డారు. కడుపు నింపుకోవడానికి కాయ కష్టం చేస్తున్నా, ఆయనలోని తిరుగుబాటుదారుడు మాత్రం విశ్రమించలేదు.
1938 నాటికి అంటే సుమారు 15 సంవత్సరాల వయసులో కార్మిక వర్గ పోరాటాలలో భాగస్వామ్యం కావటం, కేరళ కమ్యూనిస్టు ఉద్యమ వ్యవస్థాపకులలో ఒకరైన పీ కృష్ణ పిళ్ళై స్ఫూర్తితో 1940లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. కుట్టనాడులో కొబ్బరి పీచు కార్మికులను, వ్యవసాయ కార్మికులను సంఘటితం చేశారు. ఉన్నప్పుర వాయిలార్ రైతాంగ తిరుగుబాటులో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
తన జీవితమంతా కార్మిక వర్గ రాజకీయాలకు అంకితం కావటానికి ఆయనను ప్రేరేపించిన పోరాటం పున్నప్ర వాయులర్ రైతుల తిరుగుబాటు. సాధారణ సభ్యుడిగా మొదలైన ఆయన రాజకీయ జీవితం ఈ పోరాటాల నడుమ, ఆయనకు అలప్పుజ పార్టీ జిల్లా కార్యదర్శి బాధ్యతలను, రాష్ట్ర కమిటీ సభ్యుడు బాధ్యతలను, 1957 నాటికి అవిభక్త కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా బాధ్యతలను అప్పగించింది.
1964లో సీపీఐ నుంచి చీలిపోయి సీపీఐఎంగా ఏర్పడిన తొలి 32 మందిలో వీఎస్ ఒకరు. నిన్నటి వరకు ఈ 32 మందిలో సజీవంగా ఉన్న ఏకైక సభ్యుడు ఆయనే.
సైద్ధాంతిక పోరాటాలు, రాజీలేని వైఖరులు..
అచ్యుతానందన్ రాజకీయ జీవితమంతా సైద్ధాంతిక పోరాటాల వేదికే. 1962 నాటి భారత్- చైనా యుద్ధం సమయంలో పార్టీ నిర్ణయాలను కాదని యుద్ధంలో పాల్గొంటున్న సైన్యానికి కావలసిన రక్తాన్ని సమకూర్చటానికి రక్తదాన శిబిరాలను నిర్వహించారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ఈ శిబిరాలు నిర్వహించినందుకు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కేరళ రాష్ట్ర కార్యదర్శి వర్గం నుంచి పార్టీ ఆయనను తొలగించింది.
పర్యావరణ సంక్షోభం గురించి మాట్లాడిన మార్క్సిస్టు నేతలలో వీఎస్ అచ్యుతానందన్ తొలి తరం నేతగా నిలిచిపోతారు. 1980లలోనే అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని, భారీ సాగునీటి ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ గళం విప్పటంతో, అప్పట్లో ఆయనను సీపీఎం పోలిట్ బ్యూరో కూడా విమర్శించింది. ఆయన పర్యావరణ వాదానికి నేపథ్యం కేరళకున్న ప్రత్యేకమైన భౌగోళిక, పర్యావరణ పరిస్థితులు, వాటిపై ఆధారపడిన పేదల జీవన ఉపాధులు. 1990- 2000 సంవత్సరాల నాటికి ఆయన కేరళలో అశేష ప్రజాదరణ పొందిన విశిష్ట నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 15 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా కొనసాగారు.
భూఆక్రమణలు, లాటరీ మాఫియా, ప్లాచిమడలో కోకోకోలా ప్రాజెక్టు వంటి అనేక సమస్యలపై సుదీర్ఘకాలం పోరాటాలు నిర్మించి, నిర్వహించారు. ముతంగా ఘటన జరిగినప్పుడు ఆయన ఆదివాసీల పక్షాన నిలబడ్డారు. కాసరగోడు ప్రజలు ఏండో సల్ఫాన్ బారిన మృత్యువాత పడుతున్నప్పుడు వారికి న్యాయం, నష్టపరిహారం అందించేందుకు గళమెత్తారు.
