
ప్రపంచ సోషలిస్టు ఉద్యమంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పత్రం కమ్యూనిస్టు ప్రణాళిక. 1847 డిశంబరు 1848 ఫిబ్రవరి మధ్య కమ్యూనిస్టు లీగ్ ఆదేశం మేరకు మార్క్స్, ఏంగెల్స్ దీన్ని రూపొందించారు. 1848 ఫిబ్రవరిలో అచ్చయ్యింది. ప్రస్తుత వ్యాఖ్య కమ్యూనిస్టు ప్రణాళిక శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న ఏడాది తర్వాత రాస్తున్నాము. ఆలస్యంగానైనా అందుబాటులోకి వస్తున్న ఈ వ్యాఖ్యను పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
కమ్యూనిస్టు ప్రణాళిక – చారిత్రక ప్రాధాన్యత
కమ్యూనిస్టు ప్రణాళికకున్న ప్రత్యేకత ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలంటే ప్రపంచ సోషలిజం చరిత్రలో ఈ గ్రంధం స్థానం ఏమిటో చూడగలగాలి.
గతంలో అనేకసార్లు మనం ఊహించుకున్న విధంగా ఆదిమ కాలంలోగానీ, మధ్యయుగాల్లో గానీ సోషలిజం అన్న భావనకు తావే లేదు. సాంఘిక సంస్కరణ ఉద్యమాలు, సిద్ధాంతాలు తెరమీదకు వచ్చాయి. అందులో కొన్ని తీవ్రవాద స్వభావాన్ని కలిగి ఉన్నవి కూడా ఉన్నాయి. ఈ సిద్ధాంతాలు మౌలికంగా అత్యున్నత స్థాయి సమానత్వాన్ని ప్రబోధించాయి. మరికొన్ని సిద్ధాంతాలు వినిమయ వస్తువుల వ్యవస్థను ప్రతిపాదించాయి. కానీ ఏ సిద్ధాంతమూ ఉత్పత్తి సాధనాలను సమాజపరం చేసే ఆధునిక సోషలిస్టు సమాజ భావనను ప్రతిపాదించలేదు. అయితే ఇదేమీ అంత ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. ఈ దశలో ఉత్పత్తి, యాజమాన్యం చెల్లాచెదరుగా పడి ఉన్న ఉత్పత్తి కేంద్రాల్లో (వర్క్‌షాపుల్లో) అత్యంత ప్రాధమిక రూపంలో, స్థాయిలో ఉండేవి. కాబట్టి అటువంటి ఆలోచన వచ్చే అవకాశమే లేదు.
పదహారో శతాబ్దం తొలి నాళ్లల్లో థామస్ మూర్ రచించిన ఉటోఫియా గ్రంధం నిజమైన సోషలిస్టు అవగాహనకు సైద్ధాంతిక వ్యక్తీకరణగా చెప్పుకోవచ్చు. మరోరకంగా చెప్పుకోవాలంటే మమనం చెప్పుకుంటున్న ఆధునిక సమాజం ఆవిర్భవిస్తున్న సంధికాలంలో అయితే ఉటోఫియా అన్నది ఓ వ్యక్తి సృజానాత్మకతకు పరాకాష్టే తప్ప ఓ సామాజిక ఉద్యమ వ్యక్తీకరణ కాదు. పదిహేడో శతాబ్ది మధ్యలో ఇంగ్లాండ్‌లో అంతర్యుద్ధం జరిగే సమయంలోనే సోషలిజం ఓ సామాజిక భావనగా రూపుదిద్దుకోవటం మొదలైంది. బహుశా ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లో ఉద్భవించిన అత్యుత్తన్నత సోషలిస్టు మేధావి గెరార్డ్ స్టాన్లీ అని చెప్పవచ్చు. ఆయన నాయకత్వంలో సాగిన డిగ్గర్ ఉద్యమం బహుశా ప్రపంచ చరిత్రలో తొలి సోషలిస్టు ఉద్యమం అయి ఉంటుంది. అయితే ఈ ఉద్యమం చాలా తక్కువ కాలం మాత్రమే మనుగడ సాగించగలిగింది. దాదాపు శతాబ్దంన్నర తర్వాత బేబూఫ్ నాయకత్వంలో సాగిన ఫ్రెంచి విప్లవం పరిస్థితి కూడా ఇలాంటిదే. ఈ మధ్య కాలంలో గణనీయమైన సంఖ్యలో రచయితలు సోషలిస్టు భావాలను ముందుకు తెచ్చారు.
అయితే 19వ శతాబ్దం నాటికి గానీ సోషలిజం ప్రామాణికమైన సామాజిక అంశంగా ముందుకు రాలేదు. ఈ సమయంలోనే పశ్చిమ యూరప్ దేశాల రాజకీయ జీవితంలో సోషలిస్టులు ఏదో ఒక మేర ప్రభావాన్ని చూపటం ప్రారంభించారు. ఆరంభ దినాల్లో ఊహాజనిత సోషలిస్టులు (ఓవెన్, ఫోరియర్, సైమన్), 1830`40 దశకాల్లో వెల్లివిరిసిన ఛార్టిస్టు ఉద్యమం నూతన ఫ్యాక్టరీ కార్మికులు సోషలిస్టు రాజకీయ పార్టీకి కావల్సిన శక్తివంతమైన పునాది కానున్నారని నిరూపించారు.
ఈ వివరాలు పరిశీలించినప్పుడు సోషలిజం ఆధనిక సామాజిక ధోరణి అనీ, పారిశ్రామిక విప్లవపు పురిటిబిడ్డ అనీ నిర్ద్వంద్వంగా ధృవీకరించవచ్చు. పారిశ్రామిక విప్లవం 17 శతాబ్దంలో ఇంగ్లాండ్‌ను ఓ కుదుపు కుదిపింది. పద్దెనిమిదో శతాబ్దం చివరి దశాబ్దాలు, 19వ శతాబ్దం తొలి దశాబ్దాల నాటికి పశ్చిమ యూరప్ దేశాలన్నింటిలోనూ సామాజిక ఆర్థిక వ్యవస్థలను సమూలంగా మార్చేసింది. 1840 దశకం నాటికి ఆశాజనకమైన సిద్ధాంతంగా అప్పటికే గణనీయంగా చర్చించబడిన సిద్దాంతంగా సోషలిజం ఉనికిలోకి వచ్చింది.
అప్పటికి ఓ భావనగా ఉనికిలోకి వచ్చిన సోషలిజానికి రంగు రుచి వాసన, రూపం లేవు. అద్భుతమైన అభిప్రాయాలు, భావనలు, ఆకర్షణీయమైన పథకాలు, కార్యక్రమాల సమాహారంగా అప్పటికి సోషలిజం ఉండేది. వీటన్నింటినీ వ్యవస్థీకృతం చేయాల్సిన అవసరం ముందుకొచ్చింది. అప్పటి వరకూ చలామణిలో ఉన్న భావనల్లో ఏది ఉపయుక్తమనదీ, ఏది కాదు అని అంచనా వేయాల్సిన అవసరం ఏర్పడిరది. ఉపయుక్తం కాని అంశాలను విడనాడి బూర్జువా తాత్విక చింతలో అత్యంత పురోగామి దృక్పధాన్ని సోషలిస్టు సిద్ధాంత నిర్మాణంలో ఇముడ్చుకోవాల్సిన సందర్భం వచ్చింది.
కమ్యూనిస్టు ప్రణాళికను ఎలా అంచనా వేయాలి?
తొలి వందేళ్లల్లో కమ్యూనిస్టు ప్రణాళిక ఎలాంటి ప్రభావాన్ని చూపింది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవటానికి మనం ప్రధానంగా తెలిసో తెలియకో మనకు కలిగిన అభిప్రాయాలపైనే ఆధారపడతాము.
తమను తాము మార్క్సిస్టులుగా పరిగణించుకునేవాళ్లల్లో కొందరు కమ్యూనిస్టు ప్రణాళికను పవిత్ర గ్రంధంగానో భావిస్తారు. బైబిల్లో అక్షరం అక్షరం పాటించే ఛాందస క్రైస్తవుల్లాగా ఈ గ్రంధాన్ని చూస్తారు. కమ్యూనిస్టు ప్రణాళిక విషయంలో కూడా ప్రతి అక్షరం ప్రతి ప్రతిపాదన రాసేనాటికి సత్యమైనదనీ, దాంట్లో ఒత్తులు పొల్లులు కూడా మార్చాల్చిస అవసరం లేదని వంద సంవత్సరాల ప్రపంచ ఉద్విగ్న చరిత్రను ఈ విధంగానే ప్రణాళిక వెలుగులో మదించాలని ప్రతిపాదిస్తారు. అర్థవంతంగా ఆలోచించేవారికెవరికైనా ఈ విధమైన ఛాంధసత్వం ఆమోదయోగ్యం, అనుసరణీయం కాదని చెప్పటానికి పెద్దగా కష్టపడాల్సిన అసవరం లేదు. వర్గ శతృవులు కూడా కమ్యూనిస్టులను విమర్శించటానికి ఇటువంటి ప్రమాణాలనే ముందుకు తెస్తారు.
నూటికి నూరు శాతం తిరుగులేనిదన్న ప్రమాణం ప్రకారం చూస్తే కమ్యూనిస్టు ప్రణాళికు కాలం చెల్లిందని పక్కన పడేయటానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చూసినప్పుడు మాత్రమే ఏ మేధో అల్పత్వం కలిగిన వారైనా సరే శాస్త్రీయ సోషలిజం పితామహులు తనకంటే గొప్ప మేధావులేమీ కాదని జబ్బలు చరుచుకోవటానికి అవకాశం ఉంటుంది. అటువంటి వ్యక్తులకు అమెరికా మేధో సమాజంలో నేడు కొరత లేదు. ఇటువంటి మేధావులు తమ విజయాల గురించి వేల సార్లు డప్పు కొట్టుకున్నా కమ్యూనిస్టు ప్రణాళిక శాస్త్రీయతకు, సమకాలీనతకు వచ్చిన ముప్పేమీ లేదు. కమ్యూనిస్టు ప్రణాళిక రచయితల కీర్తి ప్రతిష్టలకు వాటిల్లిన ముప్పేమీ లేదు.
కమ్యూనిస్టు ప్రణాళిక ప్రభావాన్ని మదించటానికి పాటించాల్సిన ప్రమాణాలను కూడా మార్క్స్ ఏంగెల్స్‌లే ప్రతిపాదించారు. ఈ కోణంలో చూసినప్పుడు వివిధ సంచికలకు మార్క్స్ ఏంగెల్స్‌లు రాసిన ముందుమాటలు కూడా కమ్యూనిస్టు ప్రణాళికంత విలువైనవి. ప్రాధాస్యత, ప్రాసంగికత కలిగినవే. (ప్రత్యేకించి 1872 జర్మన్ సంచికకు రాసిన ముందుమాట, 1882 రష్యన్ ప్రతికి రాసిన ముందుమాట, 1883 జర్మన్ ప్రతికి రాసిన ముందుమాట, 1888 ఆంగ్ల ప్రతికి రాసిన ముందుమాట ఈ కోవకు చెందినవి) ఈ ముందుమాటలను అధ్యయనం చేయటం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలేమిటన్నది ఈ క్రింది విధంగా సంక్షిప్తీకరించుకోవచ్చు :
- కొన్ని కొన్ని సందర్భాల్లో మార్క్స్ ఏంగెల్స్‌లే మారుతున్న పరిస్థితులకు కమ్యూనిస్టు ప్రణాళికలోని వివరణలకు మధ్య పొంతన లేదని భావించారు. ప్రత్యేకించి కార్యాచరణ, ప్రపంచ సాహిత్యాలకు సంబంధించిన అధ్యాయాలకు కాలం చెల్లిందని భావించారు.
- కమ్యూనిస్టు ప్రణాళికలో ప్రతిపాదించిన మౌలిక సూత్రాలు ‘స్థూలంగా సరైనవేననీ, నేటికీ వర్తించేవేనీ’ భావించారు (1872, 1888 ముందుమాటలు).
- పారిస్ కమ్యూన్ అనుభవంతో కమ్యూనిస్టు ప్రణాళికలో ఓ విలువైన అంశాన్ని మార్క్స్ ఏంగెల్స్‌లు జోడిరచారు. ఈ ప్రతిపాదిన మూల రచనలో లేదు. ‘‘ కార్మికవర్గం అప్పటికే అందుబాటులో ఉన్న రాజ్యాంగ యంత్రాన్ని యథాతథంగా స్వీకరించి తమ లక్ష్యాలు సాధించేందుకు వీలుగా ఉపయోగించుకోలేరు.’’అన్నదే మార్క్స్ ఏంగెల్స్‌లు జోడిరచిన సూత్రం. మరో విధంగా చెప్పుకోవాలంటే రెడీ మేడ్‌గా విప్లవ శక్తులకు అందుబాటులోకి వచ్చే రాజ్యాంగ యంత్రం సమకాలీన పాలక వర్గ ప్రయోజనాలు కాపాడేందుకు ఉనికిలోకి వచ్చిన రాజ్యాంగయంత్రమే. కార్మికవర్గం విజయం సాధించిన తర్వాత ఈ రెడీమేడ్‌గా అందుబాటులో ఉన్న రాజ్యాంగ యంత్రాన్ని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని మార్క్స్ ఏంగెల్స్‌లు నిర్ణయానికి వచ్చారు.
- మార్క్స్ ఏంగెల్స్‌లు తమ ఉమ్మడిగా రాసిన ముందుమాటలో (1882 రష్యన్ ప్రతికి రాసిన ముందుమాటలో) పశ్చిమ యూరప్ చారిత్రక అనుభవాల ఆధారంగా కమ్యూనిస్టు ప్రణాళికలో ప్రతిపాదనలు రూపొందించబడ్డాయని అంగీకరించారు. 1882 నాటికి రష్యా విప్లవోద్యమ నాయకురాలిగా ఎదిగే దిశగా ప్రయాణిస్తోందని అంచనా వేశారు. ఈ పరిణామం అనివార్యంగా అనేక కొత్త ప్రశ్నలను మన ముందుకు తెచ్చిందనీ, ఈ ప్రశ్నలు, వాటికి సమాధానాలకు కమ్యూనిస్టు ప్రణాళిక మూల ప్రతిలో స్థానం కల్పించలేదని స్పష్టంగా తెలియచేశారు. ఈ అంశం చాలా కీలకమైనది. ముఖ్యమైనది. అవసరమైనది కూడా.
