
ఫిబ్రవరి 13వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ వాషింగ్టన్ నగరంలోని వైట్‌హౌస్‌కు ఒక సహచరుడిని కలుసుకొనే మాదిరి జరిపిన వ్యక్తిగత పర్యటన అమెరికాతో అంటకాగేందుకు భారత్ ఆత్రయపడుతోందనే సందేశాన్ని పంపింది.బ్రిటీష్ వలస పాలన నుంచి విముక్తి తరువాత 75 సంవత్సరాలకు పైగా ఒక విధంగా యుక్తిగా భారత్ ఇటువంటి చర్యలకు దూరంగా ఉంది.
అంతర్జాతీయ రాజకీయాల్లో దౌత్య సంబంధాలలో తనకంటూ ఒక స్థానం ఏర్పాటు చేసుకోవాలన్న తపన ఫలితమే ఈ పర్యటన. ఇది హిందూ జాతీయ ప్రభుత్వం జాగ్రత్తగా ప్రియముగా భావించుకుంటున్న కల. రాజకీయ భూగోళంలో అమెరికాతో జత కట్టేందుకు సిద్ధమవుతున్న దేశంలోని ఎక్కువ మంది అధికార, ప్రతిపక్ష కులీనులు అన్యాపదేశంగా అయినా సరే ఈ చర్యలను సమర్ధిస్తున్నారు.
అఫ్కోర్స్,దానికి మరోకోణం ఉంటుంది, సూర్యుడికి ఎంత దగ్గరగా వస్తే అంతగా దానితో ప్రమాదాలు కూడా ఉంటాయి. అతిగా గర్వించటం, విజ్ఞుల మాటలను విస్మరించటం తగదన్న పురాతన గ్రీకు నీతిని విస్మరించ కూడదు.
ట్రంప్ యంత్రాంగాన్ని చూస్తే ఎలాంటి శషభిషలు లేని వలసవాద వైఖరితో కూడిన మతపరమైన ప్రేమాతిశయ ముద్ర కనిపిస్తుంది. నైతికంగా, రాజకీయంగా, భౌగోళిక రాజకీయ పరంగా చూసినప్పటికీ అంతర్జాతీయ రంగంలో ప్రస్తుతం భారతదేశం ఉన్న పరిస్థితుల్లో ఇది ఏమంత ఆహ్వానించదగిన చర్య కాదు.
అంతర్జాతీయ పరిస్థితి గురించి భారతీయ కులీనులలో వాస్తవిక అంచనా కొరవడుతున్నది. చైనాతో సమంగా ఒక అగ్రశక్తిగా మారేందుకు భారత్‌కు అమెరికా సహాయపడుతుందనే భ్రమ భరితమైన ఆలోచనే పూర్తిగా దీనికి దోహదం చేసింది.
ఆ విధంగానే చైనా బెల్ట్ మరియు రోడ్ పథకానికి పోటీగా నిర్జీవంగా పడి ఉన్న భారత – మధ్య ప్రాచ్య ఆర్థిక కారిడార్ (ఐఎంఇసి) పునరుద్దరణ గురించి ట్రంప్‌తో మాట్లాడేందుకు మోడీకి ఒక ప్రస్తావనాంశంగా మారి ఉండవచ్చు. అయితే గాజా నుండి నిరాశ్రయులైన పాలస్తీనియన్లకు పునరావాసం కల్పిందుకు సౌదీ అరేబియా అనువైన ప్రాంతంగా ఉంటుందని ఇజ్రాయెలీ ప్రధాని నెతన్యాహు ప్రేలాపన చేశాడు. ఐఎంఇసికి నిధులు సమకూర్చాల్సిన రియాద్‌కు అది తీవ్ర ఆగ్రహం కలిగించింది.
గాజాలో పాలస్తీనియన్లందరినీ అంతం చేయాలన్న అమెరికా`ఇజ్రాయెల్ పథకాల గురించిగానీ, గాజా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని దాన్ని మధ్య ప్రాచ్య విహార కేంద్రంగా మారుస్తానన్న ట్రంప్ అనాగరిక ఆలోచన గురించి గానీ భారత్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది ఏకధృవ దురవస్థ, బుద్ధిహీనత. మిగతా ప్రపంచమంతటి నుంచి విమర్శలకు, మధ్య ప్రాచ్యంలో శాంతిని కాపాడాలన్న అబ్రహాం ఒప్పందాలపై మద్దతుకు తావిచ్చింది.
