
భారతదేశంలో ఆర్థిక కుంభకోణాలకు కొదువలేదనే చెప్పాలి. హర్షద్ మెహతా నుంచి నీరవ్ మోదీ వరకు భారీ బ్యాంక్ స్కాంలకు కేరాఫ్ అడ్రసే.. ఆర్థిక కుంభకోణాలు దేశ ఆర్ధిక వ్యవస్థ పైనే తీవ్ర ప్రభావం చూపుతాయనడం కాదనలేని నిజం. ఈ ఆర్థిక స్కాంలతో సంబంధం లేకున్నా ఇప్పుడు కొత్త తరహా ఆర్థిక కుంభకోణాలకు మార్గం సుగమమవుతోంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ బ్యాంకులతో వ్యాపారాలకు, వాటి నుంచి వచ్చే గ్యారెంటీ లను స్వాగతం పలుకుతూ ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ఆర్బీఐ నిబంధనలను భేఖాతరుచేస్తూ, ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్ధలు ప్రభుత్వ ప్రాజెక్టు టెండర్ల విషయంలో చూపుతున్న ఔదార్యం అనుమానాలకు దారితీస్తోంది. ఇప్పుడు ప్రభుత్వ భారీ ప్రాజెక్టుల కాంట్రాక్టులను చేజిక్కించుకోవడానికి సదరు నిర్మాణ సంస్ధలు ఎక్కడో కరేబియన్ దీవులలో వుండే బ్యాంకుల గ్యారెంటీలతో రంగంలో దిగుతున్నాయి. అవన్నీ ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా వున్నాయా లేవా అన్న దానిని పట్టించుకోకుండా ప్రభుత్వ సంస్దలు వాటిని అంగీకరించి సదరు కాంట్రాక్టర్లకు పనులు కట్టబెడుతున్నాయి. ఇందులో అవినీతి, ఎంత చేతులు మారుతోందన్నది తర్వాత విషయం.
అసలు విషయానికి వస్తే… రాష్ట్రప్రభుత్వాలు గాని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు గాని తమపరిధిలో చేపట్టే భారీ ప్రాజెక్టుల షరతుల విషయంలో ఆర్బీఐ నిబంధనలకు పక్కదారి పట్టిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం జాతీయం చేయబడిన,లేదా షెడ్యూల్ బ్యాంకులు జారీ చేసే గ్యారెంటీలే స్వీకరించాలి. అయితే ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు తూర్పు కరేబియన్ ద్వీప దేశమైన సెయింట్ లూయీస్ లో వున్న యూరో ఎగ్జిమ్ బ్యాంకు గ్యారెంటీ లను అనుమతిస్తున్నాయి. ఇప్పటికే ఆ బ్యాంక్ పనితీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వందలాది గ్యారెంటీ లను అందించిన ఆ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అసలు సామర్థ్యం ఎంత.. అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక సమాచారం ప్రకారం బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లు, గ్రాంట్లు, ఆడిట్ వివరాల ప్రకారం ఆ బ్యాంక్ 1900 కోట్ల నికర నిల్వలు కలిగి వుంది. ఈ లెక్కంతా 2023 డిసెంబర్ నాటిది. అయితే ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంకు భారత దేశంలోనే సొంతంగా 26,560 కోట్ల వ్యాపారం చేసింది. అనేక భారత బడా కాంట్రాక్టు సంస్థల తరపున గ్యారెంటీ లు అందిస్తోంది. అయితే ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఏ బ్యాంకు బాకీలైనా తన యాజమాన్య వనరులలో 10 శాతం మించకూడదు.ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. యూరో యాక్సిస్ ప్రధాన కార్యాలయం కరేబియన్ లో వుండగా, అది మాత్రం భారత్ లో ఎక్కువ వ్యాపారం సాగిస్తోంది. గుజరాత్ గాంధీనగర్ లోనూ ఆ బ్యాంకు తన బ్రాంచ్ కలిగి వుంది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం చూస్తే యూరో బ్యాంక్ తమ కస్టమర్ల తరుపున బ్యాంక్ గ్యారెంటీ లు, క్రెడిట్ లెటర్లు ప్రధానంగా జారీచేస్తోంది. అదే గ్యారెంటీ లను మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లాంటివి వినియోగించుకొని రంగంలోకి దిగుతున్నాయి.