ఈ ముందుమాటలు పరిశీలిస్తే తామేదో స్వప్నలోకపు సౌధాన్ని నిర్మిస్తున్నామని, ఎల్లకాలం చలామణిలో ఉండే ముడి సూత్రాలను అందిస్తునాన్నమన్న భావనలో మార్క్స్ ఏంగెల్స్‌లు లేరన్న వాస్తవం అర్థమవుతుంది. భవిష్యత్ తరాల సోషలిస్టులు ఈ సూత్రాలకు లోబడి ఉండాలని కూడా వారేమీ ఆశించలేదు. ప్రత్యేకించి పెట్టుబడిదారీ వ్యవస్థ కొత్త కొత్త దేశాలకు విస్తరిస్తూ పోయే కొద్దీ, ఆయా దేశాలను ఆధునిక ప్రపంచ చరిత్రలో భాగస్వాములను చేసే కొద్దీ కమ్యూనిస్టు ప్రణాళికలో ప్రస్తావించని అభివృద్ధి నమూనాలు, సమస్యలు ముందుకొస్తాయన్న అవగాహనతోనే మార్క్స ఏంగెల్స్‌లు ఉన్నారన్న వాస్తవం మనకు కనిపిస్తుంది.
మరోవైపున కమ్యూనిస్టు ప్రణాళికలో ప్రస్తావించిన మౌలిక సూత్రాలు సమకాలీన ప్రాధాన్యత కలిగినవేనన్న విషయంలో వారిరువురికీ ఎటువంటి సందేహమూ లేదు. తర్వాతి దశాబ్దాల్లో జరిగిన పరిణామాలు, లేదా తదుపరి కాలంలో వాళ్లు సాగించిన అధ్యయనాలు సైతం తమ మౌలిక సైద్ధాంతిక ప్రాతిపదికను, చట్రాన్ని ప్రశ్నార్థకం చేసిన దాఖలాలు లేవు. మార్క్స్ ఏంగెల్స్‌లు చివరి కాలంలో సాగించిన అధ్యయనాలు మరింత లోతైనవీ, విస్తృత స్వభావం కలిగినవన్న విషయాన్ని మనం గుర్తించాలి.
ప్రచురణానంతరం శతాబ్దం తర్వాత కమ్యూనిస్టు ప్రణాళికను అంచనా వేయటానికి అనుసరించే ప్రమాణాలు, పద్ధతుల విషయంలో మార్క్స్ ఏంగెల్స్‌లు తమ జీవిత కాలంలో కమ్యూనిస్టు ప్రణాళిక ప్రచురణలు సాగిన పాతికేళ్లల్లో పాటించిన ప్రమాణాలే మనం కూడా పాటించాల్సి ఉంటుంది. వివరాల్లోకి వెళ్లి మనం గందరగోళపడాల్సిన అవసరం లేదు. 20వ శతాబ్ది తొలి యాభయ్యేళ్లల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో నేరుగా కమ్యూనిస్టు ప్రణాళిక మౌలిక సూత్రాల పర్యవసానాలను, ఫలితాలను అంచనా వేయవచ్చు.
కమ్యూనిస్టు ప్రణాళికలో మౌలిక ప్రతిపాదనలు
కమ్యూనిస్టు ప్రణాళికలో మౌలిక ప్రతిపాదనలు గా
అ) చారిత్రక భౌతికవాదం,
ఆ) వర్గ పోరాటం
ఇ) పెట్టుబడిదారీ వ్యవస్థ స్వభావం
ఈ) సోషలిజం అనివార్యత
ఉ) సోషలిజం సాధన మార్గాలను చెప్పుకోవచ్చు.
వందేళ్లల్లో ఈ మౌలిక ప్రతిపాదనలు దశ దిశలను పరిశీలించే ముందు ఈ మౌలిక ప్రతిపాదనల గురించి ప్రాధమిక అవగాహన ఏర్పాటు చేసుకుందాం.
అ) చారిత్రక భౌతికవాదం : మార్క్స్, ఏంగెల్స్‌ల తదుపరి రచనలన్నింటిలో కనిపించినట్లే కమ్యూనిస్టు ప్రణాళికలోనూ మనకు కనిపించే మౌలిక ప్రతిపాదన చారిత్రక భౌతికవాదం. ఇది చరిత్ర గమన సూత్రాలను వివరించే సిద్ధాంతం. అంతిమంగా ప్రజలు ఎలా జీవిస్తున్నారన్నదానిపైనే ఆధారపడి వారు ఎలా స్పందిస్తున్నారు, ఆలోచిస్తున్నారు అన్నది ఆధారపడి ఉంటుందని చారిత్రక భౌతికవాదం చెప్తోంది. అంటే ఏ సమాజానికైనా ఆర్థిక వ్యవస్థే పునాది అని నిర్ధారిస్తుంది. అంటే ఆర్థిక వ్యవస్థే చరిత్ర చోదక శక్తి అని నిర్ధారిస్తారు. కమ్యూనిస్టు ప్రణాళికలో మొదటి అధ్యాయం ఈ సూత్రాన్ని ప్రపంచ చరిత్రకు అన్వయించి మార్క్స్ ఏంగెల్స్‌లు అత్యంత క్లుప్తంగా సంక్షిప్తంగా ప్రపంచ చరిత్రను మనముందుంచేందుకు సాగించిన అద్భుత ప్రయత్నం. ఇందులో భాగంగా మధ్యయుగాల తొలినాళ్లలో ఆవిర్భవించిన పెట్టుబడిదారీ వ్యవస్థ 19వ శతాబ్ది వరకూ ఎలా ఎదుగుతూ వచ్చిందో సులభ శైలిలో సంక్షిప్తంగా వివరించారు. కమ్యూనిస్టు ప్రణాళికలోని రెండో అధ్యాయంలో ఉన్న ఈ క్రింది పేరాగ్రాఫ్ చారిత్రక ఆదర్శవాదానికి వ్యతిరేకంగా చారిత్రక భౌతికవాదం అవసరాన్ని స్పష్టంగా ప్రతిపాదిస్తారు మార్క్స్ ఏంగెల్స్‌లు. ఆ పేరాగ్రాఫ్‌లో వారిరువురూ
‘‘మనిషికి వచ్చే ఆలోచనలు, అభిప్రాయాలు, భావనలు ఒక్క మాటగా చెప్పాలంటే వ్యక్తి చైతన్యం ఆ వ్యక్తి నివసించే భౌతిక అస్తిత్వంతో పాటే మారుతూ ఉంటాయని చెప్పటానికి లోతైన పరిశీలన అవసరమా? భావాల చరిత్రను అధ్యయనం చేస్తే మనకు ఇంతకన్నా ఏమి అర్థమవుతుంది? భౌతిక ఉత్పత్తిలో వచ్చే మార్పుకు అనుగుణంగా తగు మోతాదులో భౌద్దిక ఉత్పత్తి కూడా మారుతుంది అనే కదా అర్థమయ్యేది? ఏ దశలోనైనా పాలకవర్గ భావజాలమే ఆ దశలో ఆ సమాజపు సార్వత్రిక భావజాలంగా చలామణి అవుతుంది. సమాజాన్ని విప్లవాత్మకంగా మార్చే ఆలోచనలు, భావజాలాల గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నప్పుడు పాత సమాజంలోనే ఈ నూతన భావజాలాలకు ఆవిర్భావానికి కావల్సిన పునాదులు పడ్డాయన్న వాస్తవం గురించి కూడా మాట్లాడుకుంటారు. పాతకాలపు భావాజాలాలను తుదముట్టించటం ఆయా పాతకాలపు భావజాలాల ఆవిర్భావానికి పునాదులు వేసిన పరిస్థితులను అంతమొందించే వేగంపైనే ఆధారపడి ఉంటుంది.’’
ఆ) వర్గపోరాటం : ఇప్పటి వరకూ జరిగిన చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే అన్న గొప్ప వాక్యంతో కమ్యూనిస్టు ప్రణాళిక మొదలవుతుంది. ఇదేమీ చారిత్రక భౌతికవాద సిద్ధాంతంతో విబేధించే అంశం కాదు. పైగా ఆ సిద్ధాంతంతో మమేకమయ్యే అంశమే. మేళవించే అంశమే. (1888 నాటి ప్రచురణకు రాసిన ముందుమాటలో ఏంగెల్స్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఇప్పటి వరకూ జరిగిన చరిత్ర అన్న అర్ధాన్ని నాగరిక పూర్వపు దశలకు వర్తింపచేయరాదని హెచ్చరించారు.) ఇప్పటి వరకూ ఉనికిలో ఉన్న సమాజంలో ఓ తరగతి ప్రజలు శ్రమ చేస్తే మరో తరగతి ప్రజలు ఆ శ్రమ ఫలాలను, మిగులును సొంతం చేసుకుంటూ వచ్చారు. చారిత్రక భౌతికవాద సూత్రం ప్రకారం జీవనోపాధిని సమకూర్చుకోవటంలో ఉండే మౌలిక వ్యత్యాసాలు ` కొందరు శ్రమ చేయటం ద్వారా సమకూర్చుకుంటే మరికొందరు యాజమాన్య హక్కు ద్వారా సమకూర్చుకుంటారు ` అంతిమంగా పరస్పరం విరుద్ధ ప్రయోజనాలు, ఆసక్తులు, ఆకాంక్షలు కలిగిన సామాజిక బృందాలను తయారు చేస్తాయి. మార్క్సిస్టు సిద్ధాంతంలో ఈ సామాజిక తరగతులనే వర్గాలు అని పిలుస్తున్నారు. ఏ చారిత్రక దశలోనైనా ఈ సామాజిక బృందాలే కీలక పాత్ర పోషిస్తాయి తప్ప ఆయా బృందాల్లోని వ్యక్తులు కాదు. ఆయా సామాజిక బృందాల మధ్య ఉన్న కార్యకలాపాలు, ప్రయత్నాలు అన్నింటికీ మించిన వైరుధ్యాలే సామాజిక ఉద్యమాలకు , యుద్ధాలకు, విప్లవాలకు పునాదులవుతాయి. ఇవన్నీ ఆయా సమాజాల పరిణామ క్రమంలో స్పష్టంగా కనిపిస్తాయి.
ఇ) పెట్టుబడిదారీ వ్యవస్థ స్వభావం : మార్క్స్ తన జీవితంలో అత్యధిక సమయం పెట్టుబడిదారీ విధానపు మార్మికత్వాన్ని విప్పి చెప్పటానికి కృషి చేశారు. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి కమ్యూనిస్టు ప్రణాళికలో శక్తివంతమైన విశ్లేషణ కనిపిస్తుంది. ( అయితే ఇక్కడ ఓ ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించాలి. కమ్యూనిస్టు ప్రణాళిక గ్రంధంలో పెట్టుబడిదారీ వ్యవస్థ అన్న పదం ఎక్కడా కనిపించదు. వర్తమాన సమాజం లేదా బూర్జువా సమాజం అన్న పదాన్ని మార్క్స్ ఏంగెల్స్‌లు పెట్టుబడిదారీ సమాజం అన్న పదానికి బదులుగా ఉపయోగించారు.) పెట్టుబడిదారీ విధానం మౌలికంగా మార్కెట్ ఆధారిత లేదా సరుకుల ఉత్పత్తి ఆధారిత ఆర్థిక వ్యవస్థ. ఈ వ్యవస్థ ‘మనిషికి మనిషికి మధ్య నగ్నమైన స్వప్రయోజనాన్ని మినహా దేన్నీ మిగల్చలేదు. కేవలం నగదు రూపకమైన చెల్లింపులను మాత్రమే మిగిల్చింది.’’ అని నిర్ధారించారు. చివరకు కార్మికుడు కూడా సరుకుగానే మారతాడు. పెట్టుబడిదారుడు లాభాలు సంపాదించుకోవటానికి శ్రమ కొనుగోలు చేస్తాడు. (తర్వాతి కాలంలో శ్రమకు బదులు శ్రమ శక్తి కొనుగోలు చేస్తాడు అని సవరించాడు). ఈ లాభాలతోనే పెట్టుబడి విస్తరిస్తుంది. ఈ క్రమంలో ఓ వర్గంగా ఏర్పడే కార్మికులు ‘‘పని దొరికినంత కాలం మాత్రమే బతకగలుగుతారు. ఎవరి శ్రమ పెట్టుబడిని పెంచుతుందో అటువంటి వారికి మాత్రమే పనిదొరుకుతుంది.’’.
