
ఆరెస్సెస్‌కు రాజ్యాంగం పట్ల విశ్వాసం ఉందన్న అబద్ధమాడాల్సి వస్తే కూడా వెనకాడదు. ఎందుకంటే గాంధీ హత్యానంతరం ఆరెస్సెస్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయించుకోవటం దాని అవసరం. అబద్ధమాడటం ద్వారా తమ కార్యకలాపాలకు ఎటువంటి అవరోధం లేకుండా చేసుకోగలిగితే అందులో తప్పేమిటి? అది వ్యూహాత్మకం అన్నది వారి భావన. ఆరెస్సెస్ తన ప్రయోజనాల కోసం అబద్దమాడుతుందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ కోట్లాది సంఖ్యలో ఉన్న విద్యావంతులు, లక్షల సంఖ్యలో ఉన్న మేధావులు, రాజకీయ పార్టీల కార్యకర్తలు, పార్టీలు ఈ అబద్ధాలను ఎందుకు నమ్ముతున్నారు? సమాజాన్ని సైతం ప్రభావితం చేయగల మేధో వర్గం ఆరెస్సెస్ పట్ల పక్షపాతంతో ఎందుకుంది? దేశంలో గణనీయంగా ఉన్న మేధో వర్గం ఆరెస్సెస్ ప్రచారం చేస్తోంది విద్వేషపూరిత హింసాత్మకవాదం అని ఎందుకు గుర్తించలేకపోతోంది? ఎందుకు అంగీకరించలేకపోతోంది?
గోల్వాల్కర్ : మనిషి వెనక ఉన్న మర్మం, మర్మం వెనక ఉన్న మనిషి పేరుతో కొత్త పరిశోధనా గ్రంధాన్ని వెలువరించిన ధీరేంద్ర కె ఝా ఆధునిక భారతంలో ఆరెస్సెస్ చరిత్రనూ ప్రత్యేకించి భారతీయ మితవాద శక్తుల నిర్మాణాలను వెలికి తెచ్చే తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ రచనకు ముందు గాడ్సే గురించి రాశారు. హిందూత్వ కాల్బలం గురించి షాడో ఆర్మీస్ అనే పుస్తకం రాశారు. హిందు ఓటుబ్యాంకును రూపొందించటంలో సాధువులు, పీఠాలు పోషిస్తున్న పాత్రను పరిశోధించి గ్రంథస్తం చేశారు.
తాజా పరిశోధన మాధవ్ సదాశివ గోల్వాల్కర్ గురించి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు రెండో సర్సంఘ్ చాలక్‌గా పని చేశారు. ఇతనికున్న ప్రత్యేకత ఏమిటి? వర్తమాన భారతదేశంలో మనం చూస్తున్న విద్వేషపు విధ్వంసక యంత్ర నిర్మాత గోల్కాల్కర్.
ఆరెస్సెస్ ఓ యంత్రం. ఆరెస్సెస్‌ను ప్రారంభించింది హెగ్డేవారే అయినా దానికి నిర్మాణ, సైద్ధాంతిక బలం, బలగాలను సమకూర్చింది మాత్రం గోల్వాల్కరే. ఒక సంఘం, సంస్థగా ప్రారంభమైన ఆరెస్సెస్‌ను వెయ్యి తలల కాలనాగులా, అమీబాకన్నా చురుకైన నిర్మాణ సౌలభ్యం కలిగిన సంస్థగా, ఎప్పుడు ఎక్కడ ఏ రంగు, రుచి, వాసనలతో కనిపించాలనుకుంటే ఆ రంగు, రుచి, వాసనలతో కనిపించే మాయావిగా రూపొందించిన ఘనత గోల్వాల్కర్దే. ఎన్ని రూపాల్లో, ఎన్ని ప్రాంతాల్లో, ఏ ముఖంతో కనిపించినా ఈ కాళీయుడి లక్ష్యం ఒక్కటే. నిరంతరం ఇతరులను ద్వేషిస్తూ అభద్రతాభావంతో బతికే పురుషాధిక్య, ఒంటరి మనస్తత్వం కలిగిన హిందువులను తయారు చేయటమే ఆ లక్ష్యం.
