
సీమాంతర ఉగ్రవాదం కారణంగా భారత్- పాకిస్తాన్ల మధ్య 1960లో కుదుర్చుకున్న సింధూ జలాల ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. పహాల్గాం దాడులు చివరకు రెండు దేశాలను యుద్ద రంగంలోకి దిగేలా చేశాయి.
నీటి ఒప్పందాలను రద్దు చేసుకోవడం కేవలం భారతదేశం ఒక్కటే తీసుకున్న చర్య కాదు. దక్షిణాసియా దేశాలలో అంతర్జాతీయ జల పంపిణీ ఒప్పందాలను రద్దు చేసుకోవడం ఒక ధోరణిగా మారింది. ఈ మధ్యకాలంలో దేశాల మధ్య తలెత్తే వివాదాల్లో జలవనరులు ఒక వ్యూహాత్మక సాధనంగా మారుతున్నాయి. దీంతో దేశాల మధ్య పరస్పరం అపనమ్మకాలు, పర్యావరణ సంక్షోభం, భౌగోళిక రాజకీయ పోటీలకు దారి తీస్తోంది. ఈ మధ్యకాలం వరకు అంతర్జాతీయ జల ఒప్పందాలు ఉమ్మడివనరులుగా ఉండేవి. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు.
మొత్తం ప్రపంచ జనాభాలో దక్షిణాసియాలో కనీసం పాతిక శాతం జనాభా నివసిస్తోంది. ఈ జనాభా హిమ శిఖరాలు కరగడం వలన ఏర్పడే నదీ జలాలపై ఆధారపడి మనుగడ సాగిస్తుంది. దీని వల్లనే నాగరికతలు విస్తరిస్తున్నాయి. దేశాలు సస్యశ్యామలం అవుతున్నాయి. ఈ హిమాలయాలే ప్రపంచంలో స్వచ్ఛమైన జలాలకు మూడో ముఖ్య వనరుగా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో జల దౌత్యం విఫలమైతే ఈ భూభాగంలో జల ప్రళయాలు, పర్యావరణ సంక్షోభాలు, ప్రకృతి విపత్తులు అనివార్యం అవుతాయి. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ జల వనరుల ఒప్పందాలను, అంతర్జాతీయ పర్యావరణ న్యాయానికి సంబంధించిన అంశాలుగా పరిగణించాల్సిన తక్షణ అవసరం ముందుకు వచ్చింది.
అంతర్జాతీయ జల వివాదాల గురించి పరిశీలించేటప్పుడు 2024 లో వచ్చిన వరదలను గుర్తు చేసుకోవాలి. ఈ వరదల్లో బంగ్లాదేశ్‌లో సుమారు 6 కోట్ల జనాభా నష్టపోయింది. భారత్ భూభాగంలో ఎగువ ప్రాంతంలో ఉన్న ఆనకట్ట నుంచి ఎటువంటి హెచ్చరికలు లేకుండా భారీ ఎత్తున గేట్లు తెరవడం వల్ల ఈ నష్టం సంభవించిందని అకొంతమంది బంగ్లాదేశ్ ప్రభుత్వ అధికారులు భిప్రాయపడ్డారు. భారత ప్రభుత్వం ఈ ఆరోపణలకు స్పందించలేదు. అనూహ్య స్థాయిలో కుండపోత వర్షాలు కురిసినప్పటికీ భారత ప్రభుత్వం ఆనకట్ట యాజమాన్యం విషయంలో ఎటువంటి అజాగ్రత్తలకు తావివ్వలేదని స్పష్టం చేసింది. రెండు దేశాల ప్రభుత్వాల ప్రకటనలు ఎలా ఉన్నా 2024 వరదలు భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉన్న వివాదాలకు, ఉద్రిక్తతలకు తిరిగి ప్రాణం పోశాయి.