రాజకీయ అవకాశవాదాలు హోరెత్తుతున్న కాలంలో కూడా వీఎస్ ఆదర్శవాదిగానే నిలిచారు. వివిధ అంశాలపై ఆయా సందర్భాలలో సొంత పార్టీ సీపీఐఎం తీసుకున్న నిర్ణయాల విషయంలో కూడా పార్టీ నాయకత్వంతో ఆయన విభేదించారు, ఘర్షణపడ్డారు. 2009లో పొలిట్ బ్యూరో నుంచి తొలగించబడిన తర్వాత కూడా కేరళ రాజకీయాలకు నైతిక విలువల విషయంలో చుక్కాణిగానే నిలిచారు. పదవి తగ్గగానే ప్రజా జీవితం నుంచి కనుమరుగు కాలేదు.
2006లో 82 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దేశ రాజకీయాలలో ఆ వయసులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజకీయ నాయకులు మరొకరు లేరు. ఆయనకున్న విశేష ప్రజాదరణ కారణంగా అంతిమంగా 2006 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయనే సీపీఐఎం ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2006- 2011 మధ్య కాలంలో కేరళలో మౌలిక వస్తువుల అభివృద్ధి- ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రాజెక్టులు, వల్లార్‌పదం టెర్మినల్, టెక్నోపార్క్ విస్తరణ, కొచ్చి మెట్రో రైల్ నిర్మాణం ప్రారంభం, కన్నూరు విమానాశ్రయం ప్రారంభం, ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు ఉపాధి అవకాశాలు వంటి అనేక రంగాలలో కేరళ విశేష పురోగతిని సాధించింది.
ఆయన ప్రదర్శించిన అసమాన ధైర్యసహసాలే ఆయన ప్రభుత్వానికి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చాయి. పరిపాలన అంటే ఆయనకు అది ఒక నైతిక ఉద్యమం. రాజీలకు వేదిక కాదు. సమాజంలో శక్తివంతమైన వ్యక్తులు, శక్తులకు ఆయన నిరంతరం దూరంగానే ఉన్నారు. ప్రజాక్షేత్రంలో బాధ్యతాయుత పాలనకు, అకౌంటబిలిటీకి పెద్దపీట వేశారు. ఆయన విమర్శకులు వ్యతిరేకులు సైతం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అన్నివేళలా పేదల పక్షపాతిగానే నిలిచిందని అంగీకరిస్తారు.
2011 అసెంబ్లీ ఎన్నికలలో స్వల్పమైన తేడాతో అధికారాన్ని కోల్పోయిన వీఎస్ మాత్రం జనహృదయనేతగానే నిలిచారు. ప్రతిపక్షనేతగా ఆయన పదునైన పలుకుబడి, చురుకైన వ్యంగ్యం, నిర్భయంగా సాగే ఉపన్యాసాలతో సభలలో నవ్వులు కురిపించేవారు. తనదైన శైలిలో సాగే ఆయన కృషి ఆయనకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఆయన వ్యక్తిగతంగాను, రాజకీయాలలోనూ అధికారంలో ఉన్నప్పుడు అధికారం బయట అనుసరించిన రాజకీయ జీవన విధానం, నడవడిక ఆయనను రాష్ట్ర రాజకీయాలలో అగ్రగన్యుడైన నేతగా నిలబెట్టింది.
2016లో జరిగిన ఎన్నికలలో 92 ఏళ్ల వీఎస్ మలంపూర నియోజకవర్గము నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ముఖ్యమంత్రి పదవి మాత్రం పీనరై విజయన్ను వరించింది. ఆయనను కేరళ రాష్ట్ర పరిపాలన సంస్కరణల సంఘానికి అధ్యక్షుడిగా నియమించారు. ఆ బాధ్యతలను ఆయన నవ్వుతూ స్వీకరించారు.
2019లో ఆయనకు గుండెపోటు వచ్చేంతవరకు క్రియాశీలక రాజకీయాలలోనూ, క్షేత్రస్థాయి రాజకీయాలలోనూ కొనసాగారు.