తాజాగా 14,400కోట్ల అంచనాలతో చేపట్టిన థానే బోరివరి ట్విన్ టెన్నల్ కాంట్రాక్టు ను మేఘా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకుంది. ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్ మెంట్ అథారిటీ ప్రాజెక్టు టెండర్లను మెఘాకు ఓకే చేసింది. అయితే ఈ టెండర్ల కోసం మేఘా కరేబియన్ యూరో బ్యాంకు గ్యారెంటీ ఇవ్వడం దానిని ప్రభుత్వ సంస్థ అనుమతించడం వివాదమవుతోంది. ఇది అతిపెద్ద ఆర్థిక కుంభకోణంగా కోర్టులో పిల్ కూడా దాఖలైంది.గతంలో కొన్ని ప్రాజెక్టు లకు యూరో బ్యాంకు గ్యారెంటీ లనే మేఘా వినియోగించింది. వాటిపైనా విచారణ కొనసాగుతోంది.ఇక్కడ ఆలోచించాల్సిన విషయం మేఘా సంస్థో, మరో సంస్థో యూరో బ్యాంకు గ్యారెంటీ లను వాడిందని కాదు. ఆ యూరో బ్యాంక్ గ్యారెంటీలకు ఎంత నిబద్ధత వుందనేదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆర్బీఐ నిబంధనలు భేఖాతరుచేస్తూ విదేశీ బ్యాంక్ ల గ్యారెంటీ లను ప్రోత్సాహం ఇస్తున్న ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు సదరు కాంట్రాక్టు సంస్థలు నిబంధనల మేరకు పనులు పూర్తి చేయకపోతే ,ప్రజాధనాన్ని తిరిగి రాబట్టగలుగుతాయా… మన చట్టాల కిందికి రాని విదేశీ బ్యాంకు ల గ్యారెంటీ తో నిధులెలా రాబడతాయి. అన్నీ ప్రశ్నలే..
విదేశీ బ్యాంకుల నుంచి లావాదేవీలు జరిపే సంస్థలు మన బ్యాంక్ లను మధ్యవర్తులు గా వాడతాయి. అంటే కేవలం పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజీయన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు విషయంలో మేఘా సంస్థకు యూరో బ్యాంకు కు ఎస్బీఐ మధ్యలో వుంది. ఒక సందేహాస్పదమైన బ్యాంక్ గ్యారెంటీ లకు ఎస్బీఐ వంటి ప్రముఖ జాతీయ బ్యాంక్ మద్దతుగా నిలవడం తో కొన్ని చిన్న బ్యాంకులూ దీనిని అనుసరించే ప్రమాదం పొంచివుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ బ్యాంక్ అధికారులే చెబుతున్నారు. ఏదైనా తప్పు జరిగితే ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం చూపే ఇటువంటి వ్యాపార లావాదేవీలు ఇప్పుడు పబ్లిక్ గా మారుతున్నాయి.
వివాదాలు చుట్టుముట్టేలా వుండటం, కోర్టు సమస్యలు వచ్చే అవకాశం తో థానే టన్నెల్ ప్రాజెక్టు విషయంలో విదేశీ బ్యాంకు గ్యారెంటీ లను మార్చాలని, ఏదైనా షెడ్యూల్ బ్యాంక్ షూరిటీ లు తిరిగి ఇవ్వాలని కూడా మేఘాకు ముంబై మెట్రోపాలిటన్ సంస్థ సూచించినట్లు తెలుస్తోంది. ఇలావుంటే 2022లో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ NHAI కి 22 వేల బ్యాంక్ గ్యారెంటీని అందించింది. ఆ సమయంలో విదేశీ బ్యాంక్ ఇచ్చిన గ్యారెంటీ కి ఓకే చెప్పేలా తన నిబంధనను మార్చుకుందని NHAI వర్గాలే చెబుతున్నాయి. అప్పట్లో మధ్యవర్తిగా యూనియన్ బ్యాంక్ ఇండియా మధ్యవర్తిత్వం వహించడంతో ఏసమస్యా లేకుండా పోయింది.
యూరో ఎగ్జిమ్ బ్యాంక్ వంటి విదేశీ బ్యాంకు లను ఉపయోగించుకొని కొన్ని సంస్థలు భారీ ప్రభుత్వ కాంట్రాక్టు లను పొందటం వివాదాలకు దారితీస్తుండటంతో ఆర్బీఐ కూడా నిబంధనలను మరింత కఠినతరం చేసే పనిలో పడింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విదేశీ బ్యాంకు ల గ్యారెంటీ ల విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా అధికారం లోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం జారీ చేసిన 31 బ్యాంకు గ్యారెంటీలను సమీక్షిస్తోంది. ఏపీ ప్రాజెక్టుల టెండర్ల విషయంలో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ వంటి విదేశీ బ్యాంకులను అనుమతిస్తాయా లేదా అన్నదానిపై అధికారులు స్పందించడంలేదు. అయితే పార్టీలతో ప్రమేయం లేకుండా బీజేపీ ప్రభుత్వాలతో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వాలు, మిగిలిన ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు ఒకే దోవలో నడుస్తుండడం విదేశీ బ్యాంకు ల గ్యారెంటీ లకు అనుమతులు ఇవ్వడం భవిష్యత్ లో ఆర్ధిక కుంభకోణాలకు దారితీసే అవకాశం వుంది.
మొత్తంమీద యూరో ఎగ్జిమ్ బ్యాంక్ వ్యాపార లావాదేవీలు మాత్రం అనేక సందేహాలకు ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ గాంబియా అధికార వెబ్సైట్ లోని జాబితాలో యూరో బ్యాంక్ పేరు కనిపించడంలేదని ,అది నిజయైన గాంబియన్ కాదని కూడా యూకే ఫైనాన్షియల్ ఎఫైర్స్ చూసే FCA కు కూడా గతంలోనే లేఖలు వచ్చాయి. ఏదేమైనా మన ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లుతెరచి యూరో ఎగ్జిమ్ బ్యాంకు వంటి వాటిని ప్రోత్సహించడం లో ముందు వెనుక ఆలోచించాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.