
తెలంగాణ ప్రభుత్వం అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశం కోసం ఆన్లైన్ కేంద్రీకృత ప్రవేశ వ్యవస్థ, డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST)ను 2016 లో రూపొందించింది. ఈ విధానం దాని సౌలభ్యం, పారదర్శకతకు ప్రశంసలు అందుకుంది. విద్యార్థులు ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి, ఇష్టపడే కళాశాలలను ఎంచుకోవడానికి, SMS ద్వారా ప్రవేశ నిర్ధారణను పొందడానికి అనుమతించడం ద్వారా, DOST, ప్రవేశ ప్రక్రియను సులభతరం చేసింది. అయితే, ఈ విధానం ఉన్నత విద్యలో, ముఖ్యంగా గ్రామీణ-పట్టణ విభజనకు, విద్యలో అసమానత్వానికి, నాణ్యత, సహకారం పెంపొందించే విషయాలలో అవాంఛిత పరిణామాలను కలగజేసింది. ఈ వ్యాసం DOST యొక్క ఊహించని ఫలితాలను విమర్శనాత్మకంగా పరిశీలిస్తుంది, తగ్గుతున్న గ్రామీణ కళాశాల నమోదులు, పోటీ ప్రచారంలో ఉపాధ్యాయుల ప్రమేయం, విద్యలో సమానత్వం, నాణ్యత సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది.
వాస్తవానికి DOST ప్రక్రియ విద్యార్థులకు ప్రవేశాలను మరింత అందుబాటులోకి తెచ్చింది. అయితే, పట్టణ సంస్థలు మెరుగైన అవకాశాలు, వనరులను అందిస్తాయని భావించడం వల్ల, ఈ సౌలభ్యం గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ కళాశాలలకు విద్యార్థుల భారీ వలసలకు దారితీసింది. అర్బన్ కళాశాలల్లో సీట్లపై హేతుబద్దమైన పరిమితులు లేకపోవడం, గ్రామీణ ప్రాంత విద్యార్థుల వలసల వలన ఆ కాలేజీలలో ప్రవేశాలు ఎక్కువై మౌలిక సదుపాయాల కొరత ఏర్పడింది, చాలా కాలేజీలు షిఫ్టు పద్దతిలో నడుస్తున్నాయి, దీని వలన విద్య నాణ్యత దెబ్బతింటున్నది. విద్యార్థులు పట్టణ కేంద్రాలకు వలస వెళ్లడంతో, గ్రామీణ కళాశాలలు తక్కువ నమోదుతో బాధపడుతున్నాయి, దీని వలన వనరుల నిరుపయోగం, విద్యా వాతావరణం తగ్గడం జరుగుతున్నది. ఒకప్పుడు విభిన్న దృక్పథాలను, గొప్ప అభ్యాస అనుభవాలను పెంపొందించిన వైవిధ్య తరగతి గది సంస్కృతులను కోల్పోవడానికి కూడా ఈ వలసలు దారితీశాయి. విద్యార్థుల సంఖ్య తగ్గడంతో, గ్రామీణ కళాశాలలు నిరుత్సాహంగా మారాయి, ఇది ఉన్నత విద్య పట్ల విద్యార్థుల ప్రేరణను, ఆకాంక్షలను ప్రభావితం చేస్తున్నది, పట్టణ మరియు గ్రామీణ విద్యా సంస్థల మధ్య అసమానతలను మరింత తీవ్రతరం చేస్తున్నది.
