
నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు వై పాటన్ కొన్ని రోజుల క్రితం ఒక బహిరంగ సభలో హార్న్‌బిల్ టీవీ రిపోర్టర్ దీప్ సైకియాను బహిరంగంగా తిట్టి, బెదిరించారు. ఆ తర్వాత, మణిపూర్‌లోని సేనాపతి జిల్లాలో ఆ జర్నలిస్టుపై కాల్పులు జరిగాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉన్నప్పటికీ, బుల్లెట్ మాత్రం శరీరంలోనే ఉంది.
న్యూఢిల్లీ: నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత వై పాటన్ స్థానిక టీవీ ఛానల్ రిపోర్టర్ దీప్ సైకియాను బహిరంగ సభలో బెదిరించారు. ఈ సంఘటన జరిగిన సరిగా వారం రోజులకు మణిపూర్‌లోని సేనాపతి జిల్లాలోని నాగా గ్రామంలో ఆ రిపోర్టర్‌పై కాల్పులు జరిగాయి .
నాగాలాండ్– మణిపూర్‌లోని నాగా తెగ ప్రాంతాలలో ప్రభావవంతమైన రాజకీయ నేత పాటన్, ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. గతంలో ఆయన రాష్ట్ర హోంమంత్రి, సరిహద్దు వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు.
ఆగస్టు 23న అస్సాం సరిహద్దులోని నాగాలాండ్‌లోని ఒక గ్రామంలో బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాటన్ పాల్గొన్నారు. న్యూస్ కవర్ చేయడానికి అక్కడికి చేరుకున్న జర్నలిస్ట్ దీప్ సైకియాను చూసి కోపంతో, పేరు పెట్టి పిలిచి తిట్టి, బెదిరించారు.
హార్న్‌బిల్ టీవీ వార్తా నివేదికలో నాగ తెగ గ్రామస్తులను భాగస్వామ్యం చేసినందుకు బీజేపీ నాయకుడు బహిరంగంగా విలేకరిని మందలించారు.
రాష్ట్ర సరిహద్దులో ఉన్న రెంగ్మా అటవీ అభయారణ్యంలో అస్సాం ప్రభుత్వం తొలగింపు డ్రైవ్‌ను నిర్వహించింది. ఈ సందర్భంలో పాటన్ లేదా స్థానిక ఎమ్మెల్యే అచుమెంబో కికోన్ దాదాపు ఒక నెల పాటు గ్రామస్తులను పరామర్శించలేదు. తమను పాటన్, స్థానిక ఎమ్మెల్యే పలకరించలేదని గ్రామస్తులు ఆ నివేదికలో పేర్కొన్నారు.
ఈ అభయారణ్యంలో కొంత భాగం వివాదాస్పద భూమిలో ఉంది. దీనిపై నాగాలాండ్ సరిహద్దు వివాద కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.
సైకియా నివేదికలో చూపబడిన గ్రామస్తుల ప్రకారం, పాటన్ జూలై 24న మాత్రమే సరిహద్దు ప్రాంతాలను సందర్శించారు. ఆ తర్వాత అటువైపు ఒక్కసారి కూడా ఆయన కన్నెత్తి చూడలేదు. అస్సాం ప్రభుత్వ తొలగింపు డ్రైవ్ గురించి గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నప్పటికీ, స్థానిక ఎమ్మెల్యే కూడా వారిని పలకరించలేదు. వోఖా డిప్యూటీ కమిషనర్ వినీత్ కుమార్ ఆగస్టు 21- 22 తేదీలలో మాత్రమే ఆ ప్రాంతాన్ని సందర్శించారు.
ఆగస్టు 24న హార్న్‌బిల్ టీవీ ప్రసారం చేసిన వోఖా జిల్లాలోని లిఫాన్యన్ గ్రామంలో జరిగిన బహిరంగ సభ వీడియో క్లిప్‌లో, సైకియాను నాగా ప్రాంతాల నుంచి తరిమికొట్టమని తాను “కొంతమందిని” కోరానని, కానీ వారు ఇంకా అలా చేయలేదని పాటన్ చెప్పారు. సైకియా అస్సాంకు చెందినవారు. పాటన్ అతన్ని “తన ముందు కూర్చోవద్దని” కోరారు. తనను అడిగే ఏ ప్రశ్ననైనా “సహించన”ని చెప్పారు.
సరిహద్దు సమస్యపై ఆ ప్రాంత మాజీ ఎమ్మెల్యే ఎం కికోన్ను ఇంటర్వ్యూ చేయడంపై బీజేపీ నాయకుడు ఆ విలేకరిని ప్రశ్నించారు.
ఇటీవల పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకునే వరకు కికోన్ పార్టీ జాతీయ ప్రతినిధిగా ఉన్నారు. భండారి అసెంబ్లీ నియోజకవర్గంలో నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన అచుమెంబో కికోన్ చేతిలో కికోన్ ఓడిపోయారు. స్థానికంగా చూసుకుంటే, పాటన్కు చాలా దగ్గరగా పరిగణించబడతారు.
