
తొలిసారి ట్రంప్ అధికారానికి వచ్చినపుడు ఎన్నికైన సెనెటర్లు అమెరికా చరిత్రలోనే అత్యంత సంపన్నులుగా రికార్డు సృష్టించారు. ట్రంప్‌ను రెండోసారి అధికారానికి తెచ్చిన 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన వారు సైతం ఈ విషయంలో తమ రికార్డును తామే రద్దు చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రస్తుతం అమెరికా పార్లమెంట్ సభ్యుల ఉమ్మడి ఆస్తి విలువ 460 బిలియన్ డాలర్లు. వీరిలో 16 మంది శతకోటీశ్వరులు. అమెరికా సంపదలో కేవలం 1 శాతం జనాభా చేతుల్లో 31 శాతం సంపద కేంద్రీకృతమై ఉంది.
అమెరికా ప్రజాస్వామ్య దేశమే. కాకపోతే కేవలం జనాభాలో 0.0001 శాతం ఉన్న వారు మొత్తం అమెరికన్ పౌరుల జీవితాలను, దేశ ఆర్థిక వ్యవస్థనూ ప్రభావితం చేసే విధానాలను రూపొందిస్తున్నారు.
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఆ దేశంలోని అత్యంత సంపన్నకుటుంబాలు రెండు బిలియన్ డాలర్లు చందాలుగా ఇచ్చాయి. నయా కుబేరులు ఏకంగా ప్రభుత్వ పరిపాలనలోనే భాగస్వాములు అయితే అటువంటి వారి చేతుల్లో కేంద్రకృతమయ్యే రాజకీయాధికారికి ఉండే శక్తి అసామాన్యమైనది. ఉదాహరణకు ఎలన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన కుబేరుడు అని తెలిసిందే. గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ట్రంప్ తరఫున ప్రచారం చేయటంతో పాటు 250 మిలియన్ డాలర్లు రిపబ్లికన్ పార్టీకి చందాగా ఇచ్చారు. ట్రంప్ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు మస్క్ ఏకంగా పాలనా సామర్ధ్యపు విభాగాన్ని ఏర్పాటు చేయించుకుని మరీ దానికి అధినేతగా బాధ్యతలు చేపట్టారు.
ఆర్థికంగా అపరిమిత శక్తివంతులు రాజకీయ వ్యవహారాల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటే సంపద కేంద్రీకరణ, ప్రజాస్వామ్యం పరిణతిలపై ప్రతికూల ప్రభావం చూపుతారని పరిశోధనలు నిర్ధారించాయి.
ప్రజలపై ఎటువంటి ప్రభావం ఉంటుంది?
ఒక వ్యక్తి కేవలం సంపన్నుడు అయినంత మాత్రాన ప్రభుత్వంలో (పరిపాలన నిర్వహణలో) భాగస్వామి కాకూడదు అని వాదించలేము. ఇక్కడ సమస్యల్లా ఏమిటంటే పరస్పర విరుద్ధ ప్రయోజనాలు. యావత్ దేశ జనాభా ప్రయోజనాలకు అవసరమైన విధానాలు, చట్టాలు రూపొందించేవారు ప్రజలకన్నా మితిమీరిన సంపన్నవంతులైతే అటువంటి చట్టాలు రూపొందించటానికి, ప్రజాహిత చర్యలు చేపట్టడానికి స్వతహాగానే విముఖతతో ఉంటారు. ఉదాహరణకు ప్రపంచంలో పెరిగిపోతున్న ఆర్థిక అంతరాలు తగ్గించాలంటే సంపద పన్ను, వారసత్వ పన్ను విధించాలని ఐక్యరాజ్యసమితి మొదలు అంతర్జాతీయ మేథో సంస్థలన్నీ ప్రతిపాదిస్తున్నాయి. కానీ నయానో భయానో అధికారానికి ఎగబాకి దేశ ప్రజల తలరాతలు మార్చే బాధ్యతల్లో (అధికారంలో) ఉన్న మస్క్ లాంటి వ్యక్తులు ఇటువంటి చట్టాలను అంగీకరించరు కదా. దీన్నే పరస్పర విరుద్ధ ప్రయోజనాలు అంటారు. (కాన్ల్ఫిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్).