విద్యార్థుల సంఖ్య తగ్గడంతో, గ్రామీణ కళాశాలల్లో ఫ్యాకల్టీ వేకెన్సీలు కుదించ బడ్డాయి, ఈ ప్రక్రియకు యు జి సి మార్గదర్శకాల ద్వారా లేదా, ఇతర శాస్త్రీయమైన ప్రకటిత నియమాల ద్వారాగాని కాకుండా ఇష్టానుసారం చేశారు. మూడేళ్ళ ఆప్షనల్ సబ్జెక్టుల బోధనను ఒకే ఒక అధ్యాపకుడు నిర్వహించవలసిన పరిస్థితులొచ్చాయి, ఈ సబ్జెక్టుల్లో మొదటి సంవత్సరంలో విద్యార్థుల నమోదు 80 దాటితేనే రెండవ అధ్యాపక పోస్ట్ మంజూరు కాబడింది. భాషలకు, ఆర్ట్స్ సబ్జెక్టులకు సంబందించి అయితే ఈ సంఖ్యను 150 అనీ, 170 అని ఇష్టానుసారంగా నిర్ధారించారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియంల విద్యార్థులను కలిపి బోధన చేయాలని ఆదేశించారు. వీటికి లిఖిత ఆదేశాలు లేవు, కేవలం మౌఖిక ఆదేశాలతోనే ఈ మార్పులను చేశారు. వీటిని అనుసరించి పెద్ద సంఖ్యలో అధ్యాపకుల బదిలీలు జరిగాయి, ఇది ఫ్యాకల్టీని తీవ్రమైన అస్తిరత్వానికి, ఆందోళనకు గురిచేసింది. ఈ ముప్పును ప్రిన్సిపాళ్ళ సంఘాలు, అధ్యాపక సంఘాలు ప్రశ్నించలేదు, సరికదా, అధ్యాపకులు సమీప ఫీడర్ సంస్థలను అంటే జూనియర్ కాలేజీలను జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో సందర్శించి నమోదు ప్రచారాలలో పాల్గొనాలని అధ్యాపకులపై ఒత్తిడి తెచ్చారు. ఈ చర్యను తక్షణ పరిష్కారంగా భావించారు, ఈ ప్రచార కార్యక్రమాలకు విశేష ప్రాధాన్యతనిచ్చారు, కాలేజీల ప్రిన్సిపాళ్లు ఈ ప్రచారాలను చురుకుగా ప్రోత్సహించడం వలన వస్తు మార్కెట్లో ఉండే తీవ్రమైన పోటీ వాతావరణం లాంటిదే డిగ్రీ కాలేజీల మధ్య ఏర్పడుతున్నది, ఈ పోటీ కేవలం ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల మధ్యనే గాకుండా, ప్రభుత్వ సంస్థల మధ్య కూడా విపరీతం అయింది, దీనితో వనరుల కొరత కలిగిన ప్రభుత్వ కాలేజీలలో విద్యార్థుల నమోదు తీవ్రంగా ప్రభావితం అవుతున్నది. ఈ మార్పు విద్యా సమాజానికి కేంద్రంగా ఉండవలసిన సహకార స్ఫూర్తిని దెబ్బతీసింది. అధ్యాపకులు ప్రధాన విద్యా బాధ్యతల కంటే మార్కెటింగ్ కార్యకలాపాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. పాఠ్య, సహ పాఠ్య కార్యకలాపాలు స్పూర్తిరహితంగా నిర్వహించబడుతున్నాయి, విమర్శనాత్మక ఆలోచన, స్వతంత్ర ఆలోచన, ప్రజాస్వామిక విలువల పెంపు లాంటి ఉన్నత విద్య యొక్క విస్తృత లక్ష్యాలు దెబ్బతింటున్నాయి. ముఖ్యమైన ఈ లక్ష్యాలు సాధించబడకుండా విద్యార్థులు పొందే డిగ్రీల వలన సమాజానికి లాభం ఏమీ ఉండదు.
విద్యలో సమ భాగస్వామ్యం, నాణ్యత పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజల సమ భాగస్వామ్యం లేకుండా విద్యలో నిజమైన నాణ్యతను సాధించలేము, సమానత్వం లేకపోవడం తప్పనిసరిగా నాణ్యతను రాజీ పడేటట్లు చేస్తుంది. భౌగోళిక, సామాజిక, అనువంశిక లేదా ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యకు న్యాయమైన అవకాశాలను కలిగి ఉండేలా సమానత్వం నిర్ధారిస్తుంది. ఆ విద్యా ఫలితాల అందుబాటు కూడా సమానంగా ఉన్నప్పుడే సభాగస్వామ్యం ఉన్నట్టు. అయితే, ప్రస్తుత విధాన చట్రం, వనరుల కెటాయింపులో అసమానతలను ఇంకా పెంచేదిగా ఉంది. పెరుగుతున్న నమోదుతో పట్టణ కళాశాలలు ఎక్కువ నిధులు, మౌలిక సదుపాయాల మద్దతును పొందుతున్నాయి, గ్రామీణ కళాశాలలు నిర్లక్ష్యం చేయబడుతున్నాయి.