పెట్టుబడిదారీ వ్యవస్థ అంతకు ముందున్న సమాజ రూపాల కంటే భిన్నంగా, నిరంతరం విస్తరించే వ్యవస్థ. ‘‘ నిరంతరం ఉత్పత్తి సాధనాలను తద్వారా ఉత్పత్తి సంబంధాలను, వాటితో పాటు యావత్ సామాజిక సంబంధాలను విప్లవీకరించుకోకుండా మనుగడ సాగించలేదు.’’ అంతేకాదు. ‘‘తయారయ్యే సరుకుల కోసం నిరంతరం మార్కెట్ కోసం ప్రపంచమంతా వెతుకులాట మొదలుపెడుతుంది.’’. ఈ లక్షణాల రీత్యా ‘‘బూర్జువా వ్యవస్థ కేవలం వందసంవత్సరాల పాలనలోనే గత సమాజాలన్నీ కలిపినా సాగించిన ఉత్పత్తి మోతాదు, తీవ్రత కంటే మించిన విశాలమైన అనూహ్యమైన ఉత్పత్తి సామర్ధ్యాలను అభివృద్ధి చేసింది.’’ కానీ ఇదే భారీ ఉత్పత్తి సామర్ధ్యం పెట్టుబడిదారీ వ్యవస్థకు శతృవుగా మారుతుంది. కమ్యూనిస్టు ప్రణాళికలో అత్యంత విలువైన వాక్యాలను పూర్తిగా ఇక్కడ నెమరు వేసుకోవాలి. ఈ వాక్యాల ద్వారా మార్క్స్, ఏంగెల్స్‌లు పెట్టుబడిదారీ వ్యవస్థను సంక్షోభం వైపు నడిపిస్తున్న అంతర్గత వైరుధ్యాల గురించి వివరిస్తారు. ఆ వాక్యాలు ఇవి :
‘‘ ఆధునిక బూర్జువా వ్యవస్థ తన ఉత్పత్తి సంబంధాలు, వాణిజ్యం, ఆస్తి సంబంధాలతో ఎంతో ఉన్నత స్థాయిలో ఉత్పత్తి సాధనాలను, మారక సాధనాలను పుట్టిస్తుంది. ఈ శక్తులు దాని అధికార నియంత్రణ పరిధులను దాటి వ్యాపిస్తాయి. ఈ ఉత్పత్తి సృష్టించిన ప్రపంచం కూడా వీటిని నియంత్రించలేదు. దశాబ్దాల పారిశ్రామిక వాణిజ్య చరిత్ర అంతా ఆధునిక ఉత్పత్తి శక్తులు ఆధునిక ఉత్పత్తి సంబంధాలపై సాగించిన తిరుగుబాట్లే. ఆస్తి సంబంధాలకు వ్యతిరేకంగా సాగిన తిరుగుబాట్ల చరిత్రలే. ఈ ఉత్పత్తి సంబధాలు, ఆస్తి సంబంధాలే బూర్జువా వ్యవస్థ, దాని పాలన మనుగడకు పునాదులు. వాణిజ్య సంక్షోభం గురించి ప్రస్తావిస్తే సరిపోతుంది. పదేపదే తలెత్తే ఈ సంక్షోభాలు మొత్తం బూర్జువా వ్యవస్థనే సవాలు చేస్తాయి. ఒక సంక్షోభాన్ని మించి మరో సంక్షోభం ప్రమాదకారిగా మారుతుంది. ఇటువంటి సంక్షోభాల సమయంలో పెద్దమొత్తంలో సరుకులే కాదు, కాలం పోగు చేసిన ఉత్పత్తి సామర్ద్యాలు కూడా దశలవారీగా ధ్వంసమవుతాయి. ఈ సంక్షోభాలన్నింటిలోనూ ఓ అంటువ్యాధి ప్రబలుతుంది. పెట్టుబడిదారీ పూర్వపు సమాజాల్లో అటువంటి అంటువ్యాధిని మనం చూసి ఉండము. అదే అధికోత్పత్తి అంటువ్యాధి. ఉన్నట్లుండి సమాజాలు ఆటవిక దశకు చేరినట్లనిపిస్తాయి. ఓ క్షామమో లేక విశ్వవ్యాప్తమైన విధ్వంసక యుద్ధమో రోజువారీ మనుగడ సాగించటానికి కావల్సిన సరుకుల సరఫరాను అడ్డుకున్నట్లనిపిస్తుంది. పరిశ్రమలు, వాణిజ్యం ధ్వంసమైనట్లనిపిస్తుంది. ఎందువలన? ఎందుకంటే నాగరికత బాగా విస్తరించింది. జీవనం సాగించటానికి ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. అవసరానికి మించిన పరిశ్రమలు, వాణిజ్యం సాగుతున్నాయి. సమాజంలో ఉన్న ఉత్పత్తి శక్తులు ఇక ఏ మాత్రమూ బూర్జువా సమాజపు అవసరాలు తీర్చటానికి ఉపయోగపడేవిగా లేవు. పైగా ప్రసుత్త పరిస్థితుల్లో బూర్జువా సమాజం మనుగడ సాగించటానికి అవరోధాలు సృష్టిస్తున్నాయి. ఉత్పత్తి శక్తులు ఈ అవరోధాలను అధిమిస్తే బూర్జువా సమాజం అతలాకుతలమైపోతుంది. బూర్జువా ఆస్తి మనుగడకే ముప్పుగా పరిణమిస్తాయి. చూస్తే అవి బూర్జువా సమాజపు పరిస్థితులు బూర్జువా సమాజం సృష్టించిన సిరిసంపదలతో పోల్చి చూస్తే చాలా ఇరుకుగానూ, సంకుచితమైనవిగానూ కనిపిస్తాయి. బూర్జువా సమాజం ఈ సంక్షోభాలను ఎలా అధిగమిస్తుంది? ఓ వైపు సార్వత్రిక ఉత్పత్తి సాధనాలను సంపూర్ణంగా నాశనం చేయటం ద్వారానూ మరో వైపున కొత్త కొత్త ప్రపంచ మార్కెట్లను సంపాదించుకోవటం ద్వారానూ, పాత మార్కెట్లను మరింతగా దోచుకోవటం ద్వారానూ ఈ సంక్షోభం నుండి బూర్జువా సమాజం బయట పడటానికి ప్రయత్నం చేస్తుంది. అంటే మరింత తీవ్రమైన, మరింత దోపిడీ స్వభావంతో కూడుకున్న సంక్షోభాలకు దారులు వేయటం ద్వారానే ప్రస్తుత సంక్షోభాలను బూర్జువా సమాజాలు అధిగమించగలుగుతాయి. సంక్షోభాలను నిలువరించి, నియంత్రించగల మార్గాలను, సాధనాలను ధ్వంసం చేయటం ద్వారానే ఆయా సంక్షోభాల నుండి బూర్జువా సమాజాలు విముక్తి పొందగలుగుతాయి’’ అన్న వాక్యాలు పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంత కాలమూ అక్షరమక్షరం రుజువయ్యేవే.
(ఈ) సోషలిజం అనివార్యత : పెట్టుబడిదారీ వ్యవస్థ అనివార్యంగా పతనమవుతుందని చెప్పినంత మాత్రాన సోషలిజం విజయం గ్యారంటీ అనుకోవడానికి వీల్లేదు. ఓ సమాజం పతనమైనప్పుడు మరింత మెరుగైన ఆధునిక సమాజం ఆవిర్భావానికి ఎన్ని అవకాశాలున్నాయో పతనమైన సమాజం కంటే మరింత గందరగోళం, తిరోగమన వ్యవస్థలు కూడా తెరమీదకు వచ్చిన సందర్భాలు చరిత్రలో గణనీయంగానే ఉన్నాయి. అందువలన పెట్టుబడిదారీ వ్యవస్థ దాని స్వభావం రీత్యానే ఓ దశలో దాన్ని కూల్చేసి దాని స్థానంలో సోషలిస్టు వ్యవస్థను స్థాపించేందుకు అవసరమైన శక్తిని తయారు చేయడం చాలా ముఖ్యమైన అంశం. దీనికి సంబంధించిన హేతుబద్ద వివరణను కమ్యూనిస్టు ప్రణాళికలోని మొదటి భాగం మొదటి భాగంలో మార్క్స్ ఏంగెల్స్‌లు ఇలా సంక్షిప్తీకరించారు :
‘‘పెట్టుబడిదారీ వర్గం ఉనికికీ ఆధిపత్యానికీ మూలం పెట్టుబడి ఆవిర్భావం, సమీకరణ. వేతన శ్రమే పెట్టుబడికి మాతృక. కార్మికుల మధ్య పోటీ పెట్టడంపైనే వేతన శ్రమ ఉనికి ఆధారపడి ఉంటుంది. పరిశ్రమల విస్తరణ కోసం బూర్జువా వర్గం అసంకల్పితంగానే సాధనంగా వ్యవహరిస్తుంది. (అనివార్యంగా) ఈ క్రమంలో ఉపాధి కోసం జరిగే పోటీలో ఎవరికి వారుగా ఉన్న కార్మికులను ఓ చోటికి పోగు చేస్తుంది. వారికి ఓ విప్లవ ఐక్యతను సమకూరుస్తుంది. సంఘ నిర్మాణం అనివార్యం చేస్తుంది. ఆధునిక పరిశ్రమ అభివృద్ధి మొత్తం బూర్జువా వర్గం ఆధిపత్యం, దోపిడీకి పునాదిగా ఉన్న పరిస్థితులను సమూలంగా మార్చేస్తుంది. ఈ క్రమంలో బూర్జువా వ్యవస్థ దేన్ని తయారు చేస్తుందంటే తనకు సమాధులు తవ్వే వర్గాన్ని తయారు చేస్తుంది. బూర్జువా వ్యవస్థ పతనం, కార్మికవర్గ విజయం రెండూ సమాన ప్రాధాన్యత కలిగిన అంశాలే. అనివార్యతలే.’’
(ఉ) సోషలిజానికి మార్గం : ఈ అంశంలో కమ్యూనిస్టు ప్రణాళికలో చెప్పినట్లుగానే రెండు కోణాలున్నాయి. మొదటిది సోషలిస్టు విప్లవం యొక్క సాధారణ స్వభావం. రెండోది అంతర్జాతీయ స్థాయిలో విప్లవ సాధన దిశగా సాగే ప్రయాణం.
సోషలిస్టు విప్లవం ప్రధానంగా కార్మికవర్గ విప్లవం. ఈ విప్లవ సాధనలో మార్క్స్ ఏంగెల్స్‌లు ఇతర వర్గాల పాత్రను తిరస్కరించలేదు. పైన చెప్పుకున్నట్లుగా పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి కావాలంటేనే గణనీయమైన సంఖ్యలో కార్మికులు, వారి శ్రమ శక్తి అవసరం. పారిశ్రాక రంగం విస్తరించే కొద్దీ దానికి అనుబంధంగా విస్తరించే రవాణా రంగం కార్మికుల మధ్య ఐక్యతను పెంపొందిస్తుంది. ఉమ్మడి కార్యాచరణకు అవకాశాలు మెరుగుపరుస్తుంది. ఈ ప్రయత్నాలు ఓ దశకు చేరుకున్నప్పుడు ‘‘కార్మికులంతా ఓ వర్గంగా తయారవుతారు. తదుపరి ఓ ప్రత్యేక రాజకీయ పార్టీగా మారతారు.’’. పెట్టుబడిదారీ వ్యవస్థలోని వైరుధ్యాలు ఇవ్వాళ కాకపోతే రేపైనా విప్లవాన్ని అనివార్యం చేస్తాయి. విప్లవ సాధన క్రమంలో ‘‘ కార్మికవర్గం పాలకవర్గంగా ఎదిగి ప్రజాస్వామ్య పరిరక్షణ యుద్ధంలో విజయం సాధించాలంటేఅధికారాన్ని స్వాధీనం చేసుకోవడం తొలి అడుగు మాత్రమే’’నని మార్క్స్ ఏంగెల్స్‌లు స్పష్టంగా వివరించారు. కార్మికవర్గం అధికారానికి వచ్చిన తర్వాత మౌలిక సామాజిక మార్పులు మొదలవుతాయన్న కీలకమైన అంశాన్ని తరచూ మనం విస్మరిస్తూ ఉంటాము :
‘‘కార్మికవర్గం (విప్లవం ద్వారా సిద్ధించిన) తన ఆధిపత్య స్థితిని ఉపయోగించుకుని వివిధ మోతాదుల్లో అన్ని రకాల పెట్టుబడినీ స్వాధీనం చేసుకుంటుంది, ఉత్పత్తి సాధనాలను రాజ్యం చేతిలో కేంద్రీకరింపచేస్తుంది అంటే కార్మికవర్గం పాలక వర్గంగా ఉన్న రాజ్యాంగం యంత్రం చేతిలో ఉత్పత్తి సాధనాలన్నీ కేంద్రీకృతమవుతాయి. తద్వారా సాధ్యమైన వేగంగా ఉత్పత్తి సామర్ధ్యాలను పెంపొందిస్తుంది.’’
ఇది ఓ సంధికాలం. పరిణామ దశ. ఈ దశలో కార్మికవర్గం ‘‘ పాతకాలపు ఉత్పత్తి పరిస్థితులు సమూలంగా మార్చేస్తుంది.’’. (మార్క్సిజాన్ని పొరపాటుగా అర్థం చేసుకుని వ్యాఖ్యానిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో బలవంతంగా మార్చేస్తుంది అన్న పదాలను రాజ్యాంగ యంత్రాన్ని నిర్దిష్ట ప్రయోజనాల సాధన దిశగా క్రమబద్దంగా ఉపయోగిస్తుందనీ, విచ్చలవిడి హింసకు అవకాశం ఉండదన్న అవగాహనతో అర్థం చేసుకోవాలి అని విడమర్చి చెప్పాలి). అంతిమంగా కార్మికవర్గం ఈ పరిస్థితుల్లో
‘‘వర్గ వైరుధ్యాలు, వైషమ్యాలకు కారణమయ్యే పరిస్థితులను పూర్తిగా నిర్మూలిస్తుంది. అంతిమంగా ఓ వర్గంగా తన ఆధిపత్యాన్ని కూడా రద్దు చేసుకుంటుంది.