సమకాలీన భారతదేశంలో ఆరెస్సెస్ అత్యంత కీలకమైన ప్రాధాన్యత కలిగిన సంస్థ. కరసేవకులు ఇప్పుడు కేంద్రంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఆరెస్సెస్ రాజకీయ అంగమైన భారతీయ జనతా పార్టీ. దేశంలో అత్యంత సంపన్నవంతమైన రాజకీయ పార్టీ ఏదైనా ఉంటే అది భారతీయ జనతా పార్టీయే. ప్రధానమంత్రికి ఎంతటి ఉన్నత భద్రతావలయం ఉంటుందో అంతటి భద్రతావలయాన్ని ఆరెస్సెస్ అధినేతకు కూడా ఏర్పాటు చేశారు. దేశంలో ఒక ప్రైవేటు సంస్థకు, అదీ స్వఛ్చంద సంస్థ, సాంసృతిక సంస్థ అని చెప్పుకుంటున్న సంస్థ అధినేతకు ప్రధానమంత్రితో సమానంగా రక్షణ వలయం ఏర్పాటు చేయటం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి.
ఈరోజు దేశంలో ప్రతి ముఖ్యమైన ప్రభుత్వ అంగమూ ఆరెస్సెస్ కనుసన్నల్లోనే నడుస్తోంది. విశ్వవిద్యాలయాల మొదలు సామాజిక శాస్త్ర అధ్యయనాలు, సాంస్కృతిక అధ్యయనాల సంస్థలు అన్నీ ఆరెస్సెస్ ప్రత్యక్ష పరోక్ష అజమాయిషీలో నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ సంస్థ అనేక దేశాల్లో వేర్వేరు పేర్లతో పని చేస్తోంది. అందువల్ల అటువంటి బహుముఖ పార్శ్వాల్లో సులువుగా పని చేయటానికి వీలుగా సంస్థను తీర్చిదిద్దిన వ్యక్తి గురించి తెలుసుకోవటం తప్పనిసరి అవసరం.
ఆరెస్సెస్ నిర్దేశించుకున్న లక్ష్యమే హిందువులను సంఘటితం చేయటం. హిందువులకు ముగ్గురు శాశ్వతమైన శతృవులున్నారు, ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు. వీరి నుండి హిందువులను కాపాడాలన్నది ఆరెస్సెస్ ప్రకటిత లక్ష్యం. ఇక్కడ ఓ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. హిందూ సమాజాన్ని అంతర్గతంతో సంస్కరించేందుకు, ఆత్మపరిశీలన చేసుకొమ్మని ప్రబోధించేందుకు ఆరెస్సెస్ ఎన్నడూ పని చేయలేదు. ప్రయత్నించలేదు. హిందువుల ధార్మిక జీవనం గురించి కూడా ఆరెస్సెస్‌కు పెద్దగా పట్టింపులేదు.
కుల వ్యవస్థ లాంటి నిచ్చెనమెట్ల దోపిడీ, అణచివేతలతో కూడిన నిర్మాణం వలన ఆరెస్సెస్‌కు ఇబ్బంది లేదు. అంబేద్కర్ లా కులనిర్మూలన లక్ష్యం ఆరెసెస్ ఎజెండాలో లేదు. గాంధీ లాగా అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపిన చరిత్ర ఆరెస్సెస్‌కు లేదు. సతీసహగమనంలాంటి క్రూరత్వం గురించికానీ, వితంతు పునర్వివాహాల గురించికానీ, వరకట్నం వంటి దురాచారాల గురించి కానీ ఆరెస్సెస్ ఎన్నడూ నోరెత్తలేదు. కులాంతర వివాహాల గురించి ఉద్యమించింది లేదు.
హిందువులు నిరంతరం బయటి నుండి వచ్చే ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మాత్రమే చెప్తుంది. తద్వారా నిరంతరం బిక్కుబిక్కుమంటూ, సాటి ప్రజల పట్ల అనుమానాలతోనూ, అభద్రతతోనూ జీవించమని బోధిస్తోంది. దాంతో పాటు హిందువులే అత్యంత అధికులమన్న భావనను నూరిపోస్తుంది. లోపల ఎంత కుళ్లినా బాగుచేసుకుందామనే కోణం లేదు. హిందూ సమాజం ఎదుర్కొనే బయటి ప్రమాదాలు అంటే దాని దృష్టిలో ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులే.