విద్యలో నాణ్యత అనేది మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల సంఖ్య గురించి మాత్రమే కాదు, తరగతి గది, భిన్న నేపథ్యాలను కలిగిన విద్యార్థుల మిశ్రమంగా, వైవిధ్యమైన అనుభవాలను పంచుకునేటట్లుగా కూడా ఉండాలి. DOST ప్రవేశ విధానం లేక మునుపు గ్రామీణ కాలేజీలలో కూడా ఈ వాతావరణం ఉండేది. విభిన్న దృక్పథాలకు గురికాకపోవడం విద్యార్థుల మేధో వృద్ధిని పరిమితం చేస్తుంది, మొత్తం విద్యా అనుభవాన్ని తగ్గిస్తుంది. DOST పర్యవసానాల వలన గ్రామీణ కళాశాలలలో విద్యార్థుల నమోదు తగ్గి, విభిన్నమైన విద్యార్థుల మిశ్రమ వాతావరణం లోపించి, తరగతి గదులు ఏకరీతిగా మారడం కూడా విద్య నాణ్యత దెబ్బతినడానికి కారణం అవుతున్నది. కేంద్రీకృత ప్రవేశ విధానం వలన సృష్టించబడిన, విద్య సమానత్వం- నాణ్యతల మధ్య సంఘర్షణ అసమతుల్య విద్యా ఫలితాలకు కారణమై అసమానతలను మరింత శాశ్వతం చేసే ప్రమాదం ఉంది.
కేంద్రీకృత ప్రవేశ వ్యవస్థ ప్రైవేట్ విద్యా సంస్థల ప్రభావాన్ని తగ్గిస్తుందని భావించినప్పటికీ, ఇది ఎండోజినస్ ప్రైవేటీకరణను ప్రోత్సహించింది – ప్రభుత్వ సంస్థలు మనుగడ కోసం ప్రైవేట్ సంస్థల పద్దతులయిన పోటీ, మార్కెట్ ఆధారిత పద్ధతులను అనుసరించడం ఎండోజినస్ ప్రైవేటీకరణ. అధ్యాపకులు విద్యార్థులను ఆకర్షించడానికి తరచుగా అవాస్తవ వాగ్దానాలు చేయడం, కొంత ప్రలోభాలకు గురి చేయడం కూడా జరుగుతున్నది (స్వయం ప్రతిపత్తి కలిగిన కొన్ని కాలేజీలు, పరీక్షలు, మూల్యాంకనం విషయాల్లో విద్యార్థులకు అనుకూలంగా ఉంటామని ప్రలోభపెడుతూ ప్రచారం చేసుకుంటున్నాయి). ఈ ప్రవర్తన ప్రైవేట్ సంస్థల ప్రవర్తనను ప్రతిబింబిస్తుంది, ప్రభుత్వ విద్య యొక్క ప్రధాన లక్ష్యాన్ని పలుచన చేస్తుంది.
ప్రభుత్వ సంస్థలు విద్యార్థుల నమోదు కోసం పోటీపడడం నవ ఉదారవాద విధానాల లోతైన ప్రభావానికి ఉదాహరణగా నిలుస్తుంది. ఉన్నత విద్య సంస్థల పాత్ర, విమర్శనాత్మక ఆలోచన, పౌరసత్వ శిక్షణ, మేధో వృద్ధిని పెంపొందించే స్థలంగా కాకుండా మార్కెట్ కొలమానాలకు తగ్గించబడింది.
కేంద్రీకృత విధానం యొక్క మరొక ముఖ్యమైన పరిణామం సంస్థాగత స్వయంప్రతిపత్తి క్షీణించడం. విద్యా బోధనకు సంబందించిన క్షేత్ర అనుభవాలపై అధ్యాపకులను సంప్రదించకుండా, పరిమిత అవగాహన ఉన్న అధికారులచే విధానాలు పై నుండి క్రిందికి అమలు చేయబడతాయి. ఈ సంస్కరణలను ప్రతిఘటించడంలో కీలక పాత్ర పోషించాల్సిన కాలేజీ విద్య ప్రిన్సిపాళ్ళ, అధ్యాపక సంఘాలలో, నవ ఉదారవాదం, ప్రైవేటీకరణ అంశాలపై లోతైన అవగాహన లేకపోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతున్నది.