చైనా తన ఇరుగు పొరుగు దేశాలతో జల వనరుల పంపిణీకి సంబంధించిన ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు. అయినా దక్షిణాసియా ఆగ్నేయ ప్రాంతాల్లో పెరుగుతున్న చైనా ప్రభావం, పలుకుబడి నేపథ్యంలో రానున్న కాలంలో తలెత్తబోయే ప్రమాదాలకు సంబంధించినటువంటి సూచనలు తెలియజేస్తుంది.
ప్రమాదాలను తీవ్రతరం చేస్తున్న పర్యావరణ సంక్షోభం..
వర్తమానంలో పెరుగుతున్న రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు నడుమ అంతర్జాతీయ నదీ జలాల ఒప్పందాలు కీలక ప్రాధాన్యతలను సంతరించుకుంటున్నాయి. నానాటికి కరిగిపోతున్న హిమ శిఖరాలు, అనూహ్య స్థాయిలో మారుతున్న వర్షపాతాలు, పర్యావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
కరిగిపోతున్న హిమశిఖరాల కారణంగా హిమాలయాల సానువుల్లో ప్రవహించే నదులు జలోత్పాతాలతో ఉప్పొంగాయి. దీర్ఘకాలంలో ఈ పర్యవసానాలు, ప్రభావాలు, పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది అస్పష్టంగా మారింది. పర్యావరణ ప్రమాదాలు ఇదే స్థాయిలో కొనసాగితే హిమశిఖరాల కరుగుదలతో నిండే గంగా, సింధు, బ్రహ్మపుత్ర వంటి నదులు ఈ శతాబ్దం చివరి నాటికి ఎండిపోయే ప్రమాదం కూడా ఉంది. దాంతో వందల కోట్ల జనాభాతో ఉన్న దక్షిణాసియా ఆగ్నేయ దేశాలు పెను పర్యావరణ విపత్తులకు కేంద్రాలు కానున్నాయి.
హిమాలయాల అంతర్గత నిర్మాణంలో వస్తున్న మార్పులు ఈ ప్రమాదాలను లేదా ప్రమాదకర పర్యవసానాలను మరింత వేగవంతం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రత కంటే ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మరింత వేగంగా పెరుగుతున్నాయి. మంచు కురిసే వేగం తీవ్రత మొదలు వర్షపాతం తీవ్రతలు మధ్య మారుతున్న పర్యావరణం ఏ నదిలో ఏ ప్రాంతంలో ఏ సమయంలో ఎంత జలపాతం ఉంటుంది అన్న విషయాలకు సంబంధించిన స్పష్టతతో కూడిన పరిస్థితులకు దారి తీయనున్నాయి. అంటే ఆయా నది పరివాహక ప్రాంతాలలో వ్యవసాయ ఉత్పత్తులో దిగుబడులు కూడా అనిషితంగా మారబోతున్నాయి.
అదే సమయంలో దక్షిణాసియా ప్రాంతంలో నిరంతరం పెరుగుతున్న భూగర్భ జల వినియోగం వల్ల భూగర్భ జల వనరులు ఆశించిన దాని కంటే వేగంగా తరిగిపోతున్నాయి. దీంతో ఆ ప్రాంతాల్లో జల సంక్షేపం ఉధృత రూపం దాల్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం ఈ ప్రాంతంలో రాజకీయ భౌగోళిక పరిణామాలలో ప్రమాదాన్ని ముందుకు తెస్తోంది. దీని వల్ల పొంచి ఉన్న ప్రమాదం ఏంటంటే సరిహద్దు దేశాల మధ్య నానాటికి పెరుగుతున్న అపనమ్మకానికి తాజా వివాదం లోతైన పనులు వేస్తుంది. నది జల ప్రవాహాలకు సంబంధించిన వివరాలు సేకరించుకోవటం ఇచ్చిన వివరాలను విశ్వసించటం వంటి సమస్యలను ముందుకు తెస్తుంది.
భారత్- పాకిస్తాన్ కుదుర్చుకున్న సింధూ జలాల ఒప్పందంలో కీలకమైన షరతు ఏంటంటే ఆయా సమయాలలో సింధూ నదిలో ప్రవహించే జలాల మోతాదు ఎంత, నీటిమట్టం ఎంత, ఆనకట్ట యాజమాన్యానికి సంబంధించిన సమాచారాన్ని రెండు దేశాలు ఇచ్చిపుచ్చుకోవాలి.
