
Reading Time: 4 minutes
జూన్ 15వ తేదీ నాడు ఢిల్లీలో పీవీ నరసింహారావు సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం పూర్తిచేసింది. పూర్వపు తీన్ మూర్తి భవన్, ప్రస్తుత ప్రధానమంత్రి సంగ్రహాలయం కార్యక్రమానికి వేదిక. ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమానికి హాజరైయ్యారు. సందర్భం మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జీవితం కృషి గురించిన చర్చ.
పీవీ నర్సింహారావు ప్రమాదవశాత్తూ ప్రధాని అయిన వ్యక్తి అనీ కొందరు అంటే, మరికొందరు ఆయనే భారతీయ జనతా పార్టీ తొలి ప్రధాని అని అంటుంటారు. అయితే, భారతదేశంలో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించిన నాయకడిగా ఆయనను ఎక్కువమంది గుర్తిస్తుంటారు.
ఈ కార్యక్రమానికి వాహకుడిగా ఏపీ సీఎం చంద్రబాబును ఎంచుకున్నారు. ఆయన రాజకీయ జీవితం కూడా సైద్ధాంతికంగా అన్ని కోణాలు, మెలికలు, మలుపులు తిరిగింది. నిబద్ధత కలిగిన రాజకీయాల విషయంలో ఆయన పాదరసం లాంటివారు.
నిజానికి అది పీవీ నరసింహారావు సంస్మరణ కాదని, చంద్రబాబు మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత కానీ తెలియలేదు. ప్రసంగం మొదటి నుంచి చివరి వరకు స్వామి భక్తి ప్రదర్శనే కనబడింది. తన వ్యూహాత్మక పారాయణంలో, నర్సింహారావును చంద్రబాబు ఎంతగా తలుచుకున్నారో లేదో తెలీదు. కానీ, తన అసలైన గురువు మోడీని మాత్రం ఆపాదమస్తకం మాటలతో తడిమేశారు.
ఈ ఉపన్యాసం భారతదేశాన్ని సమూలంగా మార్చేసిన పాలనా దక్షుడి గురించి తెలుసుకోవడం కంటే, వర్తమానంలో దేశాన్ని మార్చేస్తున్న సిద్ధాంతం, దానికి నాయకత్వం వహిస్తున్న మోడీ గురించి కీర్తించే వేదికగా మారింది. అంతేకాక పాలక ఎన్డీయే కూటమిలో చంద్రబాబు ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారో కూడా వెల్లడించే సందర్భంగా మారింది.
ఆ సాయంత్రం సభ ఎలా నడవాలన్నది ముందే ఖరారైంది. ప్రధాని మోడీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన నృపేంద్ర మిశ్ర అధ్యక్షస్థానంలో ఉండి అప్పటి వరకూ జరిగిన ఉపన్యాసాలు, వాటిలో చర్చించిన అంశాల జాబితా చదివి వినిపించారు. కాంగ్రెసేతర ముఖ్యమంత్రులందరికీ పేరు ముందు గౌరవ వాచకం శ్రీ అని వాడితే జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీలకు మాత్రం ఈ గౌరవవాచకం దక్కలేదు. ఇదేదో కాకతాళీయంగా జరిగింది కాదు. మోడీ హయాంలో దేశం కోసం అనుసరించే విధానాలే కాదు. ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో కూడా నిర్ణయమవుతోంది. అది కూడా రాజకీయ దళారుల ద్వారా. చరిత్రను సంరక్షించే వేదికగా ఉన్న చోటే చరిత్ర పుటలు తారుమారవుతున్నాయి.
నాయుడు వేదిక ఎక్కగానే పీవీ నర్సింహారావు గొప్ప రాజనీతిజ్ఞుడు అని మచ్చుకు రెండు మెచ్చుకోలు మాటలు పలికి తనకు ఇష్టమైన విషయం మీదికి మాట మళ్లించారు. ‘గత ఐదు దశాబ్దాల్లో రాజకీయాల్లో అన్నీ చూశాను’ అని చంద్రబాబు తేల్చేశారు. ఆ తర్వాత మోడీ దశాబ్ది పాలనలో సాధించిన అద్భుతాలు గురించి వక్కాణించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న దశాబ్ది గురించి వడివడిగా దాటుకుంటూ వెళ్లిపోయారు. దేశంలో సంస్కరణలు ప్రారంభించిన ద్వయం, పీవీ నర్సింహారావు – మన్మోహన్సింగ్ల ద్వయమే. ఆర్థిక విధానాల విషయంలో నర్సింహారావులో సగం మన్మోహన్సింగ్ అంటుంటారు. చంద్రబాబు రాస్తున్న యాభయ్యేళ్ల భారత రాజకీయాల చరిత్రలో వాజ్‌పేయికీ మోడీకీ మధ్యలో ఉన్న పదేళ్ల కాలం చీకటి యుగమే.