ఆరెస్సెస్ అభిప్రాయంలో హిందువు ప్రపంచంలోనే ఉత్తమజాతి. దేవుడే తన ప్రతిరూపాలుగా సృష్టించాడు. శాంతజీవులు, సహనశీలురు. ఇటువంటి లక్షణాలు ఇతర మతాల్లో కనిపించవు. ఈ ప్రపంచంలో తొలి మానవులు హిందువులే. ఈ విశ్వంలో ఏమీ లేనప్పడు కూడా హిందూమతం ఉన్నది. హిందుమతమే అత్యంత ప్రాచీనమైనదీ, శాశ్వతమైనదీ కాబట్టి మంచిది. ఈ మతానికి వేదికగా భారతదేశాన్ని దేవుడే ఎంచుకున్నాడు. అందుకే ఈ భూమ్మీద హిందువులకు తప్ప వేరెవ్వరికీ హక్కులుండవు. ఈ అవగాహన ఆచరణలో హిందూయిజాన్ని ఓ మతంగా కాపాడుకోవటంతో మొదలై హిందువులంతా ఒకే జాతి, ఈ దేశం హిందూ దేశమే అనే స్థాయికి చేరుతుంది. చేరింది. భారతీయులంటే హిందువులు. హిందువులంటే భారతీయులు. హిందువుల కానివారెవరైనా భారతదేశంలో బతకాలంటే హిందువుల అనుమతి తీసుకోవాలి. ఇక్కడ హిందువులకు ప్రాతినిధ్యం వహించే ఏకైక సంస్థ ఆరెస్సెస్ కాబట్టి ఆరెస్సెస్ అనుమతి తీసుకోవాలి అన్నది ఆరెస్సెస్ అవగాహన.
హిందువులకు ఆరెస్సెస్ ఇచ్చే నిర్వచనం ఇతరులతో పోల్చినపుడు మాత్రమే వర్తిస్తుంది. ఆ నిర్వచనం ప్రకారం హిందువు తనకుతానుగా చూసుకున్నప్పుడు ఏమిటో తెలీని అయోమయంలో ఉంటాడు. ఆరెస్సెస్ నిర్వచనం ప్రకారం ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులంటే భయపడేవాడు, ద్వేషించేవాడు మాత్రమే హిందువు అవుతాడు. కాబట్టి ఆరెస్సెస్ పరిభాషలో హిందువును నిర్వచించాలంటే ఈ మూడూ కనీస ప్రమాణాలు. ఆరెస్సెస్ నిర్వచించే హిందువులు తమకు తాము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం లేనివారు. ఎందుకంటే దేవుడే వారిని పరిపూర్ణమైన మానవుడిగా సృష్టించాడని ఆరెస్సెస్ చెప్తోంది కాబట్టి. ఆరెస్సెస్ నిర్వహించే హిందువుల వ్యక్తిగత జీవితంలో ఉన్న లోపాలు ఎవరైనా వేలెత్తి చూపిస్తే వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.
సావర్కార్ ప్రేరణతో గోల్వాల్కర్ హిందువులను పై విధంగా నిర్వచించారు. మనమూ, మన జాతీయత అన్న కరపత్రంలో సావర్కార్కూడా హిందువలకు ఇచ్చిన నిర్వచనం ఇదే. ఆరెస్సెస్ ప్రాపంచిక దృక్ఫథానికి పునాదులు వేసిన అవగాహన ఇదే అని చెప్పవచ్చు. ఆరెస్సెస్‌కు పునాదులు వేసిన గోల్వాల్కర్‌కు నేటి రూపంలో మనకు కనిపిస్తున్న ఆరెస్సెస్ నిర్మాణాన్ని ఊహించిన వ్యక్తిగా విలక్షణమైన గుర్తింపు ఉంది. ఆరెస్సెస్ కేవలం ఒక సంస్థ కాదు. సంస్థలకే సంస్థ.