వాణిజ్య నైతికతలు, తమ వ్యాపారాలు, ప్రభుత్వ వ్యవహారాల మధ్య ఉన్న సంబంధాన్ని బహిరంగపర్చాలన్న చట్టాలు మిగిలిన దేశాల్లో కంటే అమెరికాలోనే ఎక్కువగా ఉన్నాయి.
ట్రంప్ ప్రభుత్వంలో వాణిజ్య మంత్రి (అమెరికా పరిపాలనా భాషలో కార్యదర్శి అంటే మనం ఇక్కడ సదరు శాఖా మంత్రిగా అర్థం చేసుకోవచ్చు) ద్రవ్య సేవలందించే ఓ ప్రైవేటు కంపెనీ యజమాని. నాసా సంస్థ బాధ్యతల్లోకి వచ్చిన వ్యక్తి ప్రైవేటు రంగంలో అంతరిక్ష పరిశోధనలు చేపట్టి రోదసీ యాత్రలు నిర్వహిస్తున్న వ్యక్తి. శ్వేత సౌధంలో కృత్రిమ మేథ, క్రిప్టో కరెన్సీ విభాగాల పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టిన వ్యక్తి పేపాల అనే ఆన్లైన్ చెల్లింపుల సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగిగా పని చేశారు.
మార్కెట్ ప్రయోజనలకూ, ప్రజా ప్రయోజనాలకూ మధ్య మౌలికమైన వైమనస్యం (వైరుధ్యం) ఉంది. ఓ పరిశోధకుడు ప్రశ్నించినట్లు ‘రోజుకు 14 మిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించే వ్యక్తికి లక్షలాదిమంది అమెరికా పౌరులకు అందే 197,600 డాలర్ల సామాజిక భృతి విలువ అర్థమవుంతా?’
ప్రస్తుతం అమెరికా వార్షిక బడ్జెట్ 6.75 ట్రిలియన్ డాలర్లు. ఇందులో రెండు ట్రిలియన్ డాలర్ల మేర కోత విధిస్తామని మస్క్ ప్రకటిస్తున్నారు. పరిపాలనా సామర్ధ్యాన్ని పెంచేందుకు ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఆయన్ను దీనికి బాధ్యుడిగా నియమించిన విషయాన్ని ముందే చెప్పుకున్నాము. అంటే ఇటువంటి వారి దృష్టిలో పరిపాలన సామర్ధ్యం అంటే ప్రజలకు మెరుగైన సేవలందించటం కాదు. పౌరసేవలను నిలిపివేయటం అన్నమాట. కానీ మస్క్ ఏమంటున్నారు? బడ్జెట్ కోతల వలన స్వల్పకాలంలో కొంతమందికి అసౌకర్యం కలగవచ్చు అంటున్నారు. మొత్తం దేశంలో అయ్యే ఖర్చులో మూడో వంతు ఖర్చు కోత కోయటం స్వల్పకాలిక అసౌకర్యమా? ఆ బడ్జెట్ వనరుల ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందేవారికి ఆ ప్రయోజనం దక్కకపోవటం వలన కలిగే బాధ వర్ణణాతీతం.
అమెరికా ప్రభుత్వంలో వివిధ విభాగాలు ఎలన్ మస్క్‌కు దాదాపు వంద కాంట్రాక్టులు ఇచ్చాయి. వీటిపై 11 నిఘా విభాగాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఆయా దర్యాప్తు విభాగాల్లో అధికారులపై ట్రంప్ ప్రభుత్వం వేసిన వేటు కారణంగా అమెరికా ప్రభుత్వానికీ, మస్క్‌కు మధ్య జరిగిన 30 వివాదాస్పద ఒప్పందాలపై జరుగుతున్న దర్యాప్తులు నిలిచిపోతాయి.
పన్నులు, ఆర్థిక నియంత్రణలు, సామాజిక సంక్షేమ చర్యలు వంటి అనేక అంశాల విషయంలో అమెరికాలోని ఒక శాతం సంపన్నుల అభిప్రాయాలకూ, సాధారణ ప్రజల అభిప్రాయాలకూ మధ్య పొసగని తేడాలున్నాయని పరిశోధకులు గుర్తు చేస్తున్నారు. 85 శాతం సాధారణ ప్రజలు ప్రభుత్వమే ప్రాథమిక విద్యాభ్యాస భారాన్ని మోయాలని కోరుకుంటుంటే సంపన్నులైన ఒక్క శాతం జనాభా మాత్రం అటువంటిదేమీ అవసరం లేదనీ, ఎవరి కాళ్ల మీద వాళ్లే నిలబడాలనీ వాదిస్తున్నారు.