భారతదేశం అత్యంత శక్తివంతమైన, అత్యంత సమానతలతో కూడిన నాల్గో అగ్రరాజ్యంగా ఎదుగుతుందన్న ప్రపంచ బ్యాంకు వాదనను చంద్రబాబు వల్లె వేశారు. ఈ వాదనను పరిశీలకులు, వాస్తవ పరిస్థితులు ఎప్పుడో తిప్పికొట్టాయి. ప్రభుత్వం పొరపాటున జారీ చేసిన ప్రకటనను అంతే పొరపాటున అర్థం చేసుకున్న నాయకుడి ఉపన్యాసం ఇది. రాష్ట్రంలో సూపర్ సిక్స్ పేరుతో అధికారానికి వచ్చి ఆ హామీలు అమలు చేయటంలో తొలి ఏడాదిలోనే విఫలమైన దార్శనికుడి అవగాహన అది.
చరిత్ర గురించి సౌకర్యవంతమైన మతిమరుపు..
మోడీని ఆకాశానికెత్తటానికి చంద్రబాబు నాయుడు పీవీ నర్సింహారావును సందర్భంగా వాడుకోవడం వైచిత్రి.
తెలుగుదేశం రాజకీయ అస్తిత్వమంతా ఒప్పుడు పీవీ నర్సింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ పార్టీపై కమ్మ సామాజిక వర్గం పెంచుకున్న వ్యతిరేకతపైనే ఆధారపడి ఉంది. 1970 దశకంలో నర్సింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అమలు జరిపిన భూ గరిష్టపరిమితి చట్టాలు, ముల్కీ నిబంధనలు కమ్మ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ నుంచి దూరం చేశాయి. ఈ వ్యతిరేకతే చంద్రబాబునాయుడు మామ ఎన్టీ రామారావు రాజకీయ ఆరంగేట్రానికీ, తెలుగుదేశం ఓ రాజకీయ శక్తిగా ఎదగటానికి పునాది.
పీవీ నర్సింహారావు కాలంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాలతో కమ్మ సామాజిక వర్గంలో పెరిగిన అసమ్మతిని సొమ్ము చేసుకుంటూనే చంద్రబాబు రాజకీయాల్లోనూ, తెలుగుదేశంలోనూ అంచలంచెలుగా ఎదిగారు. ముఖ్యమంత్రి అయ్యారు.
నర్సింహారావు దేశానికి చేసిన సేవల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే విస్మరించారు చంద్రబాబు. ప్రముఖ హక్కుల ఉద్యమ నాయకుడు 1991లో రాసిన నంధ్యాలలో నరమేధం అన్న వ్యాసంలో పీవీ నర్సింహారావు ప్రత్యర్ధిని బరిలోకి దిగనీయకుండా ఓ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఏకపక్షంగా ఎలా గెలిచారో వివరించారు. ప్రతిపక్ష నాయకులను అపహరించటం, జైల్ల పాలు చేయటం, ముఠా రాజకీయాల గురించి వివరాలు ఆ వ్యాసంలో ఉన్నాయి. కానీ చంద్రబాబు రాస్తున్న కల్పిత గాథలో ఇవన్నీ మాయం అయ్యాయి.
కాషాయ కమలదళానికి కీర్తికవచాలు..
ఈ ఉపన్యాసంలో నాయుడు నటనా కౌశలమంతా ఎన్డీయే నేతలు రూపొందించిన స్క్రీన్‌ప్లే ప్రకారమే నడిచింది. నర్సింహారావు 17 భాషల్లో మాట్లాడగలిగిన ద్రష్ట అని చెప్తూనే ‘‘ఇప్పుడు హిందీ ఎందుకు నేర్చుకోవాలని ప్రశ్నించుకుంటున్నాము’’ అని అనకుండా ఉండలేకపోయారు చంద్రబాబు. ద్రావిడ రాజకీయాల్లో ఉన్న ఏకాభిప్రాయాన్ని చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నాడన్న విషయం ఈ ఉపన్యాసం విన్నవారికి అర్థమవుతుంది. ఒకప్పుడు ద్రావిడ రాజకీయాల్లో ఏకాభిప్రాయమే అత్యున్నత రాజకీయ సాంప్రదాయమని చెప్పిన నాయకుడు చంద్రబాబు.