2023లో జరుపుకున్న వీఎస్ జన్మదినం కేవలం ఆయన 100వ పుట్టినరోజు మాత్రమే కాదు. ధైర్యసహసాలతో కూడిన ప్రజానుకూల రాజకీయాలకు, నిబద్ధత- నిస్వార్థ సేవలకు వందేళ్ళ ఉత్సవం. సూత్రబద్ధ రాజకీయాలకు ఆయన జీవితం నిలువెత్తు పతాక. సంపాదనకాంక్ష లేని జీవితం.
కేరళ కాస్ట్రో, గోర్బచేవ్ విమర్శకులు..
వీఎస్ అచ్యుతానందన్‌ను తరచూ కేరళ కాస్ట్రో అని పిలుస్తూ ఉంటారు. కమ్యూనిస్టు ఆదర్శాల పట్ల ఆయన నిబద్ధత, శతాబ్ది కాలపు విప్లవ పథం, ప్రజలు మెచ్చిన నేతగా ఆయనకున్న గుర్తింపులే ఆయన్ను కేరళ కాస్ట్రో అని పిలవడానికి కారణాలు. 2016లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెనరై విజయన్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని పార్టీ నిర్ణయించినప్పుడు, అప్పటి సీపీఐఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అచ్యుతానందన్ అధికారం చలాయించకూడదని, అధికారాన్ని ప్రదర్శించాలని చెప్తూ “క్యూబాకు కాస్ట్రో ఎలాగో భారతదేశానికి వీఎస్ అలాంటి వార”ని అన్నారు. స్వతహాగా వీఎస్‌కు ఫిడెల్ కాస్ట్రో అంటే అమితమైన అభిమానం గౌరవం. ప్రపంచవ్యాప్తంగా పీడితుల పక్షాన పనిచేసే వారికి ఫిడెల్ కాస్ట్రో ఓ వేగుచుక్క అని వీఎస్ నమ్మేవారు.
ఒక చిన్న క్యూబా లాంటి దేశాన్ని ప్రతికూల పరిస్థితుల్లో సోషలిజం వైపు నడిపించినందుకు, 600కు పైగా హత్యాయత్నాలను అధిగమించి నిలిచినందుకు కాస్ట్రోను వీఎస్ ఎంతగానో ఆరాధించేవారు. కాస్ట్రో అమెరికా అదరగొండితనాన్ని, సామ్రాజ్యవాదాన్ని తట్టుకొని తనదేశంలో సోషలిస్టు వ్యవస్థ నిర్మాణానికి పునాదులు వేశారు. ఒక కమ్యూనిస్టు ప్రభుత్వం పేదల జీవితాలలో ఎన్ని వెలుగులు నింపగలదో క్యూబా నిరూపించింది. క్యూబాలో ప్రభుత్వం ప్రపంచ సంపన్న దేశాల ప్రభుత్వాలు ఆయా దేశాల ప్రజలకు అందిస్తున్న సౌకర్యాలు వసతులకంటే మెరుగైన సౌకర్యాలు వసతులు అవకాశాలు కల్పిస్తోంది. వీఎస్ దృష్టిలో కాస్ట్రో వారసత్వం కేవలం రాజకీయ వారసత్వం మాత్రమే కాదు, అంతర్జాతీయ నైతిక వారసత్వం కూడా. అంతర్జాతీయంగా సామ్రాజ్యవాద శక్తులు నూతన రూపాలలో ముందుకు వస్తున్న సమయంలో కాస్ట్రో మరణం ప్రపంచ మానవాళికి తీరని లోటని వీఎస్ అన్నారు.
పార్టీ నాయకత్వంతో ఆయనకున్న విభేదాలు బహిరంగమే. పార్టీ నీడన లేని నాయకుడు ఒడ్డున పడిన చేపతో సమానమంటూ పినరై విజయన్ చేసిన వ్యాఖ్యలకు, వీఎస్ పదునైన జవాబు ఇచ్చారు. అటువంటి తేలకపాటి భావాలను చరిత్ర అంగీకరించదని అన్నారు. అప్పట్లో ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలలో ఉన్నారు.
