
ఈ వార్త శీర్షిక చూసి ఆశ్చర్యపోతున్నారా? ఈ వార్త ముందే తెలిస్తే ఫిబ్రవరి 26 వరకు కొనసాగే మహాకుంభ మేళలో ఇప్పటికే జరిగిన అగ్నిప్రమాదాలు ఇతర విపత్తులగుండా ప్రయాణించకుండానే మోక్షానికి మార్గం వెతుక్కునేవాళ్లం కదా అనుకుంటున్నారా?
వాట్సాప్ యూనివర్సిటీలో ప్రచారమవుతున్న పోస్టర్ ఇది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో గంగ, యమున, సరస్వతి నదుల సంగమ స్థానమైన త్రివేణి సంగమంలో మౌని అమావాస్య రోజున స్నానం చేస్తే అప్పటి వరకు జీవితంలో చేసిన పాపాలన్నీ ఆ నీళ్లల్లో కొట్టుకుపోతాయని అదనంగా పుణ్యఫలం సిద్ధిస్తుందని ఉన్న నమ్మకాలు మనకు తెలిసినవే. ఈ నమ్మకాలున్నా లేకపోయినా పుణ్యతిథి రోజున పుణ్యక్షేత్రాన్ని సందర్శించి స్నానం చేస్తే తప్పేమి లేదనే అభిప్రాయం ఉండడం సహజమే. అటువంటి అభిప్రాయాలు ఉన్నప్పుడు ఆర్ధిక కారణాలరీత్యా కానీ ఆరోగ్య కారణాలరీత్యా కానీ ప్రయాణం చేయలేక కానీ ప్రయాగ్‌రాజ్ చేరుకోలేని వారు కోట్ల సంఖ్యలో ఉండివుండవచ్చు. అటువంటి వారికి మనసులో ఏదో ఒక మూల అయ్యో అన్న బాధ కూడా ఉండవచ్చు. అటువంటి వారి భావోద్వేగాన్ని సొమ్ము చేసుకోవడానికి భక్తిని కూడా సరుకుగా మార్చగల ‘సమర్ధులు’ చేస్తున్న ప్రచారంలో భాగం ఈ పోస్టర్.
ఈ పోస్టర్ సారాంశమేమిటంటే..
‘‘పవిత్ర మహాకుంభ స్నానానికి మీ జీవితంలో ఇది చివరి అవకాశం. ఎందుకంటే ఇది 144 ఏళ్లకు ఒకసారి వచ్చే సందర్భం. అవకాశాన్ని వదులుకోవద్దు. మీరు రాలేకపోయినా ఈ కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్‌కు మీ ఫోటో పంపండి. అదే నెంబర్‌కు రూ.500 ఫోన్ పే ద్వారా కానీ మరో రూపంలో కానీ మరో రూపంలో పంపి, దాని స్క్రీన్‌షాట్ కూడా వాట్సాప్ చేయండి. మీరు పంపిన ఫొటో ప్రింట్అవుట్ తీసుకొని చేతపట్టుకొని ప్రయాగ్‌రాజ్‌లో మేము మీ తరఫున పవిత్రస్నానం చేస్తాము.
దీనివల్ల మీకు కలిగే ప్రయోజనాలేంటంటే..
- మీ ఆత్మపరిశుద్ధం అవుతుంది
- పవిత్ర దీవెనలు మీకు దక్కుతాయి
- పవిత్ర మహాకుంభ మేళాలో స్నానం చేసినందుకు మీ పితృదేవతలు మిమ్ములను ఆశీర్వదిస్తారు
మంచి తరుణం మించిపోవును, మహత్తర తరుణం ఇప్పుడప్పట్లో మళ్లీ రాదు. మీ జీవితకాలంలో అసలు రాదు. కాబట్టి మా నెంబర్‌కు రూ.500తో పాటు ఫొటో పంపండి.’’
గతంలో భక్తుడికి, భగవంతుడికి అనుసంధానంగా పూజారులు ఉండేవారు. మనం దర్శించే గుడిని బట్టి, మూలవిరాట్టును దర్శించుకునే సమయం, సందర్భాన్ని బట్టి, దక్షిణలు చదివించే ఓపికను బట్టి, దర్శించుకునేవారి సామాజిక, ఆర్ధిక, రాజకీయ హోదాలను బట్టి దేవాలయాలలో దర్శనాలు దొరకడం, తిరుపతి, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, మధుర, కంచి, కాశీ, ఉజ్జయినిలాంటి ప్రసిద్ధిగాంచిన దేవాలయాలలో సత్వర, శీఘ్ర, సన్నిహిత, సమీప దర్శనాల కోసం వేలు, లక్షల ఖర్చుతో పాటు రాజకీయ పలుకుబడి కూడా అవసరం అన్నది భక్తులందరికి తెలిసిన విషయమే. ఈ నమ్మకాలను సొమ్ము చేసుకుంటూ సత్వర సంపాదనా మార్గాల కోసం వెంపర్లాడే కుహనా భక్తులు, కుహనా దైవదూతలు సాగించే ఇటువంటి చిట్కా మోక్ష మార్గాల వలన నమ్మకమే ప్రశ్నార్ధకమవుతుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.