కరుడుగట్టిన హిందూత్వను సైద్ధాంతికంగానూ, ఆచరణాత్మకంగానూ తెరమీదకు తీసుకురావటంలో గోల్వాల్కర్ పాత్ర గురించి లోతైన అవగాహనను అందిస్తుంది ఈ పుస్తకం. గోల్వాల్కర్ రచన మనం, మన జాతీయతలోనే భారతీయ ఫాసిజానికి సంబంధించిన పునాదులున్నాయి. హిందూరాష్ట్ర నిర్మాణంలో భాగంగా గతాన్ని సావర్కార్ వ్యాఖ్యానిస్తే భవిష్యత్తును గోల్వాల్కర్ ఊహించాడన్న రచయిత వ్యాఖ్య అక్షర సత్యం. ఇంకా చెప్పాలంటే హిందూరాష్ట్ర నిర్మాణానికి సంబంధించిన వ్యూహరచనను, ప్రణాళికను గోల్వాల్కర్ ‘మనం, మన జాతీయత’ ద్వారా అందించారు.
కాలక్రమంలో ‘మనం, మన జాతీయత’ కరపత్ర రచయితగా తనను తాను చెప్పుకోవడానికి వెనకాడిన సందర్భాలూ ఉన్నాయి. ఈ పుస్తకాన్ని సార్వత్రికంగా పుస్తకాల షాపుల్లో అమ్మటానికి వెనకాడిన సందర్భాలూ ఉన్నాయి కాబట్టి ఈ రచనకూ, రచయితకూ మధ్య ఉన్న అనుబంధాన్ని, సంబంధాన్ని ధృవీకరించటానికి ఈ పరిశోధనాత్మక రచన చేపట్టారు నా. నిజానికి ఇది నాజీ ప్రాపంచిక దృక్ఫధంతో ఉన్న రచన. భారతదేశంలో ముస్లిం జనాభా విషయంలో నాజీలు యూదుల పట్ల అమలు చేసిన పరిష్కారాన్ని అమలు చేయాలని ప్రతిపాదించే రచన ఇది.
ధీరేంద్ర పుస్తకంలో కనిపించే గోల్వాల్కర్ జీవితమంతా అనుమానాలే. కుట్రలు, కుతంత్రాలే. తనగురించిన తనకు ఉన్న అభిప్రాయాలే. అతని జీవితాన్ని నడిపించినవి ప్రేమ, కారుణ్యం, వాత్సల్యం వంటి విలువలు కాదు. కుట్రలు, కుతంత్రాలు, విద్వేషం వంటి విలువలే. తనగురించి తానే అబద్ధాలు సృష్టించి వాటిని ప్రచారంలో పెట్టడంలో గోల్వాల్కర్‌కు ఉన్నంత సంతృప్తి మరెందులోనూ లేదు.
ఈ పుస్తకావిష్కరణ తర్వాత బయటికి వస్తూ ఓ యువకుడు ‘గోల్వాల్కర్ ఫ్రొఫెసర్ అన్న వాస్తవాన్ని మర్చిపోకూడదు’ అని వ్యాఖ్యానించటం చూశాను. తన గురించి తను చెప్పే మాటలు (ప్రవచనాలు) గురించి ఇతరులకు గౌరవం కలిగించేందుకు గోల్వాల్కర్ ఆడిన మొదటి పెద్ద అబద్ధం ఇది. ఈ విషయాన్ని ధీరేంద్ర ఝా పుస్తకం సాక్ష్యాధారాలతో సహా మనముందుంచుతుంది. అత్యంత చిన్న వయసులోనే గోల్వాల్కర్ ప్రొఫెసర్ అయ్యాడన్నది ఆ ప్రచారం సారాంశం. అంటే ఆయన అంత మేధో సంపన్నుడన్న ప్రచారమన్నమాట. ఇటువంటి అబద్ధాలే తన సొంత రచన ‘మనం, మన జాతీయత’ గురించి కూడా ప్రచారంలో ఉన్నాయి. ఆ పుస్తకాన్ని రాసింది ఆయనే. కానీ ఈ కారణంగా తన రాజకీయ మనుగడ ప్రశ్నానర్ధకమైన వేళ అది కేవలం అనువాదం మాత్రమేననీ, తన సొంత రచన కాదనీ బుకాయించాడు. ఆ బుకాయింపే ఇప్పటికీ ప్రచారంలో ఉంది.