వర్గాలు, వర్గ వైరుధ్యాలతో కూడిన పాత బూర్జువా సమాజం స్థానంలో సమాజం ఓ సంఘంగా ఏర్పడే పరిస్థితులు రూపుదిద్దుకుంటాయి. ఈ సంఘంలో ప్రతి ఒక్కరూ తమతమ సామర్ధ్యాలకు అనుగుణంగా సమగ్రంగా అభివృద్ధి చెందే అవకాశాలుంటాయి’’
ఇది స్థూలంగా సోషలిస్టు విప్లవం యొక్క స్వభావం. రూపు రేఖలు. అంతర్జాతీయ విప్లవ సాధన, దాని మార్గం గురించి ఏమి చెప్పారు అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. ఇక్కడ మార్క్స్ ఏంగెల్స్‌లకు ఓ స్పష్టత ఉంది. ఆధునిక కార్మికవర్గం మౌలికంగా అంతర్జాతీయ ఉద్యమమనీ, జాతీయ సరిహద్దుల పరిధిని అధిగమించి సాగే ఉద్యమమే అయినా ‘రూపం రీత్యా కార్మికవర్గం బూర్జువా వర్గంతో చేసే పోరాటం మౌలికంగా జాతీయ రంగంలో సాగించే, సాగే పోరాటమే.’’ అన్నదే వారికున్న ఆ స్పష్టత. ఈ అవగాహనను మరింత ముందుకు తీసుకెళ్తే ‘‘తొలుత కార్మికవర్గం ఆయా దేశాల్లోని పాలక వర్గమైన బూర్జువాలతో తమ విబేధాలు పరిష్కరించుకోవాలి.’’ అని నిర్ధారించుకోవచ్చు. అదే సమయంలో ప్రతీఘాత విప్లవ శక్తులకున్న అంతర్జాతీయ స్వభావం, సామర్ధ్యాల గురించి మార్క్స్ ఏంగెల్స్‌లకు అంచనా లేకపోలేదు. ఆయా దేశాల్లో విజయవంతమైన సోషలిస్టు విప్లవాన్ని అణచివేసేందుకు ఆయా దేశాల బూర్జువా వర్గాలు అంతర్జాతీయ విప్లవ ప్రతీఘాత శక్తుల సహకారాన్ని తీసుకుంటాయి. అందుకే ఏ ఒక్క దేశంలోనైనా కార్మికవర్గ విప్లవం విజయం సాధించాలంటే కార్మికవర్గం విముక్తి పొందాలంటే ప్రపంచంలోని అన్ని నాగరిక దేశాల మద్దతూ అవసరం అవుతుంది. ఆ విధంగా వివిధ దేశాల్లో పురోగమించే విప్లవోద్యమాలు లేదా సాధించిన విజయాలను పరిరక్షించుకోవడానికి ఈ పంథాలో ప్రయాణిస్తున్న దేశాలన్నీ ఒకదానితో ఒకటి సహకరించుకోవాలి. ఈ క్రమం అంతర్జాతీయ దోపిడీకి తావులేని ఓ నూతన సమాజాన్ని సృష్టిస్తుంది. మార్క్స్, ఏంగెల్స్‌లు చెప్పినట్లుగా :
‘‘మనిషిని మనిషి దోపిడీ చేసే వ్యవస్థకు శాశ్వతంగా స్వస్తి పలకటానికి ఏమోతాదులో ప్రయత్నం జరుగుతుందో అదే మోతాదులో ఒక దేశం మరో దేశాన్ని దోపిడీ చేసే వ్యవస్థ కూడా ముగింపుకు వస్తుంది. ఒక దేశంలో వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు వైరుధ్యాలు అంతమయ్యాక వివిధ దేశాల మధ్య ఉండే వైషమ్యాలు, వైరుధ్యాలు కూడా అంతమవుతాయి.’’
విప్లవం ఎక్కడ మొదలవుతుంది అన్న విషయానికి వస్తే మార్క్స్ ఏంగెల్స్‌లు పశ్చిమ యూరప్‌లోని ఆధునిక పెట్టుబడిదారీ దేశాలలో మొదలై వివిధ దేశాలకు విస్తరిస్తుందన్న తార్కిక నిర్ధారణకు వస్తారు. 1848లో మానిఫెస్టో రాసే సమయానికి యూరోపియన్ దేశాలు విప్లవం ముగింట్లో ఉన్నాయన్న వారిరువరి అంచనా శాస్త్రీయమైనదే. ఈ విప్లవాల యుగం జర్మనీతో మొదలవుతుందని ఆశిస్తూ :
‘‘కమ్యూనిస్టులు ప్రధానంగా జర్మనీపై తమ దృష్టి కేంద్రీకరించి ఉంచుతారు. ఎందుకంటే ఆ దేశం బూర్జువా విప్లవం ముంగిట్లో ఉంది. జర్మనీలో జరిగే బూర్జువా విప్లవం చోటు చేసుకోబోయే నాటికి యూరోపియన్ నాగరికత సాధించిన అత్యంత ఆధునిక అభివృద్ధికి జర్మనీ కేంద్రంగా ఉంటుంది. ఇంగ్లాండ్‌లో 17వ శతాబ్దిలో ఉండే కార్మికవర్గం సంఖ్య, ఫ్రాన్స్‌లో 18వ శతాబ్దిలో ఉంటే కార్మికుల సంఖ్య కంటే జర్మనీలో ఎక్కువమంది కార్మికులుంటారు. అదేవిధంగా జర్మనీలో విజయవంతమయ్యే బూర్జువా విప్లవాన్ని వెన్నంటే కార్మికవర్గ విప్లవం జైత్రయాత్ర కొనసాగిస్తుంది.’’
ఈ అంచనా అతి అంచనా లేక అత్యాశగా మిగిలిపోయింది. జర్మనీలో బూర్జువా విప్లవానికి బదులు ప్రతీఘాత విప్లవం విజయం సాధించింది. ఆ మాట కొస్తే 1840 దశకంలో యూరప్ ప్రతీఘాత విప్లవాల జైత్రయాత్రకు ఆనవాలుగా మారింది. అయినా సరే మార్క్స్ ఏంగెల్స్‌లు ఈ విషయంలో కానీ మరో విషయంలో కానీ మానిఫెస్టోలో ప్రస్తావించిన అంశాలను సవరించటానికి సిద్ధం కాలేదు. 1870, 1880 దశకాల నాటికి మార్క్స్, ఏంగెల్స్ ఇరువురూ రష్యాలో జరిగే పరిణామాలను ఆసక్తిగా పరిశీలించటం ప్రారంభించారు. వందేళ్ల క్రితం ఫ్రాన్స్‌లో ప్రజాతంత్ర విప్లవం జయకేతనం ఎగురవేసిన విధంగానే రానున్న కొద్దికాలంలో రష్యాలో విప్లవం విజయయాత్ర మొదలువుతందన్న అభిప్రాయానికి వచ్చారు. అదేసమయంలో రష్యా విప్లవం పశ్చిమ దేశాల్లో విప్లవ జ్యోతులు వెలిగించటానికి దారితీస్తుందన్న అభిప్రాయానికి మాత్రం వారు రాలేదు. ఏంగెల్స్ జీవిత చరిత్ర రాసిన గుస్టావ్ మేయర్ ‘‘ తర్వాతి కాలంలో ఏంగెల్స్ రష్యా విప్లవం కోసం ఆతృతతో ఎదురు చూశాడని, రష్యా విప్లవం విజయవంతమైతే పశ్చిమ దేశాలు విప్లవం దిశగా పురోగమిస్తాయని ఆశించాడు’’ అని రాశాడు. గుస్టావ్ తన విశ్లేషణను కొనసాగిస్తూ ‘‘ అయితే తన ఆశలు నెరవేరతాయన్న నమ్మకం ఏంగెల్స్కు లేదు. పశ్చిమ దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోయటానికి ముందే యూరోపియన్ నాగరికతకు అత్యంత సమీపంలో ఉన్న మహా సామ్రాజ్యంలో విప్లవం విజయవంతం అవుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేయలేదు’’ అని కూడా చెప్పారు.
వందేళ్ల తర్వాత కమ్యూనిస్టు ప్రణాళిక మౌలిక సూత్రాలు ఏమి చెప్తున్నాయి?
వందేళ్ల తర్వాత కమ్యూనిస్టు ప్రణాళిక ప్రతిపాదించిన సైద్ధాంతిక చట్రం గురించి ఏమి చెప్పాలి? గతంలో మార్క్స్, ఏంగెల్స్‌లు చెప్పినట్లు ‘‘స్థూలంగా కమ్యూనిస్టు ప్రణాళిక ప్రతిపాదనలు నేటికీ సరైనవే’’ అని చెప్పగలమా? లేక గత ఐదారు దశాబ్దాలుగా జరుగుతున్న పరిణామాలు కమ్యూనిస్టు ప్రణాళిక సూత్రీకరణలను తిరస్కరించేవిగా ఉన్నాయా? తిరగదోడే విధంగా ఉన్నాయా? ఈ అంశాలు ఒక్కోటిగా సమీక్షిద్దాం.
చారిత్రక భౌతికవాదం :
గడచిన యాభై ఏళ్లల్లో ఏ ఒక్క సందర్భం కూడా చారిత్రక భౌతికవాద సూత్రాల ఔచిత్యాన్ని తిరస్కరించటానికో లేదా తిరగదోడాల్సిన అవసరాన్ని ముందుకు తీసుకురాలేదు. దీనికి భిన్నంగా చరిత్ర గతిని మార్చే మౌలిక సాధనం ఆర్థిక పరిణామమేననీ, ఈ విషయాన్ని వర్తమాన సమాజం గుర్తించినంత నిక్కచ్చిగా గతంలో ఎన్నడూ గుర్తించలేదని చెప్పుకోవచ్చు. ఇదేదో కేవలం మార్క్సిస్టులో సోషలిస్టులకో పరిమితమైన అంశం కాదు. చరిత్ర పరిశోధకుల్లో అత్యధికులకు ఈ సూత్రం మార్గదర్శకంగా మారిందని చెప్పటం అతిశయోక్తి కాబోదు. మనిషి యొక్క భౌతిక పరిస్థితుల్లో, సామాజిక సంబంధాల్లో, సామాజిక జీవితంలో మార్పులు జరిగిన ప్రతిసారీ మనిషి ఆలోనచలు, అభిప్రాయాలు, భావనలు ఒక్క మాటలో చెప్పాలంటే చైతన్యం మారుతూ ఉందన్న చారిత్రక భౌతికవాద మౌలిక సూత్రాన్ని పేరెన్నికగన్న సామాజిక శాస్త్రవేత్తలూ అంగీకరించారు. (అటువంటి వారిలో కొంతమందికి ఈ మౌలిక అవగాహన ఎవరిదో, దీని మూలాలు ఏమిటో కూడా తెలిసి ఉండకపోవచ్చు). ఈ మధ్య కాలంలో జరిగిన ప్రపంచ యుద్ధాలు, పెట్టుబడిదారీ విధానం చవి చూసిన సంక్షోభాలు, ప్రకృతి వైపరీత్యాల వెలుగులో అనేక నిర్హేతుక సిద్ధాంతాలు, ప్రవచనాలూ, మార్మిక సిద్ధాంతాలూ ముందుకు వచ్చిన మాట వాస్తవమే. ఈ నిర్హేతుక, మార్మిక సిద్ధాంతాలు స్థూలంగా బూర్జువా వర్గపు ఆలోచనా ధోరణికి ప్రతీకలే. అయితే ఎక్కడైతే సోషలిస్టు ఉద్యమంలోనూ, బయటా తార్కిక దృష్టి, నిస్పాక్షికత మిగిలి ఉందో అటువంటి చోట్ల మానవ సమాజాన్ని, దాని చరిత్రను అర్థం చేసుకునే ప్రయత్నంలో నిస్సందేహంగా చారిత్రక భౌతికవాదం మార్గదర్శిగా దారిదీపంగా నిలిచి ఉంది.
వర్గపోరాటం :
గత యాభయ్యేళ్లల్లో జరిగిన పరిణామాలు చారిత్రక భౌతికవాద సూత్రీకరణలను బలోపేతం చేసినట్లే వర్గపోరాట సూత్రీరణలను కూడా పదేపదే రుజువు చేస్తున్నాయి. సంపన్న దేశాల్లో ఆంతరంగిక వ్యవహారాలు వర్గ వైరుధ్యాల ఆధారంగా పరిణామం చెందుతున్నాయి. రూపుదిద్దుకుంటున్నాయి. దీనికంటే మరింత నగ్నంగా అంతర్జాతీయ వ్యవహారాల్లో వర్గపోరాటం గతంలో ఉన్నడూ లేనంత విస్పష్టంగా వ్యక్తమవుతూ ఉంది. రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో పుట్టి పెరిగి ప్రమాదకర స్థాయికి చేరుకున్న ఫాసిజం ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ నిజస్వరూపాన్ని తెలుసుకునేలా చేసిన పెద్ద సంఘటన. పెట్టుబడిదారీ వ్యవస్థ వర్గ స్వరూపాన్ని బట్టబయలు చేసిన పరిణామం. దీని ద్వారా విశాల ప్రజానీకానికి పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి, దాని వర్గ స్వభావం గురించి మరింత ఎక్కువగా స్పష్టంగా తెలుసుకునే అవకాశం కలిగింది. ప్రజల నుండి ప్రతిఘటన ఎదురైనప్పుడు తమ వర్గ ప్రయోజనాలు కాపాడుకునేందుకు పెట్టుబడిదారీ విధానం ఎంత నీచానికైనా పాల్పడగలదు అన్న అవగాహన ప్రజలకు కలిగించిన పరిణామం ఫాసిజం. చారిత్రక భౌతికవాదం సూత్రాన్ని ప్రపంచ మేధావులు, శాస్త్రవేత్తలు అంగీకరించినట్లుగానే వర్గ పోరాట సూత్రాన్ని కూడా అంగీకరించి పెట్టుబడిదారీ వ్యవస్థ ను విశ్లేషించటంలో మార్క్స్, ఏంగెల్స్ బాట పట్టారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సామాజిక శాస్త్రజ్ఞులు. సామాజిక మన:స్తత్వశాస్త్రం మొదలు చైనా సమాజాన్ని అర్థం చేసుకోవడానికీ, భారతదేశంలో కుల వ్యవస్థను అమెరికా దక్షిణ రాష్ట్రాల్లో జాతి వివక్షనూ అర్థం చేసుకోవడానికి వర్గ పోరాటం, వర్గ విశ్లేషణ మార్గదర్శక సూత్రాలయ్యాయి. మార్క్సిజాన్ని వ్యతిరేకంగా నిజాయితీపరులైన శతృవులు కూడా గతంలో లాగా వర్గాన్ని, వర్గ పోరాటాన్ని తిరస్కరించే పరిస్థితిలో లేరు. ఇప్పుడు పాలకవర్గ బాకాలను తిరస్కరించాల్సిన పరిస్థితికి నెట్టబడ్డారు. ఇటువంటి వారంతా ‘‘ మార్క్స్ దోపిడీ చేస్తున్న పిడికెడు మందిపై దోపిడీకి గురవుతున్న విశాల జనబాహుళ్యం సాగించే వర్గ యుద్ధాన్ని పెద్దగా ప్రాచుర్యంలోకి తీసుకురాలేదు. కానీ వర్తమాన పరిణామాలు ఈ సామాజిక వాస్తవికతను (దోపిడీని, దోపిడీకి వ్యతిరేకంగా సాగుతున్న ప్రజా పోరాటాలను) పదేపదే ధృవీకరిస్తున్నాయి’’ అన్న హెచ్ జి వెల్స్ అభిప్రాయంతో ఏకీభవించక తప్పదు. హార్వర్డ్ విశ్వ విద్యాలయంలో సోషల్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ అధిపతి టాల్కోట్ పార్సన్ సైతం ‘‘వర్గ పోరాటం గురించి మార్క్సిస్టు అవగాహన స్థూలంగా నిరూపించబడిరది’’ అని చెప్పారు.
