
ఇప్పటివరకూ దేశంలో సమ్మె అంటే ఒక ఘోరమైన నేరంగా భావిస్తున్నారు. కేంద్ర కార్మిక శాఖ నివేదికలు, పరిశ్రమల శాఖ వార్షిక నివేదికలు అన్నీ. సమ్మేల కారణంగా మూతపడ్డ పరిశ్రమలు అంటూ ఒక అధ్యాయాన్ని రాస్తూ వచ్చేవి. ప్రత్యేకించి ప్రపంచ బ్యాంక్ ద్వారా స్మగుల్ చేయబడ్డ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నివేదికల్లోనూ, అంతర్జాతీయ పెట్టుబడులకు ఏయే దేశాలు అనువైనవో గుర్తించేందుకు సాగే అధ్య్యనల్లోనూ కార్మిక సంఘాలు, కలెక్టివ్ బార్హైనింగ్, గుర్తించబడ్డ కార్మిక సంఘాల సంఘటిత శక్తి కీలకమైన పరిశీనాంశాలుగా ఉండేవి. ఉన్నాయి. ఈ అవగాహన సరైనది కాదు అని నిరూపించే దిశగా జరుగుతున్న సమ్మె ఈ రోజు ఎలైసి ఉద్యోగులు చేస్తున్న సమ్మె.
ఒక కార్మిక సంఘం తమ సంస్థలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని దేశవ్యాప్తంగా సమ్మెకు దిగడం చాలా అరుదైన ఘటన. సంస్థ భవిష్యత్తు పట్ల ఎంతో అవగాహనా, అంచనా ఉంటే తప్ప ఇలాంటి పిలుపు నివ్వడం సాధారణంగా జరగదు. అంతే కాకుండా, జీత భత్యాలను కోల్పోతూ సంస్థ గురించి, దాని భవిష్యత్తు అవసరాల గురించి ఆలోచించడమంటే ఎంతో లోతైన సైద్ధాంతిక నిబద్ధత, సంస్థ పట్ల అకుంఠిత అంకితభావం ఉంటే తప్ప సాధ్యం కాదు.
ఈరోజు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ‘ఒక గంట’ సమ్మె జరుగనున్నది. ఎల్ఐసి ఆఫ్ ఇండియా లో బేస్ క్యాడర్స్ అయిన క్లాస్ త్రీ మరియు క్లాస్ ఫోర్ ఉద్యోగాల భర్తీ వెంటనే చేపట్టాలని ఈ సమ్మె జరుగనున్నది.
సంస్థల్లో నియామకాలు చేపట్టడం కోసం ఒక కార్మిక సంఘం సమ్మెకు పిలుపునివ్వడాన్ని దేశంలో ని సోదర కార్మిక సంఘాలన్ని హర్షిస్తున్నాయి. సంస్థ పట్ల ఇలాంటి నిబద్ధత అందరికీ ఉండాలని కోరుకుంటున్నాయి. దేశభక్తి ప్రాధాన్యత కలిగిన ఈ సమ్మె లో పాలుపంచుకోవడానికి ఉద్యోగులంతా సిద్ధమయ్యారు. సంస్థ భవిష్యత్తు అవసరాలకోసం యువరక్తాన్ని సాధించే క్రమంలో చిన్న చిన్న త్యాగాలకు వెనుకాడకుండా దేశవ్యాప్తంగా సమ్మె సైరన్ మ్రోగింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ప్రారంభమైన నేపథ్యంలో, బీమా చట్ట సవరణల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఇదే సందర్భంలో మరియు ఇన్సూరెన్స్ రంగంలో 100% ఎఫ్‌డీఐలను అనుమతించాలనుకున్న కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయ కాలంలో ఈ సమ్మె ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నది.
కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు, ఐఆర్డీఏఐ నేల విడిచి చేస్తున్న సంస్కరణల సాము పరంపరలో ఎల్ఐసి మేనేజ్మెంట్ సంస్థ భవిష్యత్తుకు కావాల్సిన యంత్రాంగాన్ని సమకూర్చడంలో సోయిదప్పి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. అంతే కాకుండా క్లాస్ త్రీ మరియు క్లాస్ ఫోర్ ఉద్యోగాల నియామకాల పట్ల పూర్తిగా అలక్ష్యం ప్రదర్శిస్తున్నది.
ఈ నేపథ్యంలో బాధ్యత కలిగిన మరియు ప్రభుత్వ రంగ పరిరక్షణే ప్రధాన సిద్ధాంతంగా ఏర్పడిన కార్మిక సంఘం, ఏఐఐఈఏ, ఉద్యోగాల నియామకాల ప్రక్రియను సాధించే పోరాటాన్ని తన భుజాన వేసుకుంది. దానికి చట్టబద్ధమైన మార్గం సమ్మెనే అని నమ్మి ఉద్యోగులను పురమాయించింది. కోల్పోయేది కాస్తంత వేతనమే కావచ్చు కానీ తమను తాము ఉద్దండులుగా భావిస్తున్న వారి కళ్లు తెరిపించడానికి ఇది ఎంతో దోహద పడగలదు.
