
ఇంటింటికీ కేబుల్ టీవీ, ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్‌కు చౌకగా అందించే ఏపీ ఫైబర్‌నెట్ మూతపడుతోందా..? ఆదిశగానే ప్రభుత్వం ఆలోచన చేస్తోందా.? ఇప్పుడు అందరికీ అదే అనుమానం కల్గుతోంది. గతంలో తమ ప్రభుత్వం లోనే ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఫైబర్ నెట్ ను కష్టాల నుంచి గట్టెక్కించడం తమవల్ల కాదని చంద్రబాబు డిసైడ్ అయిపోయారా..? రాష్ర్ట వ్యాప్తంగా ఫైబర్ నెట్ సర్వీసులు ఆగిపోయాయి. వినియోగదారులు వేరేదారి చూసుకుంటున్నారు.ఫైబర్ నెట్ ఆపరేటర్లు నిరసనకు దిగుతున్నారు. దీంతో అసలు ఫైబర్ నెట్ లో ఏమి జరుగుతోందన్న ప్రశ్న ఉత్పన్నమైంది.
కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే ఫైబర్ నెట్ పై దృష్టి
నిజానికి చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి రాగానే ఏపీ ఫైబర్ నెట్ పై దృష్టి పెట్టారు. తెలుగుదేశం లో చురుకుగా పనిచేసే నేతగా జీవీ రెడ్డి ని ఫైబర్ నెట్ కు ఛైర్మన్ గా నియమించారు. జీవి రెడ్డి దూకుడు గా వ్యవహరించి, ఫైబర్ నెట్ అనేక సమస్యలలో వుందని, దానికి పూర్తి ప్రక్షాళన అవసరమని తేల్చేశారు. తనకు ఎవరి అనుమతీ అవసరం లేదన్న రీతిలో ఫైబర్ నెట్ వాస్తవ పరిస్దితి ఇదంటూ మీడియా ముందు పెట్టి రచ్చ రచ్చ చేశారు. వైసీపీ హయాంలో ఐదేళ్లు ఏపీ ఫైబర్ నెట్ ను గాలికి వదిలేశారని, కనెక్షన్లు కూడా గణనీయంగా తగ్గిపోయిన అంశాన్ని బైటపెట్టారు. విధులు నిర్వర్తించకుండా ఎలాంటి పనులు చేయకుండా 500 మంది ఉద్యోగులు జీతాలు తీసుకుంటున్నారని బాంబు పేల్చారు. వారందరినీ తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే సంస్ధ ఎండీ దినేష్ రెడ్డి , ఛైర్మన్ మధ్య విభేదాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు మందలింపుతో జీవీ రెడ్డి ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. దాంతో సంస్థ పనితీరు గందరగోళంగా మారింది. అనంతర పరిణామాలలో ఎండీ ని మార్చి విచారణ కు ఆదేశించిన ప్రభుత్వం 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఫైబర్ నెట్ లో జరిగిన అక్రమాలను బయటపెట్టేందుకు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు.5400 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరుగగా దాదాపు 500 కోట్లు అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఫైబర నెట్ సంస్థను మూసివేయాలని కొందరు సూచించినట్లు, క్షేత్రస్థాయిలో ఉద్యోగులకు కొన్ని నెలలుగా జీతాలు కూడా ఆగినట్లు చెబుతున్నారు.
