
భూమికీ, ఆకాశానికీ
రెంటికీ చెందని
జెండర్ను నేను!
నన్ను హత్తుకోవడం కాదు
అసలు నా పొడ గిట్టదు
ఈ సమాజమనే అర్థం కాని
బ్రహ్మపదార్థానికి..
నా పొడ అటుంచి
నన్ను తాకడమే
మహా పాపమైపోయిందిగా
అదీ వదిలెయ్యండి
కనీసం నా వైపు
మామూలుగా కూడా చూడలేని
మీ మానసిక దౌర్బల్యానికి
ఏ పూజలు, ఏ మందులు పనిచేస్తాయి?
సరే అదీ కాదు
నా గురించి తలపులోనైనా
నా కన్న తల్లిదండ్రులు కూడా
నన్ను నన్నుగా చూడనప్పుడు
నాకెప్పుడూ వింతగానే ఉంటుంది!
పుట్టగానే నన్ను కుప్పతొట్టిలో
పడేయలేదెందుకని కాదు
ఇప్పటికీ నేనీ సమాజాన్ని
ఎందుకు ఆ తొట్టిలో పడేయలేకపోతున్నాననేది
అసలు నిజం ఏంటంటే,
మనుషులు జంతువుల వలె కాదు
“అన్-కండిషనల్ ప్రేమికులు”
అని నేను మాత్రమే తెలుసుకుని
పూర్తిగా పాటించే అసంపూర్ణ మనిషిని!
అందుకే,
నా అవ్యాజ ప్రేమ
నా మీద మాత్రమే కాదు;
నా లాంటి వారి మీదే కాదు
మీ అందరి మీద కూడా
మిమ్మల్ని కన్నవారందరి
మీద కూడా
వారిని కన్న
ఈ సమాజం మీద కూడా..