
అతి నిరాడంబరత, విజ్ఞానసారం, కళాతత్వం- సౌందర్య దృష్టి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వ్యక్తిత్వపు సారమని తన జీవిత చరిత్రను రాసిన శాస్త్రవేత్త బానేష్ హాఫ్మన్ అంటారు. విభిన్న రంగాల్లోని ఐన్‌స్టీన్ ప్రతిభ ప్రస్తుత శతాబ్దపు నీలి గగనాన ఇంద్రధనుస్సులా యావత్ ప్రపంచానికి సైన్స్ పాఠాలను నేర్పుతోంది. ఆయనను అనుసరిస్తూనే కొత్తదనం కోసం నవతరం అన్వేషిస్తుంది.
ఐన్‌స్టీన్ మెదడుపై శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయంటే ఆయన ఆలోచనలు విశ్వాన్వేషణలో ఎంతలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయో మనమే అర్థం చేసుకోవాలి. శ్రీశ్రీ కవితా వాక్యాలైన ‘ఆ మార్గం అనితరసాధ్యం’ను ఐన్ స్టీన్ ఫిజిక్స్ మహాప్రస్థానానికి వాడవచ్చు.
‘ఒక్క క్షణం పాటు మీ చేతిని కుంపటి మీద పెట్టండి ఒక గంటలా కనిపిస్తుంది. ఒక అమ్మాయితో గంటసేపు సరదాగా గడపండి ఒక్క క్షణంలా అనిపిస్తుంది. అదే సాపేక్షత’ అని తనదైన శైలిలో మనందరినీ ఐన్‌స్టీన్ ప్రభావితం చేస్తారు. కంప్యూటర్లు, ఇంటర్నెట్, క్వాంటం ఫిజిక్స్, అణు విద్యుత్‌లతో సహా నేటి కృత్రిమ మేధ, రోబోటిక్ కంప్యూటింగ్, స్ట్రింగ్ థియరీ, విశ్వ వ్యాకోచం, గురుత్వాకర్షణ తరంగాలు, బ్లాక్ హోల్స్, డార్క్ ఎనర్జీ, బిగ్ బ్యాంగ్లాటి ఎన్నో ఆధునిక శాస్త్ర సాంకేతిక పదాలకు ఆయన ఆలోచనలే పునాది రాళ్ళుగా ఉన్నాయి.
‘నా ఈ వ్యాసాలు విప్లవాత్మక మార్పులకు నాంది అవుతాయి’ అంటూ 1905లో ‘థియోరీ ఆఫ్ రిలేటివిటి’తో గుమాస్తా అయిన ఓ అనామక యువకుడు తన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి సైతం ఆ అనామక వ్యక్తి ఆత్మ విశ్వాసానికి నిదర్శనంగా 2005ను ఐన్ స్టీన్ సంవత్సరంగా, అంతర్జాతీయ భౌతిక శాస్త్ర సంవత్సరంగా ప్రకటించింది. ‘ఫిజిక్స్ ఫర్ టుమారో’ ప్రపంచ గీతమై కోట్లాది గెలాక్సీల గుండెల్లో ప్రతిధ్వనించింది.
ఫిజిక్స్‌లో ఒక నోబెల్ బహుమతి గెలిచిన ఓ గొప్ప శాస్త్రవేత్తగా మాత్రమే ఐన్‌స్టీన్‌ను మనం పరిమితం చేయలేము. అనంత మేధాశక్తి సామర్థ్యంతో పాటు మానవత, నైతికత కల్గిన తత్వవేత్తగా, స్వాతంత్రం, న్యాయం, సమానత్వాల పట్ల అచంచలమైన విశ్వాసం గల విలక్షణమైన వ్యక్తిగా ఆయన కనబడతారు. అన్నింటికీ మించి విశ్వశాంతి కాముకుడిగా తనలోని సమగ్ర మూర్తిమత్వపు వ్యక్తితత్వం భిన్న మానవీయ, శాస్త్రీయ కోణాల్లో యావత్ ప్రపంచం చూసింది.
నేటితరంలో కూడా యువత కొన్ని సందర్భాల్లో ‘అబ్బో వీడో పెద్ద ఐన్ స్టీన్’అని అంటున్నారంటే ఆయన ప్రాభవం ఇంకా కొన్ని శతాబ్దాలు ఇలానే కొనసాగుతుందేమోనని అనిపిస్తుంది. ప్రాథమిక భౌతిక రాశులుగా వున్న పొడవు, ద్రవ్యరాశి, కాలానికి కాంతివేగంతో ముడిపెట్టి న్యూటన్ కాలానికి ఐన్‌స్టీన్ ముగింపు పలికారు.
చిన్నప్పుడు తన తండ్రి ఇచ్చిన నావికా దిక్సూచి, రేఖాగణితం పుస్తకంలో నుంచి స్ఫూర్తి పొంది నేడు స్పేస్ అండ్ టైమ్‌కే దిక్సూచిగా ఎదిగారు. ద్రవ్యం శక్తిగాను, శక్తి ద్రవ్యంగాను మారవచ్చని ERmc^2తో విశ్వ గమనానికే సాపేక్షతతో కొత్త ఫిజిక్స్ నేర్పారు. ఇంతలా శతాబ్దాల కాలాన్ని కాంతివేగంతో పరిగెత్తించి ‘నేను కొత్తగా కనుగొన్నది ఏమీలేదు. సృష్టించిందీ ఏమీ లేదు. నేను, నా పూర్వీకుల భుజాలపై నుంచి మరింత దూరం స్పష్టంగా చూడగలిగానంతే’ ఐన్ స్టీన్ అ‘మాయ’కంగా అంటారు.
