
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో 11వ తరగతి చదువుతున్న దళిత విద్యార్థిపై దాడి జరిగింది. పరీక్ష రాయడానికి వెళుతుండగా అతనిపై దాడి చేసి, అతని మూడు వేళ్లను కోశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. కబడ్డీ మ్యాచ్‌లో అగ్రవర్ణాలకు చెందిన అభ్యర్థుల జట్టును ఓడించిన తర్వాత కుల ఉద్రిక్తత వల్ల ఈ దాడి జరిగిందని బాధిత కుటుంబీకులు ఆరోపించారు.
న్యూఢిల్లీ : తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో సోమవారం(మార్చి 10)నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. షెడ్యూల్డ్ కులానికి(ఎస్సీ) చెందిన 11వ తరగతి విద్యార్థి పరీక్ష రాయడానికి వెళుతున్నాడు. ఈ క్రమంలో కొందరు అతనిపై దాడి చేసి, అతని మూడు వేళ్లను కోశారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, కుల ఉద్రిక్తత కారణంగా ఈ దాడి జరిగిందని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందుతులైన మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
‘ఉన్నత’ కుల ప్రత్యర్థులను బాధిత విద్యార్థి జట్టు ఓడించిన కబడ్డీ మ్యాచ్‌లో అతని పాత్రపై కోపం వల్ల ఈ దాడి జరిగిందని బాధిత కుటుంబం తెలిపింది. అయితే ఆ విద్యార్థికి, ఉన్నత కులానికి చెందిన బాలికకు మధ్య ఉన్న ప్రేమ వ్యవహారంతో ఈ దాడి ఘటన ముడిపడి ఉందేమోననే దానిపై దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.
దర్యాప్తు గురించి తెలిసిన ఒక సీనియర్ పోలీసు అధికారి ప్రకారం, విద్యార్థి తండ్రి దాఖలు చేసిన ప్రాథమిక ఫిర్యాదులో దాడికి కబడ్డీ మ్యాచ్ కారణమని పేర్కొన్నారు. కానీ ప్రాథమిక దర్యాప్తు, అదుపులోకి తీసుకున్న మైనర్లను(బాధితుడి సహవిద్యార్థులందరూ) పోలీసుల ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆ విద్యార్థికి పోలీసుల అదుపులో ఉన్నటువంటి బాలురలో ఒకరి సోదరితో ఉన్నటువంటి సంబంధం వల్ల హింస జరిగిందని తేలింది. ఆ వ్యక్తి తమిళనాడు రాష్ట్ర హిందూమతంలోని తేవర్ కులానికి చెందినవాడు.
బస్సులో పట్టపగలు దాడి..
ద న్యూస్ మినిట్ నివేదిక ప్రకారం, బాధితుడిని అరియనాయగీపురానికి చెందిన ఒక ఇటుక బట్టీ కార్మికుడి కుమారుడు దేవేంద్రన్గా గుర్తించారు. అతను తిరునెల్వేలి జిల్లాలోని పాలయంకోట్టైలోని తన పాఠశాలకు వెళుతుండగా నిందితులు అతనిపై దాడి చేశారు. ప్రస్తుతం బాధితుడు తిరునల్వేలి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు, అతని పరిస్థితి విషమంగా ఉంది.
పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ముగ్గురు మైనర్లు బస్సును ఆపారు. ఆ తర్వాత బాలుడిని బయటకు లాగి అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో అతని ఎడమ చేతి మూడు వేళ్లు తెగిపోయాయి. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన అతని తండ్రిపై కూడా నిందుతులు దాడి చేశారు. ఘటనలో అతని తల మీద గాయాలయ్యాయి. సమీపంలో నిలబడి ఉన్న వ్యక్తులు బాధితులకు సహాయం చేయడానికి పరిగెత్తే సమయానికి దాడి చేసిన వారు పారిపోయారు.
బాలుడిని మొదట శ్రీవైకుంఠం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ తరువాత తిరునల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు తెగిపోయిన వేలును తిరిగి అతికించే ప్రయత్నంలో శస్త్రచికిత్స చేశారు.
కుల నేరాల నివారణకు ప్రత్యేక పోలీసు విభాగం ఏర్పాటు కోసం డిమాండ్..
ఈ సంఘటనతో తీవ్ర ఆగ్రహం పెల్లుబీకింది. విద్యార్థి కుటుంబీకులు, స్థానిక కార్యకర్తలు న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు.
దళిత యువకుడిపై జరిగిన దారుణమైన దాడి తర్వాత విడుతలై చిరుతైగల్ కట్చి(విసికె)అధ్యక్షుడు, చిదంబరం ఎంపీ థోల్ తిరుమావళవన్ స్పందించారు. కుల ఆధారిత దురాగతాలను నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పోలీసు నిఘా విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేసినట్టు ద న్యూస్ మినిట్ నివేదించింది.
దేవేంద్రన్ తెగిపోయిన వేళ్లను తిరిగి అతికించడానికి శస్త్రచికిత్స జరుగుతోందని, కానీ ఒక వేలు కనిపించలేదని తిరుమావళవన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దారుణ హింసను ఆయన ఖండించారు. దేవేంద్రన్ ఈ నెల ప్రారంభంలో కెట్టియామల్పురం జట్టుపై గెలిచిన అరియనాయగిపురం కబడ్డీ జట్టులో సభ్యుడని గుర్తుచేశారు.
‘దక్షిణ జిల్లాల్లో ముఖ్యంగా తిరునల్వేలి, తూత్తుకుడిలో కుల ఆధారిత హింస- హత్యలు నిరంతరం జరుగుతున్నాయి’ అని విసికె అధ్యక్షుడు వాపోయారు. కుల ఆధారిత దురాగతాలను ఆపడానికి తమిళనాడు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీని కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక నిఘా టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలి కోరారు.
ద వైర్ హిందీ స్టాఫ్
అనువాదం: క్రిష్ణ నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.