DOST ప్రవేశాలలో సౌలభ్యం, పారదర్శకత ఉన్నప్పటికీ, దాని ఊహించని పరిణామాలు తెలంగాణలో అండర్ గ్రాడ్యుయేట్ విద్య యొక్క సమానత్వం, నాణ్యత, కాలేజీల స్వయంప్రతిపత్తిని, పనితీరును గణనీయంగా ప్రభావితం చేశాయి. గ్రామీణ-పట్టణ విభజన, ప్రభుత్వ సంస్థల మధ్య పెరిగిన పోటీ విద్యా నైపుణ్యాన్ని పణంగా పెట్టి నమోదుపై దృష్టి పెట్టడం లోతైన సంక్షోభానికి లక్షణాలు.
- ఈ సవాళ్లను పరిష్కరించడానికి, రద్దీని నివారించడానికి మరియు సమతుల్య నమోదును ప్రోత్సహించడానికి పట్టణ కళాశాలల్లో ప్రవేశాలను పరిమితం చేయాలి.
- మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మరియు విద్యార్థులను ఆకర్షించడానికి గ్రామీణ కళాశాలలకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించాలి.
- కేవలం నమోదు సంఖ్యల ఆధారంగా కాకుండా సంస్థాగత అవసరాల ఆధారంగా సమాన వనరుల కేటాయింపును నిర్ధారించడానికి నిధుల నమూనాను సంస్కరించాలి.
- ప్రచార కార్యకలాపాలలో పాల్గొనడానికి అధ్యాపకులపై ఒత్తిడిని తగ్గించడం, అర్థవంతమైన బోధన, పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆరోగ్యవంతమైన విద్యా వాతావరణాన్ని పునరుద్ధరించాలి.
- హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సహకారంతో CESS ( Centre for Economic and Social Studies) లో ఉన్నత విద్య సమస్యల అధ్యయనం కోసం 2020 లో రాష్ట్ర ప్రభుత్వం RSEPPG (Research Cell for Studies in Education Policy, Planning and Governance) విభాగాన్ని ఏర్పరచింది. దీని ద్వారా DOST ప్రవేశ విధానం పై సమీక్ష జరిపించాలి.
అకడమిక్ సెల్ ను గుమాస్తా పనికోసం గాక, కాలేజీ విద్య సమస్యల అధ్యయన కేంద్రంగా సంస్కరించాలి.
అంతిమంగా, ఉన్నత విద్య యొక్క లక్ష్యం, స్వతంత్ర ఆలోచనాపరులను పెంపొందించడం, సహకారాన్ని పెంపొందించడం, ప్రాంతీయ, సామాజిక అంతరాలను తగ్గించడం, సామాజిక సమస్యల పట్ల అవగాహనను, ఉత్తమమైన పౌరసత్వ శిక్షణను అందించడం, బాద్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దటం. కాని, ప్రభుత్వ సంస్థలను విద్యార్థుల నమోదు సంఖ్యల ద్వారా నడిచే పోటీ సంస్థలుగా మార్చడం కాదు. అసమానతలు, వైవిధ్యత ఎక్కువ ఉన్న సమాజాలకు కేంద్రీకృత విధానాలు సరైనవి కావనేది ప్రాథమిక సూత్రము, దీనికి విరుద్దంగా చేపట్టబడే ఏ కార్యక్రమమైన సరైన ఫలితాలనివ్వదు. సమతుల్యమైన, సమగ్రమైన విద్య, వికేంద్రీకృత విధానాల ద్వారా మాత్రమే నిజమైన విద్య సారాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.
ఎడమ శ్రీనివాస రెడ్డి
అధ్యాపకులు, కాకతీయ ప్రభుత్వ కళాశాల, హనుమకొండ,
సొసైటీ ఫర్ ఛేంజ్ ఇన్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపక సభ్యులు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.