బుల్లెట్ ఇంకా శరీరంలోనే..
కొన్ని రోజుల తర్వాత, ఆగస్టు 30న, మణిపూర్‌లోని సేనాపతి జిల్లాలోని నాగా గ్రామంలో సైకియాపై కాల్పులు జరిగాయి. సైకియా ఒక పూల ప్రదర్శనను కవర్ చేస్తున్నారు. ఈ క్రమంలో తనపై దాడి జరిగింది.
స్థానిక నివేదికల ప్రకారం, నాగ తెగ ప్రాబల్య జిల్లాలోని లై గ్రామంలో రిపోర్టర్ కాలు, చంకపై కాల్చిన యువకుడిని గ్రామస్తులు అదుపులోకి తీసుకున్నారు.
ఈస్టర్న్ మిర్రర్ ప్రకారం , ‘తుంగ్జోయ్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ తిమోతి రోనామై(యువకుడిపై) ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ధృవీకరించారు. అయితే, దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున మరిన్ని వివరాలు అందుబాటులో లేవు’ అని ఆయన తెలియజేశారు.
“సకియా పరిస్థితి స్థిరంగా ఉంది, కానీ బుల్లెట్ తన శరీరంలోనే ఇరుక్కుపోయింది” అని రోనామై చెప్పినట్లు నివేదిక పేర్కొంది.
విధుల్లో ఉన్నప్పుడు సాకియాపై జరిగిన దాడిని హార్న్‌బిల్ టీవీ ఖండించింది. ఈ దాడిని “దిగ్భ్రాంతికరమైన, ఖండించదగిన”దిగా అభివర్ణిస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది.
హార్న్‌బిల్ టీవీ ఎడిటర్ జుథోనో మాక్రో మాట్లాడుతూ, “సాకియాపై కాల్పులు కేవలం అతనిపై జరిగిన దాడి కాదు. పత్రికా స్వేచ్ఛ– ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యక్ష దాడి” అని అన్నారు.
న్యాయం, పారదర్శకత, జవాబుదారీతనానికి విలువనిచ్చే సమాజంలో మీడియా నిపుణులపై హింసను సహించరాదని మాక్రో పేర్కొన్నారు. అంతేకాకుండా, దాడి చేసిన వ్యక్తి, అతని సహచరులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
మోకోక్చుంగ్ టైమ్స్ కూడా ఈ సంఘటనను ఖండిస్తూ, ‘తీవ్ర వేదన’ను వ్యక్తం చేసింది. అంతేకాకుండా, దీనిపై వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. అదే సమయంలో, జర్నలిస్టుపై దాడి అంటే పత్రికా స్వేచ్ఛపై దాడి అని వారు పునరుద్ఘాటించారు.
“ఇటువంటి సంఘటనలు ఈ ప్రాంతంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తున్నాయి. పెరుగుతున్న ముప్పులను నొక్కి చెబుతున్నాయి. పత్రికా స్వేచ్ఛను కాపాడటానికి రాష్ట్రం, పౌర సమాజం, పౌరులు కలిసి పనిచేయాలని మేము కోరుతున్నాము” అని ఆ పత్రిక పేర్కొంది.
దీనికంటే ముందు, జర్నలిస్టుకు పాటన్ జారీ చేసిన బెదిరింపులను కోహిమా ప్రెస్ క్లబ్- మోకోక్చుంగ్ ప్రెస్ క్లబ్ ఖండించాయి.
ఆగస్టు 31న, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా కూడా పాటన్‌ను హెచ్చరిస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. “మంత్రుల కథనాలను విస్తృతం చేయడం జర్నలిస్టుల పని, ప్రజా సంబంధాల అధికారులుగా వ్యవహరించడమే కాకుండా, ప్రభుత్వం/లేదా దాని సీనియర్ మంత్రులకు వ్యతిరేకంగా తమ ఇళ్లలో సురక్షితంగా లేకుంటే వారి ఆందోళనలు, మనోవేదనలను వ్యక్తీకరించడానికి సాధారణ పౌరులకు ఒక వేదికను అందించడం కూడా అవుతుంది” అని హెచ్చరించింది.
“ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆ రిపోర్టర్‌కు అండగా నిలుస్తుంది. నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రి ఇటువంటి ప్రవర్తనను వెంటనే ఆపాలని హెచ్చరిస్తుంది. ఎందుకంటే ఇది ఒక జర్నలిస్ట్ తన వృత్తిని పూర్తిగా నిర్వహించకుండా నిరోధిస్తుంది. అలాంటి చర్యలు పత్రికా స్వేచ్ఛను ఉల్లంఘిస్తాయి. ఇది పౌరుడికి పని చేసే హక్కును హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19కి విరుద్ధం కూడా” అని పీసీఐ ప్రకటన పేర్కొంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.