ప్రజోయోగ విధానాల రూపకల్పన బాధ్యతలు సంపన్నుల చేతిలో బంధీ అయినప్పుడు కలిగే ఫలితాలు అత్యంతదారుణంగా ఉంటాయి. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ‘డ్రిల్, బేబీ, డ్రిల్’ అని నినాదమిచ్చారు. అంటే ప్రకృతినరులు ప్రత్యేకించి ఇంధనవనరులకు అనుకూలంగా ఉండే విధానాలే తన విధానాలు అని చెప్పటానికి ఆయన ప్రచార వ్యూహకర్తలు రూపొందించిన నినాదమన్నమాట. ఆ నినాదానికి అనుగుణంగానే పారిస్ పర్యావరణ ఒప్పందం నుండి అమెరికా వైదొలగింది. ట్రంప్ తన మొదటి దఫా అధికారంలో ఉన్నప్పుడు ఆమోదించిన టాక్స్ కట్, జాబ్ చట్టం ద్వారా అమెరికాలోని అత్యంత సంపన్నులకు 85 శాతం పన్ను రాయితీలు దక్కాయి. ఈ చర్యల వలన ప్రభుత్వ లోటు పెరగటమే కాక వివిధ జాతులకు చెందిన వారి మధ్య వార్షికాదాయ అంతరాలు ఘోరంగా పెరిగిపోయాయి. సరసమైన ధరలకే వైద్య సదుపాయం చట్టాన్ని సవరించటంతో ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతల్లో ఉన్న కాలంలో వైద్య ఆరోగ్య సేవలు దారుణంగా పెరిగిపోయాయి.
అంతులేని స్థాయిల్లో శక్తులను సమకూర్చుకున్న మార్కెట్లకు అడ్డుఅదుపూ లేని అవకాశాలు కల్పించేందుకు వీలుగా తెరమీదకు వచ్చిన నయా ఉదారవాద విధానాల (రీగకానమిక్స్) వ్యక్తీకరణకు పరాకాష్ట రూపమే ట్రంప్ అని చెప్పవచ్చు. నయా ఉదారవాద విధానాల ఫలితాలు కూడా మన కళ్లముందున్నాయి.
అయితే, సంక్లిష్టతల గురించి పరిశోధనలు చేసే శాస్త్రవేత్త పీటర్ టర్చిన్ చెప్పినట్లు, 1983 నాటికి 10 మిలియన్ల కంటే ఎక్కువ ఆస్తులున్న కుటుంబాలు 66వేలు మాత్రమే. 2019 నాటికి ఇటువంటి కుటుంబాల సంఖ్య 6,93,000. అంటే పదిరెట్లు పెరిగాయి. అంటే నయా ఉదారవాద విధానాల కాలంలో సంపన్నుల తయారీ రేటు అనూహ్యంగా పెరిగింది. (ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ). దాంతో పాటు ఈ కాలంలోనే సంపన్నుల రాజకీయాల్లోకి ప్రవేశించటం వేగవంతమైంది.
ఎకనమిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ అధ్యయనం ప్రకారం 1945 నుండీ 1973 వరకూ దేశ ఆర్థికాభివృద్ధి రేటుతో సమానంగా కార్మికుల వేతనాలు పెరుగుతూ వచ్చాయి. కానీ 1973 తర్వాత పరిస్థితులు మారిపోయాయి. 1974 నుండి 2013 మధ్యకాలంలో ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదకత 74 శాతం పెరిగితే కార్మికుల వేతనాలు మాత్రం తొమ్మిది శాతమే పెరిగాయి. ఆ కాలంలో మధ్యతరగతి వేతనాలు స్తబ్దతకు లోనయ్యాయి. దిగువ తరగతి కార్మికుల వేతనాలు ఐదు శాతం పడిపోయాయి. ఉన్నత ఆదాయ వర్గాల వేతనాలు 41 శాతం పెరిగాయి. 1965 నాటికి అమెరికాలో శక్తివంతమైన 350 కంపెనీల ప్రధాన కార్యనిర్వహణాధికారుల వేతనాలు సాధారణ కార్మికుల వేతనాలకంటే 20 రెట్లు పెరిగాయి. 2000 తర్వాతి కాలంలో ఈ ఉన్నతోద్యోగుల వేతనాల్లో పెరుగుదల సాధారణ కార్మికుల వేతనాల పెరుగదల రేటు కంటే 384 రెట్లు పెరిగింది. అమెరికాలో సగటు నిజవేతనం 2013 కంటే 1965లోనే ఎక్కువగా ఉంది.