పెట్టుబడిదారీ వ్యవస్థ స్వభావం:
సామాజిక శాస్త్రాలు, చారిత్రక విజ్ఞాన శాస్త్రం మార్క్సిజాన్ని అంగీకరించినంతగా, మార్క్సిస్టు మౌలిక సూత్రాలకు ప్రాధాన్యత ఇచ్చినంతగా రాజకీయ అర్థశాస్త్రం ఇవ్వలేదు. దీనికి కారణాలు తెలుసుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. చారిత్రక భౌతికవాదం, వర్గపోరాటం వివిధ సమాజాలకు వివిధ అభివృద్ధి దశలకు వర్తించే సార్వత్రిక సూత్రాలు. ఈ సూత్రాలను సందర్భోచితంగా ఉపయోగించుకోవడం వలన తక్షణమే వచ్చే ప్రమాదం ఏమీ ఉండదు. అదేసమయంలో వ్యక్తివాద సిద్ధాంతాలు, బూర్జువా సిద్దాంతాల ద్వారా సాధించే దానికంటే మరింత మెరుగైన విలువైన నాణ్యమైన విశ్లేషణ, ఫలితాలు ఈ మార్క్సిస్టు సార్వత్రిక సూత్రాలను అన్వయించటం ద్వారా సాధించవచ్చు. కానీ రాజకీయ అర్థశాస్త్రం విషయానికి వస్తే పరిస్థితులు వేరు. మార్క్సిస్టు రాజకీయ అర్థశాస్త్రం ప్రధానంగా పెట్టుబడిదారీ వ్యవస్థ గురించిన విశ్లేషణ. బూర్జువా మేధావులు నివసించే వర్తమాన సమాజానికి సంబంధించిన వాస్తవిక నిర్దిష్ట విశ్లేషణ. మార్క్సిస్టు రాజకీయ అర్థశాస్త్ర విశ్లేషణ సమాజం ముందుంచే సూత్రీకరణలు నిర్ధారణలు సందేహాలకు తావులేనివి. బూర్జువా వర్గం అంగీకరించలేనివి. అందువల్లనే బూర్జువా ఆర్థికవేత్తలు అసలు మార్క్సిస్టు రాజకీయ అర్థశాస్త్రం ఉనికిలోనే లేదన్నట్లుగా వ్యవహరిస్తారు. మార్క్స్ అసమాన ప్రతిభ కలిగిన ఆర్థికవేత్త అని అంగీకరించటానికి బూర్జువా ఆర్థికవేత్తలకు నోరు రాదు. జెకె ష్కుంప్టర్ చెప్పినట్లు ‘‘ ఆర్థిక సిద్ధాంతాన్ని చారిత్రక విశ్లేషణకు గురి చేయటం ద్వారా చారిత్రక వ్యాఖ్యానాన్ని చారిత్రక నిర్దారణలుగా మల్చే కృషి చేసిన వారిలో కారల్ మార్క్స్ అత్యంత అగ్రశ్రేణి ఆర్థిక శాస్త్రవేత్త.’’.
మార్క్స్‌ను ఓ ఆర్థికవేత్తగా గుర్తించక పోవటం కమ్యూనిస్టు మానిఫెస్టో వైఫల్యంగా పరిగణించవచ్చా? కానీ వాస్తవం దీనికి భిన్నమైనది. గత శతాబ్ద కాలంగో పదేపదే ఏమి రుజువవుతోంది? పెట్టుబడిదారి వ్యవస్థ నిరంతరం తన పరిధి విస్తరించుకోవటానికి కృషి చేస్తుందన్న వాస్తవం కాదా? ఎక్కడికైనా వెళ్లాలి, స్థిరపడాలి, సంబంధాలు ఏర్పర్చుకోవాలన్న తపన కాదా? పెట్టుబడిదారీ వ్యవస్థను, దానికి పునాదులైన బూర్జువా వర్గపు ఉనికిని పదేపదే సవాలు చేస్తున్న చక్రీయ సంక్షోభాలు పెట్టుబడిదారీ వ్యవస్థ చలన సూత్రాల్లో అంతర్భాగమయ్యాయన్న వాస్తవాన్ని ఎవరైనా తిరస్కరించగలరా? బూర్జువా వర్గం సృష్టించిన సంపద మొత్తాన్నీ ఇముడ్చుకోలేనంత ఇరుకు గదుల నిర్మాణం పెట్టుబడిదారీ వ్యవస్థ నిజలక్షమన్న వాస్తవాన్ని ఎవరు తిరస్కరించగలరు? పెట్టుబడిదారీ వ్యవస్థలోని అంతర్గత వైరుధ్యాలో సాంప్రదాయక రూపంలో, పద్ధతుల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ మనుగడనే సవాలు చేసే స్థాయిలో ఉన్నాయన్న వాస్తవాన్ని గుర్తించనిరాకరించే కబోదులెవరుంటా?
సోషలిజం అనివార్యత :
పెట్టుబడిదారీ వ్యవస్థ పాచిపట్టిన మెట్లపై నిల్చున్నదన్న వాస్తవాన్ని దగ్గరగా గమనించిన వారెవరైనా వ్యవస్థలో ఉన్న లోపాలు తొలగించి మెరుగైన సమాజ నిర్మాణం దిశగా ప్రయాణించేలా చేయాలని ఆశించటం తప్పు కాదు. అయితే అటువంటి ఆశావహుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. వారి విశ్వాసం కూడా సన్నగిల్లుతోంది. ఉన్న కొద్దిమంది అయినా తమ విశ్వాసాలకు కట్టుబడి ఉండే హక్కు కలిగి ఉన్నారు.
కమ్యూనిస్టు ప్రణాళిక రాసే నాటికి సోషలిజం భావనలు వాటిని ప్రతిపాదించే వారు 1893లో జూరిచ్‌లో జరిగిన రెండో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ సమావేశంలో ఎంగెల్స్ చెప్పినట్లు చిన్న చిన్న శకలాలుగా ఉన్నారు. ‘‘ ఆ దశ నుండి నేటికి సోషలిస్టు ఓ శక్తివంతమైన పార్టీగా ఎదిగారు. ఈ ఎదుగుదల చూసి ప్రపంచ పాలకవర్గం బెంబేలెత్తుతోంది’’ అని చెప్పిన రెండేళ్లకు ఏంగెల్స్ అస్తమించారు.
ఏంగెల్స్ ఈ మాటలు చెప్పిన పాతికేళ్ల తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. అనంతర కాలంలో ప్రపంచ భూభాగంలో ఆరోవంతులో ఉన్న భూభాగంలో కార్మికవర్గ విప్లవం విజయం సాధించే దిశగా ప్రయాణిస్తున్నాయని తర్వాతి పరిణామాలు రుజువు చేశాయి.
మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన మూడు దశాబ్దాల తర్వాత రెండో ప్రపంచయుద్ధం జరిగింది. ఆ యుద్ధం ముగిసే నాటికి ప్రపంచ జనాభాలో నాల్గోవంతు జనాభా, తూర్పు యూరప్‌తో సహా సోషలిస్టు శిబిరంగా మారింది.
పెట్టుబడిదారీ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు రంగం లో నిలబడి ఆగే ఏకైక ఖిలాడీగా ఉన్నప్పుడే సోషలిస్టు భావాల వ్యాప్తిని అడ్డుకోలేకపోయినప్పుడు పదేపదే సంక్షోభానికి గురయ్యే దశలో ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థ నేడు ఏ విధంగా సోషలిస్టు భావాల వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలదు? ప్రస్తుతం పెట్టుబడిదారీ వ్యవస్థ అనారోగ్యంతో కునారిల్లుతోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న సోషలిస్టు వ్యవస్థ విసిరే సవాళ్లకు సతమతమవుతోంది. సోషలిస్టు వ్యవస్థ కాలం గడిచే కొద్దీ బలం పుంజుకుంటోంది. దీన్ని కాదనగలిగిన వారెవ్వరు? పెట్టుబడిదారీ వ్యవస్థ పతనం కాక తప్పదు. పెట్టుబడిదారీ వ్యవస్థ స్థానంలో సోషలిస్టు వ్యవస్థ నిర్మాణమవుతుంది అన్నది కమ్యూనిస్టు ప్రణాళిక ఇచ్చే మౌలిక సందేశం.
కమ్యూనిస్టు ప్రణాళిక అచ్చయినప్పటి నుండీ పదేపదే రుజువు అవుతున్న విషయం ఇదే కదా.
సోషలిస్టు వ్యవస్థ దిశగా ప్రయాణం :
సోషలిస్టు విప్లవం సాధారణ లక్షణాల గురించి కమ్యూనిస్టు ప్రణాళికలో మార్క్స్ ఏంగెల్స్‌లు చెప్పిన సూత్రీకరణలను హేతుబద్దమైనవేనని, ఆచరణ సాధ్యమైనవేనని సోషలిస్టు రష్యా అనుభవాలు రుజువు చేస్తున్నాయి. కార్మికవర్గం రష్యా విప్లవంలో నిర్ణయాత్మక పాత్ర పోషించింది. ప్రణాళిక ప్రతిపాదనల్లో మొదటిది కార్మికవర్గాన్ని పాలకవర్గం స్థాయికి అభివృద్ధి చేయటం. కార్మికవర్గం ‘‘తనకున్న ఆధిపత్యాన్ని ఉపయోగించుకుని వివిధ మోతాదుల్లో బూర్జువావర్గం చేతుల్లో ఉన్న పెట్టుబడిని స్వాధీనం చేసుకుంటుంది. అన్ని రకాల ఉత్పత్తి సాధనాలను రాజ్యం చేతిలో కేంద్రీకరింపజేస్తుంది….ఉత్పత్తి శక్తులను సాధ్యమైనంత వేగంగా అభివృధ్ధి చేస్తుంది.’’ ఈ సూత్రీకరణ రష్యా విప్లవంలో అమలైంది. రుజువైంది. సమాజంలో వర్గ విభజన లేకుండా చేస్తుందని మానిఫెస్టో ప్రకటించింది. కానీ సాపేక్షంగా వెనకబడిన సమాజాన్ని పెట్టుబడిదారీ దేశాలతో సమానంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం, అంతర్జాతీయ స్థాయిలో ముదిరిపోతున్న వర్గ వైరుధ్యాల నేపథ్యంలో సోవియట్ రష్యాలో రాజ్యం కమ్యూనిస్టు ప్రణాళిక ప్రతిపాదించినట్లు అంతర్ధానం కావటానికి బదులు మరింత బలోపేతం అయ్యింది. మరిన్ని జవసత్వాలు సమకూర్చుకున్నది. ‘‘ సమాజంలో ప్రతి ఒక్కరూ స్వేఛ్చ గా అభివృధ్ధి అయితేనే మొత్తం సమాజం స్వేఛ్చగా అభివృద్ధి అవుతుంది’’ అన్న లక్ష్యాన్ని సాధించటానికి సోషలిస్టు వ్యవస్థ సుదీర్ఘ ప్రయాణం సాగించాల్సి ఉంది. ఇది భవిష్యత్తు లక్ష్యంగా ఉంది. ఉంటుంది.
అంతర్జాతీయ విప్లవం గురించి కమ్యూనిస్టు ప్రణాళిక వేసిన అంచనా కూడా తర్వాతి కాలంలో జరిగిన పరిణామాలు సరైనదేనని రుజువు చేశాయి. సోషలిస్టు విప్లవం ఏకకాలంలో ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన తిరుగుబాటు రూపం తీసుకోలేదు. వివిధ దేశాల్లో విముక్తిపోరాటాల రూపాన్ని, స్వాతంత్ర పోరాటాల రూపాన్ని తీసుకుంది. ఒక్కో స్వాతంత్య్రోద్యమం, ఒక్కో విముక్తి ఉద్యమం దేనికదే ప్రత్యేకమైనది. తరతమ స్థాయిల్లో భిన్నత్వాలున్నప్పటికీ ఆయా సోషలిస్టు విప్లవాలు పూర్వపు బూర్జువా విప్లవాల తరహాలోనే అంతర్జాతీయ స్వభావాన్ని కలిగి ఉన్నాయి. నూతన ప్రపంచ క్రమాన్ని నిర్మించే ప్రయత్నాలకు పునాదిరాళ్లు వేశాయి. అయితే ప్రస్తుతం నిర్మితమవుతున్న నూతన ప్రపంచ క్రమంలో దేశాల మధ్య శతృత్వాలు శాశ్వతంగా సమసిపోతాయా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేము. తూర్పు యూరప్‌లో యుగోస్లోవియాకు మిగిలిన సోషలిస్టు దేశాలకు మధ్య మొలకెత్తుతున్న విబేధాలు మరో సమస్యను ముందుకు తెస్తున్నాయి. వర్తమాన ప్రపంచంలో అంతర్జాతీయ సంబంధాలు ప్రపంచాన్ని రెండు శిబిరాలుగా విభజిస్తున్నాయి. ఉభయ శిబిరాలూ అంతిమ పోరాటానికి సన్నద్ధమవుతున్నాయి. అనేక సోషలిస్టు దేశాలు ఏకకాలంగా ఉనికిలో ఉండటం అన్నది వర్తమాన పరిణామం. తాజా పరిణామం. అందువలన యూగోస్లోవియా పరిణామాల పర్యవసానాలు ఎలా ఉంటాయన్న విషయంలో మనం ఇప్పటికిప్పుడే ఓ నిర్ణయానికి రాలేము. అయితే సోషలిస్టు శిబిరం పట్ల వ్యక్తమవుతున్న నిలువెత్తు విద్వేషాలు, అంతర్జాతీయ స్థాయిలో దోపిడీ ముగింపుకు వస్తుందన్న ఆశాభావాలు వందేళ్ల క్రితం ఎంత బలంగా ఉన్నాయో ఇప్పుడూ అంతే బలంగా ఉన్నాయి.