ఉక్రెయిన్‌లో నాటో ఓటమి తరువాత తన ఐరోపా అనుంగుదేశాలతో మట్టూ మర్యాద లేకుండా ట్రంప్ దూరం జరుగుతున్నాడు. వారి సంగతి వారే చూసుకోవాలంటున్నాడు. ఈ మార్గాన్ని అతగాడి నూతన రక్షణ మంత్రి పీటర్ హెగ్సేత్ గతవారం బ్రసెల్స్‌లో జరిగిన రక్షణ మంత్రుల తొలి సమావేశంలో ఆవిష్కరించాడు.
ఉమ్మడి భద్రత గురించి చెప్పిన నాటో కూటమి నిబంధనలలోని ఆర్టికల్ ఐదు గురించి అడగ్గా దాని బదులు స్థితిస్థాపకత సూత్రాన్ని చెప్పిన ఆర్టికల్ మూడును ముందుకు తెచ్చి మాట్లాడాడు. అదేమి చెప్పిందంటే ‘‘ ఈ(నాటో) ఒప్పందం మరింత సమర్ధవంతంగా తన లక్ష్యాలను సాధించాలంటే నిరంతరం మరియు సమర్దవంతమైన స్వయం సహాయక, పరస్పర సాయం పద్దతులతో భాగస్వామ్య పక్షాలు విడివిడిగా, సంయుక్తంగా ముందుకు పోవాలి. సాయుధ దాడిని ఎదుర్కోవాలంటే తమ స్వంత మరియు ఉమ్మడి సామర్ధ్యాన్ని కొనసాగించుకోవాల్సి ఉంది.’’.
కొద్ది రోజుల తరువాత ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ మ్యూనిచ్ భద్రతా సమావేశంలో తేటతెల్లంగా మాట్లాడుతూ విపరీత ఆశ్చర్యానికి గురిచేశాడు. అట్లాంటిక్ దేశాల కూటమి కుప్పకూలిన విషయాన్ని అరమరికలు లేకుండా చర్చకు పెట్టాడు. ఐరోపా- అమెరికా మధ్య మిలిటరీ భారాన్ని పంచుకోవటం గురించో, లేక రష్యా నుంచి ఉందని భావిస్తున్న ముప్పు గురించో కాదని, మౌలికంగా ఐరోపా సమాజం, రాజకీయ ఆర్ధిక వ్యవస్థల గురించిన వివాదమే నని స్పష్టం చేశాడు.
ఐరోపాకు పెను ముప్పు రష్యా లేదా చైనా నుంచికాదనీ ఆయా దేశాలు అంతర్గతంగా నే ముప్పు ను ఎదుర్కొంటున్నామని ఖరాఖండిగా చెప్పేశాడు. మహత్తర యూరప్ దేశాలు దారి తప్పి గందరగోళంలో ఉన్నాయని చెప్తూ నాటో మనుగడ కొన సాగించాల్సిన నైతిక అవసరం లేదని చెప్పడం తప్ప దాదాపు ఆ అర్థం వచ్చేవన్నీ చెప్పేశాడు.
అమెరికా తీసుకుంటున్న ఈ వైఖరి తో నిజంగానే ఉక్రెయిన్‌కు వచ్చి పడే చిక్కులు అపారం. మ్యూనిచ్ సమావేశం తరువాత వ్లదిమిర్ జెలెనెస్కీ ‘‘ అమెరికా ఉపాధ్యక్షుడు స్పష్టం చేశాడు. దశాబ్దాల తరబడి కొనసాగిన అమెరికా – ఐరోపా బంధం ముగుస్తున్నది. ఇప్పటి నుంచి పరిణామాలు భిన్నంగా ఉంటాయి. ఆ మేరకు ఐరోపా సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.’’ అన్నాడు.
చరిత్ర ఇలా మన కళ్ళ ముందే ఆవిష్కరించబడుతున్నపుడు, సొంత దీర్ఘ కాల మిత్రుల పట్ల అమెరికా తీసుకుంటున్న వైఖరి, దాని పర్యవసానాలు కళ్ళముందే కనపడుతుంటే భారతీయ కులలీన వర్గం వీటిని చూడటానికి ఎందుకు నిరాకరిస్తుంది ? భారతీయ కులీనులు గ్రీకు పురాణాల్లో మాదిరి కమల పుష్పాలు తిని మత్తులో పడినట్లుగా, దూరదృష్టిలేని వారిగా ఎందుకు వ్యవహరిస్తున్నట్లు ? ఈ రోగం అధికార, ప్రతిపక్ష పార్టీల కులీనుల్లో కూడా ప్రబలింది.