సోవియట్ యూనియన్ పతనం గురించి వ్యాఖ్యానిస్తూ, భారతదేశంలో సహా వందలాది దేశాలను విప్లవాత్మకంగా ప్రభావితం చేసిన సామాజిక మార్పులకు పునాదులు వేసింది అన్నారు. కానీ గోర్బచేవ్ అనుసరించిన విధానాలతో ఆ మహాసముద్రం ఎండిపోయిందని, ఆ సముద్రం నుంచి తీసుకున్న ఒక్కొక్క బకెట్ నీళ్లకు ఒక్కొక్క కథ ఉంటుందని వీఎస్ పేర్కొన్నారు. నాగరికత పరిణామంలో ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన రాజ్యాలు సైతం కాలగర్భంలో కలిసిపోయాయని గుర్తు చేశారు. రష్యా తరహాలో జరిగిన అంతర్గత వైఫల్యాలు భారతదేశంలోనూ, ఇతర దేశాలలోని విప్లవోద్యమంలోనూ ప్రత్యేకించి కేరళ విప్లవోద్యమ నిర్మాణంలోనూ జరగకుండా చూసుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల ద్వారా కమ్యూనిస్టు ఉద్యమానికి బయట శత్రువుల నుంచి వచ్చే ప్రమాదం కంటే నాయకత్వ స్థానాల్లో ఉన్న వారి నుంచి వచ్చే ప్రమాదమే తీవ్రమైనదని, అటువంటి ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పరోక్షంగా హెచ్చరించారు.
కేరళలో గుర్తింపు పొందిన సామాజిక శాస్త్రవేత్త దివంగత కున్హమన్ రాసిన ఆత్మకథలో వీఎస్ అచ్యుతానందన్ గురించి ఒక అద్భుతమైన సందర్భాన్ని ప్రస్థావిస్తారు. ఈ ఆత్మ కథ పేరు ధిక్కారం. కున్హమన్ మాటల్లో వీఎస్ చుట్టూ వైఫైలా ఉండేది కేవలం సాంప్రదాయక పద్ధతుల్లో వచ్చిన అధికారం కాదని, ఆయన ఒక నిబద్ధత కలిగిన నైతిక శక్తి అని ప్రస్థావిస్తారు. అధికారం చేతికి అందగానే ఇతరులపై పెత్తనం చేయడానికి సిద్ధపడే నాయకుల కంటే భిన్నంగా తన చేతిలోని అధికారాన్ని ఇతరులను నియంత్రించడానికి సాధనంగా వీఎస్ ఎన్నడూ ఉపయోగించలేదు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వీఎస్ ఎంతగా అసౌకర్యానికి గురయ్యేవారో అద్భుతంగా చిత్రీకరిస్తారు కున్హమాన్. అది చదివిన వారికి వీఎస్ లాంటివారు అధికారం తెచ్చిపెట్టే డాబు దర్పంతో, సుఖసంతోషాలతో తృప్తిపడేవారు కాదని అర్థమవుతుంది.
అచ్యుతానందన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, కేరళ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ 2013లో ఓ సందర్భంలో మాట్లాడుతూ సాంప్రదాయక కమ్యూనిస్టు శకం ముగిసిన తర్వాతి కాలంలో ఉన్న కమ్యూనిస్టు నేతలలో వీఎస్‌కు ఉన్నంత విశేషమైన ప్రజాదరణ మరో నేతకు లేదని వ్యాఖ్యానించారు. నిబద్ధత, నిజాయితీలతో కూడుకున్న జీవితమే ఆయనను మిగతా రాజకీయ నాయకుల కంటే భిన్నమైన వాడిగా నిలబెట్టిందని ప్రభాత్ పట్నాయక్ అన్నారు. హంగు ఆర్భాటాలు లేని జీవితం, మొక్కవోని నైతికత, ఉన్నత ఆదర్శాలు, విలువల పట్ల అకుంఠిత దీక్ష, అంకితభావం ఆయన సొంతమని, ఇవన్నీ కేరళలోని ప్రగతిశీల రాజకీయాల వారసత్వం నుంచి పుట్టుకొచ్చిన విలువలేనని ప్రభాత్ పట్నాయక్ పేర్కొన్నారు.