రాజకీయ నిస్పాక్షిత సమస్య
అమెరికాలో దారిద్య్రంలోకి కూరుకుపోతున్న కార్మికులు ఓ వైపునా, ఆకాశాన్నంటుతున్న సంపద శిఖరాలు మరోవైపునా పెరిగిపోతూ వచ్చాయి. ఈ విషయంలో రెండు పార్టీల మధ్యా, వారి విధానాల్లోనూ ఎటువంటి తేడా లేదు. 14మంది శత కోటీశ్వరులు ట్రంప్ కోసం చందాలిస్తే 21 మంది కమలా హారిస్‌కు చందాలిచ్చారు. తొలి ట్రంప్ క్యాబినెట్లో భాగస్వాముల ఉమ్మడి ఆస్తులు 6.2 ట్రిలియన్ డాలర్లు అయితే ఒబామా రెండో సారి అధికారానికి వచ్చిన తర్వాత ఒబామా కూర్చిన మంత్రిమండలిలోని సభ్యుల ఉమ్మడి ఆస్తుల విలువ 2.8 ట్రిలియన్ డాలర్లు. ట్రంప్ తొలి పాలనలో కార్పొరేట్ లాభాలు 2 ట్రిలియన్లు దాటితే ట్రంప్‌ను ఓడించి అధికారానికి వచ్చిన బైడెన్ పాలనా కాలంలో ఈ లాభాలు 3.7 ట్రిలియన్ డాలర్లకు చేరాయి. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే కార్మికుల్లో అత్యధికులు ట్రంప్‌కు ఓటు వేస్తే డిగ్రీ పట్టా పుచ్చుకున్న వారిలో అత్యధికులు కమలా హారిస్‌కు ఓటు వేశారు.
ఆర్థికంగా చితికిపోతున్న పేదలను ఓటు బ్యాంకుగా మార్చుకోవటమే ట్రంప్ ఎన్నికల వ్యూహంలో కలికితురాయి. ఈ చితికిపోతున్న పేదలకు, వారికుండే కోపాలను ఆసరా చేసుకుని జాతివ్యతిరేకత నూరిపోయటానికి, తలకెక్కించటానికి పాలకులు పెద్దగా కష్టపడక్కర్లేదు. ట్రంప్ కూడా అదే చేశాడు. దాంతో వీరంతా ఏదో ఆశతో ఫాసిస్టులు, నయా ఫాసిస్టుల ప్రభావానికి లోనుకావటం, అటువంటి శక్తులను నెత్తికెత్తుకుని ఊరేగించటం మరింత తేలికైంది. 1998లోనే తత్వవేత్త రిచర్డ్ రోట్రీ ‘‘… పట్టణేతర ఓటర్లు ఈ వ్యవస్థ విఫలమైందన్న నిర్ధారణకు వస్తారు. దాంతో ఏదో అరివీర భయంకరుడు వచ్చి తమను ఆదుకుంటాడని ఎదురు చూస్తారు. ఆ ప్రయత్నంలో గత నాలుగు దశాబ్దాలుగా నల్లజాతీయులు, ఆసియా వాసులు, ఏకలింగ సంపర్కులు సాధించుకున్న విజయాలన్నీ ఆవిరైపోతాయి.’’ అని హెచ్చరించారు.
చైనాలో ఇప్పటికే 31 శాతం మంది కుబేరులు పాలనా యంత్రాంగంలో భాగస్వాములు. రష్యాలో 21 శాతం. అమెరికాలో 3.5 శాతం రాజకీయ రంగంలో కీలక స్థానాలాక్రమించారు. అయినా రాజకీయం కుబేరుల క్రీడారంగం కావటం ప్రపంచంలోనే అతి ప్రాచీన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా మనుగడకు ముప్పు తేవడమే కాదు. ఈ ప్రమాదం పర్యవసానాలు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేయనున్నాయి.
నిస్సిం మన్నథుక్కెరెన్
(ఫ్రంట్‌లైన్ సౌజన్యంతో)
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.