కమలదళానికి చంద్రబాబు లొంగుబాటు ఇప్పుడు కుటుంబ వారసత్వంగా మారింది. తొలుత ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హిందీ పెద్దమ్మ లాంటిదని కితాబిచ్చారు. తర్వాత చంద్రబాబుకు రాజకీయ వారసుడుగా చెప్పబడుతున్న నారా లోకేష్ ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హిందీ జాతీయ భాష అని వక్కాణించారు. ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ఇది తప్పని వారిస్తుంటే నారా లోకేష్ మరింతగా రెచ్చిపోయారు.
మోడీ నేతృత్వంలోని ఎన్డీయే భాగస్వామి చేరాలంటే ఈ మాత్రం అర్హతలు సాధించాలి కదా మరి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోడీకి వ్యతిరేకంగా సంకుల సమరం చేసిన చంద్రబాబుకు శాశ్వతంగా ఎన్డీయేలో స్థానం లేదని అమిత్‌షా ప్రకటించాల్సి వచ్చింది అప్పట్లో. కానీ అదే ఎన్డీయేలో స్థానం దక్కించుకోవడం కోసం చంద్రబాబు ఎంతగా లొంగిపోయారో, ఈ వారంలో జరిగిన పరిణామాలు రుజువు చేస్తున్నాయి. సాంస్కృతిక రాజకీయాలను దేశవ్యాప్తంగా ఆధిపత్యం సాధించిన బీజేపీ చేతుల్లో యోగ ఓ అస్త్రంగా మారింది. సందర్భం ఉన్నా లేకున్నా యోగ గురించి కీర్తించటానికి చంద్రబాబు నాయుడు వెనకాడటం లేదు. ఇలాంటి అనేక సందర్భాల ద్వారా రాష్ట్రంలో సున్నితత్వం ముసుగు వేసుకున్న హిందూత్వ రాజకీయాల విస్తరణకు చంద్రబాబు పావుగా మారారు.
హిందూత్వపై పోరాటం చేయలేని చంద్రబాబు ప్రస్తుతం హిందూత్వసామ్రాజ్య నిర్మాణానికి చమటోడుస్తున్నారు.
మంచి పిల్లి అన్న నయా ఉదారవాదపు మేలిముసుగు..
మహిమగల స్త్రోతంలా, తన ఉపన్యాసమంతా పబ్లిక్ పాలసీ అన్న పదాన్ని పదేపదే ప్రస్తావించారు. బాలగోపాల్ దశాబ్దాల క్రితమే చెప్పినట్లు పబ్లిక్ పాలసీ అన్నది నూతన సిద్ధాంతానికి సంబంధించిన కోడ్. నాయుడు చెప్తున్న పబ్లిక్ పాలసీ నయా ఉదారవాద మంత్రం. ఈ మంత్రోచ్ఛారణలో వినిపించేది రాజ్యం ప్రైవేటు పెట్టుబడికి వెసులుబాటు కల్పించే పాత్రధారి మాత్రమే అన్న మాట. అందుకే ఆయన మాటల్లో సామాజిక బాధ్యత, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం, హక్కులు, సామాజిక న్యాయం పదప్రయోగం స్థానంలో బిల్ గేట్స్ వంటి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేట్ ప్రపంచం మెచ్చిన సమర్థత, దాతృత్వం వంటి పదాలు పుంఖానుపుంఖాలుగా వస్తాయి.
పీ4 నమూనా గురించి ప్రతిపాదించేటప్పుడు ఈ నయాఉదారవాద మంత్రం నిజస్వరూపం బయట పడుతంది. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్టనర్షిప్ అన్నది దీని వివరణ. ఈ మధ్యకాలంలో ఇంతకంటె పెద్ద డొల్ల నినాదం రాలేదు. పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్ విధానం నేడు సార్వత్రిక విధానం అయ్యింది. అభివృద్ధి బాధ్యతలను కంపెలకు అప్పగించి ప్రభుత్వం చేతులు దులిపేసుకోవడానికి పెట్టిన పేరే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అని ఆర్థిక వేత్తలు, సామాజిక శాస్త్రజ్ఞులు విమర్శిస్తున్నారు. ఈ పదబంధంలో నాల్గో పదం పీపుల్ అన్నది కూడా చేర్చటం అంటే, ఇప్పటి వరకూ సార్వత్రిక విమర్శలకు గురైన విధానాన్ని అమలు చేయటంలో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వాములు చేస్తున్నామన్న అపోహలు కల్పించి, దాన్నేదో అభివృద్ధి ప్రజాతంత్రీకరణ మంత్రంగా ప్రచారం చేసే హడావుడి వ్యూహం తప్ప ఇందులో పస లేదు.