ఇక మన చర్చలో చివరి అంశానికి వద్దాము. అదే సోషలిస్టు విప్లవం యొక్క భౌగోళిక స్వభావం గురించిన అంశం. ఇక్కడ ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. కమ్యూనిస్టు ప్రణాళిక రాసే సమయంలోనే కాదు. తర్వాతి రచనల్లో కూడా విప్లవం ఎక్కడ విజయవంతం అవుతుందన్న విషయంలో మార్క్స్ ఏంగెల్స్‌ల అంచనా తప్పని రుజువైందన్నది చారిత్రక వాస్తవం. తొలి సోషలిస్టు విప్లవం మార్క్స్ ఏంగెల్స్‌లు ఆశించినట్లు యూరప్‌లోని ఆధునిక పెట్టుబడిదారీ దేశంలో విజయం సాధించలేదు. ప్రపంచ పెట్టుబడిదారీ దేశాల్లో అగ్రగామిగా నిలిచిన బ్రిటన్ స్థానాన్ని అమెరికా ఆక్రమించింది. అయినా అమెరికాలో తొలి సోషలిస్టు విప్లవం వేళ్లూనుకోలేదు. అంతేకాదు. రష్యాలో వెలిగిన విప్లవజ్యోతి అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో విస్తరించలేకపోయింది. మార్క్స్ ఏంగెల్స్‌ల అంచనాలకు భిన్నంగా సోషలిస్టు విప్లవం బాగా వెనకబడిన దేశాల్లో, సైనికపరంగానూ, ఆర్థికపరంగానూ పెట్టుబడిదారీ వ్యవస్థ చొరబడలేని దేశాల్లో పురోగమిస్తోంది. సోషలిస్టు విప్లవాన్ని విజయవంతం చేసిన తొలి దేశం రష్యా. ఈ విషయాన్ని మార్క్స్ ఏంగెల్స్‌లు ఊహించలేకపోవటమే కాదు, వాళ్లు బతికున్న కాలంలో ఉన్న పరిస్థితుల్లో వాళ్లే కాదు… ఎవరైనా ఊహించలేరు.
ఈ విషయంలో మార్క్స్, ఏంగెల్స్‌లు ఎందుకు పొరబడ్డారు? ఈ విషయానికి తనదైన ప్రాధాన్యత ఉండటంతో పాటు మార్క్సిజం గురించి మార్క్స్ ఏంగెల్స్‌ల అవగాహన గురించి అనేక అపోహలకు తావిచ్చేదిగా కూడా ఉన్నందున ఈ విషయాన్ని మరింత లోతుగానూ, జాగ్రత్తగానూ పరిశీలించాలి.
ఇక్కడ మొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే రష్యా విప్లవాన్ని అర్థం చేసుకోవటానికి కావల్సిన వివరణలను మార్క్స్ ఏంగెల్స్‌లు మనకు అందించలేదు. ఈ చిన్న మాటతో మనం ఎదుర్కొంటున్న ప్రశ్నకు సమాధానం దొరకదు. 1870, 1880 దశకాల్లో రష్యాలో సోషలిస్టు విప్లవం సాధ్యం కాదని మార్క్స్ ఏంగెల్స్‌లు అంచనాకు వచ్చిన మాట వాస్తవమే. ఆ సమయంలో వాళ్ల అంచనా సరైనదే. అదే సమయంలో రష్యాలో విజయవంతమైన విప్లవం కూడా కమ్యూనిస్టు ప్రణాళిక అందించిన అవగాహన, ముందుకు తెచ్చిన ప్రతిపాదనలకు లోబడే జరిగిందన్న వాస్తవాన్ని కూడా మనం తిరస్కరించలేము. మనం తరచూ విస్మరించే అంశం ఏమిటంటే 1880 నుండి మొదటి ప్రపంచ యుద్ధ కాలం నడుమ జారిస్టు రష్యాలో పెట్టుబడిదారీ వ్యవస్థ వాయువేగంతో విస్తరించింది. 1917 నాటికి స్థూలంగా చూసుకుంటే రష్యా వెనకబడిన దేశమే. అదే సమయంలో యూరప్‌లోని అతి పెద్ద పరిశ్రమలకు రష్యా కేంద్రంగా కూడా ఉంది. సంఖ్యా బలం రీత్యా, సంఘటిత శక్తి రీత్యా రష్యా కార్మికవర్గం కేవలం 1880 నుండి మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనే ఉనికిలోకి వచ్చింది. ఎదిగింది. 1848 నాటి జర్మనీతో పోలిస్తే 1917 నాటి రష్యాలోనే పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరణ మరింత శక్తివంతంగా ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మార్క్స్ ఏంగెల్స్‌లు కమ్యూనిస్టు ప్రణాళికలో జర్మనీ అన్న చోట రష్యా అని చదువుకుంటే ఇలా ఉంటుంది :
‘‘కమ్యూనిస్టులు తమ దృష్టిని ప్రధానంగా రష్యావైపు మళ్లిస్తారు. ఎందుకంటే రష్యా బూర్జువా విప్లవ సాధన ముంగిట్లో నిలిచి ఉంది. యూరోపియన్ నాగరికత అత్యంత ఆధునికత దిశగా అడుగులేస్తున్న తరుణంలో రష్యాలో బూర్జువా విప్లవం అనివార్యం. 17 శతాబ్దం నాటి ఇంగ్లాండ్, 18 శతాబ్దం నాటి ఫ్రాన్స్‌ల్లో కంటే రష్యాలో కార్మికవర్గం అభివృద్ది అయి ఉంది. రష్యాలో బూర్జువా విప్లవం అనివార్యంగా తక్షణమే జరగబోయే సోషలిస్టు విప్లవానికి సూచిక’’.
1848లో జర్మనీలో ఏమి జరుగుతుందని మార్క్స్ ఏంగెల్స్‌లు ఆశగా ఎదురు చూశారో 70 ఏళ్ల తర్వాత రష్యాలో అదే జరిగింది. దీనర్ధం ఏమిటి? పాశ్చాత్య దేశాల్లో సోషలిస్టు విప్లవం విజయవంతం కానప్పటికీ కమ్యూనిస్టు ప్రణాళిక అందించిన తర్కం ప్రకారం రష్యా ప్రపంచ విప్లవాలకు తొలి జ్యోతిగా నిలుస్తుంది.
రష్యాలో మొదలైన విప్లవం తర్వాత వెనకబడిన దేశాల్లో విస్తరిస్తూ పోవటం లో కూడా మార్క్సిస్టు సిద్ధాంతంలో వైరుధ్యంగా చూడాల్సిన అవసరం ఏమీ లేదు. చరిత్ర అనుభవాలను అరువు తెచ్చుకుంటుంది అన్న సూత్రం మార్క్స్ ఏంగెల్స్‌లకు తెలుసు. ప్రపంచంలో ఏ మూల సోషలిస్టు విప్లవం విజయవంతం అయినా మరో మూల విప్లవాగ్నిని రాజేయటానికి దోహదం చేస్తుంది. అది విప్లవ జ్వాల యొక్క తార్కిక పర్యవసానం. లక్షణం. అదేసమయంలో తొలి విప్లవ విజయకేతనం ఎగురవేసిన దేశం ప్రయాణించిన మార్గంలోనే మిగిలిన దేశాలు ప్రయాణించాల్సిన అవరం లేదు. కొద్దో గొప్పో సవరణలు, మార్పులతో, ఒకటో రెండో విప్లవ దశలు అధిగమించి ఓ గెంతు వేయవచ్చు. ఈ విషయాన్ని చర్చించేందుకు కమ్యూనిస్టు ప్రణాళికలో అవకాశం లేదు. సందర్భమూ కాదు. కానీ రష్యాలో సోషలిస్టుల మధ్య జరిగిన చర్చల్లో రష్యా అనివార్యంగా బూర్జువా సమాజం దాటిన తర్వాతనే సోషలిస్టు సమాజంగా మారాలా లేక పెట్టుబడిదారీ వ్యవస్థ సమగ్రాభివృద్ధి దశకు చేరుకోకుండానే సోషలిస్టు దశలోకి ప్రవేశించవచ్చా అన్న ప్రశ్న తలెత్తింది. 1877లో రష్యాకు చెందిన ఓ రచయితను మార్క్స్ తీవ్రంగా విమర్శిస్తూ :
‘‘పెట్టుబడి గ్రంధంలో నేను పశ్చిమ యూరప్‌లో పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భావం గురించి ఇచ్చిన చారిత్రక వర్ణనను యథాతథంగా అనుకరించేందుకు ప్రయత్నం చేశారు. దీన్ని చారిత్రక తాత్విక సిద్ధాంతంగా మల్చి మొత్తం ప్రపంచ మానవాళీ ఇదే దారిలో ప్రయాణించాల్సి ఉంటుందని చెప్పారు. ఆయా దేశాలు (విప్లవ సాధన నాటికి) ఏ దశలో ఉన్నప్పటికీ (విప్లవానంతరం) ఆయా దేశాల ఉత్పత్తి శక్తులు అనూహ్య స్థాయిలో అభివృద్ధి చెందుతాయి. సామాజికశ్రమ ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. సర్వసమగ్ర మానవుడిని సృష్టిస్తుంది. (మార్క్స్ ఏంగెల్స్ లేఖలు 354పేజీ)’’ అని స్పష్టం చేశారు.
అదేవిధంగా ఏంగెల్స్ 1893లో రష్యా విప్లవోద్యమంలో తారా స్థాయిలో జరుగుతున్న చర్చ నేపథ్యంలో ఇదే అంశంపై :
‘‘ఆదిమ వ్యవసాయక కమ్యూనిస్టు దశ నుండి ఉన్నత సామాజిక చైతన్యం పెంపొందిన పరిస్థితులు రష్యాలో తప్ప మరెక్కడా మనకు కనిపించవు. ఇంక్కెడైనా అంతకు మించిన ఉన్నత స్థాయి చైతన్యం ఉంటే అది అప్పటికే ఉనికిలో ఉన్నదై ఉంటుంది. అటువంటి ఉన్నత చైతన్యానికి గల చారిత్రక కారణాలు ఏమైనప్పటికీ అంతిమంగా పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలు, తద్వారా సామాజికంగా తలెత్తే ద్వంద్వ వైరుధ్యాలు ఉన్న సమాజాల్లో మాత్రమే అటువంటి ఉన్నత స్థాయి చైతన్యాన్ని మనం చూడగలం. కానీ వ్యవసాయక సమాజాల్లో అటువంటి ఉన్నత స్థాయి చైతన్యాన్ని రష్యాలో మాత్రమే చూడగలం. బహుశా మరో చోట ఉంది అంటే రష్యా సమాజం దాన్ని అనుకరించింది అని మాత్రమే ఊహించుకోవాల్సి ఉంటుంది.
పశ్చిమ యూరప్ దేశాలు పరిపక్వం చెంది ఉంటే బహశా
1860`70 నాటికే అటువంటి పరిణామాలు జరిగి ఉండేవి. అటువంటి పరిణామాలకు ప్రధానంగా ఇంగ్లాండ్, ఫ్రాన్స్ కేంద్రాలుగా ఉండి ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో రష్యా సమాజం అప్పటికే ఉనికిలో ఉన్న తన కమ్యూన్ల వ్యవస్థ ద్వారా ఏమి సాధించవచ్చో చూపిస్తుంది.’’ (ఎంపిక చేసిన లేఖలు, పేజీ 515) అన్నారు.
అయితే ఈ వాదన ఓ ప్రత్యేక పరిస్థితుల్లో ముందుకు తేబడిన వాదన అయినప్పటికీ ఒక దేశంలో జరిగిన చారిత్రక పరిణామాలు మరో దేశంలో పునరావృతం అవుతాయని ఖచ్చితంగా చెప్పటానికి నేడు చైనాలో జరుగుతున్న పరిణామాలే సాక్ష్యం. సోషలిస్టు సిద్ధాంతం, ఆచరణ మరో చోట ఎక్కడో ఏదో ఒక మేరకు అభివృద్ధికాని పక్షంలో చైనా నేడు సోషలిస్టు సమాజంగా పరివర్తన చెందే క్రమంలో తలెత్తే సమస్యలను పరిష్కించే ప్రయత్నం చేసి ఉండేది కాదు అని చెప్పకతప్పదు. పశ్చిమ యూరోపియన్ దేశాల (సైద్ధాంతిక రంగంలో) అనుభవాలు, రష్యా అనుభవాలు (సైద్ధాంతికంగా, ఆచరణ రీత్యా) నేపథ్యంలో చైనా విప్లవం తీసుకోవాల్సిన అనివార్యమైన పంథాగా ఇది స్థిరపడిపోయింది.