1905లో ‘ఆన్ ది ఎలక్ట్రో డైనమిక్స్ ఆఫ్ మూవింగ్ బాడీస్’ పరిశోధనా పత్రంతో ఆధునిక విజ్ఞానంపై ఐన్‌స్టీన్ ఎక్కువ ప్రభావాన్ని చూపారు. గమనం అంతా సాపేక్షమే అనీ, శూన్యాకాశంలో కాంతి వేగం విలువ స్థిరంగా ఉంటుందని ఆయన ప్రతిపాదించారు. నేటి యువ శాస్త్రవేత్తలకు ‘కాంతి వేగాన్ని మించే వేగం’ ఓ శాస్త్రీయ సవాల్‌గా మారిందని చెప్పవచ్చు. ఫొటో విద్యుత్ ఫలితం ప్రయోగ నిరూపణతో నోబెల్ గెలిచిన ఐన్ స్టీన్ ‘జ్ఞానం, నైపుణ్యం మాత్రమే మానవాళికి గౌరవకరమైన జీవితాన్ని ఇవ్వలేవు. ఉన్నతమైన నైతిక ప్రమాణాలు, విలువలు కలవారిని ఎంతో ఆరాధించడం మానవతకు సహజం’ అంటారు.
‘We should be thankful to the Indians who taught us how to count, without which no worth while scientific discovery would have been possible’ అంటూ భారతదేశం అందించిన ‘శూన్యం’ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విఖ్యాత భారతీయ తత్వవేత్త, ఆసియా ఖండంలోనే తొలి నోబెల్ విజేత రవీంద్రనాథ్ ఠాగూర్‌తో కూడా ఐన్‌స్టీన్‌కు ‘ఆన్ ది నేచర్ ఆఫ్ రియాలిటీ’తో సంభాషణ జరిగింది. సైన్స్, ప్రకృతి, ఆధ్యాత్మికత, చైతన్యం, తత్వశాస్త్రం వంటి అంశాలపై వారి మధ్య సత్యాన్వేషణ జరిగింది.
సిగ్మండ్ ఫ్రాయిడ్, మహాత్మా గాంధీ వంటి విఖ్యాత ప్రముఖులతో కలిసి విశ్వ శాంతి కోసం తన ప్రయత్నాలను కొనసాగించారు. ‘ఇటువంటి వ్యక్తి ఒకరు సజీవంగా రక్త మాంసాలతో ఈ నేలపై నడయాడాడంటే భవిష్యత్తు తరాలు నమ్మలేక పోతాయేమో’అంటూ గాంధీకి ఐన్‌స్టీన్ ఇచ్చిన అక్షర నివాళి విశ్వ వనంలో ఏనాటికీ ఎవ్వరూ చెరపలేని శిలా శాసనంగా చెప్పవచ్చు. గాంధీజీ, ఐన్‌స్టీన్ ఇద్దరూ ప్రత్యక్షంగా కలవాలనుకున్నప్పటికీ కాలం ఎందుకో వాళ్ళిద్దరినీ కలవకుండా చేసింది.
విశ్వ ఆవిర్భావానికి సంబంధించిన ఎన్నో శాస్త్రీయ అంశాలు భగవద్గీతలో ఉన్నాయని, ఫోటాన్ శక్తి మారుతుందని గుర్తించి నిరూపించిన సివి రామన్ ఆలోచనా విధానం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని ఐన్‌స్టీన్ అన్నట్టుగా చరిత్రలో చెప్పడం జరిగింది.
నిత్యం అధిపత్యం, నియంతృత్వ, అమానుష అజ్ఞాన, ఆయుధ చర్యలతో, యుద్ధాలతో మానవ మనుగడ ఆధునికత పేరుతో ప్రస్తుతం అనాగరికంగా వ్యవహారిస్తుంది. ఇటువంటి తరుణంలో ఐన్‌స్టీన్ జీవన విధానం, వ్యక్తిత్వపు పాఠాలు అందరూ అనుసరించాల్సిన సమయం ఆసన్నమైంది. తన సూత్రంతో ఆటంబాంబు కనుగొని లక్షల ప్రాణాలు తీయడాన్ని ఐన్‌స్టీన్ తీవ్రంగా వ్యతిరేకించారు. విశ్వశాంతి కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగపడాలని తన జీవితాంతం సందేశమిచ్చారు.
ఇక మళ్ళీ ప్రపంచ యుద్ధాలు జరిగితే రాళ్ళు, కర్రలు మాత్రమే మిగులుతాయని గట్టిగానే ఆనాడే హెచ్చరించిన విశ్వ మానవుడు ఐన్ స్టీన్. మానసిక ప్రశాంతత కోసం వయోలిన్‌తో సమయాన్ని కేటాయించిన ఆయన నాన్ వయోలెన్స్ కావాలని దశాబ్దాలుగా పోరాటం చేశారు. ‘నాకు ప్రత్యేక నైపుణ్యం లేదు. అంతులేని జిజ్ఞాస మాత్రమే వుంది’అని ఆయన స్ఫూర్తి వచనాలతో విశ్వం విస్తరణ సాక్షిగా విజ్ఞాన్వేషణలో విశ్వహద్దులను చెరిపేస్తూ, విశ్వశాంతి జలపాతాలను పారిస్తూ మనమంతా ప్రేమ మంత్రాన్ని జపిద్దాం. సత్యం మార్గంలో మా‘నవ’మనుగడను కొనసాగిద్దాం. సృష్టి రహాస్యాలపై మన సంతకాలను ముద్రిద్దాం.
ఫిజిక్స్ అరుణ్ కుమార్
ఫోన్ నెం: 9394749536
(మార్చి 14న ఐన్‌స్టీన్ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.