ఏ సంస్థకైనా శిక్షితులైన సిబ్బంది ప్రధాన భూమిక పోషిస్తారు. అందుచేతనే, లాభాపేక్ష లేని మరియు జీత భత్యాల ఆధారంగా మాత్రమే పని చేయగలిగే పర్మనెంట్ ఉద్యోగుల ద్వారా సంస్థలను నిర్వహించాలని ఏనాడో భారత పార్లమెంట్ నిర్ణయించింది. కానీ బాధ్యతలను పూర్తిగా విస్మరించే ప్రపంచీకరణ సరళీకరణ పరిణామాల అనంతర కారణాల వల్ల అవుట్సోర్సింగ్ పెరిగిపోతోంది. దాని ద్వారా నాణ్యత మరియు అకౌంటబిలిటీ కూడా సన్నగిల్లుతున్నాయి. ఇన్సూరెన్స్ ఒక దీర్ఘకాలిక కాంట్రాక్ట్. అంతే కాకుండా, కాంట్రాక్ట్ (ఒప్పందం) కుదుర్చుకున్న వ్యక్తి కన్నా వారి వారసులకు నమ్మకంతో బదులివ్వాల్సిన జవాబుదారీతనం వుండవలసిన వ్యవస్థ. ఇలాంటి చోట పర్మనెంట్ మరియు సరైన విద్యార్హతలు కలిగిన ఉద్యోగులను క్రమం తప్పకుండా నియమిస్తూ ఉండడం వల్ల సంస్థ దినదినాభివృద్ధి సాధించగలుగుతుంది.
ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగాల కొనసాగింపుకు, పర్మనెంట్ ఉద్యోగ నియామకాలకు మరియు ఉమ్మడి బేరసారాలకు పూర్తిగా విరుద్ధమైన ఆలోచనలతో సాగుతున్నది. ఇది చాలా ప్రమాదకరం.
అందుచేత ఈ రోజు జరిగే ఒక గంట సమ్మె డిమాండ్ల లో ఉమ్మడి బేరసారాల హక్కు కల్పించడానికి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్‌కు గుర్తింపు ఇవ్వాలని కూడా ఉన్నది. ‘ఒక కార్మిక సంఘానికి గుర్తింపు’ అంటే అది ఆ సంస్థలోని ఉద్యోగులందరికీ తమ వాదనను వినిపించుకో గల వేదిక అన్న మాట. ఏ సంఘానికి లేదా ఎవరికి గుర్తింపు ఉన్నదన్నది ముఖ్యం కాదు. అలాంటి ప్రక్రియ ఒకటంటూ సంస్థలో ఉంటే అది అందరికి మేలు కలుగగల అవకాశం. ఉద్యోగులకు యాజమాన్యానికి అనుసంధానకర్తగా వ్యవహరించే మెజారిటీ కార్మిక సంఘానికి గుర్తింపు ఉభయ తారకమే అవుతుంది. అంతే కాకుండా, ప్రభుత్వం గానీ లేదా మేనేజ్మెంట్ గాని ఏకపక్ష నిర్ణయాలకు పోకుండా ఉమ్మడి బేరసారాల ద్వారా బహుళ ప్రయోజనాలకై యత్నించడం తో పాటు ప్రజోపయోగకరంగా కూడా ఉంటుంది.
ఎల్.ఐ.సి సంస్థ కు ఎక్కువగా ఆర్థిక భారం పడని ‘బేస్ క్యాడర్స్’ ఎల్ఐసీ అసిస్టెంట్ మరియు ఎల్ఐసీ సబ్‌స్టాఫ్ ఉద్యోగాల నియామకాలు వెంటనే చేపట్టి, ఎల్ఐసిలోని మెజారిటీ సభ్యులకు నాయకత్వం వహిస్తున్న కార్మిక సంఘం, ఏఐఐఈఏ కు గుర్తింపునివ్వడం ద్వారా సంస్థ ప్రగతికై ఉద్యోగులను క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తూ పాలసీదారులకు మరింత సేవలందించి వాటాదారులకు లాభాలు చేకూర్చడమే కాకుండా ప్రభుత్వానికి కూడా కావాల్సిన నిధులను సమకూర్చే మార్గం నిరంతరాయంగా కొనసాగగలదు. ఈ విషయంలో ఇంకెంతమాత్రం తాత్సారం చేయకుండా ఎల్ఐసి మేనేజ్మెంట్ ఉద్యోగ నియామకాలను చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం సముచితం. ప్రభుత్వం కూడా తగిన విచక్షణతో సానుకూలంగా అనుమతిని ఇవ్వగలదని ఆశిద్దాం.
జి. తిరుపతయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.