అబద్ధాలు రూపొందించి నిజాలని జనం నమ్మేస్థాయిలో ప్రచారం చేయగల సమర్ధుడైన గోల్వాల్కర్ నాయకత్వంలో సాగిన అబద్ధపు ప్రచారాల్లో ఆరెస్సెస్‌కు, గాడ్సేకు సంబంధం లేదన్నది మరోటి. పాపం నిజానికి గాడ్సే జీవితాంతం ఆరెస్సెస్ సభ్యుడుగానే ఉన్నాడు. గాంధీ హత్యానంతరం ఆరెస్సెస్ రాజకీయరంగంలో ఎదుర్కోవాల్సిన దుర్గతి నుండి తప్పించుకునేందుకు అల్లిన కట్టుకథ గాడ్సేకు ఆరెస్సెస్‌కు సంబంధం లేదన్న కట్టుకథ.
ఈ దేశానికి ఎదురయ్యే ముప్పు గురించి ఆరెస్సెస్ అగ్రనేతలు చేసిన ప్రచారాన్ని ఆరెస్సెస్ కార్యకర్తలకు ఇచ్చిన ఆదేశంగా గాడ్సే భావించాడా అన్నది ధీరేంద్ర ఝా ముందుకు తెస్తున్న ప్రశ్న. గాంధీ హత్యానంతరం తమను తాము కాపాడుకోవడానికి ఆరెస్సెస్, గోల్వాల్కర్లు 13 రోజుల పాటు సంతాపదినాలు కూడా ప్రకటించారు. ఈ 13 రోజుల పాటూ ఆరెస్సెస్ శాఖలన్నీ ఊపిరున్నవంతవరకూ ద్వేషించే గాంధీపేరు తమ గురువుల సరసన చేర్చి సంతాపం ప్రకటించారు. ఇటువంటి అబద్ధపు ప్రచారాలతో ఆరెస్సెస్ తనను తాను ఆత్మవంచన చేసుకుంటుందా లేక అనుయాయులను, సాధారణ ప్రజలను మోసగిస్తోందా అన్న ప్రశ్నను ముందుకు తెస్తోంది ధీరేంద్ర ఝా పుస్తకం.
గోల్వాల్కర్ భారతదేశం, హిందు పదాలకు ఎలాగైతే తప్పుడు నిర్వచనాలిచ్చారో అదే విధంగా తన జీవితం గురించి తానే ప్రచారంలో పెట్టుకున్న అనేక అంశాల్లో ఎన్నో అసత్యాలు ఒదిగి ఉన్నాయి. ఈ విషయాన్నే ధీరేంద్ర ఝా పుస్తకం మనముందుంచుతోంది. అటువంటి మనిషి జీవిత చరిత్ర ఎందుకు రాయాలన్న ప్రశ్నకూడా ముందుకొస్తుంది. గత కొంతకాలంగా నిరంతరం గోల్వాల్కర్ గురించి సాగుతున్న ప్రచారం, ఆయన్ను దేవుడిని చేస్తున్న తీరు నేపథ్యంలో ఆయన గురించి, ఆయన జీవితం గురించి వాస్తవాలు తెలుసుకోవడానికి ఈ పుస్తకం కావాలి. ఇలాంటి పుస్తకాలు రావాలి. అంతేకాదు. ఈ నందనవనం లాంటి సుందర భారతాన్ని నిత్య రక్తార్పణం చేసే రక్కసిమూకలతో నిండిన ఫాసిస్టు హిందూరాష్ట్రగా నిర్మించేందుకు కావల్సిన విత్తనాలు వెదజల్లి ఆ విత్తనాలే ఇప్పుడు వటవృక్షాలై విద్వేషాన్ని విరజిమ్ముతున్న వేళ ఆ విత్తనాలు వేసిన వ్యక్తి గురించి తెలుసుకోవడానికి ఈ పుస్తకం కావాలి.