వరదలు, కరువు కాటకాలు వంటి విషయాలను నిర్ధారించుకోవటానికి వీలుగా తగిన చర్యలు చేపట్టడానికి ఈ సమాచారం పాకిస్తాన్‌కు చాలా కీలకమైంది. భారతదేశం ఇచ్చే సమాచారం ఆధారంగా పాకిస్తాన్ తన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణ, వ్యవసాయ ప్రణాళిక, తాగునీటి వనరులు ఏర్పాటు వంటి నిర్ణయాలు తీసుకోవటానికి దోహదం చేస్తుంది. అయినప్పటికీ భారతదేశము ఈ విషయాలు పాకిస్తాన్‌తో పంచుకోవడానికి సిద్ధమవుతున్నట్లుగా కనిపించడం లేదు.
అంతర్జాతీయ నది జలాల వ్యవహారాల విషయంలో భారతదేశంతో ఇబ్బందులు పడుతున్నది పాకిస్తాన్ ఒకటే కాదు. ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్, నేపాల్‌లు కూడా ఇటువంటి ఇబ్బందులను వ్యక్తం చేశాయి. దీర్ఘకాలంగా అమలవుతున్న ఈ ఒప్పందాలను కేంద్ర ప్రభుత్వం పునః పరిశీలించాలని నిర్ణయించుకోవడం ఇరుగు పొరుగు దేశాలకు అనేక అనుమానాలు, సందేహాలు, భయాందోళనలను కలుగజేస్తుంది.
గంగా నది పరివాహక ప్రాంత జల పంపిణీ ఒప్పందం 2026 నాటికి ముగింపుకు వస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశంలో బంగ్లాదేశ్ సాగు, తాగునీటి అవసరాలకు కావలసిన కనీస నీటి మోతాదు గంగా నదిలో ప్రవహించేలా గ్యారెంటీ చేయాల్సి ఉంది. ఈ కనీస మోతాదు నది జలాలే బంగ్లాదేశ్ వ్యవసాయానికి కీలకమైన ప్రాణాధారం.
ఇటువంటివే భారత దేశం కుదుర్చుకున్న మరికొన్ని ఒప్పందాలు ఉన్నాయి. నేపాల్‌తో కుదుర్చుకున్న మహాకాళి నదీ పరివాహక జలాల ఒప్పందం, కోసి నది ప్రవాహ జలలా ఒప్పందం. బంగ్లాదేశ్ కుదుర్చుకున్న తీస్తా నది జలాల ఒప్పందం ఇంకా అమలుకు నోచుకోలేదు. దాంతో నేపాల్, బంగ్లాదేశ్‌లకు భారతదేశ వ్యవహార శైలి పట్ల నిరంతరం అనుమానాలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రాంతీయ దౌత్యానికి సంబంధించిన విషయాలపై అనేక అనుమానాలు, అపోహలకు కారణమవుతున్నాయి. జల వనరుల వినియోగం, పంపిణీ విషయంలో భారత ప్రభుత్వ పద్ధతుల గురించిన సందేహాలు పెరుగుతున్నాయి.
ఈ పరిస్థితుల పరిణామాల వల్ల ప్రస్తుతం ఉపయోగకరమైన పరిస్థితులయితే కనపడటం లేదు. ఎందుకంటే భారతదేశం, నేపాల్, పాకిస్తాన్‌లు కాలం చెల్లిన జల నిర్వహణ పద్ధతులను పాటిస్తున్నాయి. అంటే ఈ దేశాలు అవసరానికి మించిన నీటి వనరులను వినియోగిస్తున్నాయి. పర్యావరణ సంక్షోభం, వైపరీత్యాలు, పెరగడానికి, అనూహ్య స్థాయిలో కరువులు వరదలు సంభవించడానికి దారితీస్తున్న నేపథ్యంలో ఆయా దేశాలు అంతర్జాతీయ జలవనరుల పంపిణీ ఒప్పందాలను పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది.
