
మేఘా ఇంజనీరింగ్ పై ముంబై హైకోర్టు లో కేసు…
ద వైర్ తెలుగు ప్రత్యేక కథనం
ప్రముఖ నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ భారీ ఆర్థిక మోసాలకు పాల్పడుతోందా… నకిలీ బ్యాంకుల సహకారంతో ప్రభుత్వ సంస్దలు, ఏకంగా ప్రభుత్వాలనే కుదేలు చేస్తోందా?మేఘా సంస్థ ఆర్థిక మోసాలపై ఇప్పటికే పలుమార్లు ఆరోపణలు వచ్చినా, తాజాగా కొత్త కోణాలు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం మేఘా ఆర్థిక మోసాలపై ముంబై హైకోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ముంబై నగరంలోని 16 వేల 6 వందల కోట్ల థానే బోరివలీ ట్విన్ టన్నెల్ ప్రాజెక్టు టెండర్ దక్కించుకుంది మేఘా కంపెనీ. ఈ ప్రాజెక్ట్ ను ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ పర్యవేక్షిస్తుంది. MMRDA కు ప్రభుత్వ నియమాలు ప్రకారం బ్యాంక్ గ్యారంటీ సమర్పించాలి. ఆ బ్యాంక్ గారంటీలు ఆర్బీఐ గుర్తించిన జాతీయ అంతర్జాతీయ బ్యాంకుల నుండి మాత్రమే ఇవ్వాలి. కానీ ఈ ప్రాజెక్ట్ నిమిత్తం మేఘా ఇంజనీరింగ్ సంస్థ సమర్పించిన బ్యాంక్ గ్యారంటీ లు ఇచ్చే బ్యాంక్ గారంటీలు ఇచ్చిన ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ అనుమతి లేక పోవడమే ప్రస్తుత వివాదానికి కారణం. దాంతో మేఘా. నకిలీ బ్యాంకు గ్యారెంటీ లను సమర్పించిందంటూ పిల్ దాఖలవడం సంచలనంగా మారింది.నకిలీ బ్యాంకు గ్యారెంటీలపై కేంద్ర దర్యాప్తు సంస్దలతో విచారణ చేయించాలని హైదరాబాద్ కే చెందిన ప్రముఖ జర్నలిస్ట్ రవి ప్రకాష్ ఈ పిల్ దాఖలు చేయడం మరో విశేషం. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ ..రవి ప్రకాష్ తరపున వాదిస్తుండగా, వచ్చేవారం హైకోర్టు పిటీషన్ విచారించనుంది.
ఎక్కడో సెంట్ లూయిస్ దీవుల్లో వున్న యూరో ఎగ్జిమ్ బ్యాంకు నుంచి ఒక ప్రభుత్వ ప్రాజెక్టు కోసం మేఘా సంస్థ గ్యారెంటీ లను ఇవ్వడం వాటిని ముంబై మెట్రోపాలిటిన్ అథారిటీ అధికారులు అనుమతించడాన్ని పిటీషనర్ తప్పుపట్టారు. దీనిలో MMRDA అధికారులు చేతులు కలిపారని ఆరోపించారు. మన దేశంలోని ఆర్ బీఐ అనుమతిపొందిన ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంకు నుంచే గ్యారెంటీ లు పొందాలన్న నిబంధనలను తుంగలో తొక్కారని, మేఘా నుంచి ఇలాంటి గ్యారెంటీ లను స్వీకరించడం ఆమోదయోగ్యం కాదన్నది పిటీషన్ వాదన.ముంబై ట్విన్ టన్నెల్ పబ్లిక్ ప్రాజెక్టుల రెండింటీలోనూ మేఘా ఆరు మోసపూరిత గ్యారెంటీ లనే ఇచ్చిందని వార్తలు వచ్చాయి. గతంలో మేఘా పై వున్న ఆర్థిక అవినీతి ఆరోపణలను పిటీషనర్ కోర్టుకు విన్నవించారు.
గతంలోనూ మేఘా ఇలాంటి ఆర్థిక మోసాలు ఎన్నో చేసిందన్న ఆరోపణలు వున్నాయి. ఎన్నికల బాండ్ల విషయంలో మేఘా ఇంజనీరింగ్, మౌలిక సదుపాయాలు, ఉక్కు మంత్రిత్వ శాఖ అధికారులపై సీబీఐ గతంలో అభియోగాలు నమోదు కూడా చేసింది. ఎన్నికల బాండ్ల ద్వారా, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ..బిజెపికి 584 కోట్లు, బిఆర్ఎస్కు 195 కోట్లు, డిఎంకెకు 85 కోట్లు, వైఎస్ఆర్సిపికి 37 కోట్లు, టిడిపికి 28 కోట్లు, కాంగ్రెస్కు 18 కోట్లు విరాళంగా ఇచ్చింది. మేఘా అనుబంధ సంస్థ వెస్ట్రన్ యుపి పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ కూడా కాంగ్రెస్కు 110 కోట్లు, బిజెపికి 80 కోట్లు విరాళంగా ఇచ్చింది.ఈ బాండ్ల విషయంలో క్విడ్ ప్రోకో జరిగిందన్న ఆరోపణలు వున్నాయి.
తెలంగాణ లో గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి, పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ టెండర్లు మేఘా సంస్థే చేజిక్కించుకుంది. అందులో భారీ అవినీతి జరిగిందని, ప్రమాణాల ఉల్లంఘన జరిగిందని, నాసిరకం కట్టుబడి జరిగిందని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ సాగిస్తోంది. కాగ్ రిపోర్ట్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు లో 48 కోట్లు మేఘా సంస్థ దారిమళ్ళించిందని తేల్చిచెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ సందర్భంగా యూరో ఎగ్జిమ్ బ్యాంకు గ్యారెంటీ ల అంశమూ చర్చనీయాంశంగా మారింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఆర్థిక అవకతవకలఫై దర్యాప్తు చేయాలంటూ ఇప్పటికే ఆర్ బీఐ, సీబీఐ, సిఎజి, ఆర్థిక మంత్రిత్వ శాఖలకూ పలు ఫిర్యాదులు అందాయి. అయినా అదే తరహాలో మేఘా దేశంలోని పలు రాష్ట్రాలలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు లను చేజిక్కించుకుంటోంది.
ఇదిచాలదన్నట్లు 8 వేల కోట్ల పెట్టుబడితో 2000MW విద్యుత్ తయారీ లక్ష్యంగా కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన షరావతి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ బిడ్ను మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గెలుచుకుంది. ఈ బిడ్ కేటాయింపు లో బిడ్డింగ్ షరతులు ఉల్లంగిం చారంటూ పోటీ దారు కంపెనీ అయిన ఎల్ & టి ఆరోపణలు చేసింది. పర్యావరణానికి తీవ్రంగా హాని కలిగించే షరావతి ప్రాజెక్టు విషయంలో అక్కడి పర్యావరణ పరిరక్షణ సంస్థలు తీవ్రంగా పోరాటం సాగిస్తున్నాయి. అలాంటి వివాదస్పద ప్రాజెక్టు ను కూడా వదలని మేఘా సంస్థ లార్సెన్ అండ్ ట్రోడో వంటి అంతర్జాతీయ సంస్థలను ఎదుర్కొని బిడ్ సొంతం చేసుకోవడం కొసమెరుపు. రేపు షరావతి ప్రాజెక్టు విషయంలో ఎలాంటి వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాలిమరి.
— బాలకృష్ణ. ఎం, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.