ఆరెస్సెస్ కానీ, గోల్వాల్కర్ కానీ, అతనికంటే ముందు సావర్కార్ గానీ తమగురించి తాము అసత్యాలను ప్రచారం చేయటం ప్రారంభించాయి. వారి గురించి ఓ భ్రమలను కల్పించటం అవసరమేనని ఆరెస్సెస్ అనుయాయులు అంటుంటారు. అటువంటి భ్రమలే చట్టం కళ్లుగప్పటానికి సాధనాలు కాబట్టి. ఉదాహరణకు గాడ్సే ఆరెస్సెస్ సభ్యుడే అని కోర్టులో రుజువైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే ఆరెస్సెస్‌కు, గాడ్సేకు మధ్య ఉన్న సంబంధం గురించి అబద్ధం చెప్పింది. ఆరెస్సెస్‌కు రాజ్యాంగం పట్ల విశ్వాసం ఉందన్న అబద్ధమాడాల్సి వస్తే కూడా వెనకాడదు. ఎందుకంటే గాంధీ హత్యానంతరం ఆరెస్సెస్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయించుకోవటం దాని అవసరం. అబద్ధమాడటం ద్వారా తమ కార్యకలాపాలకు ఎటువంటి అవరోధం లేకుండా చేసుకోగలిగితే అందులో తప్పేమిటి? అది వ్యూహాత్మకం అన్నది వారి భావన.
ఆరెస్సెస్ తన ప్రయోజనాల కోసం అబద్దమాడుతుందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ కోట్లాది సంఖ్యలో ఉన్న విద్యావంతులు, లక్షల సంఖ్యలో ఉన్న మేధావులు, రాజకీయ పార్టీల కార్యర్తలు, పార్టీలు ఈ అబద్ధాలను ఎందుకు నమ్ముతున్నారు? సమాజాన్ని సైతం ప్రభావితం చేయగల మేధో వర్గం ఆరెస్సెస్ పట్ల పక్షపాతంతో ఎందుకుంది? దేశంలో గణనీయంగా ఉన్న మేధో వర్గం ఆరెస్సెస్ ప్రచారం చేస్తోంది విద్వేషపూరిత హింసాత్మకవాదం అని ఎందుకు గుర్తించలేకపోతోంది? ఎందుకు అంగీకరించలేకపోతోంది? గాంధీ, నెహ్రూలు ఆరెస్సెస్ వలన దేశానికి ముప్పు ఉందని పసికట్టారు. కానీ ఆరెస్సెస్ గురించి గాంధీ చేస్తున్న హెచ్చరికలను ఆయన అనుంగు శిష్యులే ఎందుకు వినటానికి సిద్ధంకాలేదు? నెహ్రూ పదేపదే విజ్ఞప్తి చేసినా వల్లభాయ్ పటేల్ కానీ, గోవింద్ వల్లభ్ పంత్ కానీ ఆరెస్సెస్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎందుకు సిద్ధంకాలేదు?
ప్రభుత్వ నిఘా విభాగాలు ఆరెస్సెస్ దేశంలో హింసాత్మక కార్యకలాపాలకు పూనుకొంటోందన్న వాస్తవాలను, వార్తలను నిరంతరం పటేల్, పంత్‌లకు చేరవేస్తూనే ఉన్నారు. వీరిద్దరి దృష్టిలో ఆరెస్సెస్ కేవలం క్రమశిక్షణ కలిగిన దేశభక్త సంస్థ. రాజ్యాంగపదవుల్లో ఉంటూ కూడా ఈ పెద్దమనుషులిద్దరూ రాజ్యాంగానికి, సార్వత్రిక మానవ విలువకు వ్యతిరేకంగా ఆరెస్సెస్ సాగిస్తున్న విద్వేషపు ప్రచారాన్నీ, ప్రేరేపిస్తున్న హింసాత్మక ఘటనలను చూడటానికి ఎందుకు నిరాకరించారు?