చంద్రబాబు ప్రతిపాదిస్తున్న వ్యూహం ఇప్పటి వరకూ ఉన్న నయా ఉదారవాద వ్యూహాలకంటే ప్రమాదకరమైనది. ఈ వ్యూహంలో అభివృద్ధి బాధ్యతలను ‘ప్రజలు’ అన్న ఓ ఆమూర్త భావన, అస్తిత్వం భుజస్కంధాలపై మోపటం. అభివృద్ధిని సాధించటానికి కావల్సిన విధి విధానాల రూపకల్పన, అమలు, పర్యవేక్షణ, అవసరమైతే దిద్దుబాట్లు వంటివాటిని ముందుకు తీసుకెళ్లే వ్యవస్థలు నాయకత్వం, వనరులు ఈ సోకాల్డ్ ప్రజల చేతుల్లో ఉండవు. అవన్నీ పాలకవర్గం చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంటాయి. అటువంటప్పుడు మొత్తం అభివృద్ధి వ్యూహాలు రూపొందించిన అమలు చేసే అధికారం ప్రజలకు కట్టబెడుతున్నట్లు కథలు చెప్పటం ఎందుకో ప్రజలే అర్థం చేసుకోవాలి. తన ప్రభుత్వం ప్రతిపాదించిన సంక్షేమ విధానాలే అమలు చేయలేని నాయకుడికి ప్రభుత్వ బాధ్యతల బరువు ప్రజల నెత్తిన మోపేందుకు ఈ నినాదాలు బాకా అక్కరకొస్తాయి.
డెంగ్‌జియావో పింగ్ ‘‘పిల్లి నల్లదైతే ఏంటి? తెల్లదైతే ఏంటి? ఎలుకను పట్టగలిగితే చాలు కదా’’ అని చెప్పిన సామెతను పీవీ నర్సింహారావు కూడా పదేపదే వల్లె వేశారు. ఇప్పుడు అదే సామెతను చంద్రబాబు కూడా వల్లె వేస్తున్నారు. ఈ సంస్మరణ సభలోనూ దాన్ని గుర్తు చేశారు చంద్రబాబు. చంద్రబాబు దృష్టిలో సిద్ధాంతం అన్నది పిల్లి. అది నల్లదా తెల్లదా అన్నదాంతో పని లేదు. అధికారాన్ని సంపాదించటానికి పనికొస్తుందా లేదా అన్నదే ప్రమాణం.
ఈ సమావేశం నుంచి బయటికి వచ్చే సరికి కడుపంతా దేవినట్లయ్యింది. వెర్టిగో వచ్చిన రోగిలాగా తల తిరగసాగింది. ఈ ఉపన్యాసం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ప్రధాని గురించిన ఉపన్యాసం. ఉపన్యాసం చేసింది అదే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకతతో ప్రజల్లో ఉన్న అసంతృప్తిని సొమ్ముచేసుకుని అధికారానికి వచ్చిన ఓ ప్రాంతీయ పార్టీ నేత. ఈ సంస్కరణలను మరింత పకడ్బందీగా రూపొందించి అమలు చేయటంలో కీలక పాత్ర పోషించిన మరో కాంగ్రెస్ ప్రధానికి చరిత్ర కేటాయించిన స్థానాన్ని తొలగించి పదేళ్ల మోడీ పరిపాలనకు చరిత్రలో స్థానాన్ని ఖాయం చేసే సందర్భంగా మారింది.
చంద్రబాబు నాయుడు కేవలం తన కాలానికి ప్రాతినిధ్యంవహించే నాయకుడు మాత్రమే కాదనీ. కాలంతోపాటు నడిచేవాడని బాలగోపాల్ ఎప్పుడో చెప్పారు. వర్తమానం అపరిమిత అధికారాలు మోడీ చేతుల్లో కేంద్రీకృతమైన కాలం. కమలదళం మాటున హిందూత్వ కాషాయ పవనాలు విజృంభిస్తున్న కాలం. దీన్నే అదునుగా చూసుకుని మరోసారి కీర్తి శిఖరాలు అధిరోహించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.