
బీహార్‌లో ఓటర్ల జాబితా సవరించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం బీహారీల ఆత్మగౌరవం సమస్యగా మార్చడం ద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కీలకమైన రాజకీయ చర్చకు మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తెరతీస్తున్నారు.
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో ఎన్నికలు జరగబోతున్న బీహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు హడావుడిగా నిర్ణయం తీసుకుంది. దీని మీద ప్రతిపక్షాలు, తాము లేవనెత్తిన అభ్యంతరాలను ఎన్నికల సంఘం వినిపించుకోవటం లేదంటూ ఇండియా కూటమీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు తేజస్వీయాదవ్ శుక్రవారం(జూలై 4)నాడు ఈ కసరత్తు బీహారీల అస్తిత్వాన్ని- ఆత్మగౌరవాన్ని ప్రశ్నించటమేనని ధ్వజమెత్తారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఇండియా కూటమి తరఫున తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రిత్వ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.
తమ పౌరసత్వం నిరుపించుకోవాలంటూ బీహార్ ప్రజలను ఎన్నికల సంఘం కోరటం వారి అస్తిత్వాన్ని ప్రశ్నించటం తప్ప మరొకటి కాదని తేజస్వీ అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం బీహార్ ప్రజల మనోభావాలను దారుణంగా గాయపరిచిందని ఆయన పేర్కొన్నారు.
“మొత్తం దేశంలో పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సింది కేవలం బీహార్ ప్రజలేనా? కేవలం బీహార్, బీహార్ ప్రజలు మాత్రమే పౌరసత్వాన్ని ఎందుకు నిరూపించుకోవాలి?” అంటూ తేజస్వీ యాదవ్ ఎన్నికల సంఘాన్ని నిలదీశారు.
ప్రస్తుత ఓటర్ల జాబితా “ఫేక్” జాబితాయేనా?
“మీరు హిందువా, ముస్లిమా, క్రైస్తవులా లేక వెనుకబడిన కులాలకు చెందిన వారా? దళితులా? అగ్రకులాలకు చెందిన వారా? బాగా వెనుకబడిన కులాలకు చెందిన వారా అనే తేడా లేదు. ప్రతి బీహార్ పౌరుడు తన పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిందే” అంటూ ఎన్నికల సంఘం ఆదేశాలనుద్దేశించి తేజస్వీ యాదవ్ అన్నారు.
బీహార్‌లో ఓటర్ల జాబితా సవరించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం బీహారీల ఆత్మగౌరవం సమస్యగా మార్చడం ద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కీలకమైన రాజకీయ చర్చకు మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తెరతీస్తున్నారు.
ప్రస్తుతం చలామణిలో ఉన్న ఓటర్ల జాబితా నిజమైనదా కాదా ఎన్నికల సంఘం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముందు ఈ విషయాన్ని స్పష్టం చేసిన తర్వాతనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్డ్ ప్రకటించాలని పట్టుబట్టారు. తాజా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విశ్వసించకపోతే 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలను కూడా రద్దు చేయాలని తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని పేదలతో పాటు పొట్ట చేత పట్టుకొని ఉద్యోగం కోసం వలసలు వెళ్లిన నాలుగున్నర కోట్ల మంది ఓటర్ల ఓటు హక్కు భవిష్యత్తు ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో ప్రశ్నార్థకం అవుతోందని తేజస్వీ అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికల సంఘం కోరిన పత్రాలు అన్ని సమకూర్చుకోవాలంటే పెద్ద ఎత్తున అధికారులకు లంచాలు సమర్పించుకోవాల్సి వస్తుందని తేజస్వీ ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఓటరు జాబితా సంపూర్ణ సవరణ చేపట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు.