రాజకీయ భూగోళ వాస్తవికత గురించి కులీనులు ఏమరుపాటుతో ఉన్నారు. అదేమిటంటే అమెరికా చైనాల మధ్య వివాదాలు పరిష్కారం చేసుకోవడానికి యుద్ధం ఒక్కటే మార్గం కాదు. మౌలికంగా అమెరికా యుద్దాలు చేసి తన వనరులను పోగొట్టుకోకూడదనే తీవ్రమైన జాగరూకతతో ట్రంప్ ఉన్నాడు. కనుక మోడీ లేదా నెతన్యాహు వంటి నేతలకు బూటక వాగ్దానాలు చేయలేదు.
నిజానికి మోడీతో సంయుక్త పత్రికా గోష్టిలో భారత్ – చైనా మధ్య శాంతి నెలకానాలని ట్రంప్ బహిరంగంగానే చెప్పాడు, సాయం చేస్తానని కూడా ముందుకు వచ్చాడు. హిమాలయాల్లో చైనాకు వ్యతిరేకంగా మొరటుగా వ్యవహరించాలని అమెరికన్లు ప్రోత్సహించే రోజులు గతించాయి. ఆస్ట్రేలియా,భారత్, జపాన్, అమెరికాలతో కూడిన చతుర్భుజి గురించి ట్రంప్ ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపే ఇంజనుగా చైనా పాత్ర ట్రంప్ మెదడు మీద నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉంటుంది. 2024 ముగిసేనాటికి చైనా అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం లో అమెరికా ఒక లక్ష కోట్ల డాలర్ల వాణిజ్య లోటుతో ఉన్నది
. చైనా అంతే మొత్తం వాణిజ్య మిగులు సాధించింది. చైనా కృత్రిమ మేథ డీప్‌సీక్‌తో సాంకేతిక అభివృద్ధి లో కూడా చైనా పై చేయి సాధించిందని ట్రంప్ బహిరంగంగానే అంగీకరించాడు.
అంతిమంగా మోడీ గట్టి బేరగాడు అని ప్రశంసించిన ట్రంప్ అదేసమయంలో పరస్పర వాణిజ్య సుంకాలు అనే కత్తిని మోడీ మెడపై వేలాడ దీస్తూ భారత ప్రధాని మోడీని త్రిశంఖు స్వర్గంలో తల్ల కిందులుగా వెళ్లాడదేశాడు. అదనంగా ఏడాదికి పది బిలియన్ డాలర్ల మేర ఇంథన అమ్మకాలకు మోడీని ఒప్పించాడు. ఏటా 15 నుంచి 25 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులకు రంగం సిద్ధం చేశాడు.
అమెరికాకు అగ్రతాంబూలం భావనలో భాగంగా పితుక్కొనేందుకు మోడీ ప్రభుత్వాన్ని ట్రంప్ ఒక పాడి ఆవుగా చూస్తున్నాడు. అమెరికా విక్రేతల నుంచి ఎఫ్ 35 స్టెల్త్ ఫైటర్స్‌తో సహా అయుధాలను కొనుగోలు చేయించేందుకు మృదువుగా ఒప్పించేందుకు కృషి చేశాడు. గత ఫిబ్రవరిలో అమెరికా ప్రభుత్వ జవాబుదారీ కార్యాలయం రూపొందించిన ఒక నివేదికలో పేర్కొన్నదాని ప్రకారం అరవైఆరు సంవత్సరాల జీవితకాలం ఉండే ఎఫ్`35ల కొనుగోలు, మరమ్మతులు, వినియోగానికి గాను భారత దేశం కనీసం 1.7లక్షల కోట్ల డాలర్ల మేర భారాన్ని మోయాల్సిన స్థితి కి నెట్టింది మోడీ సర్కార్. ఎందుకంటే ఇతర దేశాల యుద్ధ విమానాల కంటే ఈ యుద్ద విమానాల మరమ్మతులకు భాగా ఖరీదైన విడి భాగాలు కావాలి. అవి మళ్ళీ అమెరికాయే సరఫరా చెయ్యాలి. రాజకీయ భూగోళం అవగాహన తో చూడాలంటే ఇలాంటి భావి వినియోగపు ఆయుధాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోవడం అంటే భారత దేశాన్ని మిత్రూరాలిగా అమెరికా తన పెరట్లో కట్టేసుకోవడమే.