పై వివరణల రీత్యా మనం ఓ విషయాన్ని నిర్ధారించుకోవచ్చు. రష్యాలో తొలి సోషలిస్టు విప్లవం విజయవంతం అవుతుందని మార్క్స్, ఏంగెల్స్‌లు ఊహించకపోయినప్పటికీ, తదుపరి విప్లవాలు వెనకబడి దేశాల్లో వెల్లువెత్తుతాయని స్పష్టంగా చెప్పనప్పటికీ ఈ విప్లవాలు చోటు చేసుకుంటున్న సందర్భం, మార్క్సిస్టు సైద్ధాంతిక సూత్రీకరణలకు లోబడి చోటు చేసుకుంటున్న సందర్భం రెండూ వెరసి మార్క్స్, ఏంగెల్స్ ప్రతిపాదించిన పంథాలోనే ప్రయాణిస్తున్నాయి. అటువంటప్పుడు వారి అంచనాల్లో జరిగిన పొరపాట్ల స్వభావం ఏమిటి?
పశ్చిమ యూరప్ దేశాల్లో తొలి విప్లవం విజయవంతం అవుతుందన్న మార్క్స్ ఏంగెల్స్‌ల అంచనాల పొరపాటు అభిప్రాయాలు. ఇక్కడ మనం పరిశీలించాల్సింది మార్క్స్ ఏంగెల్స్‌లు పొరపాటు పడ్డారా అని కాదు. పశ్చిమ దేశాల పెట్టుబడిదారీ సమాజాలు ఎందుకు సోషలిస్టు విప్లవాల దిశగా ఎందుకు పురోగమించలేదు అన్న విషయాన్ని పరిశీలించాలి. అంటే మార్క్స్ ఏంగెల్స్‌లు ప్రతిపాదించిన విధంగా ఆయా దేశాల్లో విప్లవోద్యమ నిర్మాణం ఎందుకు జరగలేదు , ఆయా దేశాలు పెట్టుబడిదారీ దేశాలుగానే ఎందుకు మిగిలిపోయాయి అన్న కోణంలో మన అధ్యయనం సాగాలి. చివరి దశలో పెట్టుబడిదారీ మజిలీలోకి ప్రవేశించిన రష్యా తనదైన పంథాలో సోషలిస్టు విప్లవాన్ని ఎందుకు సాధించగలిగింది అని ప్రశ్నించుకోవాలి. మరో విధంగా చెప్పుకోవాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి యొక్క తార్కిక ముగింపు సోషలిజం అయినప్పుడు అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు ముందుగా ఎందుకు సోషలిస్టు వ్యవస్థలోకి ప్రవేశించలేదు? ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా చూసే ఈ దేశాలే సోషలిస్టు విప్లవ పంథాలో అడుగు పెట్టే దేశాల్లో ఆఖరి దేశాలుగా ఎందుకు ఉంటున్నాయి? అని ప్రశ్నించుకోవాలి. అయితే మనకు కమ్యూనిస్టు ప్రణాళిక ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు. ఇటువంటి ప్రశ్నను ఎదుర్కోవాల్సిన అవసరం తలెత్తుతుందని మార్క్స్ ఏంగెల్స్‌లు తమ జీవిత కాలంలో ఊహించి ఉండరు.
సంపన్న పెట్టుబడిదారీ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు
కమ్యూనిస్టు ప్రణాళిక ప్రచురించబడిన వందేళ్ల తర్వాత కూడా సంపన్న పెట్టుబడిదారీ దేశాలు మార్క్స్, ఏంగెల్స్‌లు ఆశించినట్లు ఊహించినట్లు సోషలిస్టు పథంలో పయనించకపోవడానికి గల కారణాలు గుర్తించటం, వివరించటం అంత తేలికైన పనేమీ కాదు. ఈ విషయంపై ఇప్పటి వరకూ సంతృప్తి కరమైన సమాధానం, వివరణ ఏమీ లేదన్నది కూడా వాస్తవమే. అయితే పెట్టుబడిదారీ వ్యవస్థను, అంటే మనకాలపు ఆధిపత్య వ్యవస్థను అర్థం చేసుకోవడానికి, విశ్లేషించటానికి కావల్సినన్ని సాధనాలు అందించిన ఆ రచయితలను వాళ్లేదో ఈ సమస్యకు పరిష్కారం చెప్పలేకపోయారు అని విమర్శించుకోవడం సంజసం కాదు. అవును కాదు అన్న సమాధనాలు కోసం కాకుండా మన మెదడుకు పదును పెట్టడానికి ఈ సమస్యను సాధనంగా ఉపయోగించుకుందాం. తద్వారా ఈ సమస్యకు సమాధానం చెప్పేందుకు మనం మౌలికంగా పరిశీలించాల్సి అంశాలేమిటన్నది తెలుసుకుందాం.
యూరప్‌లోని ప్రధాన దేశాలను పరిశీలిస్తే కొన్ని ఉమ్మడి లక్షణాలు కనిపిస్తాయి. పందొమ్మిదో శతాబ్ది మధ్య కాలంలో ఉన్న పరిస్థితుల్లో సైతం ఆయా దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ మనుగడ సాగింపు సామర్ధ్యం పైనా, ఆయా దేశాల్లో పెట్టుబడిదారీ సంబంధాల వ్యాప్తి, దాని మన్నిక సామర్ధ్యం గురించీ మార్క్స్ ఏంగెల్స్‌లు తక్కువ అంచనా వేశారు అని చెప్పకతప్పదు. ఇక రెండో విషయం చాలా ముఖ్యమైనది. ఉపాంత విస్తరణ. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు మూడు నాలుగు దశాబ్దాల పాటు పెట్టుబడిదారీ వ్యవస్థ అనూహ్య స్థాయిలో విస్తరించింది. ఈ క్రమంలో నూతన సామ్రాజ్యవాద ధోరణులు ముందుకొచ్చాయి. ఈ నూతన సామ్రాజ్యవాదం వెనకబడిన దేశాల్లోని సహజవనరులను, శ్రమ శక్తిని అనూహ్య స్థాయిలో దోపిడీ చేసి ఆ దోపిడీ ఫలాలు సంపన్న దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థను బలోపేతం చేయటానికి వెచ్చించింది. 1920లో లెనిన్ స్పష్టంగా ప్రస్తావించినట్లు ‘‘పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచ వలస దోపిడీగా విస్తరించింది. ప్రపంచంలోని విశాల ప్రజానీకాన్ని సంపన్న దేశాల్లోని పిడికెడు మంది పీల్చి పిప్పి చేస్తుంది.’’ (ఏరిన రచనలు సంపుటి 29, పేజీ 87). (మార్క్స్ ఏంగెల్స్‌ల జీవితకాలం చివరి దశకాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ రూపం తీసుకుంది. ఈ పరిణామాలను మార్క్స్, ఏంగెల్స్‌లు ఊహించగలిగితే అది అద్భుతమే). మూడో అంశం. 1870,1880 దశకాల్లో సామ్రాజ్యవాదం చవిచూసిన తీవ్రమైన సంక్షోభం నుండి పెట్టుబడిదారీ వ్యవస్థ బయటపడటానికి ఈ పరిణామాలే తోడ్పడ్డాయి. పెట్టుబడిదారీ వ్యవస్థకు కొత్త ఊపిరులూదాయి. సామాజిక సంస్కరణల ద్వారా, కార్మికవర్గానికి కొన్ని సంక్షేమ పథకాలు, రాయితీలు అందించటం ద్వారా పాలకవర్గం సమాజంపై తన పూర్తి ఆధిపత్యాన్ని సుస్థాపితం చేసుకున్నాయి. ఈ నూతన విధానాలు సమాజంలో అన్ని వర్గాల మద్దతును సమీకరించుకోగలిగాయి.
సామ్రాజ్యవాద ఆధిపత్యం, దోపిడీకి మరో కోణం కూడా ఉంది. వెనకడిన దేశాల ప్రజల చైతన్యం పురివిప్పుకోవడం. ఆయా దేశాల రాజకీయ విముక్తికి ఆర్థికాభివృద్ది సాధన దిశగా సాగే పోరాటానికి కావల్సిన నైతిక, మానసిక భౌతిక వనరులను ఆయా దేశాల ప్రజలకు అందించటానికి అవకాశాలు కలిగించింది.
ఈ పరిణామాలన్నింటిలోనూ రష్యా ఓ కీలక స్థానంలో నిలిచింది. సామ్రాజ్యవాదాన్ని విస్తరించటంలో ప్రత్యేకించి మధ్యప్రాచ్యం, ప్రాచ్య దేశాలకు విస్తరించటంలో రష్యా బూర్జువా వర్గం, కనీసం ఓ తరగతి బూర్జువా వర్గం కీలక పాత్ర పోషించింది. స్థూలంగా చూసినప్పుడు రష్యా సామ్రాజ్యవాదం వలన లబ్ది పొందటం కంటే సామ్రాజ్యవాదానికి లక్ష్యంగా మారిందని చెప్పటమే సరైనది. అందువలన సామ్రాజ్యవాదం పశ్చిమ దేశాల్లో చూపించిన ఫలితాల్లో అంతర్గత వైరుధ్యాలు సమసిపోవటం, వర్గ సంకీర్ణాలు వంటి కొన్నైనా రష్యాలో మొలకెత్తాయి.
ఈ చర్చను ముగిస్తూ ఇలా చెప్పుకోవచ్చు. సామ్రాజ్యవాదం పశ్చిమ దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థలకు కొత్త ఊపిరిలూదింది. అదేవిధంగా జర్మనీ, ఇంగ్లాండ్ వంటి సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో విప్లవ కార్మికోద్యమం రానురాను సంస్కరణోద్యమంగానూ, పాలకవర్గంతో రాజీపడే ఉద్యమంగానూ మారటం కూడా సామ్రాజ్యవాద ప్రభావమే. ఈ క్రమంలోనే రష్యాలో అప్పుడే పుంజుకుంటున్న పెట్టుబడిదారీ వ్యవస్థలో వైరుధ్యాలు ఉధృతమయ్యాయి. నిరంతరం దోపిడీకి గురవుతున్న వలస, అర్థవలస దేశాల్లో విప్లవోద్యమాలకు అంకురార్పణ జరిగింది.
మానిఫెస్టో ఆశించిన విధంగా ఆధునిక పెట్టుబడిదారీ దేశాలు సోషలిస్టు విప్లవ పంథాలో పయనించకపోవటానికి గల కారణాలు ఇవి. పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి సోషలిస్టు వ్యవస్థ దిశగా సాగుతున్న ప్రయాణంలో రష్యా, ఇతర వెనకబడిన దేశాలు అందిస్తున్న తోడ్పాటును కూడా మనం అర్థం చేసుకోవాలి.
అయితే ఇక్కడ ఓ ప్రశ్న తలెత్తే అవకాశం ఉంది. అది అమెరికా గురించి. మొదటి ప్రపంచ యుద్ధం వరకూ అమెరికా ఏమీ సామ్రాజ్యవాద దేశం కాదు. అయినా ఆధునిక సంపన్న పెట్టుబడిదారీ దేశంగా అభివృద్ధి చెందింది. అటువంటప్పుడు కనీసం అమెరికా అయినా సోషలిజం దిశగా ఎందుకు అడుగులు వేయలేకపోయింది అన్నదే ఆ ప్రశ్న.
ఈ ప్రశ్నకు సమాధానం అందరికీ తెలిసిందే. పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధికి ఉత్తర అమెరికా అంతులేని అవకాశాలు తెచ్చిపెట్టింది. 19వ శతాబ్ది చివర్లో సామ్రాజ్యంవాదం దిశగా అడుగులేసిన పశ్చిమ యూరోపియన్ దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరించినదానికంటే వేగంగా అమెరికాలో పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరించింది. వేళ్లూనుకుంది. ఈ క్రమంలో అమెరికాకు ఉన్న విలక్షణ అవకాశాలు ఏమిటన్నది వివరించటానికి మరో లోతైన కసరత్తు చేయాల్సి ఉంది. ఈ మధ్య డబ్ల్యు జెడ్ ఫాస్టర్ మార్క్సిజం అమెరికా ప్రత్యేకతలు అన్న వ్యాసంలో అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రత్యేక లక్షణాల గురించి పొందుపర్చిన జాబితా నిస్సందేహంగా కీలకమైనది. ఈ వ్యాసం 1947లో పొలికల్ అఫైర్స్ అన్న పత్రికలో అచ్చయ్యింది. ఫాస్టర్ అంచనా ప్రకారం
- యూరోపియన్ దేశాల సామాజిక పరిణామంలో చారిత్రక పాత్ర పోషించిన భూస్వామ్య వ్యవస్థ మనకు అమెరికాలో కనిపించదు.
- అంతులేని ప్రకృతి వనరులు.
- విశాల కమతాలు
- శ్రమశక్తికి ఎక్కడ లేని గిరాకీ,
- భౌగోళికంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉండటం.
- యుద్ధాల తాకిడి లేకపోవడం.
ఈ ప్రత్యేతలను ఉపయోగించుకుని అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ తనదైన శైలిలో ఉత్పాదక సామర్ధ్యాన్ని పెంపొందించుకున్నది. ఏ పెట్టుబడిదారీ దేశమూ పోగుచేయనంత స్థాయిలో సంపద పోగు చేసుకున్నది. కార్మికవర్గానికి ఈ పోగుపడ్డ సంపద నుండి తృణమో ఫణమో వెచ్చించింది. కనీసం 1930 వరకూ జాతీయ సంపదలో కొంత వాటా కార్మికవర్గ అభివృద్ధి కోసం వెచ్చిస్తూ వచ్చింది. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ చరిత్రలో మనకు ఎక్కడా కనిపించదు. ఆ మాట కొస్తే వర్గ విభజితమైన ఏ దేశంలోనూ అమెరికాలో ఉన్న పరిస్థితులు కనిపించవు. (ఈ కోణాన్ని అర్థం చేసుకోవడానికి మంత్లీ రివ్యూ పత్రికలో అచ్చయని సోషలిజం `అమెరికా కార్మికవర్గం అన్న వ్యాసాన్ని చదవగలరు) ఇవన్నీ ప్రస్తావిస్తున్నంత మాత్రాన అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ అంతర్గత వైరుధ్యాలకు దూరంగా ఉందని మనం నిర్ధారించుకోవల్సిన అవసరం లేదు. ఎన్ని వైరుధ్యాలున్నా తోటి పెట్టుబడిదారీ దేశాలు సాధించిన అభివృద్ధి కంటే మెరుగైన అభివృద్ధిని సాధించగలిగింది. సామ్రాజ్యవాద దేశాల్లోని పెట్టుబడిదారీ వ్యవస్థ కంటే అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ మెరుగైన స్థానంలో నిలిచింది. సమాజంలోని అన్ని వర్గాల మద్దతు పొందింది. చివరకు కార్మికవర్గం మద్దతు కూడా అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ సంపాదించగలిగింది.