“రాజ్యాంగాన్ని భూస్థాపితం చేయాలనుకునే శక్తులు, ప్రజల ఓటు హక్కులు రద్దు చేయాలనే పార్టీలు, ప్రజాస్వామ్యాన్ని సమాధి చేయాలనే సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పాలంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి సభ్యులను గెలిపించాలి” అని తేజస్వీ యాదవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
2025 జూలై 3(బుధవారం) తేదీన 20 మంది సభ్యులు కలిగిన ఇండియా కూటమి బృందం ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్‌తో సహా ఎన్నికల కమిషనర్లను కలిసి కేంద్ర ఎన్నికల సంఘం తాజా ఆదేశాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల నాయకత్వంలో ఎన్నికల సంఘాన్ని కలిసిన ప్రతినిధి బృందం ఇంత స్వల్ప వ్యవధిలో అంతటి బృహత్ కర్తవ్యాన్ని నెరవేర్చడమంటే, దాదాపు కోటిమందికి పైగా ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘాన్ని కలిసిన తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ ఇండియా కూటమి బృందం తమ అభ్యంతరాలు, ఆందోళనలను ఎన్నికల సంఘం పెడచెవిన పెడుతోందని ఆరోపించింది. ఎన్నికల సంఘం స్పందన నిరాశాజనకంగా ఉందని, వైరిభావంతో కూడుకున్నదని ధ్వజమెత్తారు.
గతంలో జనన ధృవీకరణ పత్రాల లభ్యత, గణనీయమైన వలసలు వంటి సమస్యలను పరిష్కరించకుండా ఓటర్ల జాబితాను సంపూర్ణంగా సవరించబూనుకోవడమంటే రాష్ట్రంలో చారిత్రక సంక్షోభానికి పునాదులు వేయటమేనని ఇండియా కూటమి ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఎనిమిది కోట్ల మందికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అడిగినన్ని పత్రాలు సిద్ధం చేసి ఓటర్లకు అందించడానికంటే ముందు జరిగే ఏ రకమైన ఓటరు జాబితా సవరణలైనా అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్లను తీవ్ర గందరగోళానికి గురి చేస్తాయని హెచ్చరించారు.
కేంద్ర ఎన్నికల సంఘం మాటల్లో రాష్ట్రంలో తిష్ట వేసిన అక్రమ శరణార్ధులను, శాశ్వతంగా రాష్ట్రం వదిలి వెళ్లిన వారిని గుర్తించేందుకు తాజా కసరత్తు దోహదం చేస్తుంది. ఎన్నికల సంఘం సిబ్బంది తనిఖీ కోసం వచ్చినప్పుడు ఓటర్లు కేవలం ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు చూపిస్తే సరిపోదని జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రులకు సంబంధించిన పలు ధృవీకరణ పత్రాలు, మెట్రిక్యూలేషన్ సర్టిఫికేట్, భూ సంబంధిత పట్టాలు ఇతర ఆస్తి పత్రాలు చూపించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటనలో స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, పరిమితమైన అక్షరాస్యత ఉన్నత పాఠశాల గడపకూడా తొక్కని గణనీయమైన జనాభా, భూమిలేని పేదలు భారీ స్థాయిలో ఉన్న బీహార్‌లాంటి రాష్ట్రంలో చేపట్టిన ఇటువంటి కసరత్తు ఓటర్ల జాబితాలోని లోపాలను సవరించడానికి బదులు అనేక రకాలైన సమస్యలకు దారితీస్తాయని క్షేత్రస్థాయి పరిశీలనలు రుజువు చేస్తున్నాయి.
ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై ఇండియా కూటమి తీసుకుంటున్న వైఖరి రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రతిపక్షం అమ్ములపొదిలో ఈ వివాదాస్పద అంశం కీలకమైన ఆయుధంకానున్నది. ప్రతిపక్షం లేవనెత్తే ప్రశ్నలకు పాలక ఎన్డీయే కూటమి, దాని భాగస్వాములైన జేడియూ, లోక్‌జనశక్తి పార్టీ, హిందుస్తానీ అవామ్ మోర్చా ఎలా స్పందిస్తాయో వేచిచూడాలి.
ఓటర్ల జాబితా సవరణ తమ ఓటు బ్యాంకును కూడా ప్రభావితం చేసే అవకాశాలున్నప్పటికీ, బీజేపీతో సహా ఎన్డీయే కూటమి భాగస్వామి పక్షాలు ఈ అంశంపై ఇప్పటి వరకు పెదవి విప్పకపోవడం గమనించాల్సిన విషయం. అయితే, రాష్ట్రంలో ఎన్డీయే భాగస్వామిగా ఉన్న రాష్ట్రీయ లోక్ మోర్చా నేత ఉపేంద్ర కుష్వావా ఓటర్ల జాబితా సవరణ నిర్ణయం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో అర్హులైన ఓటర్లు ఎవరిపైనా అనర్హత వేటు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపైనే ఉందని ఆయన అన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.