కేంద్ర బడ్జెట్ లో బీహార్‌కు కేటాయించిన పద్దులు, కల్పించిన రాయితీలు గమనిస్తే బడ్జెట్‌పై సంకీర్ణ భాగస్వాముల ప్రభావం ఉందని అర్థమవుతుంది.
దాదాపు గంటన్నరకు పైగా సాగిన బడ్జెట్ ఉపన్యాసంలో రాజకీయ దృక్కోణానికి కూడా మోడీ ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందని బడ్జెట్ ప్రాధాన్యతలు గమనిస్తే అర్థమవుతుంది.
ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు, సృజనాత్మక ఆర్థిక జోక్యానికి ప్రోత్సాహం, ఎగుమతులు, వినిమయాన్ని పెంపొందించేందుకు కొన్ని ప్రతిపాదనలు వంటివాటి మధ్య వచ్చే ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీహార్‌లో రాజకీయ లక్ష్యాలకు కూడా బడ్జెట్ గణనీయమైన అవకాశాలు కల్పించింది.
మొక్కజొన్న బోర్డు, పాట్నా సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, ప్రస్తుత విమానాశ్రయం విస్తరణ, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, పాట్న ఐఐటి విస్తరణ, మరీ ముఖ్యంగా పశ్చిమ బీహార్‌కు కీలకమైన కోషి కాలువకు ఆర్థిక సహాయం వంటివి బడ్జెట్లో కేవలం బీహార్‌కు మాత్రమే దక్కే రాయితీలు.
జూలై 2024లో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు వరాలు ఇచ్చినట్లే ఈ బడ్జెట్లో బీహార్‌కు వరాలు ప్రకటించింది కేంద్రం. ఇవన్నీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రకటించిన వరాలే అయినప్పటికీ మోడీ ప్రభుత్వంపై ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, జనతాదళ్ యునైటెడ్‌ల ప్రభావం లేదని చెప్పటానికి వీల్లేదు. రెండు పార్టీలు ఖచ్చితమైన ఇచ్చిపుచ్చుకునే అవగాహనతోనే ఎన్డీయేలో భాగస్వాములయ్యాయన్న వాస్తవాన్ని ఈ బడ్జెట్ మరోసారి రుజువు చేస్తోంది. 2024లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అమరావతి రాజధాని నిర్మాణానికి 15000 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు మరో ఐదువేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని వెనకబడిన మూడు జిల్లాలకు గ్రాంట్లు కేటాయించేందుకు కూడా బిజెపి ప్రభుత్వం సిద్ధపడింది. 2024 బడ్జెట్లో కూడా పెద్దగా చర్చించని మరో అంశం ఉంది. బీహార్‌లో రహదారుల అభివృద్ధికి మరో 26వేల కోట్ల రూపాయలు కూడా కేటాయించింది కేంద్రం.
మిత్ర పక్షాల నాయకత్వంలో ఉన్న రాష్ట్రానికి ఎన్నికల ముందు ప్రత్యేక నిధులు, పథకాలు కేటాయించి మిగిలిన రాష్ట్రాలను నిరాదరణకు గురిచేస్తున్నారన్న విమర్శలకు అటు నితిష్, ఇటు నిర్మలా సీతారామన్ సమాధానాలు చెప్పుకోవాల్సి ఉంది.
అదే సందర్భంలో పాట్న కేంద్రంగా పని చేసే ఎ ఎన్ సిన్హా సామాజిక అధ్యయనాల సంస్థ డైరెక్టర్ దివాకర్ ది వైర్‌తో మాట్లాడుతూ రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంట్ను మోడీ, నితిష్‌లు ఈ వ్యతిరేకతను అధిగమించేందుకు వీలైనంత మొత్తంలో నిధుల కేటాయింపు కానీ, అభివృద్ధి పనులు కానీ చేపట్టలేకపోయిందని అభిప్రాయపడ్డారు.
‘‘రాష్ట్రంలో ఎనభై శాతం ప్రజానీకం గ్రామీణ ప్రాంతాల్లో నివశిస్తున్నారు. బడ్జెట్లో ప్రకటించిన కంటితుడుపు చర్యలకు బదులు గ్రామీణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నిర్దిష్ట ప్రయత్నాలు చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉండేది. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన లక్షన్నర కోట్ల వ్యవసాయ పాకేజితో పోల్చి చూస్తే కేంద్రం ప్రకటించింది నామమాత్రమే.’’ అన్నారు.
బీహార్‌లో పూర్తయిన కుల గణన ప్రకారం రాష్ట్రంలో 40 శాతం ప్రజలు కచ్చా ఇళ్లల్లోనే నివశిస్తున్నారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనల వలన ప్రజలకు ఒరిగేది ఏమిటి? బీహార్ ప్రజల అవసరాలు, బడ్జెట్ ప్రతిపాదనల మధ్య పొంతలేదని దివాకర్ అన్నారు.
ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తే రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా ఈ బడ్జెట్లో తగ్గిపోయే సూచలున్నాయని ఆయన హెచ్చరించారు.
బడ్జెట్ పత్రాలు పరిశీలిస్తే గ్రామీణాభివృద్ధికి కేటాయింపులు 4.6 శాతం తగ్గాయి. ఎరువుల సబ్సిడీ షుమారు మూడున్నర వేల కోట్ల మేర కోతకు గురైంది. ఆహార సబ్సిడీ 1860 కోట్లు, పెట్రోలియం ఉత్పత్తులపై సబ్సిడీ మరో 2600 కోట్లు కోతపడ్డాయి. ఇవన్నీ గ్రామీణ బీహార్ ప్రజానీకాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదని దివాకర్ అభిప్రాయపడ్డారు. మధ్యతరగతికి ఇచ్చిన ఆదాయపు పన్ను రాయితీ గ్రామీణాభివృద్ధికి కావల్సిన నిధుల సమీకరణను దెబ్బతీసే అవకాశాలు లేకపోలేదని కూడా అభిప్రాయపడ్డారు.
అజయ్ ఆశీర్వాద్ మహా ప్రశస్త
అనువాదం : కొండూరి వీరయ్య