భారత్- పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం 1960లో కుదిరింది. అప్పటికి ఇంకా ఆధునిక పర్యావరణ విజ్ఞానం అభివృద్ధి చెందలేదు. పర్యావరణ ప్రమాదాలు కూడా అంత తీవ్ర స్థాయిలో లేవు. కాబట్టి గత ఆరు దశాబ్దాలలో పర్యావరణంలో వచ్చిన మార్పులను సింధు జలాల ఒప్పందం ప్రతిబింబించలేదు. ప్రధానంగా ఒప్పందలన్నీ సాంకేతిక అంశాలను, ఇంజనీరింగ్ అధికాంశాలను ప్రామాణికంగా తీసుకుంటాయి తప్ప పర్యావరణ సంక్షోభాన్ని ప్రామాణికంగా తీసుకోలేదు.
గంగా నదీ జలాల పంపిణీ ఒప్పందం ముగింపుకు వస్తున్న తరుణంలో ఇతర నదీ పరివాహక ప్రాంత ఒప్పందాలు ఇంకా ఖరారు కావలసి ఉన్న సమయంలో దక్షిణాసియా దేశాల మధ్య జలవనరుల పంపిణీకి సంబంధించిన సమస్యలను సమగ్రంగా పరిశీలించడానికి ఇది అనువైన సందర్భం.
సింధూ నది జలాల విషయంలో భారతదేశం నది పరివాహక ప్రాంతానికి ఎగువభాగంలో ఉంది. అయిన్నప్పటికీ మిగతా జలాల ఒప్పంద విషయంలో నదీ పరివాహక ప్రాంతంలో భారతదేశం దిగువ భాగాన ఉంది. ఉదాహరణకు బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంత జలాల వినియోగం విషయంలో దిగువ ప్రాంతంలో ఉన్న భారతదేశం నదీ పరివాహక ప్రాంతపు భాగం వల్ల ఉన్న చైనాతో నిరంతరం సహాయ- సహకారాన్ని అందుకోవాల్సి ఉంది.
సింధూ నది జలాల ఒప్పందం విషయంలో భారతదేశం తీసుకునే వైఖరి ముందు ముందు భారత్, నేపాల్, బంగ్లాదేశ్‌ల మధ్య నది ప్రవాహక జల పంపిణీ ఒప్పందాల విషయంలో జరిగే చర్చలను ప్రభావితం చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో జలాధారిత రాజకీయ భౌగోళిక వివాదాలలో చైనాకు పెద్దన్న పాత్ర పోషించే అవకాశం కల్పించే పరిస్థితులు తలెత్తే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే చైనా తన పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్‌లకు వందల కోట్ల డాలర్లు మంజూరు చేయడం ద్వారా ఆయా దేశాలను తన భౌగోళిక రాజకీయ వ్యూహంలో భాగంగా ఇముడ్చుకొవడానికి సిద్ధపడుతుంది.
జలవనరులను ఈ విధంగా ఉపయోగించుకోవాలనుకుంటే ప్రతికూల పరిణామాలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. దక్షిణాసియా ప్రాంతంలో నెలకొంటున్న నదీ జలాల వివాదం కేవలం ఈ ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది కాదు. అంతర్జాతీయ పర్యావరణ సంక్షోభంలో ఈ వివాదాలను అంతర్భాగంగా చూడాల్సి ఉంది.
నిరంతరం ఉధృతమవుతున్న పర్యావరణ సంక్షోభం, ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో సింధు జలాల ఒప్పందం గంగా నది పరివాహ ప్రాంతా జలాల పంపిణీ ఒప్పందం, తీస్తా నది జలాల ఒప్పందం వంటి వాటిని తాజా పరుచుకోవడం ఒక అవకాశం మాత్రమే కాదు ముందున్న తక్షణ కర్తవ్యం.
అనువాదం: కొండూరి వీరయ్య
(ది కన్వర్సేషన్ సౌజన్యంతో..)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.