ఆపరేటర్ల ఆందోళన
ఫైబర్ నెట్ పై ఆధారపడిన ఆపరేటర్లు , సిబ్బంది ఆందోళన బాటపడ్డారు. సర్వీసులను పునరుద్దరించాలని ప్రభుత్వంపై వత్తిడి తెస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఫైబర్ నెట్ ప్రారంభించిన దగ్గరి నుంచి 2019 వరకూ 17 లక్షల దాకా వెళ్లిన కనెక్షన్ల ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. దీనంతటికీ వైసీపీ ప్రభుత్వం ఫైబర్ నెట్ విషయంలో వ్యవహరించిన తీరే కారణమని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చే నాటికి 6.5 లక్షలుగా వున్న కనెక్షన్లు ఈ 11 నెలలలో నాలుగున్నర లక్షలకు పడిపోయాయి. దాంతో పాటుగా ఉద్యోగుల తొలగింపు, ఇతర చర్యలతో క్షేత్రస్థాయిలో ఆపరేటర్లపై తీవ్ర ప్రభావం పడింది. క్షేత్రస్థాయిలో వున్న సాంకేతిక సిబ్బంది కి జీతాలు ఆగిపోయాయని చెబుతున్నారు. ఈ పరిణామాలన్నింటిని చూస్తుంటే, ఫైబర్ నెట్ కే ప్రభుత్వం మంగళం పాడుతుందా.. పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి మళ్లీ గాడిలో పెడుతుందా అన్నది తేలాల్సివుంది.ఫైబర్‌నెట్ సంస్థ పనితీరును మెరుగుపర్చడమే తన లక్ష్యమని ఇన్చార్జి ఎండీగా నియమితులైన ప్రవీణ్ ఆదిత్య తెలిపారు. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా 29 న నిరహార దీక్షలకు పిలుపునిచ్చారు ఏపీ కేబుల్ ఆపరేట్ల జేఏసీ.

పోటీని తట్టుకొని నిలుస్తుందా?
ఫైబర్ నెట్ ను పూర్తిగా మూసివేస్తారన్న వార్తలను అనుమానాలను సంస్థ అధికారులు కొట్టిపారేస్తున్నారు. అయితే సంస్థ గడ్డుపరిస్థితిలో వుందన్న విషయాన్ని మాత్రం అంగీకరిస్తున్నారు.మళ్లీ ప్రజాదరణ చూరగొనేందుకు శక్తియుక్తులు ప్రదర్శించాల్సివుంది. 149 రూపాయల బేసిక్ ప్లాన్‌ను మళ్లీ ప్రవేశపెట్టి రాష్ట్రంలో కోటిమందికి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా వెళతామని కూటమి ప్రభుత్వం తొలినాళ్లలో తెలిపినా, ఇప్పుడు వున్న కనెక్షన్లను నిలుపుకుంటే చాలన్న స్దితిలో వుంది.
ఏపీలో ఇంటింటింకీ అతి తక్కువ ధరకే చౌకగా వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించాలనే సంకల్పంతో 2017లో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రాజెక్టు ఏపీ ఫైబర్‌నెట్. నెట్ స్పీడ్ ఇతర సాంకేతిక సమస్యలతో ప్రైవేటు నెట్ సంస్థల నుంచి తీవ్ర మైన పోటీ ఎదురవుతోంది. అప్పట్లో ఇంటర్నెట్, కేబుల్, ల్యాండ్ ఫోన్లను సర్వీస్ ప్రొవైడర్లు విడివిడిగా అందిస్తుండగా వాటికి నెలవారీ బిల్లు తడిసి మోపెడయ్యేది. మూడు రకాల సేవల్ని ఒకే కనెక్షన్‌గా ఇచ్చి దేశం దృష్టిని ఆకర్షించించింది నాటి టీడీపీ ప్రభుత్వం. కేవలం రూ.149కే బేసిక్ ప్లాన్ నిర్ణయించి, కేబుల్ ఆపరేటర్లను భాగస్వాములను చేయడంతో వారే ఇంటింటికీ తిరిగి ఇళ్లకు ఫైబర్‌నెట్ కనెక్షన్లను ఏర్పాటు చేశారు. 2019 మార్చి నాటికి 17 లక్షల కనెక్షన్లు ఇచ్చింది. ఆతరువాత పరిస్థితి తల్లకిందులైంది. ఐదేళ్లలో 17 లక్షల కనెక్షన్లు కాస్తా 5 లక్షలకు దిగజారాయి. సంస్థ ఆదాయం గణనీయంగా తగ్గింది. అవినీతి అక్రమాలతో సంస్థను పీకల్లోతు అప్పుల్లో ముంచి ఫైబర్‌నెట్‌ను దివాలా అంచులకు నెట్టారు. మళ్లీ ఫైబర్‌నెట్‌కు పూర్వవైభవం తెస్తారా…మూత వేస్తారో చూడాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.