ఈ సందర్భంగా రచయిత ఈ పుస్తకంలో ఓ ముఖ్యమైన సందర్భం గురించి ప్రస్తావిస్తారు. ఆ సందర్భంలో మౌలానా అబుల్ కలాం, గాంధీ, ప్రధాని నెహ్రు, పటేల్‌లు ఉంటారు. అబుల్ కలాం నెహ్రూనుద్దేశించి మాట్లాడుతూ ‘‘ఢిల్లీలో జరుగుతున్న ఘటనలను సహించేది లేదని నెహ్రూ ఎంతో ఆవేదనతో చెప్పారు. ముస్లింలను కుక్కలు, పిల్లులకంటే దారుణంగా చంపేస్తున్నారు. వారి ప్రాణాలు కాపాడలేని తన దుస్థితి చూసి నెహ్రూ కుమిలిపోతున్నారు. ఈ నరమేధం గురించి ప్రశ్నించేవారికి ఏమి సమాధానం చెప్పాలో తెలీక ఆయన అంతరాత్మ ఘోషిస్తోంది..’’అన్నారు. దీనికి పటేల్ స్పందన చూస్తే అవాక్కవుతాము. ఢిల్లీ నడివీధుల్లో ముస్లింల ఊచకోత సాగుతూ ఉంటే హోంమంత్రిగా ఉన్న పటేల్, నెహ్రూ ఆందోళన సమంజసం కాదని గాంధీకి ఫిర్యాదు చేస్తారు. ఇంకా ఆయన ఫిర్యాదులో ఒకటో అరో జరిగితే జరిగి ఉండొచ్చు కానీ ముస్లిం ధన, మాన, ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తుంది. ఇంతకన్నా చేయగలిగిందికూడా లేదు అని సరిపుచ్చుకుంటారు. కొన్ని క్షణాల పాటు నోటమాటరాని నెహ్రూ గాంధీవైపు చూస్తారు విచారవదనంతో. సర్దార్ పటేల్ అభిప్రాయం అదే అయినపుడు ఇక నేను చెప్పేదేముంది అని అక్కడ నుండి వెనుదిరుగుతారు.
ముస్లింలపై సాగుతున్న ఊచకోతకు నిరసనగా గాంధీ ఆమరణదీక్షకు కూర్చుంటే ఆయన అత్యంత ప్రియ శిష్యుడైన పటేల్ అదేమీ పట్టించుకోకుండా తన అధికారిక పర్యటనలకు ఎందుకు పరిమితం అవుతారు? ముస్లింల ఊచకోత సరైనదేనని ఏకోశానైనా అనుకుంటున్నారా పటేల్ వంటి నేతలు. అందుకే ఆరెస్సెస్పట్ల సానుభూతితో వ్యవహరిస్తున్నారా? అన్నవి ఎవరికి వారు అర్థం చేసుకోవాల్సిన ప్రశ్నలు. ఈ కోణం దిశగా పుస్తకం చర్చించకపోయినా పటేల్ లాంటి ఉన్నత స్థాయి నాయకులు కూడా ముస్లింలపట్ల ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారన్న అవగాహనను కల్పిస్తుంది. పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత దేశంలో ఉండిపోయిన ముస్లింలను ఎలా నమ్మాలో పటేల్ అర్థం చేసుకోలేకపోయారు. స్వయంగా పటేల్ లాంటి నాయకులే ముస్లింలను అనుమానంగా చూస్తూ ఈ దేశం పట్ల వారి అంకితభావాన్ని నిరూపించుకోవాలని అడుగడుగునా కోరుతున్నారు.
ఒక లక్ష్యం కోసం కోట్లాదిమంది ముస్లింలు ఇక్కడే ఆగిపోతే, వారిపట్ల నిరంతరం అనుమానపు చూపులుంటే ఆరెస్సెస్ వంటి సంస్థ అవసరమే. ఆరెస్సెస్ ప్రేరేపిస్తున్న హింసాత్మక భావజాలం, భౌతిక హింసగురించిన ఆధారాలు కళ్లముందున్నా చూడటానికి నిరాకరిస్తూ వాళ్లంతా దేశభక్తులని ప్రకటించే పరిస్థితి ఉన్నప్పుడు ఇంతకన్నా భిన్నంగా ఏమి జరుగుతుంది? ముస్లింలు, క్రైస్తవులను అణచివేయటానికి ఇటువంటి సంస్థలు అక్కరకొస్తాయి.
గోల్వాల్కర్, సావర్కార్ల ద్వయాన్ని భారతీయ ఫాసిజానికి పితామహులు అని పిలవవచ్చు. గోల్వాల్కర్ జీవిత చరిత్రతో పాటు ధీరేంద్ర ఝా భారతీయ ఫాసిజం చరిత్రను కూడా అందిస్తున్నారు. ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత భారతీయులు ఆ ఫాసిస్టు ధోరణులను ఎందుకు సహిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది.
– అపూర్వానంద్
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.