ఈ నైతిక దృక్పథమే వీఎస్ హయాంలో ప్రభుత్వ పరిపాలన దృక్కోణంగా మారింది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకో తలపెట్టిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కారణంగా, కేరళలోని పామాయిల్ రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు తలెత్తాయి. అప్పుడు అఖిలపక్ష బృందాన్ని తీసుకొని ముఖ్యమంత్రిగా వీఎస్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ విధంగా రాష్ట్రంలోని బలహీనమైన, లేదంటే ప్రమాదాలను ఎదుర్కోబోతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ తరగతుల ప్రయోజనాల కోసం నిలబడేందుకు తాను ఏ స్థాయిలో ఏ హోదాలో ఉన్న సిద్ధంగా ఉంటానని నిరూపించిన సందర్భం ఈ అఖిలపక్ష బృందం ఢిల్లీ పర్యటన.
ఆ తరపు ఆణిముత్యం..
తాను నమ్మిన విశ్వాసాలను ఎన్నడూ వదులుకొని, ఒక వ్యక్తి జీవితానికి నిలువెత్తు నిదర్శనం వీఎస్ జీవితం. ఆ రకంగా అంకితమైన అందుకు కొన్ని కొన్ని సందర్భాలలో తీవ్రమైన నష్టాలు కూడా జరిగాయి. అయినా నష్టాలకు వెరసి తన విలువలను ఆదర్శాలను ఫణంగా పెట్టలేదు. ఆయనది సాధారణ జీవితం. కల్మషం లేని మాట. పోరాడే తెగింపు. ప్రతీ సందర్భంలో వీఎస్ అచ్యుతానందన్ అన్నివేళలా బలహీనుల పక్షాన నిలబడ్డారు. ఆశకు వంగింది లేదు, అధికారానికి లొంగింది లేదు. ఓటమికి కుంగింది లేదు.
కేరళ రాజకీయ చరిత్రలో వీఎస్ కొలియన్ వర్గానికి చెందినవారు కాదు. రాజకీయ అవకాశావాదానికి పాల్పడే తరగతికి చెందిన వారు కాదు. ఆయన కొట్టనాడులో చెప్పులు కూడా లేకుండా కాలినడకతో జీవితాన్ని ప్రారంభించిన కష్టజీవి. అలప్పుజ జిల్లాలో కొబ్బరి పీచు కార్మికులతో పెనవేసుకున్న బంధం. వైనాడులోని ఆదివాసి కుటుంబాలలోనూ, కాసర్గోడులో ఎండో సల్ఫాన్ బాధితులలోనూ ఆయనది చెరగని స్మృతి. స్వచ్ఛమైన రాజకీయాలను అనుసరించవచ్చని నమ్మిన తరానికి ఆయన చెందినవారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడవచ్చని నమ్మినవారు.
ఆయన మరణం తర్వాత కూడా ఆయన లేని లోటు, కేరళ రాజకీయాలలో కనిపించే ఆయన ప్రభావంలో మరింత శక్తివంతంగా ఉంటుంది. డొల్ల నినాదాలు, కఠోర కంఠారావాలు రాజకీయాలకు దిశా నిర్దేశం చేస్తున్న ఈ రోజులలో, శతాబ్ది కాలం మచ్చలేని కమ్యూనిస్టు మహానేతగా జీవితాన్ని కొనసాగించిన వీఎస్ అచ్యుతానందన్ ఆయన జీవితకాలంలో వ్యవహరించినట్లుగానే కేరళ సమాజానికి నైతిక చుక్కానిగా మరణానంతరం కూడా దిశానిద్దేశం చేస్తారు. ఆ తరం రాజకీయాలలో వీఎస్ అచ్యుతానందన్ ఓ ఆణిముత్యం.
అనువాదం: కొండూరి వీరయ్య
(వ్యాస రచయిత కేయం సేథి కేరళలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ విభాగానికి డైరెక్టర్‌గా ఉన్నారు. ఐసీఎస్ఎస్ఆర్ సీనియర్ ఫెలోగాను, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో డీన్ ఆఫ్ సోషల్ సైన్సెస్గాను, అంతర్జాతీయ సంబంధాల విభాగంలో ప్రొఫెసర్‌గాను పనిచేశారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.