అందువల్లనే పశ్చిమ యూరోపియన్ దేశాల స్థానంలో సోషలిస్టు విప్లవానికి నాయకత్వం వహించటానికి బదులు నిజానికి అమెరికా పైన చెప్పిన ప్రత్యేకతలు, పరిమితులు రీత్యా ప్రపంచ సోషలిస్టు విప్లవోద్యమాన్ని బలహీనపరిచింది.
పైన ప్రస్తావించుకున్న కారణాలేమీ వందేళ్ల క్రితమే గుర్తించగలిగిన కారణాలు కాదు. ఇటువంటి అనేక కారణాలు, పరిస్థితులు, పర్యవసానాల వలన పెట్టుబడిదారీ వ్యవస్థ సంపన్న పెట్టుబడిదారీ దేశాలు ప్రత్యేకించి పశ్చిమ యూరప్ మరియు అమెరికా దేశాల్లో మరింత లోతుగా వేళ్లూనుకుని పోయింది. వీటన్నిటి తుది ఫలితంగా సోషలిజం దిశగా ఆయా దేశాలు సాగించాల్సిన ప్రయాణం మార్క్స్, ఏంగెల్స్‌లు ఆశించినదానికంటే మరింత దీర్ఘకాలం వాయిదా పడుతోంది.
ఈ సమస్యపై మన చర్చను ముగించే ముందు పాఠకులకు ఓ సున్నితమైన హెచ్చరిక కూడా చేయాల్సి ఉంది. సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ అనూహ్య స్థాయిలో దీర్ఘకాలం మనుగడ సాగించగలిగిందని నిర్ధారించుకున్నంత మాత్రాన ఇక పెట్టుబడిదారీ వ్యవస్థ మృత్యుంజయురాలు అన్న నిర్ధారణకు రావటం పొరపాటవుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకూ యూరోపియన్ మరియు అమెరికా దేశాల కార్మికవర్గం పెట్టుబడిదారీ వ్యవస్థకు సమాధులు తవ్వటంలో విఫలం అయ్యిందని గుర్తించినంత మాత్రాన ఇకమీదక ఎప్పటికీ ఆ పాత్ర పోషించలేదు అని తీర్మానించుకోవడం కూడా అంటే పొరపాటు అవుతుంది. ముందు ఆయా దేశాల్లో విప్లవం విజయవంతం అవుతుందని అంచనా వేయటం వరకూ మనం పరిశీలిస్తే మార్క్స్ ఏంగెల్స్‌లు పొరపాటుపడ్డారని అర్థమవుతుంది. అయితే మార్క్స్ ఏంగెల్స్‌లు పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి చేసిన నిర్ధారణలు, సాగించిన అధ్యయనాలు, సోషలిజం దిశగా పరివర్తన అనివార్యత వంటి ఇతర అన్ని విషయాల్లో వారి అంచనాలు నూటికి నూరుపాళ్లు సత్యమేనని తేలింది. పెట్టుబడిదారీ వ్యవస్థ చలన సూత్రాల గురించి మార్క్స్ ఏంగెల్స్‌లు సాగించిన అధ్యయనాలు ప్రపంచ దేశాల పెట్టుబడిదారీ వ్యవస్థ అధ్యయనానికి ఎంతగా వర్తిస్తాయో పశ్చిమ యూరోపియన్ మరియు అమెరికా దేశాల్లోని పెట్టుబడిదారీ వ్యవస్థ చలన సూత్రాలకు కూడా అంతే సరిగ్గా వర్తిస్తుంది. ఇందులో సందేహం ఏమీ లేదు.
వర్తమాన ప్రపంచ పరిణామాలు ఈ అంచనాలు, అవగాహనలు వాస్తవికమేనని రుజువు చేస్తున్నాయి. గత శతాబ్ది ప్రపంచ చరిత్రను రక్తసిక్తం చేసిన ప్రపంచ యుద్ధాలు, వెనబడిన దేశాల్లో పెల్లుబికిన విముక్తి పోరాటాలు, వియవంతమైన విప్లవాలు అప్పటి వరకూ పశ్చిమ యూరప్ దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థకు జవసత్వాలు రక్తమాంసాలు సమకూర్చటంలో చారిత్రక పాత్ర పోషించిన సామ్రాజ్యవాదం వెన్ను విరిచాయి. అమెరికా పాలకవర్గం గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో అధికోత్పత్తి సంక్షోభానికి లోనైంది. మొత్తం ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థను తన భుజస్కంధాలపై మోయటానికి నానా తంటాలు పడుతోంది. కానీ అంతిమంగా తన ప్రయత్నంలో విజయం సాధించటం ఎలా అన్న విషయంలో మాత్రం దిక్కుతోచకుండా ఉంది. అమెరికా, యూరప్ దేశాల కార్మికవర్గాలు గత చరిత్రను తల్చుకుంటూ దిగాలు పడి ఉంటాయని, భవిష్యత్తులో ఎప్పటికీ పెట్టుబడిదారీ వ్యవస్థను సవాలు చేయబోవని తీర్మానించుకుందామా? పెట్టుబడిదారీ వ్యవస్థ స్వర్ణయుగంలో దోపిడీ ఫలాలు అంతో ఇంతో ఆయా దేశాల కార్మికవర్గానికి కూడా దక్కినంత మాత్రాన పతనమయ్యే వ్యవస్థతో పాటే ఆయా దేశాల కార్మికవర్గం కూడా పతనం కావడానికి సిద్ధంగా ఉంటుందని, ప్రభు భక్తితో తిరుగుబాటు చేయటానికి సిద్ధంగా ఉండదనీ నమ్ముదామా?
అటువంటి అభిప్రాయాలు, అంచనాలకు రావటానికి మనం సిద్ధంగా లేము.. సంపన్న దేశాలు కార్మికవర్గం వెనకబడిన దేశాల కార్మికం వర్గం ఒక్కటై కమ్యూనిస్టు ప్రణాళికలో చెప్పినట్లు ‘‘తమ జీవన స్థితిగతుల వాస్తవికత గుర్తిస్తాయి. తోటి కార్మికుల స్థితిగతులను గుర్తిస్తాయి’’. కార్మికవర్గానికి ఈ రకమైన అవగాహన కలిగినప్పుడు ఆయా తరగతుల ప్రజానీకం పెట్టుబడిదారీ వ్యవస్థ నీడన బతుకీడ్చేకంటే సోషలిజంలో గౌరవంగా జీవించేందుకు సిద్ధపడతారన్నది నిస్సందేహం.
ముగింపు :
స్థూలంగా చూస్తే తొలి వందేళ్లల్లో కమ్యూనిస్టు ప్రణాళిక ప్రాపంచిక వాస్తవాలను సవ్యంగానే ప్రతిబింబించింది. చరిత్ర సిద్ధాంతం, పెట్టుబడిదారీ వ్యవస్థ విశ్లేషణ, సోషలిస్టు విప్లవం గురించి భవిష్యత్ దర్శనం వంటివాటి విషయంలో కమ్యూనిస్టు ప్రణాళిక వాక్కులు అక్షరసత్యాలేనని గత వందేళ్ల చరిత్ర రుజువు చేసింది. సంపన్న దేశాల్లో సోషలిస్టు విప్లవం జయప్రదం అవుతుందన్న ఒకే ఒక్క అంచనాలో మాత్రం కమ్యూనిస్టు ప్రణాళిక ప్రతిపాదన సత్యదూరమని ఆచరణలో తేలింది. అయితే వందేళ్ల క్రితం ఉన్న పరిస్థితులను ఆధారం చేసుకుని గమనిస్తే ఆ రోజుల్లో ఈ అంచనా అవాస్తవికమైనదేమీ కాదని కూడా తేల్తుంది. డ్యూరింగ్పై విమర్శ అన్న తన గ్రంధంలో ఏంగెల్స్ ‘‘భవిష్యత్ ప్రపంచం గురించి మనం రూపొందించుకునే ఊహాచిత్రంచ దాన్ని కార్యరూపం సాధించుకోవడం ఆయా నిర్దిష్ట స్థలకాల పరిస్థితులు విధించే పరిమితులకు లోబడే ఉంటుంది. ఆయా సమాజాలున్న నిర్దిష్ట చారిత్రక దశ, ఆ సమాజ నిర్మాతల వస్తుగత చైతన్యంపై ఆధారపడి ఉంటుంది’’ అని స్పష్టం చేశారు.
కమ్యూనిస్టు ప్రణాళిక రచయితల అంచనాలకు తగిన విధంగా ప్రపంచ విప్లవాలు పురోగమించి ఉంటే మానవాళికి ఎంతో మేలు జరిగేది కదా। విప్లవ పథంలో అడుగు పెట్టే తొలి దేశం ఇంగ్లాండో, జర్మనీయో లేక అమెరికా అయితే ఈ ప్రయాణం ఎంత సుఖవంతంగా ఉండేది। మన దేశంలో అమాంతం పెరిగిన ఉత్పత్తి శక్తుల సామర్ధ్యం మనపై ఆధిపత్యం వహించేలా కాకుండా మన చెప్పు చేతల్లో ఉంటే ఈ దేశం విశ్వ మానవ సౌభాగ్యం కోసం ఎంతగా తోడ్పడి ఉండేదో ఒక్క సారి ఊహించుకోండి।
అయితే ఏంగెల్స్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించిన విధంగా ‘‘ దేవతలందరిలోకీ చరిత్రే అత్యంత క్రూరమైన దేవత’’. పెట్టుబడిదారీ ప్రపంచం సోషలిజం దిశగా సాగించే ప్రయాణం నాగరిక సమాజాలు ఉత్పత్తి శక్తులను ఇతోధికంగా అభివృద్ధి చేయటానికి వీలుగా, సత్వర విశ్వమానవ కళ్యాణానికి వీలుగా సులభంగా సాగిపోయేదానికంటే సుదీర్ఘమైన, కఠోరమైన పోరాటాల నడుమ సాగాల్సిందే అని చరిత్ర తీర్మానించింది. ఈ సుదీర్ఘ పోరాటంలో బూర్జువా వర్గం ఇప్పటి వరకూ మానవాళికి అందించిన కొన్ని సానుకూల ఫలితాలు, ఫలాలు కూడా మానవాళికి దక్కకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. సోషలిస్టు విజయం వ్యవస్థాగతమైతే ఈ ఫలితాలు సర్వమానవ కళ్యాణానికి సార్వత్రిక ప్రయోజనాలకు విస్తరించే అవకాశం ఉండేది. ప్రస్తుతం సోషలిస్టు విప్లవం దిశగా ఉరకలేస్తున్న సమాజాలకు, ప్రజలకు ఇప్పటి వరక చట్టబద్ధంగా గ్యారంటీ చేయబడిన మేధో స్వేఛ్చ, వ్యక్తిగత భద్రత అంటే ఏమిటో కూడా తెలీదు అంటే ఆశ్చర్యం కాదు. మరోవైపు ఈ మౌలిక హక్కులే సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో నిర్వీర్యం అవుతున్నాయి. ప్రతీఘాత విప్లవాలు చెలరేగిపోతున్నాయి. ప్రతీపశక్తులు పేట్రేగిపోతున్నాయి.
మనంనేడున్న విపరీత పరిస్థితుల్లో ఈ శక్తులు ఎంత కాలం కొనసాగుతాయన్న విషయాన్ని ఇద్దమిద్దంగా ఎవ్వరూ చెప్పలేరు. లేక భావి ప్రపంచం సరికొత్త విప్లవ శక్తులను పున:సమీకరించుకుంటుందా అన్నది కూడా ఇప్పటికిప్పుడు తేల్చి చెప్పలేము.
మార్గం దుర్గమం. ప్రమాదభరితం. ముందు ముందు ఎన్ని వైపరీత్యాలు చూడాలో తెలీదు. పరికివారు, సంశయాత్ములు, నిరాశవాదులు కూడా ఈ మార్గం గుండా ప్రయాణించాల్సిందే. మరో ప్రత్యామ్నాయం లేదు. కమ్యూనిస్టు ప్రణాళిక సందేశాన్ని అందుకున్న వారు, ప్రణాళిక రచయితల ఉద్దేశ్యాన్ని తెలుసుకున్న వారు మాత్రం కాలాన్ని వెనక్కు తిప్పలేమన్న మౌలిక సూత్రాన్ని గ్రహిస్తారు. పెట్టుబడిదారీ వ్యవస్త పతనం అనివార్యతను అర్థం చేసుకుంటారు. సోషలిజం దిశగా సాగే ప్రయాణంలో సాధ్యమైనంత వేగంగా సాధ్యమైనంత తక్కువ హింసతో గమ్యాన్ని చేరటమే మానవాళి భవ్య భవిష్యత్తుకున్న ఏకైక మార్గం అని గుర్తిస్తారు.
గమనిక : 1948 లో ప్రముఖ అమెరికన్ మార్క్సిస్టు పాల్ స్వీజీ రాసిన వ్యాసాన్ని 77 ఏళ్ల తర్వాత తొలిసారిగా తెలుగులోకి అనువదించి అందిస్తున్నాము. ఇంగ్లీషు ప్రతిని అమెరికా నుండి సేకరించి ఇచ్చిన ఐవి రమణ రావు గారికి ధన్యవాదాలు.
పాల్ ఎం స్వీజీ
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.