
తమిళనాడు: దేవనగరి లిపిలోని రూపాయి గుర్తు బడ్జెట్ లోగోలో తొలగింపు
హిందీభాష మీద వ్యతిరేకత కొనసాగుతూ, తమిళనాడులో స్వభాష అభిమాన ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఉద్యమాగ్నికి చమురులా కేంద్ర బిజెపి మంత్రుల మాటలు కూడా తోడవుతున్నాయి. ఈ క్రమంలో తమ రాష్ట్ర బడ్జెట్ లోగో నుంచి దేవనగరి లిపిలో ఉన్నటువంటి రూపాయి గుర్తును తమిళనాడు ప్రభుత్వం తొలగించి, తమిళ అక్షరాన్ని జోడించింది.
తాజాగా లోక్‌సభలో కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమిళనాడును ఉద్దేశించి ‘అనాగరిక ప్రజలు’ అని సంచల వ్యాఖ్యలు చేశారు. సభలోనే డిఎంకె ఎంపీ కనిమొళి స్పందించి, ప్రధాన్ మాటలను ఖండించారు. అంతేకాకుండా డిఎంకె నేతలు ప్రధాన్ మాటలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
ఓవైపు హిందీ భాష పెత్తనానికి, హిందీభాషేతరుల మీద హిందీ భాషను బలవంతంగా రుద్దడానికి వ్యతిరేకంగా తమిళ ప్రజలు ఉద్యమ బాట పట్టారు. రాష్ట్రంలో హిందీలో రాసిన రాతలను తమిళ భాషాభిమానులు తొలగిస్తున్నారు. తమిళ స్వభాషోద్యమానికి ప్రధాన్ మాటలు రెచ్చగొట్టినట్టు అయ్యాయి.
తమిళనాడు సీఎం స్టాలిన్ మొదటి నుంచి త్రిభాషా సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మాటల వరకే పరిమితం కాకుండా చర్యలలో కూడా చూపిస్తూ.. తాజాగా తమ ప్రభుత్వ బడ్జెట్లో హిందీ అక్షరం రూ(₹)ను తొలగించి, తమిళ రూ(ரூ)ను చేర్చారు. ఇది కాస్త తమిళనాడులో వివాదానికి దారితీసింది.
తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి తంగం తెన్నరసు మార్చి 14న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనికంటే ముందు మార్చి 13న ప్రభుత్వం బడ్జెట్ లోగోను విడుదల చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా ఉపయోగించే రూపాయి సింబల్ లేదు. అంతేకాకుండా తమిళ ‘రూ’ అక్షరం మాత్రమే ఉంది. దీంతో ఈ విషయం చర్చకు దారితీసింది. ఇంకా తమిళంలో రూపాయిని ‘రూబాయి’ అని పిలవడంపై, ఈ లోగో మార్పుకు సంబంధించి పెద్ద వివాదం రాజుకుంది.
ఈ మార్పుపై తమిళనాడు బిజెపి అధ్యక్షులు అన్నామలై సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్(ఎక్స్) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రూపాయి గుర్తు మన కరెన్సీ నోట్లపై ముద్రించబడింది, ఇది దేశవ్యాప్తంగా అందరూ ఉపయోగిస్తున్న గుర్తు’ అని తమిళనాడు సీఎంను ట్యాగ్ చేస్తూ ఘాటుగా స్పందించారు.
అన్నామలై మాటలకు స్పందనగా డిఎంకె అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై ‘లోగోలో తమిళ అక్షరం చేర్చడం నిషేధించబడ లేదు’ అని చెప్పారు. ప్రభుత్వ చర్యను సమర్థిస్తూ ఇది తప్పు కాదని స్పష్టం చేశారు. తమిళ అక్షరం చేర్చడంలో ఎటువంటి తప్పు లేదని తేటతెల్లం చేశారు.
దేవనగరి లిపి ‘₹’ నేపథ్యం..
భారత ప్రభుత్వం 2009లో భారత రూపాయికి ఒక ప్రత్యేక చిహ్నాన్ని రూపొందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒక పోటీని నిర్వహించింది. ఈ పోటీకి దేశ నలుమూలల నుంచి చాలా మంది రూపాయి చిహ్నం డిజైన్లను పంపించారు.
అందులో, తమిళనాడుకు చెందిన డిఎంకె మాజీ ఎమ్మెల్యే ధర్మలింగం కుమారుడు ఉదయ కుమార్ రూపొందించిన డిజైన్‌ను ఎంపిక చేశారు. ఉదయ్ ఐఐటీ ముంబైలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. అక్కడే తమిళ్ టైపోగ్రఫీపై పీహెచ్డీ కూడా చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఉదయ్ పంపిన గుర్తును 2010 జూలై 10న ఆమోదించి, భారత కరెన్సీ సింబల్‌గా అమలు చేసింది.
దేవనగరి లిపిలో ఉన్నటువంటి రూపాయి చిహ్నాన్ని తమిళనాడుకు చెందిన డి ఉదయ్ కుమార్ రూపొందించారు. అయినప్పటికీ, హిందీ భాషకు దగ్గరగా ఉండడంతో అమలుకు సంబంధించి కొన్ని వివాదాలు ఉన్నాయి. హిందీ భాషను హిందీయేతరుల మీద రుద్దడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇది కూడా ఓ నిదర్శనమని విమర్శలు కూడా ఉన్నాయి. తమిళనాడులో కేంద్ర త్రిభాషా సిద్ధాంతానికి, హిందీ భాష పెత్తనానికి వ్యతిరేక ఉద్యమం వల్ల ఇది కాస్త ప్రస్తుతం బయటపడింది.
– సయ్యద్ ముజాహిద్ అలీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.