అలాంటి భారతీయ దుర్బలత్వానికి మూలం ఎక్కడ ఉందో ఎవరైనా ఊహించుకోవచ్చు. రాజకీయ భూగోళం లో క్రియాశీల పరిణామాలు జరుగుతూ ఉన్నపుడు ఈ పరిణామాల్లో అంతిమంగా ఎవరు ఎక్కడ ఏయే విషయాల్లో ఎలాంటి వైఖరి తీసుకుంటారో ఇంకా స్పష్టం కానప్పుడు మోడీ గారు హడావుడిగా అమెరికా వెళ్లి నీవెంటే నేనుంటా, నే చిలుకనై నీ పలుకులు వల్లిస్త అంటూ కూనిరాగాలు తీసుకుంటూ ట్రంప్ విదేశాంగ విధానంలో ఒక పావుగా మారేందుకు తహ తహ లాడటంతో ఢిల్లీ లో ఉన్న దౌత్యనీతి నిపుణులు తలలు పెట్టుకోవాల్సిన వచ్చింది.
భారత అవసరాలకు తగినట్టి, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి మరియు స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పదిల పరుచుకొనేందుకు కాలపరీక్షకు తట్టుకొని నిలిచిన రష్యాతో ఉన్న సంబంధం అందుబాటులో ఉంది. అంతేకాదు ట్రంప్ యంత్రాంగం కూడా దానితో(రష్యా) కలసి పని చేయాలన్న సంసిద్ధతను వ్యక్తం చేస్తోంది. పని చేయాలని వాంఛిస్తున్నది.
కానీ ట్రంప్‌తో కలసి జరిపిన ఉమ్మడి పత్రికా గోష్టిలో ఉక్రెయిన్ పోరు మీద అమెరికా వైఖరితో భారత్ ను మేళవించుకొనేందుకు మోడీ ప్రాధాన్యత ఇచ్చారు. మాస్కోతో దూరంగా కీవ్ మరియు మాస్కోలతో సమానదూరంగా ఉన్నట్లు గట్టిగా చెప్పారు. ఇతరుల కోసం తామెందుకు బలికావాలంటున్న అమెరికా ప్రయోజనాల కోసం తక్షణమే కాల్పుల విరమణ జరగాలన్న ట్రంప్ జపాన్ని ప్రతిధ్వనించేవరకు వెళ్లారు.
రష్యా షరతుల మీద శాంతి పరిష్కారం సుముఖమైనదిగా కనిపిస్తున్న తరుణం, దానికి ట్రంప్ కూడా స్వయంగా ఆంగీకరించవచ్చని భావిస్తుండగా అలాంటి ఆతురతను ప్రదర్శించాల్సిన అగత్యం ఏమిటి? ప్రపంచ అధికార వ్యవస్థలో బహుధృవ సంబంధాలు బలోపేతం అయ్యే సూచనలు కనిపిస్తుండటం తో చివరికి ట్రంప్ యంత్రాంగం కూడా దానితో సర్దుబాటు చేసుకొనేందుకు సిద్దం అవుతున్నది. పనికిరానిదిగా మారిన ప్రచ్చన్న యుద్ధ కాలం నాటి కూటమి భావనను వదులుకొనేట్లు కనిపిస్తున్నది. ఇలాంటి తరుణంలో ఏకధృవ సంకట స్థితికి భారతీయ కులీనులు లోనయ్యే అధోగతి వచ్చింది, ఇది నిజంగా స్వవచన వ్యాఘ్యాతం !
గమనిక : రచయిత ఎంకె భద్రకుమార్ విశ్రాంత దౌత్యవేత్త. రష్యా, దక్షిణ కొరియా, శ్రీలంక, పశ్చిమ జర్మనీ, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లలో పని చేశారు. టర్కీ రాయబారిగా పనిచేస్తూ ఉద్యోగవిరమణ పొందారు.
అనువాదం : ఎం కోటేశ్వరరావు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.